ఖేలో ఇండియా… జీతే రహో ఇండియా…

ఖేలో ఇండియా… జీతే రహో ఇండియా…

భారత క్రీడారంగానికి జవసత్వాలను అందించే ‘ఖేలో ఇండియా స్కూల్‌ గేమ్స్‌’ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ప్రారంభించారు. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 3 వేల 750 మంది యువ క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకోడానికి ఈ కార్యక్రమంలో పోటీపడుతున్నారు. ఒలింపిక్స్‌ స్థాయి అథ్లెట్లుగా ఎదగడానికి తహతహ లాడుతున్నారు.

ప్రపంచ యువజన జనాభాలో అగ్రస్థానంలో ఉన్న ఇండియాలో క్రీడారంగ ప్రక్షాళనకు మోదీ నేతత్వంలోని కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత్‌ ఎన్నో రంగాల్లో కళ్లు చెదిరే ప్రగతి సాధించినా క్రీడా రంగంలో మాత్రం అట్టడుగు స్థాయిలోనే కొట్టుమిట్టాడుతోంది. ఈ పరిస్థితికి ఇకనైనా ముగింపు పలకాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. నిస్తేజంగా, నిద్రాణంగా తయారైన భారత క్రీడారంగాన్ని జాగతం చేయటానికి మోదీ ప్రయోగించిన అస్త్రమే ‘ఖేలో ఇండియా’

రూ. 350 కోట్ల నిధులు

గత ప్రభుత్వాలు అనుసరించిన వ్యూహాలు, పథకాలను సమగ్రంగా సమీక్షించిన ప్రధాని నరేంద్రమోదీ ‘ఖేలో ఇండియా’ అనే వినూత్న కార్యక్రమానికి న్యూఢిల్లీలో అంకురార్పణ చేశారు. గతంలో ఉన్న రాజీవ్‌గాంధీ ఖేల్‌ అభియాన్‌, పట్టణ ప్రాంతాలలో మౌలిక క్రీడా సదుపాయల కల్పనా పథకం, క్రీడారంగంలో జాతీయ ప్రతిభాన్వేషణ పథకాలను మిళితం చేయడం ద్వారా ఖేలో ఇండియా కార్యక్రమానికి తుదిరూపు ఇచ్చారు. ఈ పథకం అమలు కోసం 1756 కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్‌ను ఏర్పాటు చేశారు. దీనికి 2018 కేంద్ర బడ్జెట్‌లో 350 కోట్ల రూపాయలు కేటాయించారు. ఖేలో ఇండియా కార్యక్రమాన్ని కేంద్ర క్రీడామంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ అధికారికంగా ప్రారంభిస్తే ఖేలో ఇండియా స్కూల్‌గేమ్స్‌ను ప్రధాని మోదీ మొదలు పెట్టారు. క్రీడారంగంలో అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారి చదువుకు ఆటంకం కలగని విధంగా ప్రపంచ ప్రమాణాలతో కూడిన క్రీడా శిక్షణ ఇవ్వటానికి దేశంలోని 20 విశ్వవిద్యాల యాలను ఎంపిక చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులకు ఈ 20 విశ్వ విద్యాలయ కేంద్రాలు స్పోర్టింగ్‌ ఎక్స్‌లెన్స్‌ వేదికలుగా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు.

మూడంచెల శిక్షణ

అధునాతన శిక్షణా సదుపాయాలతో పాటు ప్రపంచ ప్రమాణాలతో తీర్చిదిద్దే శిక్షకులు సైతం ఈ కేంద్రాలలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా అట్టడుగు స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి శిక్షణతో పాటు విద్యా సదుపాయాలను సైతం అందిస్తారు. దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు, వ్యవస్థలు స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలతో అనుసంధానమై ఉంటాయి. అంతేకాదు వివిధ క్రీడలకు సంబంధించిన తాజా సమాచారం తెలుసుకో డానికి వీలుగా ప్రత్యేక యాప్‌లను సైతం కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ అందుబాటులోకి తెచ్చింది.

ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాలలోని క్రీడా మైదానాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, అత్యాధునిక శిక్షణ సౌకర్యాలు అందు బాటులో ఉంచడం, క్రీడాశిక్షకుల పరిజ్ఞానాన్ని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగు పరచడం ఖేలో ఇండియాకు ఆయువు పట్టుగా ఉంటాయి. పదేళ్ల నుంచి 18 సంవత్సరాల వయసున్న ప్రతిభావంతులైన బాలలు, యువతీ, యువకులను గుర్తించి ఎంపిక చేసిన క్రీడలతో పాటు చదువులోను రాటుదేలేలా చేయటమే ఖేలో ఇండియా ప్రధాన లక్ష్యం.

న్యూఢిల్లీలో తొలిఅడుగు

ఖేలో ఇండియా తొలిదశ జాతీయ స్కూల్‌గేమ్స్‌ కోసం దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 651 జిల్లాలలో ప్రతిభాన్వేషణ శిబిరాలు నిర్వహించారు. మొత్తం 16 క్రీడాంశాలలో 12 వేల 415 మంది బాలబాలికలను గుర్తించారు. వీరంతా 17 సంవత్సరాల లోపు వారే.

న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా జరిగిన ఈ తొమ్మిది రోజుల పోటీలలో భాగంగా అథ్లెటిక్స్‌, ఆర్చరీ, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్‌, బాక్సింగ్‌, ఫుట్‌బాల్‌, జిమ్నాస్టిక్స్‌, జూడో, కబడ్డీ, ఖో-ఖో, షూటింగ్‌, స్విమ్మింగ్‌, వాలీబాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, కుస్తీ విభాగాల్లో పోటీలు నిర్వహించారు.

ఖేలో ఇండియా నేషనల్‌ స్కూల్‌గేమ్స్‌ విజేతల కోసం 199 స్వర్ణం, 199 రజత, 275 కాంస్య పతకాలను ప్రదానం చేశారు. ఈ పోటీలలో హర్యానా నుంచి అత్యధికంగా 396 మంది పాల్గొంటే మహారాష్ట్ర నుంచి రికార్డు స్థాయిలో 188 మంది బాలికలు, యువతులు పాల్గొన్నారు. ఈ పోటీలు నిర్వహించడంలో 912 మంది వాలంటీర్లు, 1200 మంది అధికారులు, సాంకేతిక నిపుణులు పాలుపంచుకొన్నారు.

భారీగా ఉపకారవేతనాలు

స్కూల్‌గేమ్స్‌లో పాల్గొన్న వారిలో అసాధారణ ప్రతిభావంతులైన వెయ్యి మందికి నెలకు 500 నుంచి 2 వేల రూపాయల వరకూ ఉపకారవేతనంగా అందిస్తారు. వివిధ క్రీడల్లో శిక్షణ కోసం ఎంపిక చేసిన వెయ్యి మంది క్రీడాకారులకు ప్రపంచ ప్రమాణాలతో కూడిన క్రీడాశిక్షణ, చదువు, ఆహారం, వసతి కల్పిస్తారు.

2018లో ప్రారంభమైన ఖేలో ఇండియా స్కూల్‌గేమ్స్‌ పథకం కోసం 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఈ మొత్తాన్ని రానున్న కాలంలో ఏడాదికి 10 కోట్ల రూపాయలు పెంచుతారు. అంతేకాదు శిక్షణ కోసం బాలబాలికల సంఖ్యను సైతం ఏడాది ఏడాదికీ పెంచుతారు.

చిన్నవయసులోనే ప్రతిభను గుర్తించి అత్యున్నత శిక్షణ, నిరంతర పర్యవేక్షణతో ఒలింపిక్స్‌ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దటమే నరేంద్రమోదీ మానసపుత్రిక ఖేలో ఇండియా అంతిమ లక్ష్యం. మోదీ ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ఉద్దేశించి ‘ఈ దేశంలోని బాలలంతా తమకు నచ్చిన ఏదో ఒక ఆట ఆడితే ఖేలో ఇండియా లక్ష్యం నెరవేరినట్లే’ అన్నారు.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *