జీవనస్రవంతి – 6

జీవనస్రవంతి – 6

జరిగిన కథ

జీవన్‌ గోల్డ్‌మెడల్‌తో డిగ్రీ పాసై ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఖర్చుల కోసం పత్రికలకు కథలు రాస్తున్నాడు. జీవన్‌ తల్లి మీనాక్షి యాజులుగారింట్లో వంట మనిషిగా పనిచేస్తూ కొడుకును చదివించింది.

జీవన్‌ స్నేహితుడు కిరణ్‌. వీరిద్దరి స్నేహితుడు రాఘవ. కలిసి చదువుకున్న జీవన్‌, కిరణ్‌లు ఉద్యోగం కోసం వెతుకుతుంటే, రాఘవ ఆటో నడుపుతూ సంపాదన సమస్య కొంతవరకు తీర్చుకున్నాడు. రాఘవని చూసి, తాము కూడా ఉద్యోగాల వెతుకులాటతో పాటు, న్యాయమైన ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించా లనుకున్నారు జీవన్‌, కిరణ్‌లు. అలా జీవన్‌ యాజులుగారి మనవళ్ళకు ప్రైవేట్లు చెప్పే ఉద్యోగంలో కుదిరాడు.

తూర్పుగోదావరి జిల్లా మల్లెవాడకు చెందిన యాజులుగారికి అక్కడ నిండైన ఆస్తులున్నాయి. యాజులుగారి కొడుకూ, కూతురూ అమెరికాలో ఉంటూ, వాళ్ళ పెద్ద పిల్లలను యాజులుగారి వద్దే ఉంచారు. చాలా రోజులకు పూర్వం, కొడుకు ఇండియాలో ఉండగా, యాజులుగారు ఆరోగ్యం దృష్ట్యా కొడుకు ఉండే ఊరికి వచ్చి, అక్కడే స్థిరపడ్డారు.

ఢిల్లీలో ఉండే యాజులుగారి మేనకోడలు జానకి తన ఇద్దరు పిల్లలు కోవిద, శ్రీకర్‌లతో యాజులుగారింటికి వచ్చింది. కోవిద జీవన్‌కి 143 చెబుతుంది. జీవన్‌ చిన్నగా నవ్వాడు. అది చూసిన జీవన్‌ తల్లి మీనాక్షి జీవన్‌ని నానా రకాలుగా తిడుతుంది. నువ్వు పుట్టి నా పుట్టి ముంచావంటూ మాట తూలింది. దాంతో ఇల్లు విడిచి బయటికి వచ్చేశాడు జీవన్‌. మండుతున్న ఎండలో బైటకు వెళ్ళిన జీవన్‌ పార్కులో కూర్చుని ఆలోచిస్తూ, తాను నిజంగానే నష్టజాతకుడనని, తన పుట్టుక వల్లే తన తల్లికి కష్టాలు వచ్చాయని తలచి, ఈ తప్పును సరిదిద్దాలని నిర్ణయించుకున్నాడు. జీవన్‌ రాక కోసం ఎదురుచూస్తూ మీనాక్షి అర్థరాత్రి వరకూ ఎదురు చూసింది. ఆ ఎదురుచూపులతోనే తన గత జీవితాన్ని గుర్తుకు తెచ్చుకుంది.

స్వయానా తన మేనత్త కొడుకు శంకరాన్ని పెళ్ళిచేసుకున్న మీనాక్షి ఏడాది తిరక్కుండానే గర్భవతి అయింది. ఏడవ నెలలో పుట్టింటికి వెళ్ళే ప్రయత్నంలో ఉండగా జరిగింది ఆ దుర్ఘటన! అక్కడితో మీనాక్షి బతుకు తలక్రిందులయింది.

మెయిన్‌ లైన్‌కి రిపేరు రావడంతో, డ్యూటీలో ఉన్న శంకరం ఆ పనిమీద వెళ్ళాడు. అతడు ‘ఆఫ్‌’ చేసుకున్న మెయిన్‌ స్విచ్‌ని, ఎవరో ఆన్‌ చేశారు.

అకస్మాత్తుగా వచ్చిన కరెంట్‌ షాక్‌కి బలైపోయాడు శంకరం!

మరుక్షణంలో శవమై అంతెత్తు నుండి కిందపడ్డాడు.

చుట్టూ ఉన్న జనం ‘హాహా’ కారాలు చేశారు.

సీమంతం జరిపించుకుని, పూలరథంపై పుట్టింటికి చేరాల్సిన మీనాక్షి, దురదష్టవశాత్తూ భర్తను పోగొట్టుకుని, గర్భభారంతో పాటు, పుట్టెడు దుఃఖభారాన్ని కూడా మోసుకుంటూ, పూర్వసువాసినిగా పుట్టింటికి చేరుకోవలసి వచ్చింది.

అనుకోకుండా వచ్చి, తన జీవితాన్ని తలకిందులు చేసిన విధిని తలచుకుంటూ, తలను భూమిలోకి వంచుకుని, కన్నీరు మున్నీరౌతూ వచ్చి తల్లిని అమాంతం కౌగిలించుకుని భోరున ఏడ్చింది మీనాక్షి.

కూతుర్ని ఆ స్థితిలో చూడగానే, అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న మీనాక్షి తల్లి, మరింతగా కంగిపోయి మంచం పట్టింది. ఆపై, మనుమడు పుట్టాడన్న మాటైనా వినకుండానే దుఃఖభారంతో ఆమె గుండె ఆగిపోయింది. తల్లి గుండెలమీద వాలి సేదతీరాలనుకున్న మీనాక్షి ఆశ అడియాసే అయ్యింది. తల్లి మరణంతో మీనాక్షి మరింతగా కంగిపోయింది.

పుట్టిన పసివాణ్ణి అంతా నష్టజాతకుడన్నారు. కడుపులో ఉండగా తండ్రిని, బయటికొచ్చాక అమ్మమ్మనీ పొగొట్టుకున్నాడని అందరూ గొణుక్కున్నారు. అంతకన్నా వాడి గురించి అంతగా పట్టించుకున్న వారెవరూ లేరు! తక్కిన పిల్లల్లా వాడికి బారసాల, నామకరణం వంటి ఏ వేడుకా జరగలేదు. అసలు వాడికి పేరు పెట్టాలని ఆలోచించిన వారు కూడా లేరు. కాని వాడి ప్రసక్తి వచ్చినప్పుడల్లా మీనాక్షి తండ్రి మాత్రం ‘చిరంజీవి’ అని వ్యవహరించేవారు.

‘అమ్మా, మీనాక్షీ! చిరంజీవి ఆకలికి ఏడుస్తున్నాడమ్మా, చూడు’ అనో, బజారుకి వెళ్ళినప్పుడు ఏ గిలక్కాయో, చొక్కాయో కొనితెచ్చి మీనాక్షికిస్తూ, ‘ఇవి చిరంజీవి కోసం కొని తెచ్చా’ అనో అంటూండడంతో అందరూ ఆ పిల్లవాడిని ‘చిరంజీవి’ అని సంభోధించేవారు. క్రమంగా అదే ఆ పిల్లాడి పేరయింది. ఆపై ఆ పేరే సౌలభ్యం కోసం ‘జీవా’గా మారి, చివరకు వ్యావహారిక నామం ‘జీవన్‌’గా స్థిరపడింది.

జీవన్‌కి నాలుగేళ్ళు వచ్చేటప్పటికి మీనాక్షి తండ్రి కూడా కాలం చేశారు.

– – – – – – – –

మీనాక్షికీ, అన్నగారైన వెంకటాచలపతికీ మధ్యలో చాలామంది పిల్లలు పుట్టి పోవడం వల్ల ఎడం పదేళ్ళకు పైనే ఉంది. మీనాక్షి పెళ్లినాటికే అతనికి ఏడాది కొడుకు ఉన్నాడు. వాడిపేరు రవి. ఆ తరువాత మూడేళ్ళకి రాధిక పుట్టింది. చలం భార్య పద్మ ఎప్పుడూ తలనొప్పనో, నడుము నొప్పనో, ఏదో ఒక బాధ పేరుతో మూలుగుతూ సాధారణంగా మేడ దిగి రాదు. చిన్నతనంలోనే తల చెడి, ఇల్లుపట్టిన బంధువు ఒకామె చాలావరకూ ఇల్లు నడిపేది. కొన్నాళ్ళకు ఆమె కాలం చెయ్యడంతో మొత్తం పనంతా మీనాక్షిమీద పడింది.

ఎంత వంచిన తల ఎత్తకుండా పనులు చేసుకుని పోతున్నా, అప్పుడప్పుడు మేడదిగి వచ్చిన పద్మ, ఏవేవో వంకలు పెట్టి, మీనాక్షిని నానామాటలూ అనిగాని మళ్ళీ మేడమీదకు వెళ్ళేది కాదు. అసలే తన దురదష్టాన్ని తలుచుకు కుమిలిపోతున్న మీనాక్షి, వదినగారి ఆరళ్ళకు మరింతగా ఏడవడం తప్ప ఇంకేం చెయ్యగలదు!

‘ఉన్న కర్మ చాలక ఉపాకర్మ కూడా తోడయ్యిం’దన్నట్లు, మీనాక్షి ఉన్న కష్టాలకి తోడు, ఆ ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళౌతున్నకొద్దీ వాళ్ళ మధ్యన పేచీలు కూడా పెద్దవవుతున్నాయి. నాలుగేళ్ళున్న మీనాక్షి కొడుకు జీవన్‌ మీద పితూరీ లేని రోజు ఉండేదికాదు. రాధిక చేతిలోని బొమ్మ లాగేసు కున్నాడనో, రవి తింటున్న బిస్కట్‌ ఊడలాక్కుని చటుక్కున తినేశాడనో చెప్పి, కొడుకుని అదుపులో పెట్టనందుకు మీనాక్షిని పద్మ నానా మాటలూ అనేది.

‘మా కొంపమీదపడి తింటున్నది చాలక, మా పిల్లల్ని ఏడిపిస్తాడా’ అనేది పద్మ. వదినగారిని ఎలా సమాధానం చెప్పాలో తెలియక సతమతమయ్యేది మీనాక్షి.

ధైర్యంగా, ‘వాడూ చిన్న పిల్లాడేకదా వదినా! వాడికీ ఒక బొమ్మో, బిస్కట్టో ఇస్తే గొడవ ఉండదు కదా’ అని వదినగారికి చెప్పాలని ఉన్నా, చెప్పలేక, మనసులో మధనపడుతూ, ఒక్కొక్కప్పుడు తిక్కరేగి పసివాడైన జీవన్‌ని వంగదీసి, వీపుమీద రెండు దెబ్బలు వేసేది. ఆ తరువాత వాడు ఏడుస్తుంటే కడుపు తరుక్కుపోయి, తనూ ఏడిచేది మీనాక్షి.

ముసలాయన బతికుండగానే మొదలైన గొడవలు, ఆయన పోయాక మరీ ఎక్కువైపోయాయి. పసివాడైన జీవన్‌ని ప్రతిదానికీ తప్పుపట్టి, మీనాక్షిని మాటలతో వేధించసాగింది పద్మ.

వెంకటాచలపతికి రెవెన్యూ డిపార్టుమెంట్‌లో ఉద్యోగం కావడంతో సంపాదన బాగా ఉండేది. పిల్లల కోసం పద్మ ఏవేవో బొమ్మలూ, బట్టలూ తెగ కొనేది. తన పిల్లల్ని చక్కగా ముస్తాబు చేసే పద్మ, జీవన్‌ సంగతి అసలు పట్టించుకునేది కాదు.

రవి తొడగ్గా చిరిగి, పనికిరాని పాత బట్టలు జీవన్‌కి ఇచ్చేది. విరిగిపోయిన ఆటబొమ్మలు తప్ప, జీవన్‌కి మరేమీ ఉండేవికావు. తను మడిగట్టు కోడానికి ముందర కొడుకుకి స్నానం చేయించి, ఉతికి ఆరవేసిన బట్టలు తొడిగి, తలదువ్వి వదిలితే మళ్ళీ రాత్రికి గాని కొడుకుని పలకరించే తీరిక ఉండేది కాదు మీనాక్షికి.

మరీ చిన్నప్పుడు తెలియలేదుగాని, ఐదేళ్ళ వయసు వచ్చేసరికి జీవన్‌, మామయ్య పిల్లలకీ తనకీ సంరక్షణలో ఉన్న తేడా కనిపెట్టగలిగాడు. వాళ్ళకిలాగే తనకూ అందమైన ఆటబొమ్మలు కావాలనీ, స్నానం చేశాక మిక్కీమౌస్‌ బొమ్మున్న బొచ్చుతువ్వాలుతోనే తనకూ తుడవాలనీ – ఇలా ఏదో ఒకదానికి పేచీ పెట్టేవాడు.

ఇంటి చాకిరీ చేసి చేసి, ఆపై కొడుకు తెచ్చిపెట్టే పేచీలు పడలేక, వాడిని సంతప్తి పరచి సముదా యించనూలేక సతమతమయ్యేది మీనాక్షి. సాధారణంగా కొడుకు పేచీ పెడితే, గట్టిగా గదమాయించి పంపించెయ్యాలని చూసేది. ఇంకా మారాంచేసి, చెప్పిన మాట వినకపోతే రెండు వాయించి పంపించేసేది పనితొందరలోనున్న మీనాక్షి. వాడు ఒక మూలచేరి, ఏడ్చి ఏడ్చి చివరకు సొమ్మసిల్లి, అక్కడే పడుకుని నిద్రపోయేవాడు.

మీనాక్షి తనకు తీరుబడి అయ్యాక, కొడుకు దగ్గరకు వచ్చేది. దుఃఖంతో చిన్నబోయిన ముఖంతో, ముఖమంతా కన్నీటి చారలతో, నిద్రలో కూడా వెక్కిళ్ళు పెడుతూన్న కొడుకుని చూసి దుఃఖాన్ని ఆపుకోలేకపోయేది. పక్కన చతికిలబడి, వాడిని తన ఒడిలోకి తీసుకుని, గుండెలకు హత్తుకుని తానూ ఏడ్చేది మీనాక్షి.

కాలమూ కెరటమూ ఎవరికోసమో ఆగవు. జీవన్‌కి ఆరేళ్ళు నిండాయి.

– – – – – – – –

రవి దగ్గర ఒక పసుపు పచ్చని టెన్నిస్‌ బంతి ఉండేది. దాన్ని రవికి వాళ్ళ మామయ్య ఇచ్చాడుట! దాంతో రవి ‘పుటికీలు’ కొట్టి (బంతిని నేలకేసి ఒక మోస్తరు వేగంతో కొడితే అది నేలకు తగిలి మళ్ళీ అదే వేగంతో పైకి లేస్తుంది. లేచిన బంతిని అరిచేతితో మళ్ళీ నేలకేసి కొడతారు. అలా బంతిని కొడుతూనే ఉంటారు, అది లేస్తూనే ఉంటుంది) ఆడుకుంటూండేవాడు. జీవన్‌ దూరంగా నిలబడి దానివైపే ఆశగా చూసేవాడు. వాడికికూడా దాన్ని నేలకేసి కొట్టి ఆడుకోవాలని ఉండేది. అదే ఆశతో దానివైపు చూస్తూ నిలబడేవాడు. ఆ ఆశ వాడి కళ్ళల్లో కనిపించేది. కాని ఎంత ప్రాధేయపడి అడిగినా, రవి దాన్ని ఒక్కసారి కూడా జీవన్‌ని ముట్టుకోనిచ్చేవాడు కాదు.

తల్లి స్నానం చేయిస్తున్నప్పుడు ఒకసారి కసిగా తల్లితో అన్నాడు జీవన్‌, ‘రవికి వాళ్ళ మామయ్య చక్కని బంతి కొనిచ్చాడు. నాకూ ఉన్నాడు, ఒక మామయ్య! ఎందుకూ పనికిరాడు. ఒక్క బంతి కూడా కొనివ్వలేడు. తలమీద ‘ఠంగున’ మొట్టడానికి మాత్రం పనికివస్తాడు’ అని.

ఎవరైనా వింటే ప్రమాదమని, మరి మాటాడనీ కుండా కొడుకు నోరు చేత్తో మూసేసింది మీనాక్షి. అది మొదలు, జీవన్‌ ఆ బంతికోసం రవితో ఎక్కడ గొడవపడతాడోనని ఆమె భయపడుతూనే ఉంది.

ఆ రోజు సాయంకాలం రవీ, రాధికా బంతితో వీధి అరుగుమీద పుటికీలు కొట్టి ఆడుకుంటున్నారు. జీవన్‌ ఎప్పటిలాగే స్తంభం చాటున నిలబడి దాన్నే చూస్తున్నాడు. పద్మ పొరుగింటికి పెత్తనానికి వెళ్ళింది. సాయంకాలం ఔతూండడంతో మీనాక్షి పెరట్లో పశువుల కొట్టం దగ్గర పనిలో ఉంది.

జీవన్‌ ఒక్కపరుగున వచ్చి రవి చేతిలోని బంతి ఊడలాక్కుని, తను వేగంగా ‘పుటికీలు’ కొట్టడం మొదలుపెట్టాడు. ఒకటి, రెండు, మూడు.. అలా బంతి నేలను తాకి, చప్పుడు చేసినప్పుడల్లా లెక్కిస్తూ, మహావేగంతో ‘పుటికీలు’ కొడుతున్నాడు జీవన్‌. తన చిరకాలపు కోరిక తీరిన సంతోషం కనిపిస్తోంది వాడి ముఖంలో. వాడు ‘పుటికీలు’ కొట్టే తీరును, వేగాన్ని ఆశ్చర్యంగా, రెప్పవాల్చడం కూడా మర్చిపోయి చూస్తూ నిలబడిపోయాడు రవి. రాధికమాత్రం పెద్ద గొంతుక పెట్టుకుని అరుస్తూ తల్లిని పిలవడం కోసం పరుగెత్తింది. పుటికీల లెక్క వందను సమీపించింది.

కూతురు కేకలు వినిపించగానే, కబుర్లాపి కంగారుగా లేచి, ఇంటికి వచ్చింది పద్మ గాలి దుమారంలా ఉరుకులు పరుగులతో! రావడంతోనే విసురుగా జీవన్‌ చేతిలోని బంతిని ఊడలాక్కుని, వాడిని ఒక్కతోపు తోసింది. ఆ విసురుకి అల్లంత దూరం వెళ్లి కిందపడ్డాడు జీవన్‌.

తల్లి ఆసరా చూసుకుని రవి, రాధిక పరుగున వెళ్ళి, వాడిమీద పడి శక్తికొద్దీ కొట్టడం మొదలు పెట్టారు. జీవన్‌ విసురుగా లేచి తిరగబడ్డాడు. రాధిక తూగలేక నోరంతా తెరిచి ‘అమ్మా’ అంటూ ఏడవసాగింది. పద్మకు పూనకం వచ్చినట్లయ్యింది. జీవన్ని జబ్బ పట్టుకుని ఈవలికి లాగి, చేతికొద్దీ కొడుతూ అరవసాగింది..

‘ఈ నష్టజాతకుడు నా బిడ్డల్ని పొట్టనబెట్టుకునేలా ఉన్నాడు, రక్షించండి బాబోయ్‌’ అంటూ.

ఆ కేకలు విని ఇరుగుపొరుగుల వాళ్ళు పోగుపడసాగారు. పద్మ పట్టు సడలించడంతో, విసురుగా వెళ్లి, రవిని కిందకు పడదోసి, వాడిమీద ఎక్కి కూర్చుని, గుప్పిళ్ళు బిగించి వాడిని గుద్దడం మొదలుపెట్టాడు జీవన్‌.

రవి వయసులో జీవన్‌ కన్నా రెండున్నరేళ్లు పెద్దవాడైనా, పీలగా ఉండి, చూపులకు జీవన్‌ కన్నా చిన్నవాడనే భ్రాంతిని కలిగిస్తాడు.

రవి, జీవన్‌ సమవుజ్జీలుగా కిందమీదవుతూ, నేలమీదపడి దొర్లుతూ పెనుగులాడుతూండగా, దీనికంతటికీ కారణమైన బంతిమాత్రం అరుగు కిందకు దొర్లిపోయి, గడ్డిలోపడి ఏమీ ఎరుగనట్లు స్తబ్దంగా ఉండిపోయింది. ఈ గొడవలో పడి, దాని ఊసు పట్టించుకున్న వారెవరూ లేకపోయారు.

తన కొడుకు జీవన్‌ చేతిలో దెబ్బలు తినడం చూడలేకపోయింది పద్మ. జీవన్‌ నుండి రవిని విడదీసి, జీవన్‌ని చెడామడా కొట్టడం మొదలు పెట్టింది. కొట్టి కొట్టి, ఇంకా కసి పట్టలేక వాడిని స్తంభం వైపుకి తోసింది. ఆ తోపుకి జీవన్‌ విసురుగా వెళ్లి స్థంభానికి కొట్టుకుని ‘అమ్మా’ అంటూ ఆక్రోశించి, క్రింద పడిపోయాడు.

స్తంభం కొట్టుకోవడంతో ముక్కుకి, మూతికి దెబ్బతగిలి రక్తం ధారగా కారసాగింది. అది చూసి పద్మ పిల్లల్ని తీసుకుని విసవిసా మేదమీదకు వెళ్ళిపోయింది. పద్మ నోటి దురుసుతనానికి భయపడి, చుట్టుపక్కల వాళ్ళు ఒకరొకరు నెమ్మదిగా జారుకున్నారేగాని ఎవరూ స్తంభం పక్కన దెబ్బతిని పడివున్న ఆ పసివాడిని గురించి పట్టించుకోలేదు.

కొంతసేపటికి తనంతట తానే తెప్పరిల్లి, కారుతున్న రక్తాన్ని చూసి భయంతో, ‘అమ్మా’ అంటూ పెద్దగా ఆర్తనాదం లాంటి కేకపెట్టి తల్లికోసం పరుగుపెట్టాడు జీవన్‌.

(ఇంకా ఉంది)

–  వెంపటి హేమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *