కాశీపట్నం చూడర బాబు

కాశీపట్నం చూడర బాబు

జరిగిన కథ

రాజారావు-శ్యామల, నాగభూషణం, బామ్మగారి కుటుంబం, విజయ్‌-పద్మ, శంఖరూప, రమేశ్‌-జయ, చంద్రశేఖర దీక్షితులు, కళాశాల విద్యార్థుల బృందం, మరి కొంతమంది రైలులో ఎసి కంపార్ట్‌మెంట్‌లో వాళ్ళ వాళ్ళ పనిమీద కాశీ పట్నానికి బయలుదేరారు.

నాగభూషణంగారు భార్య పోయి, ఒంటరివాడై, పిల్లల ప్రవర్తన నచ్చక, శేష జీవితాన్ని కాశీలో గడుపుదామని బయలుదేరితే; రాజారావు, శ్యామల దంపతులు ఎప్పటి నుండో కాశీ చూడాలనే కోరికతో ఇప్పుడు కుదిరితే బయలుదేరారు. అలాగే జయ, రమేష్‌ దంపతులు రమేష్‌ తండ్రిగారి సంవత్సరీకం చేయించే పనిమీద కాశీ వెళుతున్నారు.

విజయ్‌, పద్మ దంపతులు కూడా ఈ ప్రయాణీకులలో ఒకరు. విజయ్‌ ఉన్నట్లుండి నిరుత్సాహంగా, సర్వం కోల్పోయిన వాడిలా తయారయి, ఎటైనా వెళ్ళిపోవాలని అనుకుంటే, ఇంట్లో వాళ్ళు కనిపెట్టి ఆపారు. తరువాత అతను కాశీ ప్రయాణం నిర్ణయించడంతో భార్య పద్మ కూడా వస్తానని పట్టుబట్టడంతో ఇద్దరూ బయలుదేరారు.

ఒంటరిగా కాశీకి బయలుదేరిన శంఖరూప తన తల్లితో పాటు ప్రశాంతమైన కమ్యూనిటీలోని ఫ్లాట్‌లో నివసిస్తోంది. తల్లి అన్న మాటలతో బాధపడుతూ శంఖరూప బాల్కనీలో కూర్చుని కాఫీ తాగుతుండగా అడుగుల చప్పుడయితే వెనక్కి చూసింది.

ఇక చదవండి..

ఆ అడుగుల చప్పుడు శంఖరూపకు అత్త వరుస అయే బాలత్తవి. ఆమె కాఫీ కప్పుతో వచ్చింది. ఇద్దరూ కాఫీని ఆస్వాదిస్తున్నారు.

‘ఏంటి అత్తా ఇవాళ ప్లాన్‌ ?’ అంది శంఖరూప.

‘ఏం లేదు. ఈ రోజు మీ అమ్మతో పూర్తిగా స్పెండ్‌ చేస్తాను. అంటే ఇంట్లోనే ఉంటాను. నీకేమైనా పనులుంటే చూసుకుని రా’ అంది.

‘సరే అలాగే’ అని తలూపింది శంఖరూప. బాలత్త లోపలికి వెళ్ళిపోయింది.

బాలత్త తన నాన్నకు చెల్లెలు. నిజంగా బాలత్త గ్రేట్‌. నాన్న లేకపోయినా, అమ్మలో తన అన్నగారిని చూసుకుంటోంది. దాదాపు ప్రతి వారాంతంలోనూ అత్త ఇక్కడికి వస్తుంది. అత్తయ్య పిల్లలు అమెరికాలో ఉన్నారు.

అమ్మ మటుకు నాన్న పోయిన తరువాత ఒంటరితనంతో పాటు, బయటికి రాక ఆరోగ్యం పాడు చేసుకుంది. ఈ అనారోగ్యం పక్షవాతంకి దారి తీసింది. ఒక కాలు, చెయ్యి పడిపోయాయి. మంచానికే పరిమితం అయిపోయింది. అప్పటి నుంచి అమ్మలో చాలా మార్పు వచ్చింది. ఆమెలో వత్తిడి బాగా పెరిగింది.

అసలు అమ్మ అలా మాట్లాడడానికి కారణం వత్తిడి. నాకు 30 ఏళ్ళు నిండిపోయినా తను ఇంకా పెళ్లి చెయ్యలేకపోయిందని, అందరిలా నేను ఇంకా జీవితంలో సెటిల్‌ అవలేదని అమ్మ బాధ.

అది ఈ విధంగా మాటలలో చూపిస్తోంది. అమ్మని అర్ధం చేసుకోగలను. ఇంతకుముందు ఎప్పుడూ అంత ఫీల్‌ అవలేదు గాని, నిన్న అమ్మ ఆ మాట అనేసరికి తను బాలన్స్‌ కోల్పోయింది.

‘అవును రాహుల్‌ని ప్రేమించాను. ఏం చెయ్యను!’ అనేసింది.

‘అదే అందుకే నా ఏడుపు. ప్రేమలో పడి ఏ కడుపో కాలో వస్తే ఎలా? ఇంకెవరు పెళ్ళి చేసుకుంటారే నిన్ను?’ అని చాల దారుణంగా అంది.

అసలు విషయం అమ్మకి తెలియనిది కాదు. కానీ దాన్ని దాచేసి, ఇదిగో ఇలా మాట్లాడుతోంది. ‘పెళ్ళయ్యాక మా అమ్మ బాధ్యత నాదే’ అనేసరికి నాకు పెళ్లి సంబంధాలు రావడం లేదు.

పోనీ తను ఇష్టపడ్డ రాహుల్‌ తన ప్రతి మాటకి తల ఊపి, చివరికి ప్రేమబంధం తుంచేసి ఒక్క ‘సారీ’ తో తేల్చేసాడు. అది తను అసలు ఊహించ నిది. ఇదిగో ఇలాగే ముంచేవరకు గుడ్డిగా నమ్ముతాం అనుకుంటూ బాధపడుతోంది శంఖరూప.

ఇంతలో తల్లిని చూసుకునే కేర్‌టేకర్‌ లక్ష్మి వచ్చి ‘మేడం, నాకు కొంచెం డబ్బు అడ్వాన్సుగా ఇప్పిస్తారా, దాన్ని నెల నెలా నా జీతంలో మినహాయించుకోండి’ అంది.

‘ఎంత కావాలి’ ఫోన్‌ చూసుకుంటూ అడిగింది శంఖరూప.

‘పది వేలు కావాలమ్మా’ అంది నెమ్మదిగా లక్ష్మి.

‘అంత డబ్బు అవసరం ఏం వచ్చింది లక్ష్మి’ అంది.

‘మా అమ్మాయి ఇంటర్‌ పాస్‌ అయింది, మీకు తెలుసు కదా మేడం! అదేదో కోర్సులో చేరుతోందిట. ఆరు నెలలు ట్రైనింగ్‌ ఇచ్చి వాళ్ళే ఉద్యోగం ఇస్తారుట’.

‘ముందు మీ అమ్మాయిని రేపు తీసుకొని రా. ఆ కోర్స్‌ వివరాలు కనుక్కుంటాను’ అంది శంఖ రూప.

బతుకు తెరువు కోసం ఎన్నో ఆరాటాలు, పోరాటాలు అనుకుంటూ నిట్టూర్పు విడిచింది శంఖ రూప.

అలా బాల్కనీలోంచి కిందకు చూస్తూ ఉండగా, ఎదురుగా ఫ్లాట్‌లో ఉండే గౌతమ్‌ వాళ్ళ నాన్నని చేయి పట్టుకొని తీసుకొని వెళుతున్నాడు.

వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఆడవాళ్ళని చూసిన గుర్తే లేదు. వారాంతాలలో ఇతను కన్పిస్తాడు. అప్పుడు పూర్తి సమయం తండ్రితో గడుపుతాడని, మిగతా రోజులలో ఓ కేర్‌ టేకేర్‌ ఉన్నాడని లక్ష్మి చెప్పింది.

గౌతం ఎప్పుడూ లిఫ్ట్‌లో గాని, కింద గాని కనిపిస్తే ఓ ‘హాయ్‌’ చెప్పి, ఓ చిరునవ్వు చిందిస్తాడు. అంతకుమించి ఎక్కువ మాట్లాడడు.

ఇంతలో ఫోన్‌లో మెసేజ్‌ బీప్‌ శబ్దం వినిపిం చింది. అది రాహుల్‌ నుంచి వచ్చింది. జస్ట్‌ పలక రింపు. అయినా అలా ఎలా ఉండగలుగుతారు మనుషులు ! అసలు తమ ఇద్దరి మధ్య ఏమీ లేనట్లుగా.. మాములుగా ఓ ఫ్రెండ్‌తో మాట్లాడినట్లు! అన్నీ మర్చిపోయాడా ! ఎంత ప్రేమ ! ఎంత ఆరాధన! ఎప్పటికీ కలిసి ఉండాలని అనుకున్న క్షణాలు.. అన్నీ.. అన్నీ ఒక్కసారిగా గాలికి ఎగిరిపోయాయా? ఛ.. తనని కాదని వెళ్ళిపోయిన వాడి గురించి ఎందుకు ఇన్ని జ్ఞాపకాలు ! అని తల విదుల్చుకుంటూ రేడియోలో ఫీవర్‌ ఎఫ్‌.ఎమ్‌. పెట్టుకుంది. అందులో కొత్తవి, పాతవి అన్ని హిందీ పాటలు వస్తాయి. ఆ పాటలు వింటూ, ఏదో పని చేస్తునట్లుగా హడా వుడిగా కాసేపు అటు ఇటూ తిరిగింది. అలా ఓ ఇరవయి నిముషాలు గడిచాక నెమ్మదిగా వచ్చి కుర్చీలో కూర్చుంది.

‘రూపా ! చాలా అలసిపోయావు. ఇదిగో కాఫీ తీసుకో’ అంటూ లోపలి నుండి వచ్చి కాఫీ కప్పు అందించింది మేనత్త బాల.

‘థాంక్స్‌ అత్తా !’ అని చేయి గట్టిగా పట్టుకుంది శంఖరూప. నా మీద అసహ్యంగా ఉందా ? అని అడిగింది.

‘ఎందుకు?’ తిరిగి ఆవిడ ప్రశ్నించింది.

‘అదే రాహుల్‌ తో నా ప్రేమ గురించి’ అంది రూప.

‘చూడు రూపా ! అప్పుడు ఆ మనిషి నీకు దగ్గరయ్యాడు, పెళ్లి చేసుకుందామని అనుకున్నారు ఇద్దరూ. కాని కొన్ని పరిస్థితులు మీ ఇద్దరిని దూరం చేసాయి. అతను ఇంక నీ జీవితం నుంచి తొలగి పోయాడు. ఆ విషయాన్ని నువ్వు ముందు బాగా జీర్ణం చేసుకో. అప్పుడు నీలో ఈ గిల్టీ ఫీలింగ్‌ పోతుంది’ అని చెప్పింది.

‘అత్తా! భలే బాగా చెప్పావు. కాని అసలేం జరిగిందో ఒక్కసారి చెప్పనీ నీకు.

‘అనవసరం రూపా!’

‘లేదత్తా ! నువ్వు ఒక్కసారి విను’ అంది.

‘సరే చెప్పు’ అందావిడ.

‘నీకు తెలుసు కదా రాహుల్‌ గురించి. వాళ్ళ అమ్మా, నాన్నలకు వాళ్ళు ఇద్దరే పిల్లలు. ఫాదర్‌ లేరు. సిస్టర్‌కి పెళ్ళయి అమెరికాలో ఉంటోంది. ఇక రాహుల్‌కి అనుకోకుండా అమెరికాలో ఆఫర్‌ వచ్చింది. తనకి తెలుసు నా కండిషన్‌. అయినా తను అప్లై చేసాడు, అదీ నాకు తెలియకుండా. ఆఫీసులో అందరూ నాకు అభినందనలు చెబుతు న్నారు. నాకు అర్ధం కాలేదు. అసలు విషయం అందరి కంటే నాకే చివర తెలిసింది. చాల మందికి మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని తెలుసు. కానీ రాహుల్‌ ఫేర్వెల్‌ పార్టీ ఇచ్చిన రోజున అందరూ నన్ను జాలిగా చూడటంతో నాకు ఒళ్ళు మండింది. అప్పుడు వెళ్లి రాహుల్‌ని గట్టిగా నిలదీశాను.

ఒక్కటే అన్నాడు.. ‘అక్కడికి వెళ్ళడం నా మరింత మంచి భవిష్యత్తు కోసం. చేతికి వచ్చిన అవకాశం వదులుకునే ఫూల్‌ ని కాదు’.

‘అంటే నాతో బ్రేక్‌ అప్‌కి సిద్ధమయ్యావా!’ అన్నాను.

‘అసలు ఆ మాట ఎందుకొచ్చింది ? నేను అనలేదే?’

‘నువ్వు అనకపోవచ్చు, కానీ దాని అర్ధం అదే కదా ! నీకు తెలుసు. నేను మా అమ్మని వదిలి రాలేనని. ఆ పరిస్థితి కూడా తెలుసు’.

‘……..’ దానికి మౌనమే అతని సమాధానం.

మళ్ళీ రెట్టిస్తే ‘అదే నువ్వు ఏదైనా ప్లాన్‌ చేస్తావేమో, ఎక్కడన్నా ఏదైనా హాస్పిటల్‌ కేర్‌లో ఉంచుతావు అనుకున్నా’ అన్నాడు.

దానితో అర్ధమయింది అతనేంటో !

అప్పుడన్నాను ‘అంటే రాహుల్‌ ! నువు నీ సంగతి మాత్రమే చూసుకున్నావ్‌ ! అమ్మని ఇలాంటి నిస్సహాయ స్థితిలో, ఇక్కడ ఎవరో దయా దాక్షిణ్యాల మీద వదిలేసి వస్తానని ఎలా అనుకున్నావు ? నువ్వు అది కూడా అనుకొని ఉండవు, నా చేతే రానని చెప్పించేస్తే, రేప్పొద్దున్న ఫ్యూచర్‌లో నీ వైపు నుంచి ఏ తప్పూ ఉండదని అనుకున్నావ్‌. చాలా బాగుంది. పోనీలే, మొదట్లోనే నువ్వేంటో తెలియడం మంచిదయింది. గుడ్‌ బై ఫర్‌ ఎవర్‌’ అని చెప్పి వచ్చేసా.

ఇవేమీ తెలియని అమ్మ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోంది అత్తా! ఇంటికి వచ్చిన వాళ్ళందరితో ఇది పెళ్లి కాకుండానే వాడితో కలిసి కాపురం చేస్తోందని తప్పుగా చెబుతోంది’ అని ఆవిడతో చెప్పుకొని బాధపడింది శంఖరూప.

రోజులు గడుస్తున్నాయి.

శంఖరూపకి తగిలిన గాయం చిన్నదేమీ కాదు. రాహుల్‌ని మర్చిపోలేక పోతోంది. ‘ఇద్దరం కూర్చొని దానికి ఇంకేదైనా పరిష్కారం ఆలోచిద్దాం’ అని అతను అనలేదు. ఏదో ఆందోళన, చిరాకు. ఆ ఆందోళనతో ఎప్పుడూ లేంది తల్లి మీద చిరాకు పడుతోంది శంఖరూప.

తల్లిపై చిరాకు పడిన క్షణంలో తల్లి చూసే నిస్సహాయ మైన చూపు శంఖరూప మనసులో గుచ్చుకునేది. దాంతో బాధపడటం కూడా శంఖరూప వంతే అయ్యేది.

ఉన్నట్టుండి శంఖరూప తల్లికి కిడ్ని సమస్య మొదలయింది. ఇంతకు ముందే మధుమేహం ఉండటంతో ఇది మరింత ఇబ్బంది పెడుతోంది. ఆ పైన బెడ్‌ మీదే ఉంటోంది. వీటన్నిటితో బతకడం చాలా కష్టం అని వైద్యులు చెప్పారు.

(ఇంకా ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *