జీవనస్రవంతి -9

జీవనస్రవంతి -9

ఆ యువతి తను కోరుకున్న వ్యక్తినే పెళ్ళాడింది. ఆ సంతోషంలో త్వరగానే గర్భవతి కూడా అయింది. కానీ అంతలోనే ఆ సంతోషం ఆవిరయ్యింది. ఒక ప్రమాదంలో భర్త చనిపోతాడు. జీవితాంతం కష్టాలు పడమని రాశాడేమో భగవంతుడు. గర్భవతిగా ఉండగానే భర్త చనిపోవటంతో చిన్న వయసులోనే అనంత శోకానికి గురైన ఆ యువతికి కొడుకు జన్మించటంతో శోకానికి కొంత విరామం లభించినట్లయింది. కొడుకు రూపంలో జీవన ఆశా దీపం మిణుకుమిణుకు మంటూ కనిపిస్తోంది. కొడుకును బ్రతికించుకుంటూ తను బ్రతుకుదాం అనుకుంది. కాని విధి ఆమె జీవితంలో మరో కష్టాన్ని రాసిపెట్టింది. అప్పటికే అత్తింటివారు పట్టించుకోవడం మానేయడం, పుట్టింట్లో వదిన ఆరళ్ళ రూపంలో ఆ కష్టం ఎదురయ్యింది. ఆ ఊరిలో ఇక బ్రతకడం కష్టం అని నిర్ణయించుకున్న ఆ యువతి ఒక అర్ధరాత్రి తన కొడుకుతో తన ఊరు వదిలి తనను, తన కొడుకును బ్రతికించుకోడానికి ఊరు దాటింది. అర్ధరాత్రి బయటకు వచ్చిన ఆ యువతి ఎటువెళ్ళింది ?

తన కొడుకును ఎలా బ్రతికించుకుంది ? అనేక కష్టనష్టాలను భరిస్తూ, జీవితాన్ని ఎలా ముందుకు నడిపింది ? కొడుకు ఏమయ్యాడు ?

ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే

‘జీవన స్రవంతి’ ధారావాహిక.

మహిళల కంట కన్నీరు తెప్పించి మనసులు కదిలించే ధారావాహిక.

జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా కుటుంబ ధర్మాన్ని పాలించడానికి అడుగు ముందుకే వెయ్యాలనుకునే ప్రతి వ్యక్తి చదవాల్సిన ధారావాహిక

‘జీవన స్రవంతి’.

ప్రతీవారం జాగృతిలో…

జరిగిన కథ

జీవన్‌ గోల్డ్‌మెడల్‌తో డిగ్రీ పాసై ఉద్యోగం వెతుకుతూ, ఖర్చుల కోసం పత్రికలకు కథలు రాస్తుంటాడు. జీవన్‌ తల్లి మీనాక్షి యాజులుగారింట్లో వంట పనిచేస్తూ కొడుకును చదివించింది. యాజులు గారి కొడుకూ, కూతురూ అమెరికా వెళ్ళి, వాళ్ళ పెద్ద పిల్లలను యాజులుగారి వద్దే ఉంచారు. జీవన్‌ యాజులుగారి మనవళ్ళకు ప్రైవేట్లు చెప్పే ఉద్యోగంలో కుదిరాడు.

కోవిద జీవన్‌కి 143 చెపితే, దానికి జీవన్‌ నవ్వాడు. అది చూసిన తల్లి మీనాక్షి జీవన్‌ని తిడుతుంది. దాంతో అతను ఇల్లు విడిచి బయటికి వచ్చేశాడు. జీవన్‌ రాక కోసం ఎదురుచూస్తూ మీనాక్షి తన గత జీవితాన్ని గుర్తుకు తెచ్చుకుంది.

తన మేనత్త కొడుకు శంకరాన్ని పెళ్ళిచేసుకున్న మీనాక్షి ఏడాదిలోనే గర్భవతి అయింది. ఏడవ నెలలో భర్త చనిపోవటంతో పుట్టింటికి వచ్చేసింది. కూతురి పరిస్థితి చూసి తల్లి కూడా మరణించింది. మీనాక్షికి కొడుకు పుడితే అందరూ అతడిని నష్టజాతకుడన్నారు. మీనాక్షి తండ్రి మనవడిని ‘చిరంజీవి’ అని పిలుస్తూంటే, అది చివరికి ‘జీవన్‌’ గా స్థిరమైంది. తండ్రి కూడా కాలం చేయడంతో చివరికి మీనాక్షి అన్నా, వదినల దగ్గర ఉంటూ ఆ ఇంటి పనులన్నిటినీ తనే చేస్తూండేది. వదిన పద్మ మీనాక్షిని, జీవన్‌ని నానా మాటలూ అంటూండేది. తక్కువగా చూసేది.

ఒకసారి పద్మ కొడుకు రవి, కూతురు రాధిక బంతితో ఆడుకుంటూంటే దానిని జీవన్‌ లాక్కున్నా డని, పద్మ జీవన్‌ని కొట్టి, స్తంభం వైపు తోసేస్తుంది. అది తగిలి జీవన్‌కి ముక్కు, మూతి పగిలి రక్తం కారుతుంది. అది చాలక మరోసారి బెత్తంతో కొట్టి పాత సామాను గదిలో జీవన్‌ని పడేసి బంధిస్తుంది. అడ్డుపడిన జీవన్‌ తల్లి మీనాక్షిని కూడా హెచ్చ రించడంతో హతాశురాలైన మీనాక్షి ఆ ఇంటి నుండి వెళ్లిపోవడానికి నిశ్చయించుకుని, అర్థరాత్రి పూట చీకటి కొట్టులో ఉన్న జీవన్‌ని తీసుకుని అక్కడ నుండి బయటపడుతుంది.

ఆ ఊరి నుండి పొలాల్లో గుండా నడిచి వెళ్తే హైవే వస్తుంది. అక్కడికి చేరుకుంటే ఏదో ఒక బస్సు ఎక్కి ఆ ఊరికి దూరంగా వెళ్ళాలని తలచిన మీనాక్షి కొడుకుతో సహా ఆ చీకట్లో పొలం గట్ల మీద నడిచి హైవే చేరుకుంది. బస్సులు ఆగే చోట రావిచెట్టు కింద నిలుచుంది. అనేక బస్సులు వచ్చి ఆగకుండానే వెళ్ళిపోయాయి. చివరికి ఒక బస్సు ఆగితే అది జీవన్‌తో సహా ఎక్కింది. టికెట్‌ తీసుకుంది. కిటికీ పక్క సీటు దొరకడంతో జీవన్‌ నిద్రలోకి జారు కున్నాడు. బస్సు కొద్ది దూరం వెళ్ళి, సడెన్‌ బ్రేకుతో ఆగింది. మీనాక్షితో పాటు బస్సులో ఉన్న వాళ్ళంతా ‘ఏమయ్యింది’, ‘ఏమయ్యింది’ అంటూ కంగారుపడి చుట్టూ చూశారు.

ఇక చదవండి…

అక్కడ రోడ్డుకడ్డంగా జనం గుంపుగా నిలబడి ఉన్నారు. బస్సు ఆగగానే వాళ్ళు పరుగున వచ్చారు. వాళ్ళను బస్సు ఎక్కనివ్వకుండా, గుమ్మానికి అడ్డంగా నిలబడ్డాడు బస్సు కండక్టర్‌.

‘ఇలా దారిలో బస్సు ఆపి ఎక్కాలని చూడడం తప్పు, స్టాపు రావాలి సార్‌! మా యజమానికి తెలిస్తే ఊరుకోడు’ అంటూ దొమ్మీగా బస్సు ఎక్కాలని చూసిన వాళ్ళని అడ్డుకున్నాడు కండక్టర్‌.

ఆ గుంఫులోంచి ఒక ఆసామి ముందుకు వచ్చి, కండక్టర్‌ చేతిలో చెయ్యేసి పట్టుకుని, ‘ఇవి చేతులు కావు, కాళ్ళనుకో! అర్జంటు పనిపడి, పట్నం వెళ్ళాల్సి వచ్చింది. తెల్లారేసరికి అక్కడికి చేరాలి. అక్కడకు సకాలంలో చేరాలంటే ఈ బస్సే ఎక్కాలి, ఎలా మరి! మేము నడిచివచ్చే వరకూ మాకోసం ఇది ‘బస్సుస్టాప్లో’ ఆగి ఉంటుందంటారా చెప్పండి ? కాస్తంత కనికరం చూపిస్తే తప్పేముంది’ అని అడిగాడు.

అతని ప్రార్థనే ఫలించిందో లేక అతడు కండక్టర్‌ చేతిని అందుకున్నప్పుడు చేతులుమారిన వందనోటు మహిమో, ఏదైతేనేమి, కండక్టర్‌ అడ్డు తప్పుకుని వాళ్ళకి దారి ఇచ్చాడు. రోడ్డు మీద గుంపుగా ఉన్న జనమంతా గబగబా వచ్చి బస్సు ఎక్కేశారు.

డ్రైవర్‌ కేకపెట్టాడు, ‘అంతమంది కూచోడానికి జాగా ఎక్కడ్దిరా బామ్మర్దీ!’ అలా తన ఉనికిని గుంభనంగా తెలియజేసి, నీకు ముట్టినదాంట్లో సగం నాది – అని చెప్పకనే చెప్పాడు ఆ బస్సు డ్రైవరు.

‘ఫర్లేదు బామ్మర్దీ! నే నెలాగో సర్ది కూచోబెడతాలే ! ముందు స్టేషన్లలో దిగేటోళ్ళు శానామందున్నారు’ అన్నాడు కండక్టర్‌. అంతా ఎక్కాక ‘రైట్‌’ చెప్పాడు అతడు.

బస్స పూర్తి వేగం అందుకోకముందే, జనాన్ని సర్ది కూర్చోబెట్టి, కొత్తగా ఎక్కిన వాళ్ళకి టిక్కెట్లు కొయ్యడం ముగించాలనుకున్నాడు కండక్టర్‌. అందరికీ టిక్కెట్లు ఇచ్చి, తన సీటులో కూర్చోబోతుండగా అతనికి ఎందుకో, తను చింపిన టిక్కెట్ల కంటే బస్సులోని జనం ఎక్కువగా ఉన్నారనిపించింది. వెంటనే చెకింగ్‌ మొదలు పట్టాడు. ఒక్కొక్కళ్ళ దగ్గర ఆగి, టిక్కెట్‌ చూసి, ఎక్కడ ఎక్కారో, ఎక్కడికి వెడుతున్నారో కనుక్కుని, సరిగా ఉన్న టిక్కెట్లకు పెన్సిల్తో టిక్కు పెడుతూ, ప్రతి టిక్కెట్టునూ పరీక్షిస్తున్నాడు అతడు. తొక్కిడిలో టిక్కెట్టు తీసుకోకుండా బస్సు ఎక్కినవాళ్ళు దొరికిపోయారు. కొందరు పెనాల్టీ కట్టి మరీ టిక్కెట్‌ తీసుకుంటే, మరికొందరు ఏడుపు మొహాలతో బస్సు దిగి వెళ్ళిపోయారు.

సడెన్‌ బ్రేకు వేసినప్పుడు మెలకువ వచ్చిన జీవన్‌ తల్లి పక్కన కూచుని, బస్సులో జరుగుతున్న ‘హైడ్రామా’ ను కళ్ళు విశాలంగా చేసుకుని చూస్తున్నాడు. కండక్టర్‌ చెకింగ్‌ చేస్తూ, నెమ్మదిగా చిట్ట చివరలో కూర్చున్న ఆ తల్లీ కొడుకుల దగ్గరకి వచ్చాడు. మీనాక్షి టిక్కెట్‌ తీసి చూపించింది. అంతా కరెక్టుగా ఉండడంతో, టిక్‌ చేసి ఇచ్చేశాడు. ‘నెక్స్టు’ అంటూ, ఎటో చూస్తున్న జీవన్‌ భుజంపై పెన్సిల్తో తట్టాడు. అదేమిటో బొత్తిగా తెలియకపోడంవల్ల, జీవన్‌ దులపరించెయ్యడంతో, కండక్టర్‌ చేతిలోని పెన్సిల్‌ ఎగిరివెళ్లి దూరంగా పడింది.

దాంతో కండక్టర్‌కి కోపం వచ్చింది.

‘ఎవరీ అబ్బాయి’ అని ఉరిమినట్లుగా అన్నాడు.

‘మా అబ్బాయేనండి’ అంది మీనాక్షి భయం భయంగా.

‘టిక్కెట్‌ తీశావా, ఏది?’ నేలమీద పడ్డ పెన్సిల్‌ తీసుకుంటూ కండక్టర్‌ అడిగాడు మీనాక్షిని.

‘లేదండి. చిన్నపిల్లాడే కదాని..’ నసిగింది మీనాక్షి.

కండక్టర్‌ జీవన్‌ వైపు పరీక్షగా చూసి ‘ఎన్నేళ్ళు ?’ అన్నాడు.

‘మొన్ననే ఆరు నిండాయి’ అంది నిజాయితీగా మీనాక్షి.

‘ఐతే ఇకనేం, అరటిక్కెట్టు తియ్యాలి. అరటిక్కెట్‌ అంటే ఎంతో తెలుసా ? నీ టిక్కెట్లో సగం! అంటే నీకు 90 రూపాయిలైతే, అందులో సగం 45 రూపాయిలు. తొందరగా తియ్యి’ తొందరపెట్టాడు.

మీనాక్షి కొంగుముడి విప్పి డబ్బులు లెక్కించసాగింది. ఒక్క నాలుగు రూపాయిలు తక్కువయ్యాయి. మాటాడకుండా మొత్తం చిల్లర కండక్టర్‌ చేతిలో పోసింది.

కండక్టర్‌ మళ్ళీ లెక్కించి, ‘నాల్గు రూపాయిలు తక్కువ’ అన్నాడు.

‘నాదగ్గర అంతే ఉంది, ఇంకొక్క దమ్మిడీ కూడా లేదు’ అంది భయపడుతూనే.

‘హోల్డాన్‌!’ పెద్ద బొబ్బపెట్టాడు కండక్టర్‌.

‘క్రీచ్‌’ మన్న బ్రేకుల చప్పుడుతో బస్సు రోడ్డువార ఆగింది.

‘టిక్కెట్‌ కొయ్యనోళ్ళు బండి దిగండి, లేమ్మా! లేచి ఆ పిల్లోణ్ణి కిందికి దింపెయ్యి’ అంటూ కండక్టరు తొందర చేశాడు.

నిస్సహాయంగా జనం వైపు చూసింది మీనాక్షి.

‘కండక్టరు ఏమిటంటున్నాడు? ఎవరికోసమని తానింత తెగింపుచేసి ఇల్లువదలి వచ్చిందో ఆ పిల్లాడిని, ఆరేళ్ళ పసివాడిని, అర్ధరాత్రి కటిక చీకట్లో, ఏపాటి పరిచయమూ లేని కొత్తచోటులో, ఒంటరిగా వదిలెయ్యడమా? అసంభవం! అది ఎంతమాత్రం జరిగే పనికాదు’ అనుకుంది మీనాక్షి దఢంగా.

‘గమ్యమేమిటో తెలియని ఈ ప్రయాణంలో ఆదిలోనే హంసపాదా’ అనుకునే సరికి ఆమెకు కన్నీరు ఆగలేదు.

ఆ కన్నీరు చూసిన ఒక ప్రయాణీకురాలికి మనసు కరిగి నీరయ్యింది. వెంటనే కండక్టరుకి హితవు చెప్పింది. ‘అదేంటి బావూ! అట్టంటవు ? మరీ ఇసిత్రాలు మాటాడమోక ! కడుపున కన్న బిడ్డను నడిరోడ్డుమీన ఒగ్గేసి, ఏ తల్లైనా ఎలిపోద్దా ఏటి ? ఓ నాల్రోపాయిలకాడికి, అగ్గెట్టమోక, ఒగ్గెయ్‌’ అంది.

‘రూల్సు ఒప్పొద్దూ? నీ కేంటి చెపుతావ్‌! ఇయ్యేల నేనీ నాల్రూపాయిలూ ఒగ్గేస్తే, రోపు నా ఉద్యోగాన్ని గూడా ఒగ్గెయ్యాల్సి రావచ్చు. నీదేం పోయె! మాయదారి పొసికోలు కబుర్లు ఎన్నైనా చెపుతావు’ అంటూ ఆమెపైన విసుక్కున్నాడు కండక్టరు.

ఆపై మీనాక్షి వైపుకి తిరిగి, ‘నీ బిడ్డకు టిక్కెట్టు కొను, లేదా వాడిని దింపెయ్యి. అది నచ్చకపోతే నువ్వూ దిగిపో. తొందరగా తేల్చు’ అంటూ హడావిడి చేశాడు ఆ కండక్టరు. వెంటనే మీనాక్షి లేచి నిలబడి కొడుకు చెయ్యి అందుకుంది.

అదే బస్సులో ఉన్న మరో ఆసామి కల్పించుకుని ‘ఆమె కొన్న టిక్కెట్టుకి ఇంకా సగమైనా అవ్వలేదు ప్రయాణం! కట్టిన డబ్బులో సగమైనా ఆమెకు తిరిగి ఇచ్చేస్తే బాగుంటుంది’ అన్నాడు.

గయ్యిమన్నాడు కండక్టరు. ‘నీకోసం రూల్సు మారవు. ఒకసారి టిక్కెట్‌ కోస్తే మరి వాపసు ఇవ్వరు. నీకంత జాలిగా ఉంటే ఆ నాలుగు రూపాయిలూ నువ్వు కట్టెయ్యి, గొడవొదిలిపోద్ది!’.

మళ్ళీ ఆ మానవుడు నోరు విప్పలేదు.

‘దిగమ్మా! తొందరగా దిగు. ఇక్కడే తెల్లారి పోయేలా ఉంది’ మరోసారి చెప్పాడు కండక్టరు.

మరే గత్యంతరం లేక, దిగిపోడానికే నిర్ణయించు కుని కొడుకు చెయ్యందుకుని లేచి ముందుకు నడిచింది మీనాక్షి. వెళ్ళిపోతున్న మీనాక్షివైపు జాలిగా చూస్తూ ఊరుకోలేక నోరుపారేసుకుంది ఇందాకటి ముసలమ్మే మళ్ళీ..

‘ఏం మడిసివయ్యా నువ్వు? నీ కాడున్నది గుండెకాయా, బండరాయా? ఆడకూతురు, సిన్న పిల్లోన్ని ఎంటెట్టుకుని పెయానం సేత్తా ఉందనైనా లేకుండా, అద్ధరేత్తిరికాడ, ఈ అడవిలో ఒగ్గేస్తవా..’

ఆమె మాటల్ని ఎంతమాత్రం పట్టించుకోలేదు కండక్టరు. మీనాక్షి కొడుకుతో బస్సు దిగగానే ‘రైట్‌’ చెప్పేశాడు. వెంటనే వెళ్ళిపోయింది బస్సు దుమ్ము రేపుకుంటూ.

కొంతసేపు, మీనాక్షి కొడుకు చెయ్యి పట్టుకుని, కొయ్యబారినట్లు చేష్టలు దక్కి రోడ్డువారగా నిలబడిపోయింది. ఇప్పుడేం చెయ్యాలో ఏమీ తోచని పరిస్థితి ఆమెది!

అది చిన్న అడవి ప్రాంతం. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉండటంతో జుయ్‌ మని రొదచేస్తూ వీస్తోంది గాలి. ఆకాశంలో పరుగులు పెడుతున్న మేఘాలు నక్షత్ర కాంతిని అడ్డుకుంటున్నాయి. ఆ కనువెలుగులో ప్రకతి స్పష్టాస్పష్టంగా నీడలాగా కనిపించి భయాన్ని పుట్టిస్తోంది. రోడ్డు వార ఒత్తుగా పెరిగిన గడ్డిలో దాగివున్న కీచురాళ్ళ సంగీతం అవిశ్రాంతంగా సాగుతూ, చెవుల తుప్పు వదలగొడుతోంది. రాత్రుల్లో తిరిగే జంతువులు రోడ్డుకి వారగా పెరిగిన పొదల్లో సందడి చేస్తున్నాయి. ఏదో జంతువు వేటాడింది కాబోలు, చనిపోతున్న జీవి కడసారిగా చేసిన ఆర్త నాదంతో పరిసరాలు కంపించాయి. హదయ విదార కంగా ఉంది ఆ జంతువు తాలూకు రోదన ధ్వని.

‘అమ్మా!’ అంటూ తల్లిని చుట్టుకుని, భయంతో బెదిరిపోయాడు జీవన్‌. మీనాక్షి తెలివి తెచ్చుకుని, జీవన్‌ వెన్ను నిమిరి సముదాయించే ప్రయత్నం చేసింది. అక్కడే, రోడ్డువార మొలచిన గడ్డిలో చటుక్కున చతికిలబడి, కొడుకును ఒడిలోకి తీసుకుని శాయశక్తులా వాడిని ఓదార్చే పనిలో పడింది ఆమె.

దారీ-తెన్నూ లేని ఈ పయనం ఏ దారిన నడుస్తుందో ఎంతమాత్రం ఊహకు అందక ఆమెకీ చాలా భయంగా ఉంది. అయినా, కొడుకుని ఓదార్చే ప్రయత్నంలో ఉన్న ఆమె జీవన్‌తో..

‘నాన్నా! భయపడకురా, ఆ ఆంజనేయస్వామి మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉన్నాడురా! ఏది ఏమైనా, మనకొచ్చిన భయమేమీ లేదు. ఆ స్వామి దయ ఉంటే చాలు, మనకి అన్నీ ఉన్నట్లే! తప్పక మనల్ని రక్షిస్తాడు. ఇప్పుడు మనం ఆయన్ను ప్రార్ధిద్దామా’ అంటూ గొంతు సవరించుకుని ‘ఆంజనేయ దండకం’ ఎత్తుకుంది మీనాక్షి.

ఆ సమయంలో ఆ రోడ్డుమీద ఆ తల్లీ, కొడుకులు తప్ప మరెవరూ లేరు. రాత్రులందు తిరిగే ఋషిపక్షులు, గుడ్లగూబలు లాంటివి, ఉండుండీ కర్ణ కఠోరంగా ఆరుస్తూ, ఆ నీరవ నిశీధిలోని భయాన్ని మరింతగా పెంచుతున్నాయి!

‘శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభా దివ్యకాయం..’ తల్లి గొంతుతో గొంతుకలిపి, భక్తితో చేతులు జోడించి, కళ్ళుమూసుకుని ప్రార్ధించసాగాడు జీవన్‌ కూడా.

జీవితంలోని భయాలనీ, బాదరబందీలనీ.. అన్నింటినీ మరిచిపోయి, ఆ తల్లీ కొడుకులు దైవ ప్రార్ధనలో లీనమై కొంతసేపు ఏకాగ్రతతో దైవ ప్రార్థన చేస్తూ గడిపారు. ఆ దండకాన్ని వల్లించడం పూర్తయ్యేసరికి వాళ్ళకు పోయిన శక్తి, ధైర్యం తిరిగి వచ్చినట్లు అనిపించింది. లేచి నిలబడి, కొడుకుని లేవదీసింది మీనాక్షి. తెల్లవారేసరికి తాము విడిచివచ్చిన ఊరికి సాధ్యమైనంత దూరంగా వెళ్ళిపోవాలన్నది ఆమె సంకల్పం. ఇద్దరూ మళ్ళీ నడక మొదలుపెట్టారు. కొంతదూరం నడిచేసరికి, ‘అమ్మా! నా కాళ్ళునొప్పే! ఇక నడవలేను’ అంటూ ఉన్నచోటే జీవన్‌ నేలమీద చతికిలబడ్డాడు.

‘ఓపిక పట్టాలిరా నాన్నా, తప్పదు! మనమిప్పుడు లేని ఓపిక తెచ్చుకుని ముందుకు నడవాలి. మనం ఎంతముందుకి వెళ్ళిపోతే అంత మనకే మంచిది. మనం ఇలా నడుస్తూండగానే, వెలుగు వస్తుంది.

వెలుగువచ్చాక ఒక ఊరు వస్తుంది, అక్కడ నీకు ఇడ్లీలు కొనిపెడతా, అవైతే మెత్తగా ఉండి నువ్వు తినగలవు. నా బంగారు తండ్రివి కదూ! లేమ్మా’ అంటూ ఎలాగో బ్రతిమాలి, బామాలి లేవదీసి కొడుకుని ముందుకు నడిపించగలిగింది మీనాక్షి.

మళ్ళీ కొంతదూరం నడిచాక ఇక నడవలేనని నిలబడిపోతే వాడిని ఎత్తుకు నడవడానికి చూసింది మీనాక్షి. కాని, అది ఆమె వల్ల కాలేదు. కొడుకుని ఎత్తుకుని నాలుగడుగులకంటే ముందుకి నడవలేకపోయింది ఆమె. ఇక లాభం లేదని, మళ్ళీ కాసేపు ఏ సంచారము లేని ఆ రోడ్డువార కూర్చుని విశ్రాంతి తీసుకోక తప్పలేదు.

కొంచెం సేపు కూర్చుంటూ, మళ్ళీ లేచి నడుస్తూ – అలా ఇంకొంతదూరం వెళ్ళేసరికి అక్కడ రోడ్డు రెండుగా చీలింది. ఏ దారిన వెళ్ళాలి అనే సందేహంతో మీనాక్షి మనసు ఊగిసలాడింది.

–  వెంపటి హేమ (కలికి)

(ఇంకా ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *