ఖేలో ఇండియాకు అంకురార్పణ

ఖేలో ఇండియాకు అంకురార్పణ

– రూ.1756 కోట్లతో క్రీడారంగ అభివృద్ధి

– దేశంలోనే అత్యాధునిక సదుపాయాలతో శిక్షణ

‘ఎక్కడేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా తయారైన భారత క్రీడారంగానికి మంచిరోజు లొచ్చాయి. భారత బాలలు పాఠశాల స్థాయి నుంచి ఒలింపిక్స్‌ స్థాయి వరకూ పాల్గొనడానికి ఉపకరించే ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోది చొరవ, పూనికతో రూపొందించారు. వందలకోట్ల రూపాయల ప్రత్యేక బడ్జెట్‌తో ఈ విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వచ్చే మూడేళ్లలో ‘ఖేలో ఇండియా’తో భారత క్రీడా వ్యవస్థ సమూల ప్రక్షాళన జరుగుతుందని భావిస్తున్నారు.

జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశం, ప్రపంచ యువజన జనాభాలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌ క్రీడారంగంలో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించలేకపోయింది. ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతం ఎన్నో రంగాలలో కళ్లు చెదిరే ప్రగతి సాధించినా క్రీడారంగంలో మాత్రం అట్టడుగు స్థాయిలోనే కొట్టిమిట్టాడుతోంది. నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్‌, ప్రపంచ నంబర్‌ వన్‌ గేమ్‌ ఫుట్‌బాల్‌లో భారత పరిస్థితి దయనీయంగా తయారయింది. ఒలింపిక్స్‌లో 204 దేశాలు పోటీపడుతుంటే పతకాల పట్టికలో భారత్‌ స్థానం 57 మాత్రమే. అంతేకాదు ప్రపంచ ఫుట్‌బాల్‌లో మన ర్యాంకు 97గా ఉందంటే మన పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. చివరకు 77 దేశాల కామన్వెల్త్‌ గేమ్స్‌, 45 దేశాల ఆసియా క్రీడల్లో సైతం భారత్‌ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది.

జాతీయ క్రీడ హాకీలో సైతం మనదేశ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, బిలియర్డ్స్‌ లాంటి ఒకటి రెండు క్రీడల్లో మన క్రీడాకారులు రాణిస్తున్నా అది నామమాత్రమే.

1756 కోట్లు

మనదేశంలో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ క్రీడారంగ పరిస్థితి మాత్రం ‘రెండడుగులు ముందుకు నాలుగడుగులు వెనక్కు’ అన్నట్లుగా తయారయ్యింది. దీనిని అధిగమించడానికి గత ప్రభుత్వాలు అనుసరించిన వ్యూహాలు, పథకాలను సమగ్రంగా సమీక్షించిన ప్రధాని నరేంద్ర మోది ఖేలో ఇండియా అనే వినూత్న కార్యక్రమానికి అంకురార్పణ చేశారు.

గతంలో ఉన్న రాజీవ్‌ గాంధీ ఖేల్‌ అభియాన్‌, పట్టణ ప్రాంతాలలో మౌలిక క్రీడా సదుపాయల కల్పన పథకం, క్రీడారంగంలో జాతీయ ప్రతి భాన్వేషణ పథకాలను మిళితం చేయడం ద్వారా ఖేలో ఇండియా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ పథకం అమలు కోసం 1756 కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్‌ను ఏర్పాటు చేశారు.

ఖేలో ఇండియా కార్యక్రమాన్ని కేంద్ర క్రీడామంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ అధికారికంగా ప్రారంభిం చారు. క్రీడారంగంలో అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారి చదువుకు ఆటంకం కలగని విధంగా క్రీడల్లో ప్రపంచ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వటానికి మనదేశంలో 20 విశ్వవిద్యాలయాలను ఎంపిక చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులకు ఈ 20 విశ్వవిద్యాలయ కేంద్రాలు స్పోర్టింగ్‌ ఎక్స్‌లెన్స్‌ వేదికలుగా అందుబాటులో ఉంటాయి.

అత్యాధునిక సదుపాయాలు

అధునాతన శిక్షణ సదుపాయాలతో పాటు అనుభవం కల్గిన శిక్షకులు సైతం ఈ కేంద్రాలలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అట్టడుగుస్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వీరికి శిక్షణతో పాటు విద్యాసదుపాయాలను సైతం అందిస్తారు. దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు, వ్యవస్థలు, స్పోర్ట్స్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలతో అనుసంధానమై ఉంటాయి. అంతేకాదు వివిధ క్రీడలకు సంబంధించిన తాజా సమాచారం తెలుసుకో డానికి వీలుగా ప్రత్యేక యాప్‌లను సైతం సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి ప్రకటించారు.

ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాలలోని క్రీడా మైదానాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, అత్యాధునిక శిక్షణ సౌకర్యాలు అందు బాటులో ఉంచడం, క్రీడాశిక్షకుల పరిజ్ఞానాన్ని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగు పరచడం ఖేలో ఇండియాకు ఆయువు పట్టుగా ఉంటాయి. పదేళ్ల నుంచి 18 సంవత్సరాల వయసున్న ప్రతిభావంతులైన బాలలు, యువతీయువకులను గుర్తించి వారు ఎంపిక చేసుకున్న క్రీడలతో పాటు చదువులోనూ రాటుదేలేలా చేయటమే ఖేలో ఇండియా ప్రధాన లక్ష్యం.

క్రీడా విధానంపై పునరాలోచన

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే మన రాజ్యాంగంలో క్రీడలు ఉమ్మడి జాబితా అంశంగా ఉండటం కూడా దేశ క్రీడాభివద్ధికి ప్రతిబంధకంగా తయారయింది. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికీ ఓ క్రీడా విధానాన్ని రూపొందిస్తే రాష్ట్రాల స్థాయిలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ప్రత్యేక క్రీడావిధానం ఏర్పాటు చేసుకోడం క్రీడాప్రగతిలో అసమానతలకు తావిస్తోంది. ఈ పరిస్థితిని నివారించి దేశమంతటికీ ఒకే సమగ్ర క్రీడావిధానాన్ని సిద్ధం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకొంటామని క్రీడామంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ అన్నారు. క్రీడల్ని ప్రస్తుతమున్న ఉమ్మడి జాబితా నుంచి కేంద్ర జాబితా అంశంగా మార్చే ఆలోచన కూడా ఉందని ఆయన ప్రకటించారు. అయితే ఇదంతా దశలవారీగా జరుగుతుందని పేర్కొన్నారు. ప్రధాని మోది ప్రవేశపెట్టిన ఖేలో ఇండియాతో క్రీడారంగానికి సరికొత్త ఉత్తేజం రావడం ఖాయమని, భారత క్రీడా చరిత్రలో ఇదో గొప్ప ప్రయత్నమని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ ట్విట్టర్‌ ద్వారా ప్రశంసల వర్షం కురిపించాడు.

ప్రపంచీకరణ, క్రికెట్‌ తెగులుతో కునారిల్లిపోతున్న భారత క్రీడావటవక్షానికి, క్రికెటేతర క్రీడలకు ఖేలో ఇండియా రానున్న మూడేళ్లకాలంలో జవసత్వాలు ఇవ్వాలని కోరుకుందాం. ఖేలో ఇండియా..! చక్‌ దే ఇండియా..!

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *