భారత్‌లో పురాతన క్రీడ చదరంగం పేరు చెప్పగానే ప్రపంచ స్థాయిలో గుర్తుకు వచ్చే ఒకే ఒక్కపేరు విశ్వనాథన్ ఆనంద్. 48 ఏళ్ల లేటు వయసులో ఆరవ ప్రపంచ టైటిల్ సాధించడం ద్వారా విమర్శకుల నోటికి తాళం వేశాడు. మేధో క్రీడ చదరంగంలో విశ్వవిజేతగా నిలవడానికి వయసుతో ఏమాత్రం పనిలేదని నిరూపించాడు…
భారత్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన క్రీడల ముందు వరుసలో చదరంగం సైతం ఉండి తీరుతుంది. నాటితరం మాన్యుల్ ఆరన్ నుంచి నిన్నటి తరం విశ్వనాథన్ ఆనంద్, నేటితరం గ్రాండ్ మాస్టర్ హిమాంశు శర్మ వరకు మొత్తం 47 మంది మేటి ఆటగాళ్లున్నా సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాతే ఎవరైనా. ప్రపంచ చెస్‌లో గత నాలుగు దశాబ్దాల కాలంలో ఎందరో గొప్ప గొప్ప గ్రాండ్ మాస్టర్లు ఇలా వచ్చి అలా పోతున్నా 48 ఏళ్ల విశ్వనాథన్ ఆనంద్ మాత్రం తన ఎత్తుల పోరాటం కొనసాగిస్తూ చదరంగ రాజులకే రారాజుగా నిలుస్తూ వస్తున్నాడు.
లైట్నింగ్ కిడ్ ఆఫ్ ఇండియన్ చెస్
భారత చదరంగ చరిత్ర పుటలను ఓ సారి తిరగేసి చూస్తే విశ్వనాథన్ ఆనంద్‌కు ముందు.. ఆ తర్వాత అన్న అధ్యాయాలు మాత్రమే మనకు కనిపిస్తాయి. తల్లి సుశీల ప్రేరణతో బాల్యం నుంచే చదరంగ క్రీడనే ఊపిరిగా చేసుకొన్న ఆనంద్ 14 ఏళ్ల చిరుప్రాయంలోనే తొలిటైటిల్ సాధించి లైట్నింగ్ కిడ్ ఆఫ్ ఇండియన్ చెస్‌గా గుర్తింపు పొందాడు.
16 ఏళ్ల వయసులో తొలి జాతీయ టైటిల్ నెగ్గిన ఆనంద్ 1988లో తొలి ప్రపంచ జూనియర్ టైటిల్, పద్మశ్రీ పురస్కారం అందుకొని వారేవ్వా అనిపించు కొన్నాడు.
భారత తొలి గ్రాండ్‌మాస్టర్
విశ్వనాథన్ ఆనంద్ 1988లో గ్రాండ్ మాస్టర్ ¬దా తెచ్చుకొని ఈ ఘనత సాధించిన భారత తొలి చదరంగ క్రీడాకారుడిగా నిలిచాడు. గారీ కాస్పరోవ్, అనతోలీ కార్పోవ్, వ్లాదిమీర్ క్రామ్నిక్, బోరిస్ గెలాాండ్, జూడిత్ పోల్గార్, వాసెలిన్ తోపలోవ్, మాగ్నుస్ కార్ల్ సన్ లాంటి హేమా హేమీలతో తలపడటం ద్వారా తన ప్రత్యేకతను చాటుకొంటూ వచ్చాడు. 2000 సంవత్సరం నుంచి 2013 సంవత్సరాల మధ్యకాలంలో ఐదుసార్లు ప్రపంచ టైటిల్స్ నెగ్గడం ద్వారా సూపర్ గ్రాండ్ మాస్టర్‌గా తన సత్తా చాటుకొన్నాడు. తన కెరియర్ లోనే అత్యుత్తమంగా 2782 పాయింట్ల ఎలో రేటింగ్ సాధించాడు.
1991- 92 సీజన్‌కు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్‌రత్న అందుకొన్న ఆనంద్ 2007లో పద్మవిభూషణ్ పురస్కారం సైతం సాధించాడు. 2007లో ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడిగా గుర్తింపు సంపాదించిన ఆనంద్ చెన్నై వేదికగా 2014లో ముగిసిన ప్రపంచ టైటిల్ సమరంలో నార్వే సంచలనం మాగ్నుస్ కార్ల్సన్ చేతిలో ఘోరపరాజయం పొందడంతో విమర్శకులు చెలరేగిపోయారు. ఆ తర్వాతి కాలంలో ఆనంద్ ఆటతీరు సైతం స్థాయికి తగ్గట్టుగా లేకపోడంతో రిటైర్మెంట్కు సమయం దగ్గర పడిందని ప్రపంచ చెస్‌కు ఇంకా ఆనంద్ అవసరం, ఆవశ్యకత ఉన్నాయా? అంటూ ప్రశ్నలు కూడా మొదలయ్యాయి.
విశ్వవిజేత
48 ఏళ్ల లేటు వయసులో విశ్వనాథన్ ఆనంద్ తన పోరాటాన్ని కొనసాగించాడు. విమర్శకులను ఏమాత్రం లెక్క చేయకుండా ప్రపంచ టోర్నీల్లో పాల్గొంటూ వస్తున్నాడు. సౌదీ అరేబియా రాజధాని రియాద్ వేదికగా ముగిసిన 2017 ప్రపంచ ర్యాపిడ్ చెస్ టోర్నీలో 9వ ర్యాంక్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. మొత్తం 15 రౌండ్ల ఈ టైటిల్ సమరంలో ప్రపంచ మేటి గ్రాండ్ మాస్టర్లతో తలపడ్డాడు.
15 రౌండ్లలో ఆనంద్ 10.5 పాయింట్లు సాధించడం ద్వారా 14 ఏళ్ల తర్వాత తిరిగి విశ్వవిజేతగా నిలువగలిగాడు. ప్రారంభ రౌండ్లలో ప్రపంచ నంబర్ వన్ మాగ్నుస్ కార్ల్ సన్‌పై సంచలన విజయం సాధించిన ఆనంద్ ఆ తర్వాతి రౌండ్లలో తన అపార అనుభవాన్ని ఉపయోగించి ఆడటం ద్వారా ఆశించిన ఫలితాన్ని సాధించాడు. ఆఖరి రౌండ్లో రష్యా గ్రాండ్ మాస్టర్ వ్లాదిమీర్ ఫెదోసివ్ కు టై బ్రేక్ ద్వారా 2-0తో ఆనంద్ చెక్ చెప్పాడు. 48 ఏళ్ల వయసులో ప్రపంచ ర్యాపిడ్ చెస్ ట్రోఫీతో పాటు కోటీ 60 లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా అందుకొన్నాడు. ఇదే టోర్నీ పురుషుల, మహిళల విభాగాలలో పోటీకి దిగిన తెలుగు తేజాలు పెంటేల హరికష్ణ 16, ద్రోణవల్లి హారిక 22 స్థానాల్లో నిలిచారు.
ప్రపంచ బ్లిడ్జ్ చెస్‌లో సైతం ఆనంద్ మూడో స్థానంలో నిలవడం ద్వారా కాంస్య పతకం సాధించాడు. ఈ జంట విజయాలతో ఆనంద్ విమర్శకుల నోటికి ఒక్కసారిగా తాళం పడింది. పైగా ప్రపంచ మాజీ ఛాంపియన్ గారీ కాస్పరోవ్ సైతం ఆనంద్ సాధించిన ఈ అసాధారణ విజయాలు విమర్శకులకు కనువిప్పు కావాలంటూ ట్విట్టర్ సందేశం పంపాడు.
ఏది ఏమైనా ప్రపంచ చదరంగ చరిత్రలో 14 ఏళ్ల వయసు నుంచి 48 ఏళ్ల వయసు వరకూ మూడున్నర దశాబ్దాల పాటు జాతీయ, ప్రపంచ టైటిల్స్ నెగ్గుతూ వచ్చిన ఒకే ఒక్కడు విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే. ఆనంద్ లాంటి గొప్ప ఆటగాడు మనదేశంలోనే జన్మించినందుకు, భారతీయుడిగా పుట్టినందుకు అందరం గర్వించాల్సిందే మరి.
– క్రీడా కృష్ణ , 84668 64969