జీవనస్రవంతి – 2

జీవనస్రవంతి – 2

జరిగిన కథ

జీవన్‌ డిగ్రీ పాసై గోల్డ్‌మెడల్‌ తెచ్చుకున్న కుర్రాడు. అతని తల్లి మీనాక్షి. ఉద్యోగం కోసం వెతుకుతూ, తన ఖర్చుల కోసం పత్రికలకు కథలు రాస్తుంటాడు జీవన్‌. అవి ప్రచురితమై, తనకు వచ్చే పారితోషికాన్ని కొత్త కథలు రాసి పోస్టు చేయటానికి, ఉద్యోగాలకు అప్లికేషన్‌లు పెట్టడానికి ఉపయోగించేవాడు. ఒకరోజు హితైషిణి వారపత్రికలో ప్రచురితమైన తన కథకు పారితోషికం తెచ్చిస్తాడనే ఆశతో పోస్టుమాన్‌ కోసం ఎదురు చూస్తున్నాడు జీవన్‌. మధ్యాహ్నం అయింది. ఇక అతను రాడని నిర్ధారించుకుని, భోజనం, తన తల్లి గుర్తుకు వచ్చి, కాళ్ళు కడుక్కొని లోపలకు వెళ్ళాడు. అప్పటివరకూ అతని కోసం ఎదురు చూస్తున్న తల్లి మీనాక్షి జీవన్‌పై కోపంతో విరుచుకుపడింది. ప్రతిరోజూ నిన్ను వియ్యపురాలిని పిలిచినట్లు, బొట్టు పెట్టి మరీ భోజనానికి పిలవాలా ?’ అని కోప్పడుతుంది. జీవన్‌ మారు మాట్లాడకుండా భోజనం చేశాడు.

జీవన్‌ తల్లి మీనాక్షి యాజులుగారింట్లో వంట మనిషిగా పనిచేస్తోంది. ఆ ఆదాయంతోనే ఇప్పటివరకు కొడుకును చదివించింది. కొడుకు చదువు కోసం కొన్ని అప్పులు కూడా అయ్యాయి. కొడుక్కి ఉద్యోగం వస్తే అవి తీరిపోవా ! అనుకునేది.

జీవన్‌ ఉండే పక్క వాటాలోనే కిరణ్‌ వాళ్ళ కుటుంబం కూడా ఉంటుంది. కిరణ్‌ జీవన్‌కి స్నేహితుడు. ఇద్దరూ కాలేజి వరకు కలిసే చదువుకున్నారు. ఇప్పుడు ఇద్దరూ కలిసే ఉద్యోగాలకోసం వెతుకుతున్నారు. అలా కొత్త అప్లికేషన్‌ పెట్టడానికి వెళుతూ కిరణ్‌ జీవన్‌తో ‘ఇలా ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ, పండిపోయి, చివరకు కాలదోషం పట్టిపోతామేమోరా’ అన్నాడు నవ్వుతూ.

కిరణ్‌లా నవ్వలేకపోయాడు జీవన్‌.

ఇక చదవండి..

‘నువ్వు చెప్పినవన్నీ అక్షర సత్యాలు. కాని అంత బరువైన మాటల్ని చెప్పి కూడా నువ్వంత సులభంగా ఎలా నవ్వగల్గుతున్నావన్నది మాత్రం నాకు ఎంతకీ అంతుపట్టడం లేదురా కిరణ్‌’ అన్నాడు జీవన్‌ బాధగా.

‘నిజంగా ఈ రోజుల్లో ఉద్యోగం రావాలంటే ఉత్తరం (రికమెండేషన్‌ లెటర్‌) అయినా ఉండాలి లేదా దక్షిణ (దండిగా లంచం) ఇవ్వగల స్తోమతైనా ఉండాలి! నువ్వు చెప్పింది నిజమే. ఒప్పుకుంటున్నాను. ఇక నువ్వు చెప్పినట్లుగా తూర్పుకి తిరిగి దణ్ణం పెట్టి దైవ నామ స్మరణం చెయ్యడమే మనలాంటి వాళ్ళ పని !’ గాఢంగా నిట్టూర్చాడు జీవన్‌.

‘కాకపోతే ఏమిటి చెప్పు? మన ఎడ్యుకేషనల్‌ క్వాలిఫికేషన్‌ ఎవరైనా అసలు పట్టించుకునేది ఎప్పుడైనా ఉందా ! కర్మం చాలక ఎవరైనా మనల్ని ఇంటర్వ్యూకి రమ్మని పిలిచినా, మనల్ని ఒదిలించుకోడానికన్నట్లు వాళ్ళు వేసే మొదటి ప్రశ్న, ‘నీకున్న జాబ్‌ ఎక్సుపీరియన్సు ఎంత ?’ అని కదా! ఎవరైనా జాబిస్తేకదా మనకు జాబ్‌ ఎక్సుపీరియన్సు వచ్చేది! ఇదంతా చూస్తూంటే నాకో సామెత గుర్తొస్తోంది, ‘వెర్రి కుదిరితే గాని పెళ్లి కుదరదు, పెళ్లి కుదిరితే గాని వెర్రి కుదరదు’ అన్నది. రోజులు గడిచిపోతున్నకొద్దీ నాకు మతి పోతోంది’ బాధపడ్డాడు జీవన్‌.

నెలల పిల్లాడిగా ఉన్నప్పుడే కిరణ్‌కి పోలియో వచ్చింది. కాలు అవిటిదయ్యింది. అసలే అంతంత మాత్రపు బ్రతుకులు వాళ్ళవి. మార్వాడీ కొట్టులో పద్దులు రాసే ఉద్యోగం తండ్రిది. జాతకాలు చెప్పీ, ముహూర్తాలు పెట్టీ మరో నాలుగురాళ్ళు సంపాదిస్తాడు ఆయన. తనది చాలీ చాలని సంపాదనే అయినా, అవిటివాడైన కొడుక్కి శ్రమ తక్కువగా ఉండే, కుర్చీలో కూర్చుని పనిచేసే మంచి బ్రతుకుతెరువు చూపించాలనే తాపత్రయంతో ఆ తండ్రి ఎంత కష్టమైనా సరే, కొడుకును కాలేజీలో చేర్పించి చదివించాడు. కిరణ్‌ కూడా శ్రద్ధగా చదివి, జీవన్‌ లాగే గణితం ప్రధానాంశంగా పరీక్షలు రాసి, ఫస్టుక్లాసులో పరీక్ష నెగ్గాడు. అప్పటినుండీ మిత్రులిద్దరూ అవిశ్రాంతంగా ఉద్యోగప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఫలితమే కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడం లేదు.

‘ఒరేయ్‌ కిరణ్‌ ! మనం డిగ్రీ తీసుకుని ఇప్పటికి సంవత్సరమయింది. ఇప్పటికీ మనకు ఉద్యోగం రానందుకు నాకైతే చాలా దిగులుగా ఉందిరా! నీలా నేను ఎంతమాత్రం నవ్వలేకపోతున్నాను’ అన్నాడు.

అలా మిత్రులిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ లైబ్రరీకి వెళుతున్నారు, అక్కడ దొరికే పేపర్లలో పడ్డ ‘వాంటెడ్‌ కాలమ్‌’లు చూసుకోడానికి.

‘అంతా ఆ పైవాడి దయ’ అన్నాడు కిరణ్‌. నడక ఆపి, చేతిలోని కర్ర చంకలో పెట్టుకుని, చేతులు రెండూ జోడించి దేవునికి నమస్కరించాడు.

నెమ్మదిగా అలా పిచ్చాపాటీ మాటాడుకుంటూ, రోడ్డువారగా నడుస్తూ పోతున్న మిత్రులిద్దరూ, రోడ్డు వెంట వేగంగా వచ్చి, తమదారికి అడ్డంగా ఆగిన ఆటోని ఉలిక్కిపడి చూశారు. ఆటోడ్రైవర్‌ కిందకి దిగి, వాళ్ళకి ఎదురుగా వచ్చి, తన ఖాఖీ చొక్కా సవరించుకుంటూ నిలబడి, వాళ్ళ కళ్ళలోకి చూసి చిరునవ్వు నవ్వాడు.

‘ఓరేయ్‌, నువంట్రా రాఘవా !’ అంటూ మిత్రులిద్దరూ ఒకేసారి పెద్దగా, ఆశ్చర్యంగా అరిచారు. చురుగ్గా రెండడుగులు ముందుకు వేసి, రాఘవని కౌగిలించుకున్నాడు జీవన్‌.

‘ఇదేం వేషం! మేము నిన్ను వెంటనే గుర్తుపట్టలేకపోయాంరా’ అన్నాడు కిరణ్‌.

‘ఇప్పుడు తెలిసిందికదా నేను మీ క్లాస్మేట్‌ రాఘవనని! నేను ఆటో డ్రైవర్‌గా మారడానికి స్ఫూర్తి దాతలు మీరే! స్ఫూర్తిదాతలకు వందనాలు!’ నాటక ఫక్కీలో వయ్యారంగా వంగి వాళ్ళకి నమస్కరించాడు రాఘవ.

‘భలేవాడివిరా రాఘవా! ఇంకొకళ్ళకి స్ఫూర్తి కావడానికి మా ఇద్దరి దగ్గరా ఏముందిట, బూడిద’ అన్నాడు కిరణ్‌ ఆశ్చర్యంతో. జీవన్‌కి నోట మాట రాలేదు. అవాక్కై నిలబడిపోయాడు.

రాఘవ నవ్వి అన్నాడు, ‘మీరిద్దరూ మరీ అంత ఇదైపోనక్కరలేదు. నేను చెప్పింది నిజం! మంచి మార్కులతో పాసైన మీకే రాని ఉద్యోగం ఆఫ్టరాల్‌, ఏవరేజి స్టూడెంటుని నా కెలా వస్తుందనుకోగలను? అందుకే ఉద్యోగం మీద పెద్దగా ఆశ పెట్టుకోకుండా, నిర్లిప్తంగా అప్లికేషన్లు పడేస్తూ, ఆటో డ్రైవర్‌గా రంగప్రవేశం చేశాను. ఇప్పుడు చెప్పండి నాకు స్ఫూర్తి ఎవరో! ఇక సంపాదనంటారా – ఫరవాలేదు. ఆటో బాడుగ పోగా, నా చేతి ఖర్చులకు, అప్లికేషన్‌ ఫారాలకు, కర్మం చాలక వస్తేగిస్తే – ఒకటీ అరా ఇంటర్వ్యూలకు తడుముకోవలసిన పనిలేదు ఇప్పుడు. కాలక్షేపం లేదనే బాధ కూడా లేదు నాకు. నా పనిప్పుడు హాయిగా ఉంది. ఫ్రీడం వచ్చినట్లుంది. ఇదివరకులా ఇప్పుడు నేను మా అన్నయ్యలనెవర్నీ డబ్బుల కోసం అడగాల్సిన పనిలేదు’ అన్నాడు రాఘవ కాస్త హుషారుగా.

జీవన్‌, కిరణ్‌ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరూ రాఘవ తెలివికి అతన్ని మనసారా అభినందించారు. తమకిద్దరికీ ఇంత వరకూ ఇలాంటి మంచి ఆలోచన ఒక్కటీ రానందుకు విచారించారు. రాఘవ చేసినపని వాళ్ళకు బాగా నచ్చింది.

‘అరే భాయ్‌! మేమిద్దరం నీకు స్ఫూర్తి నిచ్చామన్నది ఏమోగాని, ఇప్పుడు నువ్వు మాత్రం మాకు గొప్ప స్ఫూర్తినిచ్చింది నిజం! ఇప్పటి నుండీ మేముకూడా ఉద్యోగం కోసం నోరెళ్ళబెట్టుకుని ఎదురుచూస్తూ కూర్చోకుండా, చేతికి దొరికిన ఏ పనైనా సరే చెయ్యాలనే నిర్ణయానికి, ఇప్పటికిప్పుడు వచ్చేశాం’ అన్నాడు జీవన్‌.

‘మనవాళ్ళు అమెరికా వాళ్ళలా ఉండాలని, అడ్డమైన పనుల్లోనూ వాళ్ళని ఇమిటేట్‌ చేస్తారు! కాని, వాళ్ళు నమ్మి పాటించే ‘డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌’ అన్నదానిని మాత్రం చూసీ చూడనట్లుగా వదిలేశారు! వైట్‌ కాలర్డు ఉద్యోగాలకిచ్చిన విలువ మనవాళ్ళు బ్లూ కాలర్డు ఉద్యోగాలకి ఇవ్వరు. అందరికీ అందలం ఎక్కాలన్నదే ఆశ ! కాని అందరూ పల్లకీ ఎక్కితే మోసేవారెవరు? నిజానికి వైట్‌ కాలర్డు జాబ్సు కంటే బ్లూ కాలర్డు జాబ్సు అవసరమే ఎక్కువ. వైట్‌ కాలర్డు జాబ్సు లేని రోజుల్లో కూడా మనుష్యులు కాయకష్టం చేసుకుంటూ సుఖంగానే బ్రతికారు’ అన్నాడు కిరణ్‌ తన సహజ ధోరణిలో.

‘ఇప్పుడు అందరూ వైట్‌ కాలర్డు ఉద్యోగాలకే ఇష్టపడటానికి కారణం బ్లూకాలర్డు ఉద్యోగాలకి తగినంత రాబడి ఉండకపోవడం కావచ్చు. పొద్దున్న మొదలు సాయంకాలం వరకూ నడుం వంచి పనిచేసినా, వచ్చిన డబ్బు ఆ రోజు కుటుంబ పోషణకు కూడా సరిపోనప్పుడు, అలాంటి పని చెయ్యాలని ఎవరికనిపిస్తుంది చెప్పు !?’ అన్నాడు జీవన్‌.

‘ఒరే జీవా! ఇప్పుడు మనమున్న స్థితిలో అలా మీనమేషాలు లెక్కించడం మంచిదికాదు. ‘లేని బావకన్నా గుడ్డిబావ మేలు’ అంటారు. ఏది దొరికితే అది చెయ్యడం మంచిది. ముందు ఏదో ఒకటి దొరకాలి కదా’ అన్నాడు కిరణ్‌.

‘రండిరా! నా ఆటో ఎక్కండి. మీరు ఎక్కడ దించమంటే అక్కడ దింపి నేను వెళ్లిపోతా!’ ఉబలాటపడ్డాడు రాఘవ.

జీవన్‌ రాఘవ చెయ్యి పట్టుకుని, ‘నేను నీకు పోటీ అని నీకు అనిపించకపోతే నాక్కూడా ఒక ఆటో ఇప్పించరా, నీకు పుణ్యముంటుంది. రేపటినుండీ నేను కూడా ఇంతో, అంతో సంపాదించి, మా అమ్మకు సాయపడాలని ఉంది. ఆమె ఒక్కతే పడుతున్న కష్టం చూడలేకుండా ఉన్నానురా’ అన్నాడు. అలా అంటూంటే అతని కంఠం గద్గదమయ్యింది.

‘పోటీ గీటీ లాంటిదేం లేదురా. అలా ఆలోచిం చొద్దు. ఈ ఆటో యజమాని మాకు బంధువు. అందుకే నాకు డిపాజిట్‌ అడక్కుండా బండి ఇచ్చాడు. నీకైతే కనీసం పదివేలు డిపాజిట్‌ అడుగుతాడేమో..! ప్రయత్నించి చూద్దాం. పెద్దగా ఆశ పెంచుకోకు’ అన్నాడు రాఘవ.

‘నీ చేతిలో ఉన్నది నువ్వు చెయ్యి. ఆపైన అంతా దైవేఛ్ఛ!’ అన్నాడు కిరణ్‌ రాఘవతో.

‘సరేలే! ఫరవాలేదులేరా. వదిలెయ్యి. నువ్వు మమ్మల్ని లైబ్రరీ దాకా తీసుకెళ్ళు, నీ సరదా తీరుతుంది. పద’ అంటూ జీవన్‌ ఆటో ఎక్కాడు.

కిరణ్‌ కూడా, ముందుగా తన చేతికర్రను ఆటోలో ఉంచి, నెమ్మదిగా, జీవన్‌ చెయ్యాసరాతో తనూ ఆటో ఎక్కాడు. ఆటో కదిలి లైబ్రరీ వేపుకి నడిచింది.

ఆటో కొంతదూరం వెళ్ళేవరకూ ఎవరూ మాటాడలేదు. ముందు కిరణ్‌ పెదవి విప్పాడు. పక్కకు తిరిగి జీవన్‌తో అన్నాడు, ‘దిగులుపడకురా జీవా! ఇన్నాళ్ళూ మనకీ ఆలోచన రాకగాని, మనకు కూడా ఏ బట్టల కొట్టులోనో పద్దులు రాసే పని ఇప్పించమని మా నాన్నని అడుగుదాం మనం. చెయ్యాలనుకుంటే ఎక్కడో ఒకచోట ఏదో ఒక చిన్నపని దొరక్కపోదు, చూద్దాం! ఇన్నాళ్ళకి వచ్చింది కదా ఈ ఆలోచన !’ అన్నాడు.

‘పెట్టుబడి అవసరం లేనిదైతే చాలు, ఎంత చిన్నపనైనా సరే చేసి, ఎంతో కొంత డబ్బు సంపాదించాలని ఉంది నాకు’ అన్నాడు జీవన్‌.

రాఘవ హుషారుగా ఆటో నడుపుతున్నాడు. చదువులో తాను మిత్రులకంటే వెనకున్నా, సంపాదనలో ప్రస్తుతానికి వాళ్ళకంటే తనే ముందు ఉన్నందుకు అతనికి కాస్త సంతోషంగా ఉంది.

దారిలో షాపు దగ్గర బండి ఆపి, ముగ్గురి కోసం ‘చల్లటి మజ్జిగ’ తీసుకుని, దానికైన డబ్బులు తనే ఇచ్చేశాడు రాఘవ.

– – – – –

‘చదివించే స్తోమత లేకగాని, చదివిస్తే, నా బంగారుకొండకి ఎంత చదువైనా అవలీలగా వచ్చి ఉండేది కదా’ అని, అప్పుడప్పుడు అనుకుని కొడుకును తలుచుకుని బాధపడుతుంది మీనాక్షి.

పై చదువులు చదివినా స్కాలర్‌షిప్‌ వస్తుంది జీవన్‌కి. కాని దానివల్ల కొంత వరకూ మాత్రమే సాయమవుతుంది గాని, మొత్తం అన్ని ఖర్చులకూ అది చాలదు. పై చదువంటే కనిపించని ఖర్చులు ఎన్నో ఉంటాయి, కొంతైనా చేతి డబ్బు అవసరం ఉండక మానదు. డిగ్రీ పూర్తయ్యే సరికే చిన్నచిన్న అప్పులు బోలెడయ్యాయి. ఇప్పుడు అవి తీర్చడం ఎలాగన్నదే పెద్ద సమస్యయ్యింది.

కొడుక్కి డిగ్రీ చేతికి రాగానే ఉద్యోగం వస్తుందనీ, నెలకింతని ఆ అప్పులన్నీ చిటికెలో తీర్చెయ్యవచ్చుననీ అనుకుంది మీనాక్షి. కాని అలా జరగలేదు. జీవన్‌ తన అవసరాలన్నింటికీ ఇంకా తల్లిమీదే ఆధారపడ వలసి వస్తోంది. గోల్డు మెడల్‌ సంపాదించినంత తేలికగా జీవన్‌ ఉద్యోగం సంపాదించుకోలేక పోతున్నాడు. డిగ్రీ చేతికివచ్చి సంవత్సరమయినా, ఇంకా నిరుద్యోగిగానే ఉన్నాడు.

జీవన్‌కి వయసు ఇరవై రెండు నిండాయి. అంటే పెళ్లి చెయ్యవలసిన వయసు వచ్చిందని అర్థం. కాని, ‘తా దూర కంత లేదు గాని, మెడకొక డోలు’ అన్నట్లు, ‘తన అవసరాలకు చాలినంత కూడా సంపాదించు కోలేనివాడికి పెళ్ళేమిటి! ఏదో ఒక ఉద్యోగం వచ్చి ప్రయోజకుడై, పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోగల స్తోమత ఉన్నప్పుడే కదా పెళ్లి’ అనుకునేది మీనాక్షి. కాని, ‘పెళ్ళి చేసి, వాడిని ఒక ఇంటివాడిని చేశాకే కదా నా బాధ్యత తీరేది’ అని కూడా అనుకునేది.

కిరణ్‌కి ఆటో నడిపే శక్తి ఎలాగూ లేదు. ఇక జీవన్‌! ఉద్యోగం దొరికేదాకా ఆటో నడపాలను కున్నాడు గాని, రాఘవ జీవన్‌కి డిపాజిట్‌ లేకుండా ఆటో ఇప్పించలేకపోయాడు. కాని ‘తను కూడా ఏదోక పని చేసి, ఎంతో కొంత డబ్బు సంపాదించి తల్లికి సాయపడాలి’ అన్న కోరిక జీవన్‌లో నానాటికీ బలపడుతూ వచ్చింది. ఏపని చేస్తే బాగుంటుందన్న దానిమీద తీవ్రంగా ఆలోచించసాగాడు జీవన్‌. రకరకాల ఆలోచనలతో అతని తల వేడెక్కిపోతోందే గాని, ఏదీ అనుసరణీయంగా తోచడం లేదు. విధ విధాలైన ఆలోచనలతో అతడు సతమతమై పోతున్నాడు.

ఆ రోజు మధ్యాహ్నం భోజనం వేళకు ఇంటికి వచ్చిన మీనాక్షి కొడుకును అడిగింది, ‘ఒరే జీవా! నువ్వు ప్రయివేట్లు చెప్పగలవురా’ అని.

– వెంపటి హేమ (కలికి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *