జీవనస్రవంతి -3

జీవనస్రవంతి -3

జరిగిన కథ

జీవన్‌ డిగ్రీ పాసై గోల్డ్‌మెడల్‌ తెచ్చుకున్న కుర్రాడు. అతని తల్లి మీనాక్షి. ఉద్యోగం కోసం వెతుకుతూ, తన ఖర్చుల కోసం పత్రికలకు కథలు రాస్తుంటాడు జీవన్‌. అవి ప్రచురితమై, తనకు వచ్చే పారితోషికాన్ని కొత్త కథలు రాసి పోస్టు చేయటానికి, ఉద్యోగాలకు అప్లికేషన్‌లు పెట్టడానికి ఉపయోగించేవాడు.

జీవన్‌ తల్లి మీనాక్షి యాజులుగారింట్లో వంట మనిషిగా పనిచేస్తూ వచ్చే ఆదాయంతో కొడుకును చదివించింది. కొంత అప్పులు కూడా అయ్యాయి. కొడుకు చదువు కోసం అయిన అప్పులు కొడుక్కి ఉద్యోగం వస్తే తీరిపోవా ! అనుకునేది మీనాక్షి.

జీవన్‌ ఉండే పక్క వాటాలోనే కిరణ్‌ వాళ్ళ కుటుంబం కూడా ఉంటోంది. కిరణ్‌కి నెల పిల్లాడిగా ఉన్నప్పుడే పోలియో సోకింది. కాలు అవిటిదయ్యింది. కిరణ్‌ తండ్రి పద్దులు రాసి, జాతకాలు చెప్పి, ముహూర్తాలు పెట్టి వచ్చే డబ్బుతో కిరణ్‌ని చదివించాడు.

కిరణ్‌ జీవన్‌కి స్నేహితుడు. ఇద్దరూ కాలేజి వరకు కలిసే చదువుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ కలిసే ఉద్యోగాలకోసం వెతుకుతున్నారు. అలా వెతికే పనిలో లైబ్రరీకి వెళుతుండగా వీరిద్దరి స్నేహితుడు రాఘవ వచ్చి, తను ఆటో నడుపుతున్నానని, ఇప్పుడు తనకు సంపాదన సమస్య కొంచెం తీరిందని చెప్పాడు.

రాఘవని చూసి, తాము కూడా ఉద్యోగాలు వెతుక్కోవడం మాత్రమే కాక ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించాలని అనుకున్నారు జీవన్‌, కిరణ్‌లు. అలా ఏదో ఒక పని కోసం ఎదురు చూస్తుండగా ఒక రోజు మధ్యాహ్నం భోజనం వేళకు ఇంటికి వచ్చిన మీనాక్షి కొడుకు జీవన్‌ను అడిగింది, ‘ఒరే జీవా! నువ్వు ప్రయివేట్లు చెప్పగలవురా’ అని.

ఇక చదవండి..

ఒక్కసారిగా జీవన్‌కి తన మనసుకి పట్టిన మబ్బు విడినట్లయ్యింది. సంతోషంగా తలెత్తి, తల్లి ముఖంలోకి చూస్తూ అన్నాడు, ‘చెప్పగలను. ఎవరికట?’ అని.

‘యాజులు తాతయ్యగారి మనవళ్ళకు’ చెప్పింది మీనాక్షి.

‘అదేమిటమ్మా! వాళ్ళకు మన సుజాతక్క చెపుతోరది కదా, ఇప్పుడు ఆమెకేమొచ్చింది ?’

‘కడుపొచ్చింది! ఏడో నెల వెళుతోంది. రేపోమాపో పుట్టింటివాళ్ళు వచ్చి పురిటికని ఆమెను పుట్టింటికి తీసుకెళతారుట, అదీ సంగతి ! ఉద్యోగానికి కూడా సెలవు పెడుతోంది. ఇంతకీ ప్రయివేటు చెప్పడం నీ వల్ల అవుతుందా కాదా ? ముందు అది చెప్పు’ అంది మీనాక్షి.

‘ప్రయివేట్లు చెపుతానమ్మా ! తప్పకుండా చెపుతా. నాకో రెండు మూడుచోట్ల ప్రయివేట్లు దొరికితే చాలు, నువ్వా మిఠాయి కొట్టుపని మానెయ్యవచ్చు’ అన్నాడు జీవన్‌.

కొడుకు తనని గురించి ఆలోచించడం మీనాక్షికి సంతోషాన్నిచ్చింది.

‘నాన్నా! నేనంటే నీ కెంత ఇదిరా’ అంటూ కొడుకు చెంపలంటి, ఆ చేతులతో తన చెంపలపై మెటికలు విరుచుకుంది.

ఆ తరవాత అంది.. ‘పొద్దున్న యాజులు తాతయ్య అమ్మమ్మగారితో అనడం విన్నాను. ‘పిల్లలకు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, సరిగా ఈ సమయంలో ప్రయివేటు ఆపేస్తే ఎలాగ, ఎవరినైనా మరో టీచర్ని చూడాలి’ అని. నువ్వు సరేనంటే ఆ సంగతి నేను తాతయ్యగారితో చెపుతాను’ అంది మీనాక్షి.

‘వేరే ఎవరికీ చెప్పొద్దనమ్మా! వాళ్ళకి చదువు నేను చెపుతా. తాతయ్య గారికి ఈవేళే చెప్పెయ్యి, చెయ్యి దాటిపోనీకు’ అన్నాడు జీవన్‌ ఉద్వేగంతో.

‘అయ్యో అంత హడావిడి ఎందుకురా ! అన్నింటికీ తొందరేనా ? ముందు మనం అన్నాలు తినాలి. ఆ తరవాత, కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని, నేను స్వగహ వాళ్ళకు సాయం చెయ్యడానికి వెళతా. సాయంకాలం వంటకు వెళ్లినప్పుడు తప్పకుండా ఈ సంగతి తాతయ్యగారికి చెపుతా. పిల్లలకి చదువు నువ్వు చెపుతావనీ, వేరే ఎవరికీ ఆ పని పురమాయించొద్దనీను, సరా..! ముందు నువ్వు భోజనం కానియ్యి’ అంటూ కొడుక్కి భోజనంలో నెయ్యి వడ్డించింది మీనాక్షి.

— — —-

డిగ్రీ అందుకుని సంవత్సరమయినా ఇంకా నిరుద్యోగిగానే ఉన్నందుకు వచ్చిన మనస్థాపం వల్ల రాత్రులందు సరిగా నిద్రపట్టక, ఏ తెల్లవారు ఝామునో నిద్రపోయిన జీవన్‌ పొద్దెక్కితేగాని నిద్ర లేవలేకపోతున్నాడు. అలాంటిది ఆ రోజు తల్లి లేచి పనులు చేసుకుంటున్న సందడికే నిద్రలేచి కూర్చున్నాడు. తల్లి అందించిన కాఫీ తాగి, స్నానం చేసి, బ్రేక్ఫాస్టుగా చద్దన్నంలో ఆవకాయ కలుపుకుని రెండు ముద్దలు తిని, తల్లితో పాటుగా తనూ యాజులుగారి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు.

— — —-

మీనాక్షిద్వారా జీవన్‌ అభిప్రాయాన్ని విన్న యాజులుగారు, అతనిని తన మనుమళ్ళకు ప్రయివేటు మాష్టారుగా నియమించి, ఈ రోజు ఏడున్నర దాటగానే మంచి ముహూర్తం ఉందనీ, ఆ సమ యంలో జీవన్ని వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్ట మనీ మీనాక్షి చేత జీవన్‌కి కబురుపెట్టారు.

సరిగా ముహూర్త సమయానికి జీవన్‌ యాజులుగారి ఇంటికి చేరుకున్నాడు. అతను వచ్చేసరికే పిల్లలు చాప పరిచి పుస్తకాలు ముందుంచుకుని, చాపమీద కూర్చుని కొత్త ప్రైవేటు మాష్టారి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.

పాఠాలు చెప్పడానికి నాందిగా జీవన్‌ పిల్లలచేత, ముందుగా గణేశ ప్రార్ధన, ఆపై సరస్వతీ ప్రార్ధన చేయించి, తరవాత వాళ్ళకి పాఠం చెప్పడం మొదలు పెట్టాడు. అతడు చాలా ఉత్సాహంగా పిల్లలకు పాఠం చెప్పసాగాడు. భావుకుడైన జీవన్‌ పాఠం చెపుతున్న తీరు యాజులుగారికి బాగా నచ్చింది.

ఆ రోజు మొదలు ప్రతిరోజూ పిల్లలు ప్రైవేటుకి వేళ అయ్యిందనగానే చాప పరుచుకుని, పుస్తకాలు ముందర ఉంచుకుని, జీవన్‌ రాకకోసం ఎదురు చూస్తూ కూర్చునేవారు. అది యాజులుగారికి మరీ నచ్చేది.

జీవన్‌కి కూడా పిల్లలు అలా తన రాకకోసం కనిపెట్టుకుని ఉండడమన్నది చాలా సంతోషాన్ని చ్చింది. ఇన్నాళ్ళూ తనలో ఉన్న ప్రయివేట్లు చెప్పే కళను తానే గుర్తించలేకపోయినందుకు తనను తానే తిట్టుకున్నాడు.

ఒకప్పుడు అతని దష్టిలో పిల్లలకు పాఠాలు చెప్పడమంత బోరింగ్‌ పని మరోటి లేదు. వాళ్ళు అల్లరి చేస్తూ గోలగోలగా ఉంటారనీ, వాళ్ళకి పాఠాలు వినడం మీద శ్రద్ధ కంటే పంతులుగారి బుర్ర తినడంలోనే శ్రద్ధ ఎక్కువనీ అభిప్రాయ పడేవాడు. కాని ప్రస్తుతం అతని అనుభవం వేరుగా ఉంది. క్రమంగా జీవన్‌కి అసలు విషయం బోధపడింది. అదేమిటంటే..

పిల్లలు తమ గురువును అభిమానించడం, అభిమానించకపోవడం అన్నవి కేవలం ఆయన ప్రవర్తనమీద, పాఠాలు చెప్పే తీరు మీద ఆధారపడి ఉంటాయి అని.

వెంటనే అతనికి ఈ గురుశిష్య సంబంధాలను ఆధారంగా చేసుకుని ఒక కథ రాయాలన్న ఆలోచన వచ్చింది.

— — —-

కొత్తగా యవ్వనంలోకి అడుగుపెట్టిన రోజుల్లో జీవన్‌ మనసులో ఏవేవో ఊహలు పుట్టి అలజడి చేస్తూండేవి. ఆ తరువాత డిగ్రీ పూర్తవటం, ఉద్యోగాల వేటలో తరచూ లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదవటం జీవన్‌కి బాగా అలవాటయ్యింది.

అలా ఈ సంవత్సర కాలంలో తరచూ లైబ్రరీకి వెళ్లి ఏవేవో పుస్తకాలు చదువుతూ కాలం గడుపుతున్న జీవన్‌ మేధకి ఒకరోజు ఒక మంచి ఆలోచన తట్టింది. వెంటనే కలాన్ని, కాగితాన్ని అందుకుని, ఒక కథ రాసి, ‘హితైషిణి’ పత్రికకి పంపాడు. అది పబ్లిష్‌ అయ్యి, అతనికి పారితోషికం అందింది. పాఠకుల నుండి దానికి మంచి స్పందన కూడా వచ్చింది. దాంతో ఆ పత్రికవాళ్ళు అతనిని ఇంకా ఇంకా కథలు రాయమంటూ ప్రోత్సహించారు. అది మొదలు అతడు ‘జీవన్‌’ అన్న తన వ్యావహారిక నామాన్ని కాకుండా, ‘చిరంజీవి’ అన్న తనపూర్తి పేరునే కలం పేరుగా చేసుకుని, తరచూ కథలు రాయసాగాడు.

అలా మొదలయ్యింది జీవన్‌ రచనా ప్రస్థానం!

క్రమంగా కథలు రాయడం జీవన్‌కి అలవాటుగా మారింది. అతడు రాసిన కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమవుతూ, అతనికి రచయితగా మంచి పేరు తెచ్చాయి. జీవన్‌ అంటే ఎవరికీ తెలియదు గాని రచయిత చిరంజీవి కథల రూపంలో అందరికీ పరిచయస్తుడే!

కాలక్రమంలో ‘చిరంజీవి’ అందరికీ అభిమాన రచయిత అయ్యాడు. ఊరూరా అతని కథలకోసం ఎదురు చూసే పాఠకులు కోకొల్లలుగా పెరిగారు.

తనకు ఊహ తెలియని వయసులో తాతయ్య తనకు పెట్టిన పేరు ‘చిరంజీవి’. కాని సౌలభ్యం కోసం వచ్చిన మార్పుతో ఇప్పుడు ‘జీవన్‌’ అన్నది తన వ్యావహారిక నామమయ్యింది. తాతయ్య జ్ఞాపకంగా, తాతయ్య తనకు పెట్టిన పేరుని తను, తన కలం పేరుగా చేసుకున్నాడు. అనతికాలంలోనే ఆ పేరుకి, ఒక మంచి రచయితగా గుర్తింపు వచ్చింది. మరి అది వీర హనుమాన్‌ పేరుకదా !

— — —-

జీవన్‌, యాజులుగారి మనవళ్ళకి ప్రైవేటు మొదలుపెట్టి ఆ రోజుకి నెలయ్యింది. ఫెళఫెళలాడే సరికొత్త వెయ్యి రూపాయలనోటు తెచ్చి జీవన్‌ చేతిలో ఉంచారు యాజులుగారు. అది తీసుకెళ్ళి తల్లి చేతిలో ఉంచి, ఆమెకు పాదాభివందనం చేశాడు జీవన్‌. కథలకు వచ్చే పారితోషికాన్ని పక్కన పెడితే, ఇది అతని తొలి సంపాదన!

మీనాక్షి పట్టరాని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఆనంద భాష్పాలు ఆమె చెంపల్ని తడిపాయి. మెరిసే కళ్ళతో ఆమె కొడుకువైపు మురిపెంగా చూసింది.

‘అమ్మ ఎంత అల్పసంతోషి! నిజంగా నాకేదైనా మంచి ఉద్యోగం వచ్చి నెల జీతం మొత్తం తెచ్చి ఆమె చేతిలో ఉంచితే ఇంకెంత మురిసిపోతుందో’ అనుకున్నాడు జీవన్‌ మనసులో.

ప్రయివేట్ల వల్ల మంచి రాబడి ఉంటుందన్నది అతనికి అర్థమయ్యింది. ‘మరో నాలుగు ఇళ్ళలో ప్రైవేట్లు దొరికితే ఎంత బాగుంటుంది! అప్పుడింక అమ్మను ఆ భగభగ మండే మిఠాయి పొయ్యిదగ్గర కూర్చుని చేసే పని మానిపించెయ్యవచ్చు’ అన్న ఆలోచన అతని మనసులోకి వచ్చింది.

పిల్లలకి తను కేవలం పాఠాలు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నెన్నో తనకు తెలిసినవి, వాళ్ళకు అర్థమయ్యేవి చిన్నచిన్న విజ్ఞాన విషయాలు చెప్పడం, తగిన సందర్భం వచ్చినప్పుడు ఒక కథ కూడా చెపుతూండడం, అప్పుడప్పుడు జోకో, సామెతో, పొడుపు కథో చేపుతూండడం వంటి చక్కటి పద్ధతుల వల్ల జీవన్‌ పాఠం చెప్పే తీరు పిల్లల మనసుల్ని చక్కగా ఆకట్టుకుంటోంది. ఇక వాళ్ళు తన రాకకోసం ఎదురు చూడడంలో ఆశ్చర్యమేముంది!

పిల్లల అభిమానమే కాదు, ఇంట్లోని పెద్దవాళ్ళు కూడా ‘మాష్టర్‌ గారు వచ్చారు’ అంటూ తనను గౌరవంగా పలకరించడం, రాగానే కాఫీ ఇచ్చి తమ ఆదరాభిమానాల్ని ప్రకటించడం వగైరా వంటివి జీవన్‌ మనసును ఆకట్టుకున్నాయి.

ప్రయివేట్లు చెప్పడంపై ఇదివరకు తనకున్న దురభిప్రాయం స్థానంలో జీవన్‌కి మంచి అభిప్రాయం ఏర్పడింది. క్రమంగా ప్రయివేట్లు చెప్పడం అన్నది ఎన్నెన్నో అందమైన అనుభూతులకు ఆలవాలమైనదిగా తోచింది.

తను రాగానే ఆత్మీయంగా ఆహ్వానించి, కాఫీ కప్పును చేతికి అందించే అమ్మ లాంటి ఆ యింటి ఇల్లాలి ఆత్మీయత, తను మనసుపెట్టి చెపుతున్న పాఠాన్ని శ్రద్ధగా చెవిలో వేసుకుని, మధురగానంలా వినే పిల్లలతీరు జీవన్‌కి బాగా నచ్చాయి.

నెలనెలా ప్రైవేట్లు చెప్పడం వల్ల వచ్చే డబ్బు తల్లికి ఇచ్చేవాడు జీవన్‌. అందులోంచి మళ్ళీ కొంత తీసి కొడుక్కి ఇచ్చేది మీనాక్షి ‘పాకెట్‌ మనీ’గా. ఆ సమయంలో ఆమె కళ్ళలో కనిపించే ఆనందం చూడడమన్నది జీవన్‌కి ఎంతో తప్తిని కలిగించేది.

చేతిలో డబ్బు కనిపించగానే మీనాక్షికి కొడుకు కట్టుకుంటున్న బట్టలు మరీ పాతవిగా తోచాయి. వెంటనే ఆమె జీవన్‌కి రెండు జతల కొత్తబట్టలు కొంది. అంతేకాదు, ఇంట్లోకి ఎప్పటినుండో అవసరమైన సామానుకూడా కొంది. ఆపై నెలనెలా మిగులుతున్న డబ్బుతో చిల్లర అప్పులు తీర్చడం మొదలుపెట్టింది.

కాని జీవన్‌ కోరినట్లుగా తను మాత్రం మిఠాయి కొట్టు పనిని విడిచిపెట్టలేదు మీనాక్షి. అప్పులన్నీ పూర్తిగా తీరాకగాని తానా పనిని విడిచిపెట్టేది లేదని కొడుక్కి ఖండితంగా చెప్పేసింది.

‘అప్పు ముప్పు’ అన్నది ఆమెకున్న గట్టి నమ్మకాలలో ఒకటి.

— — —-

యాజులుగారి పూర్వీకులు అగ్రహారీకులు. తూర్పుగోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతమైన కోనసీమలోని మల్లెవాడ (ఊరు కల్పితం) లో వారికి పంటపొలాలు, పళ్ళతోటలు, కొబ్బరిచెట్లు లాంటి వెన్నో ఫలసాయాన్నిచ్చే ఆస్తులున్నాయి. పూర్వ వైభవం ఇప్పుడు చాలావరకూ తగ్గిపోయినా ఇంకా, సంపన్న కుటుంబం అనిపించుకోడానికి చాలిన ఆస్తిపాస్తులు మిగిలి ఉన్నాయి వాళ్ళకి. ఒక్కమాటలో చెప్పాలంటే సిరిసంపదలున్న నిండైన కుటుంబం వాళ్ళది.

యాజులుగారి కొడుకూ, అల్లుడూ కూడా పెద్దచదువులు చదివినవాళ్ళు కావడంతో, ఉద్యోగాల పేరుతో అమెరికా వెళ్లి, అక్కడే ఉండిపోయారు. వెళుతూ వెళుతూ తమ తల్లితండ్రులు మరీ ఒంటరివాళ్ళు కాకూడదని, తమ చంటిపిల్లల్ని తమ వెంటే ఉంచుకుని, కొంచెం పెరిగిన పిల్లల్ని తల్లితండ్రులకు అప్పగించి మరీ వెళ్ళారు. అలా ఇద్దరు మనుమళ్ళ బాధ్యత యాజులుగారిదయ్యింది.

చాలా రోజులకు పూర్వం, కొడుకు ఇండియాలో ఉండగా, యాజులుగారికి పెద్ద జబ్బుచేసింది. ఊపిరితిత్తులలో నిమ్ము చేరిందనీ, గాలి పొడిగా ఉండే ప్రాంతంలో ఉండడం మంచిదనీ, ఆయనకు వైద్యం చేసిన డాక్టర్‌ చెప్పిన సలహా మేరకు, ఎటుచూసినా నీటితో చుట్టబడి, చెమ్మ ఎక్కువగా ఉండే సొరతూరు విడిచి, కొడుకు ఉద్యోగం చేస్తున్న ఈ ఊరికి ఆరోగ్యం కోసం వలస వచ్చారు యాజులుగారు.

– ఇంకా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *