చెప్పాలని ఉంది

చెప్పాలని ఉంది

ఆరోగ్యం, ఐశ్వర్యం ఈ రెండింటిలో ఏది కోరుకుంటారు ? అని ఎవరైనా మనల్ని అడిగితేే తడబడకుండా ‘ఆరోగ్యం’ అనే చెబుతాం. ఎందు కంటే ఆరోగ్యంగా ఉంటే ఎంతైనా సంపాదించవచ్చు. అయితే మనకు ఆరోగ్య ధీమా కల్పించే వైద్యునికి కూడా మన సమాజంలో చాలా ప్రాధాన్యం ఉంది. ‘వైద్యో నారాయణో హరిః’ అంటే వైద్యుడు భగవంతుడితో సమానం అని అర్థం.

ఇప్పటివరకు 35 వేలకు పైగా గుండె సంబంధిత శాస్త్ర చికిత్సలు నిర్వహించిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు డా|| మన్నెం గోపిచంద్‌ ఈ టివి తెలంగాణ/ఆంధ్రప్రదేశ్‌ ఛానల్‌లలో మే 5న రాత్రి 9 గంటలకు ప్రసారమైన ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమం ద్వారా తన వృత్తిపరమైన అనుభవాలను, ఇతర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ ప్రోగ్రాంలో వైద్యుల లక్ష్యం, ‘ఆరోగ్య స్పృహ’ ఏ దేశంలో ఎక్కువ ? గుండె సంబంధిత రోగాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ? తదితర విషయాలు చర్చకు వచ్చాయి. ఆ వివరాలు ఓసారి పరిశీలిద్దాం !

డా|| గోపిచంద్‌ ఇప్పటి వరకు చేసిన శస్త్ర చికిత్సలన్నిటిలో తన తల్లికి చేసిన ఆపరేషనే క్లిష్టమైనదిగా భావిస్తానని చెప్పారు. ఒక వివాహ వేడుకలో పాల్గొన్న ఆమె ఒక్కసారిగా గుండె సంబంధిత జబ్బుతో అసౌకర్యానికి గురైతే వెంటనే హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేసి శస్త్రచికిత్స చేయడం తనకు బాగా గుర్తుందన్నారు. ఆమె వయసు (82 సంవత్సరాలు) రీత్యా, ఇతరేతర కారణాల రీత్యా నిర్ణయం తీసుకోవటం కొద్దిగా క్లిష్టమైనా ఆపరేషన్‌ విజయవంతమై తన తల్లి సురక్షితంగా బయట పడిందని గోపిచంద్‌ చెప్పారు.

‘ఆరోగ్య స్పృహ’ అవసరం

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో పర్యటించిన మీకు ఏ దేశంలో ప్రజలు ఎక్కువగా ‘ఆరోగ్య స్పృహ’ కలిగి ఉన్నట్లు అనిపించింది ? అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగితే ‘అమెరికా… అయితే అది ఆరోగ్య వంతమైన దేశమని నేను చెప్పను. కానీ ‘ఆరోగ్య స్పృహ’ అక్కడ ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ ప్రజలు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. నియమిత కాల వ్యవధిలో తగిన పరీక్షలు చేయించుకుంటారు. అలాగే మనదేశంలో కూడా 40 సంవత్సరాలు పైబడిన వారందరూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే భవిష్యత్తులో ఏ రోగాన్నైనా ప్రాథమిక దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది’ అని చెప్పారు.

డాక్టర్లది మనీ మైండా ?

ఎంతో డబ్బు ఖర్చు చేసి వైద్య విద్యనభ్యసించి డాక్టరుగా ప్రాక్టీస్‌ చేసే వారిది మనీమైండే అవుతుంది కదా ? అన్న ప్రశ్నకు సమాధానంగా గోపిచంద్‌ ఏమీ తడుముకోకుండా ఎందుకు కాదు ? అని చెప్తూ దానికి ప్రతిగా వైద్య విద్యకు అయ్యే వ్యయాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అలాగే ఏ డాక్టరు కూడా కావాలని ఏ పేషెంట్‌కు హాని చేయాలని చూడడని ఆయన చెప్పారు. కొన్ని కేసుల్లో ఫలానా పేషెంట్‌ను ఆసుపత్రికి తీసుకొచ్చిన కొన్ని గంటలకే చనిపోవడం పట్ల వైద్యుణ్ణి దోషిగా చూపిస్తున్నారని, అది సరికాదని గోపిచంద్‌ అభిప్రాయపడ్డారు. సదరు పేషెంట్‌ ఎలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రికొచ్చాడు ? అక్కడ ఏం ట్రీట్‌మెంట్‌ చేశారు ? అతను ఎందుకు మరణిం చాడు ? వంటి విషయాలపై శాస్త్రీయ విశ్లేషణ చేసిన తర్వాతే నిర్ధారణకు రావాలన్నారు. అంతేకాని డాక్టర్లపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

ఆ తర్వాతే దేశం విలువ తెలిసింది !

అనేక దేశాలు చుట్టి వచ్చిన తనకు బయటి దేశాలకు వెళ్లిన తర్వాతే మనదేశం విలువ తెలిసిందని గోపిచంద్‌ నిజాయితీగా చెప్పడం బావుంది. ప్రస్తుత కాలంలో అనేక మంది వైద్య విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, కోర్సు క్లిష్టతను గుర్తించి సిలబస్‌ సరళీకరణ, కోర్సుకు పట్టే సమయాన్ని కుదించవచ్చా ? అన్న ప్రశ్నకు సమాధానంగా ‘నేను ఎప్పుడో మూడున్నర దశాబ్దాల క్రితం చదివినప్పుడూ.. ఇప్పుడూ.. సిలబస్‌ కాస్త అటూ ఇటూగా అదే’ అని చెప్పారు. అయితే ఈ కోణంలో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని గోపిచంద్‌ అన్నారు.

‘హృదయాలయ ఫౌండేషన్‌’ తరఫున అవసరమైన వారికి వైద్య సహాయాన్ని అందిస్తున్న గోపిచంద్‌ తనకున్న సాహిత్యాభిమానంతో రవిశాస్త్రి, తదితరుల అముద్రిత రచనల్ని అందరికీ అందు బాటులోకి తెస్తున్న వైనాన్ని వివరించారు.

గుండె పదిలంగా ఉండాలంటే ?

మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎల్లప్పుడూ సమతుల ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయడం తప్పనిసరి అని గోపిచంద్‌ తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు దక్షిణ భారతదేశంలో కూరతో, పప్పుతో, సాంబారులో ఇలా అన్నిటికీ ‘రైస్‌’ని జోడించి తినడం ఎక్కువ. దీన్ని తగ్గించాలి అని చెప్పారు.

ఏ రాష్ట్రంలో గుండె జబ్బులు తక్కువ ?

భారతదేశంలో ఏ రాష్ట్రంలో గుండె జబ్బులు తక్కువ ? అన్న ప్రశ్నకు గోపిచంద్‌ సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. వాతావరణం, ఆహార అలవాట్లు సరిగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా గుండె జబ్బులు వస్తున్నాయని ఆయన చెప్పారు. కేరళలో హార్ట్‌ కంప్లైంట్స్‌ తక్కువా ? అన్న ప్రేక్షకుడి ప్రశ్నకు సైతం ‘లేదండీ అక్కడా ఉన్నాయి’ అని సమాధాన మిచ్చారు. వైద్య విభాగంలో కొన్ని సమస్యలకు అల్లోపతిలో మందులు లేవని ¬మియోపతిలో ఉన్నాయని ఆయన ఒప్పుకోవడం గమనార్హం. కాని అల్లోపతిలో ఉన్నట్లు ¬మియోపతి, ఆయుర్వేద, యునానీ విభాగాల్లో ప్రయోగాలకు తగిన ప్రోత్సాహక వాతావరణం లేకపోవడం వల్ల ఇంకా అవి అభివృద్ధి చెందాల్సి ఉందని గోపిచంద్‌ అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమం ప్రసారమవుతున్న సందర్భంలో ఛానల్‌లో కొన్నిచోట్ల సాంకేతిక లోపాలు కని పించాయి. వాటిని సరిచూసుకుంటే బాగుంటుంది. కార్యక్రమం మధ్యలో ప్రకటనల నిడివి కాస్త తగ్గించి ఉంటే బాగుండేది.

– స్ఫూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *