కాశీపట్నం చూడర బాబు – 4

కాశీపట్నం చూడర బాబు – 4

ధార్మిక, సమాజిక నవల

జరిగిన కథ

ఉదయం తొమ్మిదిన్నర గంటలు. ఒకటో నంబరు ప్లాట్‌ఫారం మీదకి కాశీ వెళ్ళే రైలు వచ్చింది. అది మూడో తరగతి ఏసి కంపార్ట్‌మెంట్‌. రాజారావు-శ్యామల, నాగభూషణం, బామ్మగారి కుటుంబం, విజయ్‌-పద్మ, శంఖరూప, రమేశ్‌-జయ, చంద్రశేఖర దీక్షితులు, కళాశాల విద్యార్థుల బృందం, మరి కొంతమంది ఆ కంపార్ట్‌మెంట్‌లో కాశీ పట్నానికి బయలుదేరారు. బోగిలోని వారిలో కొంతమంది కుటుంబంతో ప్రయాణిస్తుంటే, కొంతమంది ఒంటరిగా వచ్చారు. అలా ఒంటరిగా కాశీకి వెళ్తున్న నాగభూషణం గారికి రాజారావు, శ్యామల దంపతులు పరిచయమయ్యారు. రాజారావు బ్యాంకులో పనిచేస్తూ రెండేళ్ల క్రితమే రిటైర్‌ అయ్యాడు. రాజారావుకు ఇద్దరబ్బాయిలు. అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. సాధారణ మధ్యతరగతిలో పుట్టిన రాజారావుకి ముగ్గురు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు. కుటుంబ బాధ్యతంతా ఆయనదే. కొన్నాళ్లకు రాజారావుకు శ్యామలతో పెళ్లైంది. కాలగర్భంలో చాలా ఏళ్లు గడిచిపోయాయి. తండ్రి తనమీద వేసిన బాధ్యతలన్నిటిని పూర్తిచేశాడు. తల్లిదండ్రుల్ని పెద్దవయసులో తన దగ్గరే ఉంచుకున్నాడు రాజారావు. మొన్నటికి మొన్న రాజారావు తన తండ్రి 75వ పుట్టిన రోజే కాకుండా 50 ఏళ్ళ పెళ్లిరోజు కూడా ఘనంగా జరిపించాడు.

ఇక చదవండి..

ఆ తరువాత కొంతకాలానికి సాంబమూర్తి గారు పోయారు. ఆయన పోయిన ఏడాదికే భ్రమరాంబ గారు కూడా పోవడంతో ఒక తరం ముగిసింది. జ్ఞాపకాలుగా గోడల మీద మిగిలిపోయారు. తల్లిదండ్రుల కర్మకాండలు రాజారావు ఉన్నంతలో ఘనంగానే జరిపించాడు.

రాజారావు పిల్లలు కూడా బాగా చదువుకొని అమెరికాలో సెటిల్‌ అవ్వడంతో రాజారావు దంపతులకి బాధ్యతలు తీరి ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చినట్లయింది. ఉద్యోగం విశ్రాంతి ప్రకటించింది. కాశీ ప్రయాణ ఏర్పాట్లు పూర్తి చేసుకొని, సాయంత్రం ఎప్పటిలాగే పార్క్‌కి వెళ్లి కూర్చున్నాడు రాజారావు స్నేహితుడి కోసం ఎదురు చూస్తూ.

రాజారావు స్నేహితుడు సత్యం. ఇద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకటో తరగతి నుండి డిగ్రీ వరకు కలిసే చదువుకున్నారు. సత్యం వాళ్ళ నాన్న ఓ లారీ డ్రైవర్‌. చాలా పేదరికాన్ని అనుభవించాడు. కడుపు నిండా తిండి కూడా ఉండేది కాదు. పైగా రోజూ తాగొచ్చి, భార్యను కొడుతుండేవాడు. బాల్యంలో ఉన్న సత్యం ఇవన్నీ తన స్నేహితుడు రాజారావుతో చెప్పుకొని ఏడ్చేవాడు. ఇద్దరూ మిడిల్‌ స్కూల్‌ నుంచి హైస్కూల్‌కి వచ్చారు. స్కూల్‌లో మాస్టర్లు సత్యం అంటే ఇష్టపడేవారు. కారణం పరీక్షలలో అతడు మంచి మార్కులు తెచ్చుకోవడమే. వయసు పెరిగే కొద్ది పరిస్థితులను ఆకళింపు చేసుకునే శక్తి కూడా ఇద్దరు స్నేహితులకి పెరిగింది.

స్నేహితులిద్దరూ ఇంటర్‌లో ఉండగా కాబోలు సత్యం తండ్రి ఎవరో అమ్మాయిని లేవదీసుకొని వెళ్ళిపోయాడు. అది తెలిసిన అవతలి వాళ్ళు ఇంటిమీద పడి నానా గోల చేశారు. పదహారు, పదిహేడేళ్ల కొడుకు ఉండగా ఇలాంటి పని చేశాడని సత్యం తల్లి అవమానం భరించలేకపోయింది. అప్పటికే ఇంచుమించుగా ఇరవై ఏళ్ళ నుంచి అతనితో బాధలు పడుతోందేమో ఇక సహించలేక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అదష్టం బాగుండి వెంటనే వైద్యశాలలో చేర్చడంతో గండం గట్టెక్కింది. ఆ తరువాత సత్యం తండ్రి గురించి వార్తలేమి తెలియలేదు. అన్ని కష్టాలలోనూ సత్యంకు రాజారావు స్నేహహస్తం అందించేవాడు. అలాగే రాజారావు గురించి కూడా సత్యానికి అన్నీ తెలుసు.

‘నిజానికి మన కుటుంబ వ్యవస్థ ఏంతో గొప్పది. కాని దాన్ని ఆస్వాదించే వాళ్ళని వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. ఒక్కో కుటుంబంలో ఒక్కో లోపం ఉంటుంది. కొన్ని కుటుంబాలలో పెద్దలవి, కొన్నిటిలో పిల్లలవి. అన్నిటిని తట్టుకుంటూ సర్దుకుపోవడం లోనే ఉంది అంతా’ అని అప్పుడప్పుడూ సత్యం రాజారావుతో అనేవాడు. వాటిని మిగతావాళ్ళేమో కాని, రాజారావు మాత్రం కచ్చితంగా పాటించాడు.

సత్యం చదువు ఇంటర్‌తో ఆగిపోవడంతో ఓ పెద్ద బట్టల దుకాణంలో అకౌంట్స్‌ రాస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. అతని భార్య అతనికి తగ్గ ఇల్లాలే. ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. వాళ్ళకు ఒక్కడే కొడుకు. కొడుకుని తనలా కాక, పెద్ద ఇంజనీరు చేయాలనేది సత్యం ధ్యేయం. సాధించాడు కూడా. క్యాంపస్‌ సెలక్షన్స్‌లో కొడుక్కి మంచి ఉద్యోగం కూడా దొరికింది. ఇక పెళ్లి చేయాలి. ఆ పనిలోనే ఉన్నారు సత్యం దంపతులు.

పార్కులో దీపాలు కూడా వెలిగాయి. పార్కులో కూర్చున్న రాజారావు ‘ఇంకా సత్యం రాలేదేమిటి చెప్మా !’ అనుకుంటుండగానే హడావుడిగా వచ్చాడు సత్యం. ‘ఒరేయ్‌ ! నీకు ఓ సంగతి చెప్పాలి. రెండురోజుల క్రితం మా ఆవిడ నన్ను అర్జెంట్‌గా హాస్పిటల్‌కి రమ్మని కబురు పెట్టింది. వెళ్లి చూద్దును కదా..! అక్కడ ఎప్పుడో వేరే అమ్మాయితో వెళ్ళిపోయిన మా నాన్న ఉన్నాడురా ! ఆయన అసలు బతికున్నాడని మేం అనుకోలేదు. ఎవరో తీసుకొచ్చి జాయిన్‌ చేశారట. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నా పేరు, అమ్మ పేరు చెప్పాడట. అది విని మా ఆవిడ నాకు కబురు పంపింది. అసలే బక్క ప్రాణి. పైగా తాగే అలవాటు. అంత తాగుడు అలవాటున్నా ఇంతకాలం బతికున్నాడంటే గట్టి పిండమే అనిపించింది. ఇంతవరకు అమ్మకి చెప్పలేదు. ఆమెకు ఈ విషయం ఈ వయసులో చెప్పాలా? వద్దా ? అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అమ్మ అభిమానం నాకు తెలుసు. ఇక జీవితంలో ఆయన మొహం చూడనని ఒట్టు పెట్టుకుంది. కాని ఇద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు. ఏం చెయ్యాలో తెలియక నిన్ను సలహా అడుగుదామని వచ్చాను’ అన్నాడు.

‘సత్యం ! ఇప్పుడు ఒక్క మానవతా దక్పథంతోనే ఆలోచించమను మీ అమ్మని’ అన్నాడు రాజారావు. తీరా ఆ రాత్రి గడవనే లేదు, ఆయన కాస్తా పోయాడు. అప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పారు. భర్త లేని బాధను అమె కొన్నేళ్ళుగా భరిస్తున్నదే. అందుకే ఈ దుఃఖాన్ని కూడా దిగమింగుకుంది. కొడుకుగా సత్యం తన బాధ్యత నిర్వహించాడు.

ఈ పనులతో అలసిపోయినట్లుగా అనిపించిన సత్యం ఎందుకైనా మంచిదని డాక్టర్‌కి చూపించు కుంటే, గుండెజబ్బు ఉన్నట్లు చెప్పారు. జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ శ్రమపడకండి అన్నారు. దూర ప్రయాణాలు కూడా మంచివి కాదని చెప్పారు. తండ్రి చితాభస్మాన్ని గంగలో కలిపే పనిని ఎలా పూర్తి చేయాలా అని ఆలోచిస్తున్న సత్యానికి రాజారావు కాశీ వెళుతున్నాడని తెలియడంతో తన తండ్రి అస్తికలను గంగలో కలపమని ప్రాధేయపడ్డాడు.

అసలే ప్రాణ స్నేహితుడు, అందులోనూ జబ్బున పడ్డాడు. అందుకే రాజారావు ‘అయ్యో ! దానిదేముందిరా సత్యం ! తప్పకుండా కలుపుతాను’ అన్నాడు. ఆ సంచీని జాగ్రత్తగా ఒక బ్యాగ్‌లో పెట్టుకున్నాడు. ఇంకా ఈ విషయం శ్యామలకి చెప్పలేదు.

అలా తమ కాశీ ప్రయాణం కోసం రైలెక్కారు రాజారావు, శ్యామల దంపతులు.

– — – – – – – –  – –

రమేష్‌, జయ దంపతులు

‘కొన్ని విషయాలు ఎవరికీ చెప్పలేం, తలచుకోవడం తప్ప’ అనుకున్నాడు రమేష్‌. ఏసిలో కూడా చెమటలు పడుతున్నట్లుగా, గాలి ఆడనట్లుగా ఉంది అతనికి. అన్నిటికంటే మనసు వేగమంటారు. కానీ కాలం అనాలేమో ! ఎందుకంటే అంత వేగంగా మార్పులొచ్చాయి తన జీవితంలో.

సరిగ్గా కిందటేడాది ఇలాగే కాశీ ప్రయాణం చేయాల్సి వచ్చింది. కాని ఇప్పుడంత కూల్‌గా కాదు. అప్పుడు విషాద సమయం. ఆ విషాదం మనసును వీడటమే లేదు. పైగా నిన్నా మొన్న జరిగినట్లుగా అనిపిస్తోంది రమేష్‌కి.

ట్రైన్‌ ముందుకెళుతుంటే, రమేష్‌ మనసు ఏడాది వెనక్కెళ్ళింది.

‘నాన్న విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. అమ్మ కొంతకాలం టీచర్‌గా పని చేసి మానేసింది. నేను ఒక్కణ్ణే కావటంతో గారాబంగా పెరిగాను. ఆడింది ఆట పాడింది పాట. అయినా చదువులో చురుకుగా ఉండేవాణ్ణి. ఉన్న ఊళ్లోనే అమ్మ వైపు, నాన్న వైపు బంధువులుండటంతో ఫ్యామిలీ ఫంక్షన్స్‌కు కూడా తరచూ వెళ్ళేవాళ్ళం. చదువులో ఎప్పుడూ ముందుండే నేను శ్రద్ధగా చదివి ఇంజనీరింగ్‌ చేశాను. ఇక్కడే కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కాలంతో పాటు జరిగే సహజ సన్నివేశం పెళ్లి కదా ! అప్పుడే నా జీవితంలోకి వచ్చింది జయ.

కొంతకాలానికి మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు, సాకేత్‌, రోహిత్‌. నాన్న కట్టించిన సొంత ఇల్లు ఉంది. నాన్నకి బోలెడు పెన్షన్‌ వచ్చేది. దాన్ని వాళ్ళ యాత్రలకి వాడుకోమనే వాణ్ణి. పెద్దగా ఖర్చుకూడా ఉండేది కాదు.

సాకేత్‌, రోహిత్‌ కూడా కళాశాల చదువుల కొచ్చారు. ఇద్దరినీ హాస్టల్‌లో పెట్టి చదివిస్తున్నాను. ఆ తరువాత వాళ్ళని పై చదువుల కోసం అమెరికా పంపాలనేది జయ ప్రగాఢమైన కోరిక.

రోజులన్ని ఒకేలా ఉంటే అది జీవితం అవదు. కొన్ని సంఘటనలు పెద్ద కారణాలు లేకుండానే జరుగుతాయి. కానీ వాటి పరిణామం మటుకు తీవ్రంగా ఉంటుంది.

నా పెళ్ళై, ఇద్దరు పిల్లలతో రోజులు హాయిగా గడస్తున్న సమయంలో ఉన్నట్టుండి ఓ రోజు అమ్మ గుండెలో నొప్పి అనడంతో డాక్టర్‌ దగ్గరకి తీసుకెెళ్లారు నాన్న. కాని తిరిగొచ్చేటప్పుడు ప్రాణం లేని అమ్మని తీసుకొచ్చారు. హాస్పిటల్‌లో చెక్‌ చేస్తుండగానే మరో పెద్ద ఎటాక్‌ వచ్చి పోయిందని చెప్పారు. అది పెద్ద షాక్‌ మాకు. నాన్నకైతే కోలుకోలేని దెబ్బ. ఈ విశాల విశ్వంలో దూరాన్ని కొలవటానికి కాంతి సంవత్సరాలు కొలబద్దయితే మనిషి గుండెల్లో ఉప్పొంగే బాధను కొలవటానికి ఉబికి వచ్చే కన్నీరే కొలబద్ద.

అమ్మ పోయినప్పటినుంచి నాన్న బాగా డల్‌ అయ్యారు. స్తబ్దుగా ఉంటున్నారు. మానసికంగా కుంగిపోయారు. ఎక్కువ సమయం ఒంటరిగా గడపటానికే ఇష్టపడేవారు. ఆయనే ఒక్కరే కూర్చొని ఏడవడం ఎన్నోసార్లు చూశాను.

‘కాలం ఏ గాయాన్నైనా మాన్పుతుంది’ అనే వేదాంత ధోరణిలో ఆయన్ని ఒంటరిగా వదిలేశాను. అలా వదలకుండా ఆయన మనసులో బాధని పంచుకుని ఉంటే నాన్న అలా అయే వారు కాదేమో ! అసలు ఇంట్లో ఏం జరుగుతోందో చూడక పోవటం నా బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం.

అన్నీ సక్రమంగా నడుస్తుంటే, లోపాలు బయట పడవు. అలాగే కొన్ని విషయాలు రోజూ చూస్తూనే ఉంటాం. జరిగే మార్పులను గమనించలేం. నాన్న విషయంలో జరిగింది అదే.

ఒక రోజు జయ నా దగ్గరకు వచ్చి నాన్న మీద కంప్లైంట్‌ చేసింది ‘మీ నాన్నగారికి ఇందాకే చపాతీలు పెడితే ‘నేను తినలేదు’ అంటున్నారు. అయినా పెద్దాయన అలా అబద్ధం ఆడటం ఏంటి ? కావాలంటే నేను మరో రెండు పెట్టనా ?’ అంటూ నన్ను నిలదీసింది.

– ఇంకా ఉంది…

– మణి వడ్లమాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *