కాశీపట్నం చూడర బాబు

కాశీపట్నం చూడర బాబు

జరిగిన కథ

రాజారావు-శ్యామల, నాగభూషణం, బామ్మగారి కుటుంబం, విజయ్‌-పద్మ, శంఖరూప, రమేశ్‌-జయ, చంద్రశేఖర దీక్షితులు, కళాశాల విద్యార్థుల బృందం, మరి కొంతమంది రైలులో కాశీ పట్నానికి బయలుదేరారు. నాగభూషణంగారు భార్య పోయి, ఒంటరివాడై శేష జీవితాన్ని కాశీలో గడుపుదామని; రాజారావు, శ్యామల దంపతులు కాశీ చూడాలనే కోరికతోనూ; జయ, రమేష్‌ దంపతులు రమేష్‌ తండ్రిగారి సంవత్సరీకం పనిమీద; విజయ్‌ని ఆవహించిన నిరుత్సాహాన్ని తొలగించడానికి విజయ్‌, పద్మ దంపతులు కాశీ వెళుతున్నారు.

వీరితో పాటు అదే రైలులో ఒంటరిగా కాశీకి బయలుదేరిన శంఖరూప తన తల్లితో పాటు ప్రశాంతమైన కమ్యూనిటీలోని ఫ్లాట్‌లో నివసిస్తోంది. తల్లి అన్న మాటలతో బాధపడిన శంఖరూప తన బాధను తన మేనత్త బాలత్తతో చెప్పుకుంది. రోజులు గడుస్తుండగా శంఖరూప తల్లికి కిడ్నీ సమస్య మొదలైంది. అప్పటికే మధుమేహం ఉండటంతో ఇది మరింత ఇబ్బంది పెడుతోంది. ఆ పైన బెడ్‌ మీదే ఉంటోంది. వీటన్నిటితో బతకడం చాలా కష్టం అని వైద్యులు చెప్పారు.

ఇక చదవండి..

అప్పటికి శంఖరూప తల్లి చనిపోయి పదిహేను రోజులకు పైనే అయింది. దగ్గర చుట్టాలు అందరూ వచ్చారు. ఎవరు వచ్చి ఏం చేసినా ఆ మనిషి ఇంక తిరిగి రాదు. అందరి కంటే ఆమెని కనిపెట్టుకుని ఉన్న లక్ష్మి బాగా ఏడిచింది. అవును ఒక రకంగా శంఖరూప కన్నా లక్ష్మే దగ్గరగా ఉంది.

శంఖరూప తల్లి పడుకునే గదిలోకి వెళ్ళింది. చక్కగా సదిరి ఉన్న మంచం, పక్కనే ఉన్న టీపాయ్‌, తన చిన్నప్పటి ఫొటోని చూస్తూ కూర్చుండి పోయింది. ‘అమ్మకి ఇష్టమైనట్లుగా ఉండలేకపోయాను. రాహుల్‌తోనే జీవితం అనుకున్నాను. కానీ అతను తన స్వార్ధం చూసుకొని వెళ్ళిపోయాడు. అమ్మా! ఏం చెయ్యను ! ఇలా జరుగుతుందని అనుకోలేదు’ అనుకుంటూ దుఃఖం ముంచుకురాగా ఆ మంచం మీద కూలబడిపోయింది. అప్పుడు అనుకుంది, పోనీ అమ్మ అస్థికలు గంగలో కలిపితే ఆవిడ ఆత్మ శాంతిస్తుంది అని. బాలత్తకి ఫోన్‌ చేసి చెప్పింది. ఆవిడ సరే అంది. ఏదో తంటాలు పడి రైలులో ఎసి బోగీలో రెండు టికెట్స్‌ బుక్‌ చేయించింది. ఆఫీస్‌లో వారం రోజులు లీవ్‌ కూడా అప్లై చేసింది. కానీ ఈ లోపల అనుకోని అవాంతరం వచ్చింది. బాలత్త కూతురు రమ్యకి ఒంట్లో బావుండలేదంటే అనుకోకుండా వెళ్ళిపోయింది. ‘అత్త వస్తే ఇంకా బావుండేది’ అని ఎన్నో సార్లు అనుకుంది శంఖరూప. అనుకున్న ప్రకారం తను ఒక్కతే ప్రయాణానికి సిద్ధమై కాశీ వెళ్ళే రైలెక్కింది.

తన సీట్‌ కి ఎదురుగా కూర్చొన్న పెద్దాయన్ని చూస్తే ప్రసాద్‌ అంకుల్‌లా ఉన్నారు అనుకుంది. వెంటనే శంఖరూప ఆలోచనలు ప్రసాద్‌ అంకుల్‌ మీదకి మళ్లాయి.

తన తల్లి పోయినప్పటి నుంచి విచిత్రంగా ఓ సంఘటన జరుగుతూ వస్తోంది. తను ఆఫీస్‌ నుంచి ఇంటికి వచ్చేసరికి తన గుమ్మం ముందు గౌతమ్‌ వాళ్ళ నాన్న ప్రసాద్‌ గారు నించొని ఉంటున్నారు. తాళం తీయగానే లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటున్నారు. ఆ తరువాత ఎప్పటికో కాని లేవటం లేదు. ఆయన కోసం నియమించిన కేర్‌టేకర్‌ ఒకటే మొత్తుకుంటున్నాడు.

‘మేడమ్‌ రోజూ ఇదే వరస. అసలు ఆ ఇంట్లోకి రావటం లేదు. పైగా ‘ఇది మా ఇల్లు’ అంటూ ఇక్కడే కూర్చొంటున్నారు’ అన్నాడు అతను. అది విని శంఖరూపకి ఆశ్చర్యం వేసింది.

ఈ పెద్దాయన గురించి ఎప్పుడూ కొడుకు, కోడలు తగాదా పడుతూ ఉంటారు. ఆవిడకి ఢిల్లీలో ఉద్యోగం. పిల్లలతో అక్కడే ఉంటోంది. ఎప్పుడో కానీ రాదు. గౌతమ్‌కి ఇక్కడే ఉద్యోగం. అయినా అస్తమానం క్యాంపులకి వెళుతూ ఉంటాడు. అందుకే ఆ పెద్దాయనని కనిపెట్టుకొని ఉండడం కోసం ఈ కేర్‌టేకర్‌ని పెట్టుకున్నారుట. అతనే ఈ విషయాలన్నీ శంఖరూపకి చెప్పాడు.

ఇలా రోజూ శంఖరూప వచ్చే సమయానికి చిన్నపిల్లాడిలా ప్రసాద్‌ గారు అక్కడకి వచ్చేసేవాడు. లోపలకి వచ్చి కొంచెంసేపు సోఫాలో మౌనంగా కూర్చొనేవాడు. శంఖరూప ఆయనకి టీ, బిస్కట్లు ఇచ్చేది. అవి తిన్నాక బలవంతంగా ఆ కేర్‌టేకర్‌ ఆయన్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు.

ఈ మధ్య శంఖరూపకు ప్రసాద్‌గారి గురించిన ఆలోచనలు ఎక్కువయ్యాయి. ఆయన ఏదో పెద్ద పోస్ట్‌లో ఉండేవాడుట. ఈయన అంటే ఆఫీస్‌లో అందరికి భయమేనట. అలాంటి ఆయనకి ఈ జబ్బు రావడం చాలా బాధాకరం. దురదష్టం కూడా. ఆయన భార్య అది తట్టుకోలేక మంచం పట్టి పోవడం అత్యంత విషాదం. ఈ కొద్ది రోజులలోనే ఈయన నాకు అంత ఆత్మీయుడు అయిపోయాడు. అచ్చు రోజూ అమ్మకి చెప్పినట్లే ఈయనకు ఆఫీస్‌ విషయాలు అన్నీ చెబుతున్నాను. ‘అన్నీ వింటారు, తిరిగి మాట్లాడరు’ అనుకుంది శంఖరూప.

కాశీకి వెళ్ళేముందు ఆ కేర్‌టేకర్‌కి చెప్పింది, వాళ్ళ కొడుకు గౌతమ్‌ వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోమని. ఆయనకి కూడా చెప్పింది కాశీ వెళుతున్నానని. త్రీ డేస్‌ అన్నాడు. అంటే మూడు రోజులలో వచ్చేయమని అర్ధమా? ఏమో తెలియదు. కానీ ఆయన బిక్క మొహం వేసుకోవడం మటుకు తాను గమనించింది. ‘తొందరగా వచ్చేస్తా’ అంటూ భుజం తట్టి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి, ఇంటి నుంచి బయలుదేరి తల్లి అస్తికలని స్మశానం నుండి తీసుకొని రైల్వేస్టేషన్‌కి చేరుకొంది శంఖరూప. ప్లాట్‌ఫారం మీదకి రైలు వచ్చి ఆగింది. కంపార్టుమెంట్‌ వెతుక్కొని తన సీట్‌ నెంబర్‌ చూసుకొని కూర్చున్నాక చుట్టుపక్కల పరికించింది శంఖరూప. చాల మంది పెద్ద వాళ్ళున్నారు, ఇంకా ఆ పక్కకి కొంతమంది యువకులు ఉన్నారు. ఈ ఎదురు ఆంటీ అప్పుడప్పుడు తన్ని గమనిస్తోంది అని కొంచెం సిగ్గుపడింది. ఏమైనా గానీ కాశీ వెళ్ళడం, అమ్మ అస్తికలు గంగలో కలపడం నా పని. అక్కడ గెస్ట్‌హౌస్‌ వాళ్ళు గైడ్‌ని పంపిస్తారు అనుకుంది శంఖరూప. లయబద్ధంగా కదులుతున్న రైలుతో పాటుగా ఆమె ఆలోచనలు కూడా సాగుతున్నాయి.

———— ————- ————-

చంద్రశేఖర దీక్షితులు

మొహమాటంగా ఒక్కడే కూర్చొని ఉన్న చంద్రశేఖర దీక్షితులుని చూడగానే తెలిసిపోతుంది ఆ పిల్లవాడు ఒక్కడే ప్రయాణం చెయ్యడం ఇదే మొదటిసారి అని. అతని మొహంలో ఇంకా పసితనం పోలేదు. బహుశా పదిహేడు పద్దెనిమిది మధ్యలో ఉన్నాడు. లాల్చీ, పైజమా వేసుకున్నాడు. చెవులకి చిన్న చిన్న కుండలాలు ఉన్నాయి. నిండైన జుట్టు, దానికి చిన్న పిలక. అరటి ఆకులో కట్టిన పొట్లం విప్పుకొని, అందులో ఉన్న ఉప్పుడు పిండిని మెంతికాయతో నంజుకుని తినేసి కూర్చొన్నాడు. ఎవరితోనూ మాట్లాడటం లేదు. భయంగా, బెరుకుగా ఉన్నాడు. ఈ కుర్రగ్యాంగ్‌ అందరూ దూరంగా ఉన్నారు. నాగభూషణంగారి సీట్‌ పక్కనే కూర్చున్నాడు. ఆయన పొద్దుట నుంచి ఆ అబ్బాయిని పలకరించ డానికి ప్రయత్నాలు చేసారు. కాని చంద్రశేఖరం అంటీ ముట్టనట్లుగానే జవాబులు చెప్పాడు.

———— ————- ————-

బామ్మగారు

చూసే ఓపిక, వినే ఆసక్తి ఉంటే జీవితం మొత్తం కనిపిస్తుంది ఈ రైలు ప్రయాణంలో. ఇప్పుడు కలసి ప్రయాణిస్తున్న వాళ్ళలో రకరకాల మనుషులు ఉన్నారు. వీళ్ళలో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన జీవితానుభవం. గమ్యం చేరేవరకు ఎంత అపరిచతులయినా వాళ్ళ మధ్య ఒక తెలియని సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అదే ఈ ప్రయాణంలో ఉండే గొప్పతనం.

అందుకు నిదర్శనంగా ఎదురుగా ఉన్న బామ్మగారు అందరితో కబుర్లు చెబుతూనే తన చేతిలో ఉన్న సంచీని తడిమి తడిమి చూసుకుంటోంది.

‘ఆ సంచిలో ఏముందో.. అంత భద్రంగా పట్టుకుంది ముసలావిడ’ అని శ్యామల గుసగుస లాడింది రాజారావు చెవిలో. ‘హుష్‌ ! ఊరుకో. ఆవిడ వినగలరు’ అని శబ్దం లేకుండా అన్నాడు రాజారావు.

‘నాన్నమ్మా ! ఆ సంచీలో ఏముంది ?! ఎప్పుడూ మమ్మల్ని చూడనివ్వవు !’ అని మనవడు ఆ సంచీని లాగడానికి ప్రయత్నిస్తూ అన్నాడు.

‘ఔరా ! కాగల కార్యం గంధర్వులే చేస్తారంటే ఇదేనేమో’ అనుకున్నారు రాజారావు దంపతులు.

‘అది మీకు చూపించేది కాదులేరా’ అంది బామ్మ.

ఇక చూడాలి పాపం ఆ పిల్లల బిక్క మొహం.

ఇంతలో ఎవరో ‘కాశీ పట్నం చూడర బాబూ..’ అంటూ పాడారు. అది విన్న బామ్మగారు హుషారుగా..

‘కాశీ పట్నం చూడర బాబూ.. చూడర బాబూ.. విశ్వనాథునీ చూడర బాబూ.. చూడర బాబూ.. కళకళలాడే గంగా నదినీ కన్నుల పండువగ చూడర బాబూ.. హరిశ్చంద్రుడు సత్యం కోసం ఆలు బిడ్దలను అమ్మిన చోటూ.. అడుగడుగో విశ్వేశ్వరుడు.. హర హర యనుచు భక్తులు చూడు.. చూచి మోక్షం పొందర బాబూ..’ అంటూ రాగ యుక్తంగా పాడింది.

‘ఏది ఏది మళ్ళీ పాడు !’ మామ్మగారి మనవళ్ళు అయిన అక్కా, తమ్ముడు ఇద్దరూ ఒకేసారి అన్నారు.

అది విని మిగతా వాళ్ళు కూడా ‘బామ్మగారిలో చాలా ప్రతిభ ఉందే!’ అనుకున్నారు.

ఇంచుమించుగా అందరూ అడిగారు పాడమని. ఆవిడ మళ్ళీ పాడింది.

‘ఇది నువ్వెక్కడ నేర్చుకొన్నావు ?’ అని మనవరాలు అడిగితే

‘నేను, మా స్నేహితులు మా ఊరి తిరుణాళ్ళకు వెళ్ళినప్పుడు, అక్కడ జంతరు పెట్టేసుకొని ఓ అబ్బి వచ్చేవాడు, మా పిల్లలం అందరం ఈ తమషా చూసే వాళ్ళం’ అని ఆవిడ చెబుతుంటే..

ఆమె కళ్ళలో ఓ రకమైన మెరుపుని చూసింది ఎదురుకుండా కూర్చున్న శ్యామల. ఆవిడకి ఆ బాల్యం తాలూకు స్మతి ఎంత మధురంగా అనిపిస్తోందో ఆ మొహంలో తెలిసిపోతోంది. బోగీలో ఉన్న వాళ్ళందరూ కూడా అటు ఇటుగా బామ్మగారి మాటలకి, పాటలకి తెగ ఆనందంగా ఉన్నారు. ఆ యువకుల గుంపులోంచి ఇద్దరు అమ్మాయిలు, మరో ఇద్దరబ్బాయిలు వీళ్ళ దగ్గరకి వచ్చి నించున్నారు. అందులో ఒక అబ్బాయి ‘బామ్మా ! ‘జంతరు పెట్టె’ అన్నావు కదా ! అది అసలు ఎలా ఉంటుంది !’ అని అడిగాడు.

నిజానికి వాళ్ళకొచ్చిన సందేహమే చాల మందికి వచ్చింది అక్కడ. అప్పటికే ఆ అబ్బాయి అడిగేసాడు.

‘జంతరు పెట్టె అంటే నాలుగు పలకలుగా ఉండే ఒక పెద్ద పెట్టె. ఆ పెట్టెను అందరిని ఆకట్టుకు నేటట్లుగా రకరకాల పూసలు, అద్దాలతో అలం కరిస్తారు. ఆ పెట్టెను మూడు కాళ్ళు గల స్టాండుపై అమర్చి, ఒక మనిషి నుంచుని చూడటానికి వీలైంత ఎత్తులో నిలబెడతారు. ఆ పెట్టెకు ఒకపక్కన లోపల చూపించే బొమ్మలను అతికించి ‘కాశీ పట్నం చూడర బాబూ’ అని రాస్తారు. ఆ అతికించిన బొమ్మలో కాశీ విశ్వనాథుని దేవాలయమూ, అక్కడి గంగానదీ కనిపిస్తాయి. ఇక లోపలకు చూసేవారికి పాటను బట్టి బొమ్మ తరువాత బొమ్మ తిరుగుతూ కనబడు తుంది. బైట ఉండే పెట్టె మనిషి పాట పాడుతూ పెట్టె లోపలి రీలు తిప్పుతూ ఉంటాడు. ఒక్కసారి ఒక్కరే బొమ్మను చూడటానికి వీలవుతుంది’ అని చెప్పింది బామ్మగారు.

బామ్మగారు చెబుతూంటే అందరూ శ్రద్ధగా వింటున్నారు.

(ఇంకా ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *