కాశీపట్నం చూడర బాబు

కాశీపట్నం చూడర బాబు

ధార్మిక, సమాజిక నవల

జరిగిన కథ

ఉదయం తొమ్మిదిన్నర గంటలు. ఒకటో నంబరు ప్లాట్‌ఫారం మీదకి కాశీ వెళ్ళే రైలు వచ్చింది. అది మూడో తరగతి ఏసి కంపార్ట్‌మెంట్‌. రాజారావు-శ్యామల, నాగభూషణం, బామ్మగారి కుటుంబం, విజయ్‌-పద్మ, శంఖరూప, రమేశ్‌-జయ, చంద్రశేఖర దీక్షితులు, కళాశాల విద్యార్థుల బృందం, మరి కొంతమంది ఆ కంపార్ట్‌మెంట్‌లో కాశీ పట్నానికి బయలుదేరారు. ఆ బోగిలో ఒంటరిగా కాశీకి వెళ్తున్న నాగభూషణం గారికి రాజారావు, శ్యామల దంపతులు పరిచయమయ్యారు. రాజారావు బ్యాంకులో పనిచేస్తూ రెండేళ్ల క్రితమే రిటైర్‌ అయ్యాడు. రాజారావు కాశీకి వెళుతున్నాడని తెలిసి ఆయన స్నేహితుడు సత్యం తన తండ్రి అస్తికలను గంగలో కలపమని ప్రాధేయపడ్డాడు. ప్రాణ స్నేహితుడు కావడంతో రాజారావు కాదనలేకపోయాడు. అలా రాజారావు, శ్యామల దంపతులు కాశీకి బయలుదేరారు.

ట్రైన్‌ ముందుకెళుతుంటే బోగిలో ఉన్న రమేష్‌ మనసు మాత్రం వెనక్కెళ్ళింది. రమేష్‌ తండ్రి విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. తల్లి కొంతకాలం టీచర్‌గా పనిచేసి మానేసింది. చూస్తుండగానే రమేష్‌కు పెళ్లి వయసొచ్చింది. రమేష్‌కు జయతో పెళ్లైంది. ఒక రోజు రమేష్‌ వాళ్ళ అమ్మకు గుండెలో నొప్పి రావడంతో హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. కాని ఫలితం దక్కలేదు. భార్య చనిపోయిన దగ్గర్నుంచి రమేష్‌ వాళ్ల నాన్న బాగా డల్‌ అయ్యారు. మానసికంగా చాలా కుంగిపోయారు. ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికే ఇష్టపడేవారు. ఆ పాత రోజులను గుర్తు చేసుకుంటున్నాడు రమేష్‌.

ఇక చదవండి..

ఇంకో రోజు ఆ వీధి చివరకు వెళ్లి పాలు తెమ్మంది అర్జెంటుగా కావాలని. అలాగే అన్నారట, ఎంతకూ రాలేదు. ఎవరితోనో కబుర్లు చెపుతూ ఉండిపోయారట. ‘అదేమిటి మావయ్యా ! పాలేవి?’ అంటే ‘నువ్వు నాకు చెప్పావా తెమ్మని ! గుర్తులేదమ్మా!’ అన్నారట.

మనం మామూలుగా కొన్ని సంగతులు మరిచిపోతూ ఉంటాం. తాళం చెవులు, కళ్ళజోడు వంటివాటి విషయంలో ఎక్కడో పెట్టి మరచిపోతాం. పెట్టిన చోటు తప్ప అంతా వెతుకుతుంటాం. ఇలా మర్చిపోవటం మామూలే. అందులోనూ పెద్దవయసులో అవి సాధారణం అనుకుంటాం. కానీ అవి ఒక వ్యాధికి చిహ్నం అని ఆలస్యంగా గుర్తిస్తాం. చేతులు కాలాక అకులు పట్టుకొని లాభమేముంది? అదే జరిగింది నాన్న విషయంలో.

ఓ రోజు నాన్న పార్క్‌కి వెళ్లి ఎంతసేపటికి తిరిగిరాలేదు. మా పక్క ఇంట్లో ఉండే ఆయన ‘ఏంటి మీ నాన్నగారు ఇంత చీకటి పడ్డా ఇంకా పార్క్‌లోనే ఉన్నారు’ అనేంతవరకు నాకు అసలు నాన్న ఇంట్లో లేరన్న సంగతి గుర్తుకు రాలేదు.

నేను వెళ్లి తీసుకొచ్చే లోపల ఆయనే వచ్చేశారు. ‘ఏంటి నాన్నా ఇంత సేపు, తొందరగా వచ్చి తినేయండి’ అని అన్నాను. అప్పటికే జయకి నిద్ర వస్తోంది. ‘నేను పడుకుంటాను బాబు. మీరు పెట్టండి ఫలహారం నాన్నగారికి’ అని వెళ్లి పడుకుంది. టి.వి.లో సినిమా చూస్తున్న నేను ఆ మాటలకి ‘సరే’ అని ‘నాన్న టేబుల్‌ మీద చపాతీలు ఉన్నాయి తినేయండి’ అనేసి తిరిగి టి.వి. చూడ్డంలో మునిగి పోయాను. కాని అవి ఆయన తినలేదని తరువాత తెలిసింది. రోజులు గడుస్తున్నాయి.

ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఉదయాన్నే లేచిన జయ ఏదో గట్టిగ అంటోంది. ‘మార్నింగ్‌ వాక్‌కి వెళ్ళేటప్పుడు తలుపు దగ్గరగా వేసి వెళ్ళచ్చు కదా’ ! ‘ఎవరిని అంటున్నావు’ అన్నా జయతో. ‘ఇంకెవరిని మావయ్య గారినే! తలుపులు బార్లా తెరిచేసి వెళ్లారు’ అంది.

నేను ఆఫీసుకి వెళ్ళేటప్పటికి కూడా నాన్న రాలేదు. ఆ.. ఎవరో ఫ్రెండ్స్‌ కనిపిస్తే బాతాఖాని కొడుతూ ఉండిపోయి ఉంటారు అనుకొని ఆఫీసుకి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన కొద్దిసేపటికే జయ ఫోన్‌ చేసింది. ‘ఏవండీ మీ నాన్నగారు ఇంకా ఇంటికి రాలేదు. నాకు ఎందుకో గాబరాగా ఉంది’ అంటూ. చెప్పొద్దూ ! నాకు ఏదో భయం వేసింది. వెంటనే ఆఫీస్‌ నుండి ఇంటికి వచ్చేశాను. అక్కడ జయ, ఇంకా పక్కింటి వాళ్ళు అందరూ తలో మాట మాట్లాడు తున్నారు. అక్కడున్న ఎవరో ‘పోనీ పోలీస్‌ రిపోర్ట్‌ ఇవ్వండి’ అంటే అక్కడకు పరుగెత్తాను. వెంట నాన్నగారి ఫోటో కూడా తీసుకొని వెళ్ళమన్నారు. ఇవన్నీ అయ్యేసరికి రాత్రి అయింది. ఎక్కడా నాన్న జాడ తెలియలేదు. నాతో వచ్చినవాళ్ళకి థాంక్స్‌ చెప్పి ఇక వాళ్ళని వెళ్ళమన్నాను.

అలా ఇంట్లోకి వచ్చి చెప్పులు విప్పుతుండగా డోర్‌ కొట్టిన శబ్దమైంది. జయ వెళ్లి తలుపు తీసింది. ‘మీరా డాక్టర్‌ గారు, రండి’ అని లోపలికి పిలిచింది. ఆయన మౌళి గారు. మా వీధి చివరన ఉంటారు. ఆయన డాక్టర్‌. జస్ట్‌ ముఖ పరిచయమే మాకు. ఈవేళప్పుడు ఎందుకు వచ్చారో? అసలే నాన్న కనిపించటం లేదనే ఆదుర్దాలో ఉన్నాం అనుకున్నాను.

ఆయనే లోపలకి వచ్చి సోఫాలో కూర్చొంటూ అన్నాడు ‘మిస్టర్‌ రమేశ్‌ ! ఐ నో. మీ ఫాదర్‌ మిస్సింగ్‌ అని తెలిసింది. దాని గురించే మాట్లాడదామని వచ్చాను. బహుశా ఒక నెల క్రితం అనుకుంటా ! మీ నాన్నగారిని పలకరిస్తే ఎవరో కొత్త మనిషిని చూసినట్లు చూశారు. సర్లే ఏదో ధ్యాసలో ఉండి గుర్తుపట్టలేదేమో అనుకున్నా ! బహుశా పది రోజుల క్రితం అనుకుంటా మరోసారి కనిపించారు. నేను డిన్నర్‌ చేసి పార్క్‌ దగ్గర నడుస్తుంటే ఆయన పార్క్‌ గేటు దగ్గర నించొని అటు ఇటూ చూస్తున్నారు. ‘ఇదేమిటీ ఈ టైంలో ఇక్కడున్నార’ని అడిగా. చెప్పొద్దూ ! కొద్దిగా అనుమానం వేసింది. ‘ఏంటి సర్‌ డిన్నర్‌ అయి, నాలా వాకింగ్‌కి వచ్చారా’ అని పలకరించా. సమాధానం చెప్పడానికి ఆయన ఏదో తడబడ్డారు. పెద్దాయన కదా ! అందులో మీ మదర్‌ కూడా పోవటంతో డల్‌గా ఉండి ఉంటారని, ‘రండి సర్‌ నేను అటే వెళుతున్నాను’ అని మీ ఇంటి దగ్గర ఆయనని వదిలేసి వెళ్ళాను. కానీ ఒక డాక్టర్‌గా ఆయన ప్రవర్తన నాలో అనుమానం రేకెత్తించింది. వెంటనే ఈ లక్షణాలన్నీ నా స్నేహితుడికి చెప్పి కనుక్కుంటే అతను నా అనుమానం నిజమే అని నిర్ధారణ చేశాడు. ఈ మధ్య కొన్ని దేశాలలో ప్రతీ 70 సెకన్లకు కొత్తగా ఒకళ్ళకి అల్జీమర్‌ (మతిమరుపు వ్యాధి) సోకుతుందని కనుక్కుంటున్నారు. దీనికి మందు లేదు కానీ ముందరగా గుర్తిస్తే త్వరగా రాకుండా చూడవచ్చు. ఇదంతా ఒక్క రోజులో జరగదు. కానీ లక్షణాలు ముందు ముందు తెలుస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళని ఒంటరిగా ఎప్పుడూ ఉంచకూడదు. ఆ విషయమే మిమ్మల్ని కలిసి చెబుదామనుకున్నాను. కుదరలేదు. నేను మెడికల్‌ కాన్ఫరెన్స్‌కి వెళ్ళాల్సి వచ్చింది. వచ్చేసరికి ఈ సంగతి తెలిసింది. అందుకే వెంటనే మీకు చెప్పాలని వచ్చాను. ఒక్క సంగతి రమేశ్‌ గారు ! ఇన్ని రోజులలో అస్సలు మీ నాన్నగారు ఎలా ఉంటున్నారనేది మీరు గమనించలేదా?’ అని అడిగారు. ఆ ప్రశ్నకు ‘లేదు’ అని చెప్పడానికి ఎంతో సిగ్గు పడిపోయాను.

అది చూసి ఆయన ఇంక ఏమి అనలేక ‘డోంట్‌ వర్రీ ! తప్పకుండా దొరకుతారు మీ ఫాదర్‌’ అంటూ వెళ్ళిపోయారు.

ఆ తరువాత నాకు జయకి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. నువ్వంటే నువ్వని ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు ఎంచుకున్నాం. దానివల్ల ఫలితం శూన్యం. ఒక్క మా ఆవేశాలు బయట పడ్డం తప్ప.

ఎందుకు బయటకు వెళ్లారో, ఎక్కడికి వెళ్లారో అనే బాధ నా గుండెను పిండేస్తోంది. ఆలా నాన్న కోసం గంటలు, రోజులు, వారాలు, నెలలు, రెండు సంవత్సరాలు వెతికినా ప్రయోజనం లేకపోయింది. పోలీసులు కూడా చేతులెత్తేశారు.

తల్లితండ్రులతో కలిసే ఉన్నామని ఎంతో గొప్పగా చెప్పుకోవడం కాదు. వాళ్ళని మనం సరిగ్గా చూసుకుంటున్నామా? లేదా? అని మనలని మనం ప్రశ్నించుకోవాలి. నాన్న వేలును పట్టుకొని భయం లేకుండా నడిచిన నేను పెద్దతనంలో నా చేయిని ఆయనకి అందించలేకపోయాను. ఎంత స్వార్ధ పరుణ్ణి? నా ఉన్నతికి సోపానాలు వేసి, అసలు ఈ ప్రపంచంలో నాకు ఉనికిని ఇచ్చిన నాన్నను పోగొట్టుకున్నాను.

‘నాన్నా ఒక్కసారి కనిపించండి ప్లీజ్‌’ అని ఎన్నిసార్లు అనుకున్నానో. నాన్న కోసం రెండేళ్ల నుంచి వెతకని చోటు లేదు.

అనుకోకుండా ఓ రోజు పొద్దుట మా ఇంటి పక్క వెంకటేశం గారి మనవడు వచ్చి ‘మా తాతగారు మిమ్మల్ని ఈ నెంబర్‌కి ఫోన్‌ చెయ్యమన్నారు. మీ నాన్నగారు కనిపించారట’ అని చెప్పగానే గట్టిగా వాడిని పట్టుకొని ముద్దుపెట్టుకున్నాను. వాడు సిగ్గుపడిపోయాడు. ‘జయా నాన్న కనిపించారట!’ అని గట్టిగా అంటూ వెంటనే ఆ నెంబర్‌కి ఫోన్‌ చేశాను. అప్పుడు ఆయన ‘మీ నాన్న కాశీలో ముక్తిభవన్‌ ఆశ్రమంలో చివరి దశలో ఉన్నారు. మీరు వెంటనే బయలుదేరండి’ అని చెప్పారు. నాకు కాళ్ళు, చేతులు ఆడలేదు. వెంటనే మా బాబాయికి ఫోన్‌ చేసి చెప్పాను. ‘నువ్వు కంగారు పడకురా. నేను, పిన్ని కూడా వస్తాం. ఇదిగో ఇప్పుడే ఫ్లైట్‌లో టికెట్స్‌ కూడా బుక్‌ చేస్తున్నా’ అని ధైర్యం చెప్పాడు.

కాశీకి మూడు గంటల్లో చేరిపోయాం. ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ఆ ఆశ్రమం చేరడానికి ఒక గంట పట్టింది. అక్కడ దిగిన వెంటనే మా కోసమే ఎదురు చూస్తున్న వెంకటేశం గారు ఎదురొచ్చి ‘సారి’ అంటూ నా భుజంమీద చేతులు వేసి ‘రమేశ్‌ గారు మీరు నిబ్బరంగా ఉండాలి. ఒక్క పది నిమిషాల క్రితం మీ నాన్నగారు కన్ను మూశారు’ అని చెప్పారు.

‘నాన్నా’ అంటూ ఉన్నపాటున కూలబడ్డాను. ‘నమ్మలేను, నేను దీనికి సిద్దంగా లేను’ అంటూ ఏడుస్తుండగా, ఆ ఆశ్రమం మేనేజర్‌ మహదేవ్‌ గారు నా దగ్గరకు వచ్చి లోపలికి తీసుకెళ్లారు.

లోపలికి వెళ్లి చలనం లేని నాన్నను చూసేసరికి ఒక్కసారిగా దుఃఖం కట్టలు తెచ్చుకొంది. ఇది చూడటానికా ఇంతకాలం వెతికింది ! ‘తప్పకుండా దొరకుతారు, ఇంటికి వచ్చేస్తారు’ అనుకుంటున్న నేను నాన్న ఈ లోకం నుంచే వెళ్ళిపోయారన్న నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నాను. ‘నా నిర్లక్ష్యమే దీనంతటికి కారణం’ అనే అపరాధ భావన నన్ను నిలువెల్లా దహించేస్తోంది. తట్టుకోలేకపోతున్నాను. ‘నాన్నా, క్షమించండి’ అంటూ పుల్లల్లా అయిపోయిన ఆయన చేతులు పట్టుకొని ఏడిచేశాను. ఏడుస్తూనే ఉన్నాను. అలా ఏడుస్తున్న నన్ను బాబాయి, పిన్ని, జయ దగ్గరగా వచ్చి పట్టుకున్నారు. బాబాయి ‘లే లే, బాధపడకు. కొడుకుగా నువ్వు చెయ్యవవలసిన కార్యక్రమం ఉంది. అది చక్కగా చెయ్యి. నాన్న ఆత్మ శాంతిస్తుంది’ అన్నారు. ‘కానీ బాబాయి నాకు బాధగా ఉంది. ఇన్ని రోజులు ఆయన ఇక్కడ అనాథలా ఎవరూ లేనివాడిలా..’ అని ఏడుస్తుంటే ఆయన ఒకటే మాట అన్నారు ‘ఈ కాశీ క్షేత్రం నుంచే పై లోకాలకి వెళ్ళాలని, ముక్తి పొందాలని చాలామంది కోరుకుంటారు. అలాంటిది మీ నాన్నకి అతి సునాయాసంగా దొరికింది. ఆయన పుణ్యాత్ముడు. ఈ పవిత్ర ప్రదేశంలో విముక్తుడయ్యాడు. ఇంక నువ్వు అన్నిసార్లు అనుకోవద్దు. అయన ఆత్మ బాధ పడుతుంది’ అన్నారు.

‘అసలు ఆయన మీకు ఎలా కనిపించారు’ అని మహదేవ్‌ గారిని బాబాయి అడిగారు.

– మణి వడ్లమాని

– ఇంకా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *