జీవనస్రవంతి -10

జీవనస్రవంతి -10

జరిగిన కథ

జీవన్‌ గోల్డ్‌మెడల్‌తో డిగ్రీ పాసై ఉద్యోగం వెతుకుతూ, ఖర్చుల కోసం పత్రికలకు కథలు రాస్తుంటాడు. జీవన్‌ తల్లి మీనాక్షి యాజులుగారింట్లో వంట పనిచేస్తూ కొడుకును చదివించింది. యాజులుగారి కొడుకూ, కూతురూ అమెరికా వెళ్ళి, వాళ్ళ పెద్ద పిల్లలను యాజులుగారి వద్దే ఉంచారు. జీవన్‌ యాజులుగారి మనవళ్ళకు ప్రైవేట్లు చెప్పే ఉద్యోగంలో కుదిరాడు.

కోవిద జీవన్‌కి 143 చెపితే, దానికి జీవన్‌ నవ్వాడు. అది చూసిన తల్లి మీనాక్షి జీవన్‌ని తిడుతుంది. దాంతో అతను ఇల్లు విడిచి బయటికి వచ్చేశాడు. జీవన్‌ రాక కోసం ఎదురుచూస్తూ మీనాక్షి తన గత జీవితాన్ని గుర్తుకు తెచ్చుకుంది.

తన మేనత్త కొడుకు శంకరాన్ని పెళ్ళిచేసుకున్న మీనాక్షి ఏడాదిలోనే గర్భవతి అయింది. ఏడవ నెలలో భర్త చనిపోవటంతో పుట్టింటికి వచ్చేసింది. కూతురి పరిస్థితి చూసి తల్లి కూడా మరణించింది. మీనాక్షికి కొడుకు పుడితే అందరూ అతడిని నష్టజాతకు డన్నారు. మీనాక్షి తండ్రి మనవడిని ‘చిరంజీవి’ అని పిలుస్తూంటే, అది చివరికి ‘జీవన్‌’ గా స్థిరమైంది. తండ్రి కూడా కాలం చేయడంతో చివరికి మీనాక్షి అన్నా, వదినల దగ్గర ఉంటూ ఆ ఇంటి పనులన్నిటినీ తనే చేస్తూండేది. వదిన పద్మ మీనాక్షిని, జీవన్‌ని నానా మాటలూ అంటూండేది. తక్కువగా చూసేది.

ఒకసారి పద్మ కొడుకు రవి, కూతురు రాధిక బంతితో ఆడుకుంటూంటే దానిని జీవన్‌ లాక్కున్నా డని, పద్మ జీవన్‌ని కొట్టి, స్తంభం వైపు తోసేస్తుంది. అది తగిలి జీవన్‌కి ముక్కు, మూతి పగిలి రక్తం కారుతుంది. అది చాలక మరోసారి బెత్తంతో కొట్టి పాత సామాను గదిలో జీవన్‌ని పడేసి బంధిస్తుంది. అడ్డుపడిన జీవన్‌ తల్లి మీనాక్షిని కూడా హెచ్చ రించడంతో హతాశురాలైన మీనాక్షి ఆ ఇంటి నుండి వెళ్లిపోవడానికి నిశ్చయించుకుని, అర్థరాత్రి పూట చీకటి కొట్టులో ఉన్న జీవన్‌ని తీసుకుని అక్కడ నుండి బయటపడింది. ఆ ఊరి పొలాల్లో గుండా నడుచు కుంటూ హైవే చేరారు తల్లీ కొడుకులు. హైవేలో ఒక బస్‌ ఎక్కి టికెట్‌ తీసుకుంది మీనాక్షి. జీవన్‌ తల్లిపక్కన, కిటికీ సీటులో కూర్చుని నిద్రపోయాడు.

ఇంతలో కొంతమంది గుంపు బస్సుకు అడ్డంగా వచ్చి, బస్సును ఆపి బసెక్కారు. వాళ్ళందరికీ కండక్టర్‌ టికెట్లిచ్చి, మరోసారి చెక్‌ చేయసాగాడు. ఆ చెకింగ్‌లో ఆరేళ్ళ వయసున్న జీవన్‌కి టికెట్‌ లేదని తెలుసుకుని, అర టికెట్‌ తియ్యమని తల్లి మీనాక్షితో చెపుతాడు. ఆమె వద్ద అర టికెట్‌కు నాలుగు రూపాయలు తక్కువవడంతో ఇద్దరినీ బస్సులోనుండి దింపేశాడు. ఆ అడవి లాంటి ప్రదేశంలో ఉన్న చీకటికి, జంతువుల అరుపులకి జీవన్‌ భయపడితే, వాడికి ధైర్యం చెప్పి ఆంజనేయ దండకం పాడుతుంది మీనాక్షి. తరువాత కొంతదూరం నడిచి వెళ్ళేసరికి అక్కడ రోడ్డు రెండుగా చీలింది. ఏ దారిన వెళ్ళాలనే సందేహంతో మీనాక్షి మనసు ఊగిసలాడింది.

ఇక చదవండి..

ఆలోచించింది మీనాక్షి, ‘మనవాళ్ళు కుడివైపు మాతస్థానం అంటారు, తల్లి ఎప్పుడూ తన బిడ్డకు అన్యాయం చెయ్యదు. ఇంగ్లీషువాళ్ళు కూడా కుడివైపుని ‘రైట్‌ సైడ్‌’ అంటారు ! నేను అటే వెళతాను, రైట్‌ సేడ్‌ అదే’ అనుకుని, కుడివైపు రోడ్డు మీదుగానే అడుగులు వేసింది ఆమె.

ఒక కిలోమీటరు అలా నడిచేసరికి ఆ రోడ్డు మలుపు తిరిగింది. రోడ్డుకి ఇరుపక్కలా రాళ్ళూ-రప్పలూ, పొదలూ-పుట్టలూ ఉన్నాయి. ఆ కనువెలుగులో అవి స్పష్టాస్పష్టంగా నీడల్లాగా కనిపిస్తున్నాయి. రోడ్డుమాత్రం తీర్చి దిద్దిన పాపిడిలా స్పష్టంగా కనిపిస్తోంది.

ఎక్కడో దూరంగా కోడికూత వినిపించింది. గాలి చల్లగా సేదదీర్చేదిగా ఉంది. తెల్లవార వస్తున్న జాడ తెలుస్తోంది. ఆ తల్లీకొడుకులు మలుపు తిరిగి నాలుగడుగులు ముందుకు వేశారో లేదో, వెనుక నుండి వేగంగా వచ్చిన లారీ ఒకటి వాళ్ళకి అడ్డంగా వచ్చి సడన్‌ బ్రేక్‌తో ఆగింది.

కంగారుపడుతూ కొడుకును దగ్గరగా తీసుకుని, నిలబడిపోయింది మీనాక్షి. తలెత్తి చూసిన మీనాక్షికి, లారీలైట్ల వెలుగులో, పదడుగుల దూరంలో రెండు కోడెత్రాచులు, బుసలు కొట్టుకుంటూ, ఒకదానినొకటి కవ్వించు కుంటూ, రోడ్డువారనున్న పొదలలోకి పాకిపోవడం కనిపించి భయంతో కొయ్యబారి పోయింది మీనాక్షి. ఆ లారీ రావడం వల్ల తనకూ, తన కొడుక్కీ ఆపన్న మత్యువు తప్పిందని తెలిసి, ఆమె మ్రాన్పడిపోయింది.

అంతలో ఆ లారీడ్రైవర్‌ బండి దిగి వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ‘ఎవరమ్మా నువ్వు ? ఇలాంటి సమయంలో, ఈ చీకట్లో పసివాడిని వెంటబెట్టుకుని ఎక్కడికి వెడుతున్నావు ? మీకు ఎంత గండం తప్పిందో తెలుసా! సమయానికి నేను వచ్చాను కనుక సరిపోయింది, లేకపోతే ఆ పాములు మిమ్మల్ని కసితీరా కరిచి ఉండేవి! జట్టుకట్టే సమయంలో కోడెత్రాచులు చాలా ఉగ్రంగా ఉంటాయి!’

మీనాక్షికి నోట మాటరాలేదు. మౌనంగా చేతులు జోడించి నమస్కరించింది. తల్లిని చూసి, జీవన్‌ కూడా తమ ప్రాణదాతకు నమస్కరించాడు.

‘ఏ ఊరు వెళ్ళాలి ? అది నే వెళ్ళే రూట్‌లో గనక ఉంటే, తీసుకెళ్ళి దింపుతాను, చెప్పండమ్మా!’

ఏ ఊరంటే.. మీనాక్షి ఏమని చెప్పగలదు ? ఆమెకు పచ్చి వెలక్కాయ గొంతుకలో అడ్డం పడినట్లు, ఉక్కిరిబిక్కిరిగా తోచింది. కాని తమ ప్రాణదాతతో అబద్ధం చెప్పకూడదనుకుంది ఆమె. అందుకే..

‘ఏ ఊరు వెళ్ళాలో ఏమీ తెలియదు అన్నా! పరిస్థితులు బాగోక, ఎక్కడైనా బ్రతుకుతెరువు దొరక్కపోతుందా.. అని, పిల్లాడిని వెంటదీసుకుని, తెగింపుగా ఇలా బయలుదేరాను. ఆపై అన్నింటికీ ఆ భగవంతుడే దిక్కు!’ అంది.

‘అంతకన్న గొప్ప దక్షత మనకు ఎవరున్నారు కనుక ! ఆయనే మీకొక దారి చూపించకపోడు! ఇంతకీ మీరు ఏమేం పనులు చెయ్యగలరో చెప్పండమ్మా !’

‘నేనేం పెద్దచదువులు చదవుకోలేదన్నా! ఇంటిపని, వంటపని బాగా చెయ్యగలను. మంచిమంచి పిండివంటలు చెయ్యడం కూడా వచ్చు. ఎక్కడైనా వంటపని చేసి పిల్లాణ్ణి పెంచుకోవాలని..’

‘బాగుందమ్మా, మంచి ఆలోచన. మా ఊళ్ళో ఒకరు వంటలక్క కావాలంటున్నారు. అక్కడ ఇంకా ఎవరూ కుదరకపోతే ఆ పని నీకు ఇప్పిస్తా. వాళ్ళకు పూజ, మడీ, ఆచారం ఎక్కువ..’

మీనాక్షి ముఖం వికసించింది. ‘నేనా పని తప్పకుండా చేస్తానన్నయ్యా! ఏ ఊరైనా ఫరవాలేదు. ఇకనుండీ అదే నా ఊరనుకుంటా. కాయగూరలతో అన్ని వంటలు, పప్పులు, పచ్చళ్ళు యావత్తూ చేతనౌను. కాని, మరోరకం వంటలు – మసాలాలు వేసి వండేలాంటివి మాత్రం నాకు చేతకావు’.

డ్రైవర్‌ అర్ధం చేసుకుని నవ్వాడు, ‘అవెవరికీ అక్కరలేదు లెండమ్మా! వాళ్ళు నీచు తినరు. బ్రాహ్మలు. నువ్వుకూడా బాపనక్కవే ఐతే వచ్చి బండెక్కు, తెల్లారి జాము పొద్దెక్కేసరికి అక్కడ దింపుతాను’ అంటూ బండి దగ్గరకు నడిచాడు ఆ లారీ డ్రైవరు.

ఇంతవరకూ ముక్కూ మొహం తెలియని వ్యక్తిని నమ్మి, వెంట వెళ్ళిపోడమేనా-అని ఒక్క క్షణం తట పటాయించింది మీనాక్షి. అది అతడు కనిపెట్టాడు.

‘ఇదిగో అమ్మోయ్‌! నా పేరు వెంకటేశ్వర్లు. నాకు అట్టాంటిట్టాంటి చెడ్డ బుద్ధులేం లేవు. నన్ను నమ్ము. నువ్వు నన్ను ‘అన్నా’ అన్నావని, నీ బాధ్యత నామీద వేసుకుని, నీకు సాయం చెయ్యాలనుకుంటున్నా. ఏ ఇతర ఆలోచనలూ మనసులో పెట్టుకోకు, వచ్చి బండెక్కు, నీకు మంచి జరుగుతుంది’ అన్నాడు, అతడు ఇంజన్‌ స్టార్టు చేస్తూ.

వెంటనే కొడుకునెక్కించి, తానూ ఎక్కికూర్చుంది మీనాక్షి. లారీ స్టార్టయింది.

—— —— ——

అలావచ్చి చేరారు ఆ తల్లీ కొడుకులు యాజులుగారింటికి. అక్కడ వంటలక్కగా కుదిరాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేకపోయింది మీనాక్షికి.

ఏ ఇబ్బందీ తెలియకుండా ఈ పదిహేనేళ్ళూ పరస్పర సహకారంతో చక్కగా గడిచిపోయాయి. జీవన్‌ పెరిగి పెద్దవాడై డిగ్రీ పూర్తిచేశాడు. ఇంకేం కావాలి! నేడో రేపో ఉద్యోగం వచ్చి స్థిరపడ్డాక, పెళ్ళీ పేరంటం జరిపించి, ఒక ఇంటివాడిని చేస్తే, ఒక తల్లిగా మీనాక్షి బాధ్యత తీరుతుంది.

తండ్రి లేకపోయినా, కొడుకుని తీర్చిదిద్ది ప్రయోజకుడిని చేసిన తప్తి ఆమెకు ఉంటుంది. తన కొడుకు మనుగడకు, అభివద్ధికీ దారి చూపించిన ఆ యాజులు దంపతులమీదే కాదు, యాజులుగారి కుటుంబం మొత్తం మీద మీనాక్షికి అవధులెరుగని కతజ్ఞత, భక్తి గౌరవాలు ఉన్నాయి. వాళ్ళకు కష్టం కలిగే ఏ పనినీ ఆమె సహించలేదు.

ఎంత తన కొడుకే అయినా కూడా అంతస్తుల వ్యత్యాసం మర్చిపోయి, అభం శుభం తెలియని ఆ ఇంటి అమ్మాయికి తన చిరునవ్వుతో వలవేసి సమస్యలు సష్టించి, యాజులుగారికి కష్టం కలిగించడం, తను ఎంతమాత్రం ఒప్పుకోలేదు. అందుకే జీవన్‌ని మందలించి మంచిదారిని పెట్టాలనుకుంది.

తను కాకపొతే బుద్ధి చెప్పడానికి వాడికి ఇంకెవరున్నారు కనుక!

తప్పు చేసినప్పుడు పిల్లల్ని కోప్పడి, దారి మళ్లించడం మంచిపని కాదని ఎవరనగలరు? బాధ్యత వహించే వాళ్ళు మంచిదారికి మర లించడంలో కూడా బాధ్యత వహించక తప్పదు కదా!

కాని, ‘అతి సర్వత్ర వర్జయేత్‌’ అన్నారు పెద్దలు. ఆ తప్పు తనవల్ల జరిగింది. ఇప్పుడింక ఏమనుకుని ఏం లాభం! ఆ దైవం తన మొహాన ఏమిరాసి ఉంచాడో – అనుకుంటూ, పరిపరి విధాలుగా ఆలోచిస్తూ, పూర్వాపరాలను గుర్తుచేసుకుంటూ, కొడుకుమీద ప్రేమ పొంగులువారగా, కొడుకువచ్చే దారివైపుకే చూస్తూ, ఊరి జనమంతా గాఢనిద్రలో మునిగి ఉండగా తనుమాత్రం కళ్ళలో ఒత్తులు వేసుకుని, వీధి గుమ్మంలో కొడుకు కోసమని కనిపెట్టుకుని ఉంది మీనాక్షి.

‘ఆకలి కడుపుతో వచ్చిన వాడికి ముద్దుగా అన్నం పెట్టడానికి బదులు, మొహం వాచేలా చివాట్లు పెట్టాను. భరించలేక విస్తరి దగ్గర కూచోవలసినవాడు లేచి వెళ్ళిపోయాడు కదా! పాపిష్టిదాన్ని, ఎంతపని చేశాను! నాలాంటి కర్కోటకురాలైన తల్లి ఈ భూమిమీద మరెక్కడా ఉండబోదు’ అనుకుంటూ దుఃఖించింది మీనాక్షి.

కాలచక్రం క్షణమైనా ఆగదు ఎవరికోసమూ! ‘ఠంగ్‌, ఠంగ్‌’ మంటూ రెండు కొట్టింది పక్కింటి గడియారం.

ఆ దెబ్బలు సుత్తితో తన తలపైనే కొట్టినట్లుగా బాధపడింది మీనాక్షి. ఎంతవద్దనుకున్నా, ‘వాడు, కొంపదీసి, ఏ అఘాయిత్యమైనా చేసుకోలేదు కదా!’ అన్న భావం పదేపదే ఆమె మనసులోకి వస్తూ, ఆమెలోని మాత హదయాన్ని దహిస్తూనే ఉంది.

‘ప్రేమున్నవాళ్ళు తిట్టినట్లుగా పగవాళ్ళు కూడా తిట్టలేరు’ అంటారు. అలాగే మీనాక్షికి కూడా కొడుకును గురించి, ఏవేవో మహాభయంకరమైన ఆలోచనలు మనసులోకి వచ్చి, ఆమెకు అంతులేని మనోవేదన కలిగిస్తున్నాయి.

ఆమె కొడుకు కోసం ఎదురుచూస్తూ తన ఆకలి దప్పుల్ని మాత్రమే కాదు, నిద్రను కూడా పూర్తిగా మర్చిపోయింది.

తాపాన్ని పోగొట్టి సేదదీర్చే పిల్లతెమ్మెర అల్లనల్లన మెల్లగా వీచింది. ఆకాశాన్ని ఆవరించి ఉన్న కారుమబ్బులు అలవోకగా చెదిరిపోయాయి. నక్షత్రాల కాంతిలో దూరంగా, ఎక్కడో ఒక వ్యక్తి రోడ్డు మలుపు తిరిగి, ఆ నీరవ నిశీధిలో ఒంటరిగా రోడ్డుమీద నడుచుకుంటూ ఇటువైపుగా వస్తున్నట్లు కనిపించింది.

ఆ వ్యక్తి క్రమంగా ఆ నడిచివచ్చే తీరు చూస్తుంటే అతడు తనకు తెలుసున్న మనిషే అనిపించింది మీనాక్షికి. ఆ తలెత్తుకు దర్జాగా నడిచే తీరు, అడుగు ముందుకు వేయడంలోని ఒదుగులు అన్నీ తనకు పరిచయమున్నవే! రోడ్డుమీదే దృష్టి నిలిపి, కొడుకు రాకకై ఎదురుతెన్నులు చూస్తున్న మీనాక్షి, ఆ వచ్చేది జీవనేనని గుర్తుపట్టి ఆనందంతో పరవశించి పోయింది.

‘వచ్చేస్తున్నాడు నా బంగారు కొండ ! నా కన్నులపంట’ అనుకుంటూ ఎదురుగా పరుగు పెట్టింది.

అది మరీ అర్థరాత్రి కావడం వల్ల, జనమంతా గాఢనిద్రలో మునిగిపోయి ఉండడం చేత ఆ తల్లీ కొడుకులను ఎవరూ చూడలేదుగాని, చూసి ఉంటే – అది ఒక అద్భుతమైన సమాగమం’ అని తప్పక ఒప్పుకునేవారు.

చేయి జారిపోయిందనుకున్న పెన్నిధి, చేజిక్కిందన్న సంతోషంతో ఉన్న మీనాక్షి, పట్టరాని ఆనందంతో జీవన్‌ని కౌగిలించుకుని ‘భోరున’ ఏడ్చింది. జీవన్‌కి కూడా కళ్ళు చెమ్మగిల్లగా, ‘అమ్మా’ అని ఆక్రోశిస్తూ తల్లి కౌగిలిలో పసిబిడ్డలా ఒదిగిపోయాడు. కొంతసేపలా ఉండి నెమ్మదిగా తెప్పరిల్లారు ఇద్దరూ. ముందుగా జీవనే నోరువిప్పి మాట్లాడాడు.

‘అమ్మా! నేను నిన్ను చాలా కష్టపెట్టాను, నన్ను క్షమించగలవా?’

‘నువ్వే నన్ను క్షమించాలిరా కన్నా! నువ్వు చెపుతున్న మాటకూడా వినిపించుకోకుండా నిన్ను తూలనాడాను, నా పాపానికి నిష్క తి లేదు’ అంది మీనాక్షి కొంగుతో కళ్ళుతుడుచుకుంటూ.

క్షణం మౌనంగా ఉండిపోయి, ఆపై మాటాడాడు జీవన్‌,

‘అమ్మా! నన్ను నువ్వే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారమ్మా ? నాకు ఆ పిల్ల మాటతీరుకి నవ్వొచ్చింది. అంతేగాని నాకు మరే చెడు ఉద్దేశమూ లేదమ్మా! నన్ను నమ్ము’ అన్నాడు దీనంగా.

మీనాక్షి కొడుకు రెండుచేతుల్నీ తన చేతుల్లోకి తీసుకుని, ‘నన్ను క్షమించరా నాన్నా! ఆ పిల్ల ఒట్టి తింగరిదని తెలిసికూడా, నిన్ను ఎంతో బాధపెట్టాను’ అంటూ అపరాధ భావంతో తలవంచుకు నిలబడింది.

‘ఇప్పటికైనా గుర్తించావు, చాలమ్మా! అదే సంతోషం నాకు. కన్నతల్లే నన్ను అనరాని మాటలు అంటూంటే నాకు బతుకుమీద విరక్తి కల్గింది. రాత్రి పన్నెండు గంటలకు మన ఊరిమీదుగా వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌ బండికింద పడి చచ్చిపోడం కోసం ట్రాక్‌ మీద పడుకున్నా. రైలు స్టేషన్‌కి వచ్చి కూసింది, అంతా ఐపోయిందనే అనుకున్నా. కాని..’ అంటూ ఆగాడు జీవన్‌.

–  వెంపటి హేమ (కలికి)

(ఇంకా ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *