జీవనస్రవంతి – 7

జీవనస్రవంతి – 7

జనజాగృతి

జీవన్‌ గోల్డ్‌మెడల్‌తో డిగ్రీ పాసై ఉద్యోగం వెతుకుతూ, ఖర్చుల కోసం పత్రికలకు కథలు రాస్తుంటాడు. జీవన్‌ తల్లి మీనాక్షి యాజులుగారింట్లో వంట పనిచేస్తూ కొడుకును చదివించింది. జీవన్‌ స్నేహితుడు కిరణ్‌. వీరిద్దరి స్నేహితుడు రాఘవ. కిరణ్‌ ఉద్యోగం వెతుకులాటలో ఉంటాడు. రాఘవ ఆటో నడుపుతుంటే, జీవన్‌ యాజులుగారి మనవళ్ళకు ప్రైవేట్లు చెప్పే ఉద్యోగంలో కుదిరాడు. తూ.గో. జిల్లాకు చెందిన యాజులుగారు ఆరోగ్యం దృష్ట్యా కొడుకు ఉండే ఊరికి వచ్చి, స్థిరపడ్డారు. తరువాత ఆయన కొడుకూ, కూతురూ అమెరికా వెళ్ళి, వాళ్ళ పెద్ద పిల్లలను యాజులుగారి వద్దే ఉంచారు.

యాజులుగారి మేనకోడలు జానకి ఢిల్లీ నుండి తన పిల్లలు కోవిద, శ్రీకర్‌లతో యాజులుగారింటికి చూడ్డానికి వచ్చింది. కోవిద జీవన్‌కి 143 చెబుతుంది. జీవన్‌ చిన్నగా నవ్వితే చూసిన తల్లి మీనాక్షి జీవన్‌ని ‘నువ్వు పుట్టి నా పుట్టి ముంచా వంటూ’ తిడుతుంది. దాంతో ఇల్లు విడిచి బయటికి వచ్చేసిన జీవన్‌ తన పుట్టుక వల్లే తన తల్లికి కష్టాలు వచ్చాయని తలచి, ఈ తప్పును సరిదిద్దాలని నిర్ణ యించుకున్నాడు. జీవన్‌ రాక కోసం ఎదురుచూస్తూ మీనాక్షి తన గత జీవితాన్ని గుర్తుకు తెచ్చుకుంది.

తన మేనత్త కొడుకు శంకరాన్ని పెళ్ళిచేసుకున్న మీనాక్షి ఏడాదిలోనే గర్భవతి అయింది. ఏడవ నెలలో కరెంట్‌ షాక్‌తో భర్త చనిపోవటంతో పుట్టింటికి వచ్చేసింది. కూతురి పరిస్థితి చూసి తల్లి కూడా మరణిం చింది. మీనాక్షికి కొడుకు పుడితే అందరూ అతడిని నష్టజాతకుడన్నారు. మీనాక్షి తండ్రి మనవడిని ‘చిరంజీవి’ అని పిలుస్తూంటే, అది చివరికి ‘జీవన్‌’ గా స్థిరమైంది. మీనాక్షి తండ్రి కూడా కాలం చేశాడు.

చివరికి మీనాక్షి అన్న వెంకటాచలపతి, వదిన పద్మల దగ్గర ఉంటూ ఆ ఇంటి పనులన్నిటినీ తనే చేస్తూండేది. బద్ధకస్తురాలైన పద్మ మీనాక్షిని, జీవన్‌ని నానా మాటలూ అంటూండేది. పద్మ కొడుకు రవి, కూతురు రాధిక ఒకసారి బంతితో ఆడుకుంటూంటే దానిని జీవన్‌ లాక్కున్నాడని, పద్మ జీవన్‌ని కొట్టి తోసేస్తుంది. దాంతో జీవన్‌ రవి, రాధికలను కొడతాడు. అది తట్టుకోలేని పద్మ జీవన్‌ని స్తంభం వైపు తోస్తే, అది తగిలి జీవన్‌కి ముక్కు, మూతి పగిలి రక్తం కారి, కింద పడిపోయాడు. కొంతసేపటికి తానే తెప్పరిల్లి, కారుతున్న రక్తాన్ని చూసి భయంతో, ‘అమ్మా’ అంటూ తల్లికోసం పరుగుపెట్టాడు.

ఇక చదవండి..

గోధూళి వేళకి మీనాక్షి దొడ్డిగుమ్మంలో సిద్ధంగా ఉంది. మేతకు వెళ్ళిన పశువులు ఇళ్ళకు తిరిగివచ్చే వేళది! నిండుగా ఉన్న పొదుగులతో ఇంటికి తిరిగివచ్చిన పాడిపశువులు తమ దూడలను పలకరించే ‘అంబా’రవాలతో, లేగదూడల జవాబులతో సందడిగా ఉంది అక్కడంతా.

వాటికోసమే కనిపెట్టుకుని ఉన్న మీనాక్షి, అవి వచ్చిన వెంటనే వాటిని గుంజలకు కట్టి, దాణా పెట్టి, ఆపై వాటి ముందర గడ్డి వేసి, పాలు పితకడానికి గొల్లడు వచ్చేవేళకు తగిన రంగం సిద్ధం చేసేసరికి అసురసంధ్య అయ్యింది. ఆ తరవాత వెళ్లి స్నానం చేసి, మడిబట్ట కట్టుకుని రాత్రి వంట చేసేందుకు వంటగదిలోకి వచ్చింది మీనాక్షి.

సరిగా అప్పుడే తల్లిని వెతుక్కుంటూ వచ్చిన జీవన్‌, ఆర్తితో, ‘అమ్మా’ అంటూ వచ్చి ఆమెను గట్టిగా కౌగలించుకున్నాడు.

అప్పటికింకా వంటగదిలో లైట్‌ వెయ్యకపోవడంతో గదంతా చీకటితో మసకమసకగా ఉంది. కొడుకు పరిస్థితి తెలియని మీనాక్షి, ‘అయ్యో! నా మడి మంటకలిపేశావు కదురా’ అని కోపంగా అంటూ, పని తొందరలో ఉన్న మీనాక్షి వాడి వీపు మీద ఒక్క చరుపు చరిచింది. మూలిగే నక్కమీద తాటికాయలా పడింది ఆ దెబ్బ! బాధతో గిలగిలలాడుతూ ‘కెవ్వు’ మన్నాడు, పసివాడు పాపం!

లైట్‌ వేసింది మీనాక్షి. అప్పుడు తెలిసింది ఆమెకు కొడుకు ఎంత దుస్థితిలో ఉన్నాడో ! జరిగినదేమీ తెలియని మీనాక్షి, జీవన్‌ ఆటల్లో పడి దెబ్బలు తగుల్చుకున్నాడనే అనుకుంది.

‘ఏమైందిరా నీకు ? ఇంతదెబ్బ ఎలా తగిలిందిరా బాబూ!’ అంటూ ఆక్రోశించిందామె. తాను వాడిని కొట్టినందుకు బాధపడింది. ఆపై తన పైటచెంగు నీళ్ళలో ముంచి, వాడి మొహానికి అంటివున్న రక్తాన్ని మదువుగా తుడిచి, పంచదార డబ్బాతీసి రవంత పంచదార నోటిలో వేసింది, కదిలిన పళ్ళనుండి కారే రక్తాన్ని ఆపుతుందన్న ఉద్దేశంతో.

కొడుకుని చేరదీసుకుని, ‘పంచదార నెమ్మదిగా చప్పరించు. నెప్పి తగ్గుతుంది’ అంది ఓదార్పుగా. అసలే బాధలో ఉన్నవాడిని తను కొట్టి, మరింత బాధపెట్టినందుకు పశ్చాత్తాపంతో కన్నీరు పెట్టుకుని జీవన్ని దగ్గరగా హత్తుకుంది మీనాక్షి.

సరిగా అప్పుడే మేడ దిగి, వంటింట్లోకి వచ్చిన పద్మ అదంతా కళ్ళారా చూసింది. అసహనంతో ఆమెకు ఒళ్ళు మండిపోయింది. గుడ్లెర్రజేసి, అరచేత్తో నోటిపైన కొట్టుకుంటూ..

‘హవ్వ.. హవ్వ ! అసలు సంగతి ఇదన్నమాట ! తల్లి మద్దతు ఉండబట్టే వాడలా పేట్రేగిపోతున్నాడు. వెధవపని చేసి వచ్చిన వాడిని, మందలించి బుద్ధి చెప్పకపోగా, వాడికి పంచదార తినిపించి మరీ ముద్దుచేస్తోంది ఈ మహాఇల్లాలు. చూడండి బాబూ! చూడండి, ఇంక వీడు ఇలాకాక ఇంకెలా తయారౌతాడు చెప్పండి?’ ఊరందరూ తనమాటలు వినాలన్నట్లు గట్టిగా అరుస్తోంది పద్మ. సర్ది చెప్పడానికి ప్రయత్నించింది మీనాక్షి,

‘వీడేం చేసివచ్చాడో నాకు తెలియదు వదినా! నేను దొడ్లో పశువులకు దాణా పెడుతున్నాను. ఇప్పుడే లోపలకు వచ్చా. వీడు ముక్కూ నోరూ పగిలి, రక్తాలు కారుతూ వస్తే, రక్తం కారడం కాస్త తగ్గుతుందని, చాలా కొంచెం పంచదార నోట్లో వేశా’ అంది భయం భయంగా.

పద్మ మీనాక్షి మాటల్ని అసలు పట్టించుకోలేదు. వంట గదిలోకి పిల్లి వస్తే బెదిరించడానికని తలుపు మూల దాచిన వెదురు బెత్తం తీసి, తల్లిని కరుచుకుపోయి ఓదార్పును పొందుతున్న జీవన్ని బయటికి లాగి, ఆ బెత్తంతో కొట్టడం మొదలెట్టింది పద్మ.

‘వెన్న పెడితే వేలు కరిచాడుట ! నా ఇంట్లోపడి తింటూ, నా పిల్లల్నే కొడతాడా’ అంటూ నిండా ఆరేళ్ళైనా లేని పసివాడైన జీవన్‌ని ఆ బెత్తంతో ఎడాపెడా కొట్టసాగింది.

మీనాక్షి కొడుక్కి అడ్డుపడి, చాలావరకూ ఆ దెబ్బలన్నీ తనే కాసింది. వాళ్ళనలా కసితీరా కొట్టి కొట్టి, పద్మ అలసిపోయింది కాబోలు, బెత్తం కిందపడేసి, జీవన్‌ని తల్లినుండి విడదీసి ఈడ్చుకుపోయి, పాత సామాను పడవేసే కొట్టుగదిలో పడేసి, బయటనుండి తలుపుమూసి గడియవేసింది.

ఏడుస్తూ వెనకాలే పరుగెత్తుకొచ్చిన మీనాక్షితో, ‘ఏమమ్మోయ్‌ ! నీకే చెపుతున్నా, విను! నువ్వు గాని తలుపు తెరిచావంటే మాట దక్కదు. ఈ దెబ్బతో వాడికి బుద్ధిరావాలి’ అంటూ వేలు చూపించి బెదిరించి మరీ మేడపైకి వెళ్ళింది పద్మ. హతాశురాలై ఏడుస్తూ వంటగదిలోకి పరుగెత్తింది మీనాక్షి.

——-

టక్‌ – టక్‌ – టక్‌ మంటూ నేలను తాకి చప్పుడు చేస్తూ, పైపైకి లేస్తూ ఎంతో అందంగా ఎగురుతోంది పచ్చబంతి ! వేగంగా పుటికీలు కొట్టి ఆడుకుంటు న్నాడు జీవన్‌. నీరెండపడి, బంగారు రంగుతో మెరిసిపోతూ, జీవన్‌ పుటికీ కొట్టినప్పుడల్లా పైపైకి ఎగురుతూ ఆడుతోంది ఆ బంతి. దాన్నే చూస్తూ, దానితో ఆడుతూ తన్ను తాను మరిచి, మురిసి పోతున్న జీవన్‌కి మనసంతా సంతోషం ! అంతులేని ఆనందం !!

‘అమ్మా! ఇటు చూడు, ఎంతబాగుందో నా బుజ్జి బంతి ! బంగారు రంగులో మెరుస్తోంది. రవిగాడి బంతికంటే నా బంతే ఎక్కువ అందంగా ఉంది కదూ! వాడిది ఉట్టి పసుపురంగు, నాది బంగారు రంగు! ఇది నిజంగా బంగారుబంతే, సందేహం లేదు’.

అది ఎన్నోసారో జీవన్‌ ఆ బంతిని గురించి అలా గొప్పగా అనుకోవడం. వందోసారో, అంతకంటే ఎక్కువో కూడా. పట్టరాని ఆనందంతో వాడు పుటికీలు కొడుతుంటే దగ్గర నిలబడి చూస్తోంది మీనాక్షి. బంతి పైకి లేస్తున్నకొద్దీ సూర్యరశ్మి పడి అది ఇంకా ఇంకా ధగధగలాడిపోతోంది. అది ఒక అద్భుతంలా ఉంది జీవన్‌ పసి మనసుకి!

‘అమ్మా! నా బంతి చూడు, ఎంత ఎత్తుకి ఎగురు తోరదో’ అంటూ హుషారుగా, అరచేత్తో శక్తినంతా ఉపయోగించి, ఒకే ఒక్కదెబ్బ గట్టిగా కొట్టేడు ఆ బంతిని జీవన్‌. అంతే.

ఆ బంతి నేలకు కొట్టుకుని చాలా పైకి లేచింది. అలా లేచి, లేచి, లేచి మేఘాలలోకి వెళ్ళి, ఆపై నక్షత్ర మండలంలోకి వెళ్ళిపోయి జీవన్‌ చూస్తూ ఉండగానే మాయమై కనిపించకుండాపోయింది.

‘అయ్యో! నా బంతి’ అంటూ పెద్దగా కేకపెట్టి లేచి కూర్చున్నాడు జీవన్‌. అక్కడితో కల చెదిరిపోయి వాస్తవం ప్రత్యక్షమయ్యి, భయంతో వణికాడు ఆ పసివాడు.

(చీకటి కొట్టులో తను గడిపిన అనుభవాలన్నీ తల్లికి ఆ తరవాతి రోజుల్లో తు.చ. తప్పకుండా చెప్పాడు జీవన్‌. అందుకే అవంత బాగా తెలుసు మీనాక్షికి.)

మేనమామ భార్య పసివాడైన జీవన్‌ని కొట్టు గదిలోకి తోసి, తలుపులు బిగించి వెళ్ళిపోగానే ఒంటరిగా అసహాయంగా ఆ పాతసామాను మధ్య కూర్చుని, బాధతో, భయంతో ఏడుస్తూ ఉండి పోయాడు జీవన్‌. అప్పటికింకా ఎలుకల సంచారం మొదలవ్వలేదు. ఏడ్చి ఏడ్చి అలసి నేలమీద పడుకుని నిద్రపోయాడు ఆ పసివాడు. ఆ నిద్రలో కలగన్నాడు. ఆ కలలో బంగారు బంతితో ఆడుకున్నాడు. కానీ, మెలకువ రాగానే వాస్తవం ఎదురుపడింది.

చుట్టూ చీకటి. కీచు కీచుమంటూ సామాను మధ్య ఎలుకలు పరుగులు పెడుతున్నాయి. వాటి అల్లరికి ఉండుండి దొర్లిపడిన సామాను గుండె లవిసేలా పెద్దగా చప్పుడు చేస్తున్నాయి. ఎక్కడో ఎత్తుగా గోడలో ఉన్న వెంటిలేటర్‌ ద్వారా చవితి చంద్రుని వెన్నెల తాలూకు వెలుగు కొద్దిగా వస్తోంది.

చాలీచాలని ఆ గుడ్డివెలుగు వల్ల, ఆ గదిలోని పనికిమాలిన సామాను సష్టించిన పెద్దపెద్ద నీడలు మరింత భయాన్ని కల్గిస్తున్నాయి. ఎలుకల దాష్టీకానికి అటక మీదనుండి కిందపడిన రేకుడబ్బా భయంకర మైన శబ్దం చెయ్యడంతో ‘కెవ్వు’న కేకపెట్టి, పెద్దగా ఏడ్చాడు జీవన్‌. కాని అది అరణ్యరోదనమే అయ్యింది.

అది విని కాపాడడానికి రాలేదు ఎవరూ. మరేమీ చెయ్యలేని అసహాయ స్థితిలో కళ్ళు గట్టిగా మూసుకుని, భయాన్ని అణుచుకోవాలని చూశాడు ఆ పసివాడు. అలా వాడు ఎంతసేపున్నాడో వాడికే తెలియదు. క్రమంగా ఆ రవంత వెన్నెల కూడా సమసిపోవడంతో చీకటి గుయ్యారంలా మారింది ఆ ప్రదేశం.

మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి, దూరం నుండి మిణుకు మిణుకుమనే చిన్న వెలుగు, చుక్కలా కనిపించింది. అది అంతకంతకూ దగ్గరగా వస్తోంది. దానిని చూసి, జీవన్‌ మరింత భయభ్రాంతు డయ్యాడు. వాడి గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. బడిలో పిల్లలు చెప్పుకునే కథల్లోని కొరివిదయ్యాలు గుర్తుకొచ్చాయి. వెంటనే, ‘బాబోయ్‌! కొరివిదయ్యం’ అంటూ అరిచి, పెద్ద కేకపెట్టాడు జీవన్‌.

పెద్ద కేక పెట్టానని అనుకున్నాడేగాని, అది గొంతుపెగిలి బయటికి రాలేదు. అంతలో ఆ వెలుగు మరింత పెద్దదై చీకటి కొట్టు తలుపు తెరుచుకుని దగ్గరగా రానే వచ్చింది. భయంతో బెగ్గటిల్లిపోయాడు జీవన్‌. మళ్ళీ అరవాలని నోరు తెరవగానే ఒక చల్లని చెయ్యి ఆ నోరు మూసేసింది. నెప్పికి మూలిగాడు జీవన్‌.

‘భయపడకురా కన్నా! నేనేరా అమ్మను’ అన్న మాటలు చెవిలో గుసగుసగా వినిపించాయి. మీనాక్షి పట్టుకొచ్చిన బుడ్డిదీపపు వెలుగుని చూసి జీవన్‌ దయ్యంగా భావించి భయపడ్డాడు.

భయంతో నిలువుగుడ్లు వేసుకుని చూస్తున్న పసివానికి, ‘అమ్మ’ అన్నపదం అమతభాండంలా తోచింది. మరుక్షణంలో వాడికి కడగంటిపోతున్న ప్రాణం వెనక్కి వచ్చినట్లయ్యింది. ఆ బుడ్డిదీపపు చిరువెలుగులోనే తల్లిని గుర్తుపట్టగలిగాడు జీవన్‌! అక్కడితో భయం పోయింది.

‘అమ్మ వచ్చేసింది కదా, ఇక అన్నీ అమ్మే చూసుకుంటుంది’ అన్న భరోసా చిక్కింది వాడికి. ‘అమ్మా!’ అని ఆర్తితో పిలుస్తూ, తల్లిని కౌగిలించు కున్నాడు జీవన్‌. కొడుకును గాఢంగా హదయానికి హత్తుకుంది మీనాక్షి.

ఇప్పుడామె కన్నుల్లో కన్నీళ్ళు లేవు, కార్యదీక్షతో జ్వలిస్తున్నాయి ఆ కళ్ళు. కొడుకు చెవిలో గుసగుసగా చెప్పింది మీనాక్షి, ‘గట్టిగా మాటాడకు, ఎవరైనా వింటారు. మనమింక ఇక్కడ ఉండటం లేదు, ఇప్పుడే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చేసే చాకిరీ మరెక్కడ చేసినా, మన రోజులు గౌరవంగా వెళ్ళిపోతాయి. నడు, పోదాం’ అంది.

ఇల్లు విడిచి వెళ్ళడంలోని సాధక బాధకాలు ఏమీ తెలియని జీవన్‌కి అది బాగా నచ్చింది. వెంటనే మీనాక్షి ఒడిలోనుండి లేచి నిలబడ్డాడు. వాడికి తెలిసిందల్లా ఇల్లు విడిచి పోవడమంటే, అత్తలాంటి బ్రహ్మరాక్షసికి దూరంగా వెళ్ళడం వరకే !

‘మనం ఇంకొక్క క్షణం కూడా ఇక్కడ ఉండొ ద్దమ్మా! పదపోదాం’ అంటూ తల్లి చెయ్యి పట్టుకున్నాడు.

కొడుకు చెయ్యి విడిపించుకుని, టిఫిన్‌ బాక్సులో తీసుకువచ్చిన మజ్జిగ అన్నం పైకి తీసింది. ‘ఈ కొంచెం, రెండుముద్దలు తిను, ఉట్టి కడుపుతో ప్రయాణం చెయ్యకూడదు’ అంటూ తినిపించ బోయింది.

‘తినలేనమ్మా! నోరంతా నెప్పి’ అన్నాడు జీవన్‌. బుడ్డిదీపం వెలుగులో చూస్తే ముఖమంతా వాచిపోయి కనిపించింది. అప్పుడు గుర్తించింది మీనాక్షి, కొడుకుకి మూతీ, ముక్కూ తెగవాచి ఉన్నాయనీ, మాటకూడా సరిగా పలకలేకుండా ఉన్నాడనీను. ఇక చేసేదేమీ లేక, అన్నం పిండేసి, మజ్జిగ మాత్రం నెమ్మదిగా ఎత్తిపోసి మింగించి, శాస్త్రం ముగించింది ఆమె.

వెంటతెచ్చిన తుండు తడిపి, ఆ తడిబట్టతో ముఖంపైన, ఒంటిమీద ఉన్న రక్తపు మరకలు తుడిచి, ఒంటినున్న బట్టలు విప్పించి, ఉతికిన బట్టలు తొడిగించి, తల దువ్వి కొడుకుని ప్రయాణానికి తయారు చేసింది మీనాక్షి.

ఒక చేత్తో కొడుకుని, మరొకచేత్తో మరో రెండుజతల బట్టలున్న సంచీని పట్టుకుని, బయలు దేరింది మీనాక్షి. ఒక్కొక్క తలుపు తెరుచుకుంటూ, బయటికి వచ్చి దొడ్డిగుమ్మం తలుపు కూడా తెరుచుకుని, రోడ్డుమీదకు వచ్చింది.

అలా మొదలయ్యింది ఆ తల్లీకొడుకుల మహాప్రస్థానం అగమ్యగోచరమైన భవిష్యత్తులోకి, తెలియని గమ్యానికి !

(ఇంకా ఉంది)

–  వెంపటి హేమ (కలికి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *