కాశీపట్నం చూడర బాబు – 19

కాశీపట్నం చూడర బాబు – 19

ధార్మిక, సమాజిక నవల

జరిగిన కథ

నాగభూషణంగారు భార్య పోయి, ఒంటరివాడై శేష జీవితాన్ని కాశీలో గడుపుదామని; రాజారావు, శ్యామల దంపతులు కాశీ చూడాలనే కోరికతోనూ; జయ, రమేష్‌ దంపతులు రమేష్‌ తండ్రిగారి సంవత్సరీకం పనిమీద; విజయ్‌ని ఆవహించిన నిరుత్సాహాన్ని తొలగించడానికి విజయ్‌, పద్మ దంపతులు; తల్లి అస్తికలను కాశీలో కలపడానికి శంఖరూప, తన మనుమళ్ళతో బామ్మగారు, చంద్రశేఖర దీక్షితులు రైలులో కాశీ వెళుతున్నారు. వీరితోపాటు ఒక యువబృందం కూడా కాశీ వెళుతున్నారు. అదే రైలులో యోగిగా మారిన గౌతమ్‌ గ్రూప్‌ అఫ్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ అజయ్‌ గౌతమ్‌ కనిపించాడు. దీక్షితులను నాగభూషణంగారు, విజయ్‌ జాగ్రత్తగా చూడాలనుకున్నారు.

రైలు కాశీ చేరింది. అందరూ దిగారు. కృష్ణశాస్త్రిగారి మనిషి చంద్రశేఖర దీక్షితులను, నాగభూషణం గారిని తనవెంట తీసుకెళ్ళాడు. నాగేంద్ర అందరినీ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్ళి, అక్కడ నుండి గుడికి తీసుకెళ్ళాడు. శివ దర్శనం, శిఖర దర్శనం చేయించాడు. గంగా హారతి చూశారు. అదొక అద్భుత దృశ్యం. అప్పటికి రాత్రి అవటంతో భోజనాలు చేసి, గెస్ట్‌హౌస్‌కి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. తెల్లారాక గంగా స్నానానికి బయలుదేరారు.

అక్కడ గంగలో శంఖరూప తన తల్లి అస్థికలను, రాజారావు తన స్నేహితుడి తండ్రి అస్థికలను కలిపి, స్నానం పూర్తి చేశారు. బామ్మగారు తన సంచిలోని వస్తువులను గంగలో కలిపి పెద్దగా ఏడ్చింది. ఏమైందని అందరూ అడగటంతో తనను తన పిల్లలు వదిలేశారని, మోహన్‌ దంపతులు తనను సొంత మనిషిలా చూసుకున్నారని, ఇక ఈ భారం వారికొద్దని, తనను కాశీలో వదిలెయ్యమని అంది. అది విని అందరూ బాధపడ్డారు. వసంత బామ్మగారు తమవద్దకు ఎలా వచ్చారన్న విషయం చెప్పింది. రమేష్‌ తన తండ్రిని గుర్తు తెచ్చుకుని బాధపడ్డాడు.

ఇంతలో నాగేంద్ర ‘బ్రేక్‌ఫాస్ట్‌ చేద్దాం’ అంటే విజయ్‌ ‘ప్యాక్‌ చేయించి తీసుకెళదాం’ అంటూ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడికి నాగభూషణం గారు, చంద్రశేఖర దీక్షితులు వచ్చి ఉన్నారు. అంతా విన్నట్లుగా వాళ్ళ ముఖ కవళికలు చెబుతున్నాయి.

ఇక చదవండి..

అప్పుడు నాగభూషణంగారు బామ్మగారితో ‘అమ్మా! మిమ్మల్ని నేను ఆశ్రమానికి తీసుకెళ్తాను. నిజానికి నేను కూడా అన్నీ తెంచుకొని నా శేషజీవితం ఇక్కడే గడపాలని నిశ్చయం చేసుకుని వచ్చాను. కాబట్టి, మీకు తోడుగా ఉంటాను’ అన్నారు.

అది విన్న బామ్మగారు ‘అయ్యా ! మీరు సాటి మనిషిగా చూపించే ఈ గౌరవం, అభిమానం చాలు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను’ అనగానే,

‘అమ్మా! మీరు మా మోహన్‌కి తల్లి వంటివారు. వారు మిమ్మల్ని నాకు అప్పగించారు. కనుక మీరు వినక తప్పదు’ అంటూ మోహన్‌ వైపు తిరిగి…

‘మోహన్‌గారూ ! మీరు నిశ్చింతగా ఉండండి. ఆవిడని నా సొంత అక్కయ్యలా చూసుకుంటాను. అంతేకాదు, మీరు చేసినది ఎంతో మంచి పని. మీ మంచి మనసుని దేనితోను కొలవలేము’ అంటూ నాగభూషణం గారు విజయ్‌ వైపు తిరిగి,

‘విజయ్‌… నేను కష్ణశాస్త్రిగారితో అన్ని విషయాలూ చెప్పాను. ఆయన ‘సరేనండి, మా సుబ్బన్న బాధపడుతుంటే ఏదోక దారి చూపిస్తాలే అన్నాను. ఆ మాట విని పాపం తన కొడుకుని ఇంత దూరం పంపించాడు. పిల్లాడు బాగుపడతాడంటే సంతోషమే. అదీకాక మీ అంతట మీరు వాడి బాధ్యత తీసుకోవడం చాలా బావుంది’ అన్నారు. వెంటనే చంద్రశేఖరం నాన్నగారికి ఫోన్‌ చేసి ఇద్దరం మాట్లాడాం. ముందు ఆయన ఒప్పుకోలేదు. అప్పుడు అతని ఉత్తరం చదివి వినిపించాను. ఆ విషయం విన్న ఆయన కంగారుపడి ఏడ్చేశారు. నేను, కష్ణశాస్త్రి గారు ఇద్దరం ధైర్యం చెప్పి ఆయనతో ”మీరు బెంబేలు పడొద్దు. మీ కొడుకు మీ కళ్ళముందే ఉంటాడు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్న వ్యక్తి విజయ్‌ గారు” అని మీ వివరాలు ఇచ్చాం’ అని ముగించారు.

‘పెద్దవారు మీరు చాలా శ్రమ తీసుకున్నారు. తప్పకుండా ఆ అబ్బాయిని చదివించి, ఉద్యోగం చేయించే బాధ్యత నాది’ అంటూ ‘చంద్రా! ఇలా రా, నేను మీ బ్రదర్‌ లాంటి వాడిని, నీకు ఏ కోర్స్‌ ఇష్టమైతే అదే చేద్దువుగాని సరేనా !’ అని ప్రేమగా దీక్షితులు భుజం తట్టాడు విజయ్‌.

అప్పుడు చంద్రశేఖరం చలించిపోయాడు. జరిగిన పరిణామాలకి ఆ లేత మనసు తట్టుకోలేక పోయింది. ఇప్పుడు ఒక ఆత్మీయమైన ఆలంబన దొరికేసరికి ఒక్కసారిగా ఏడ్చేశాడు. విజయ్‌ని తన చేతులతో చుట్టేసి గట్టిగా హత్తుకున్నాడు. విజయ్‌ కూడా ఎంతో సంతోషించి దీక్షితులను ఓదార్చాడు. కొంతసేపటికి దీక్షితులుకి ఏడ్పు తగ్గి, జీవితం మీద ఆశ చిగురించింది. ఆ ముఖంలో సంతోషం కనిపించింది.

అప్పటి నుంచి ఇదంతా చూస్తున్న విజయ్‌ భార్య పద్మ ఎంతో సంతోషించి, ఫోన్‌ తీసి అత్తగారికి జరిగిన విషయాలన్నీ చెప్పింది.

ఇక అందరూ నెమ్మదిగా గెస్ట్‌హౌస్‌ వైపు నడవసాగారు.

దారిలో వెళుతుండగా శ్యామల అడిగింది రాజారావుని ‘ఏవండీ ! ఈ నాగేంద్ర మనకి ఇన్ని చేస్తున్నాడు కదా ! అతనికి డబ్బులు హోటల్‌ వాడు ఇస్తాడా ! లేకపోతే మనమే ఇవ్వాలా ! అంది.

రాజారావు ‘అదే ఇంకా నువ్వు అడగలేదేంటా అనుకుంటున్నాను. మనమే ఇచ్చుకోవాలి. మనం తెలుగువాళ్ళం కాబట్టి తెలుగు వాడిని అరేంజ్‌ చేశారు. ఎందుకంటే ఈ గెస్ట్‌హౌస్‌కి ఇతను కస్టమర్స్‌ని తెస్తే వాడికి కమీషన్‌ ఉంటుంది’ అన్నాడు.

అప్పటికి ఉదయం ఎనిమిది గంటలు దాటి పోయింది.

‘ఇవాళ కొంత కాశీ కవర్‌ చేద్దాం’ అన్నాడు నాగేంద్ర. ‘అలాగే !’ అని అందరు ప్యాక్‌ చేయించి తెచ్చుకున్న అల్పాహారం తిని, తయారై వచ్చారు.

నడుచుకుంటూ చౌరస్తా దగ్గరకు వెళ్ళేసరికి వాన్‌ సిద్ధంగా ఉంది.

ముందు క్షేత్రపాలకుడైన కాలభైరవుణ్ణి దర్శించు కున్నారు. లోపల ఇరుకు సందులలోకి వెళుతుంటే అక్కడ ఉన్న కుక్కలని చూసి శంఖరూపకి చాలా భయం వేసింది.

అక్కడ నుంచి సారనాథ్‌లోని బుద్ధ విగ్రహం, అశోక స్తూపం చూసి, అక్కడ నుంచి బెనారస్‌ హిందూ యూనివర్సిటీకి వెళ్లారు. అది మొత్తం వాన్‌లోంచే చూసేశారు. అందులో ఉన్న బిర్లామందిర్‌ వద్ద మటుకు దిగి చూసి, ఫోటోలు తీసుకున్నారు.

పనిలో పనిగా తులసీదాసు మందిరాన్ని కూడా చూసొచ్చేసరికి మధ్యాహ్నం మూడైంది. అందరూ అలసిపోవడంతో తిరుగుముఖం పట్టారు. చౌరస్తా నుంచి మళ్ళీ నడక.

వాళ్ళు భోజనాలు చేసి, గెస్ట్‌హౌస్‌కు చేరేవరకు వచ్చి ‘రేపు నేను రాను, డ్రైవర్‌ మిమ్మల్ని గయ తీసుకెళ్తాడు’ అని చెప్పి వెళ్ళిపోయాడు నాగేంద్ర.

— — —

మరునాడు జయ, రమేశ్‌ తప్ప మిగతా అందరూ గయ బయలుదేరారు. జయ, రమేష్‌లు వాళ్ళతో వెళ్ళకుండా ‘వెళ్ళే రోజున నేరుగా స్టేషన్‌కి వస్తాం’ అని చెప్పి కేదార్‌ఘాట్‌ దగ్గరున్న కష్ణశాస్త్రి గారింటికి వెళ్ళిపోయారు.

ఈ నాలుగు రోజుల్లోనూ గయా, అలహాబాద్‌, వ్యాస కాశీ, పోర్టు చూశారు. చాల బావుంది లోపల. కాశీ కోటలో వేదవ్యాస మహర్షి ఆలయం ఉంది. ఈ ప్రాంతాన్ని వ్యాస కాశీ అంటారు.

‘ఈ కోటను ‘రాం బాగ్‌’ అని కూడా అంటారు. భారతదేశ రెండవ ప్రధానమంత్రి లాల్‌ బహదూర్‌ శాస్త్రి నివశించిన ప్రదేశమే ఇది. ఆయన ఇల్లు ఇక్కడే ఉంది. రోజూ నెత్తిమీద పుస్తకాలు పెట్టుకొని అక్కడి నుంచి గంగానది ఈదుకుంటూ కాశీ వచ్చి చదువుకొని, మళ్ళీ సాయంత్రం ఈదుకుంటూ వ్యాస కాశీ చేరేవారు శాస్త్రీజి. వ్యాస మహర్షిని విశ్వనాధుడు కాశీని వదిలిపొమ్మని శపిస్తే ఇక్కడికి చేరాడు. అందుకే వ్యాస కాశీ అయింది’ అని గైడ్‌ చెప్పాడు.

ఆ మూడు రోజులు నాగేంద్ర రాలేదు కానీ ఏర్పాట్లు చేసాడు.

వ్యాస కాశీలో తెల్లారగట్ల జరిగే అభిషేకం చూసి, వారాహిని కూడా దర్శించుకున్నారు. ఆవిడ కూడా క్షేత్ర పాలికే. గుడి కూడా ఉదయం ఒక్క గంట మాత్రమే తెరచి ఉంచుతారు. ఆవిడ కింద భూగహంలో ఉంటుంది. భక్తులు కిందకి వంగుని రెండు కిటికీల ద్వారా చూస్తారు.

ఈ నాలుగు రోజులు అన్నీ తిరగడంతో సమయం తెలియకుండానే గడచిపోయింది.

చివరి రోజున రాజారావు, శ్యామల, బామ్మగారు, మోహన్‌, వసంత, చంద్రశేఖరం గంగా స్నానాలు చేసి, తమ వద్దున్న క్యాన్లు, బాటిళ్ళలో గంగతీర్థం పట్టుకొచ్చారు.

తరువాత అందరూ షాపింగ్‌ మొదలెట్టారు. లక్క సామాను చాలా బాగుంది. కాశీ చెంబులు, కాశీ తాళ్ళు, బుద్ధుడి బొమ్మలు, బెనారస్‌, కాటన్‌, సిల్క్‌, పట్టు చీరలు మన్నికైనవి జాగ్రత్తగా చూసుకొని మరీ కొనుక్కున్నారు.

ఆ రోజు మధ్యాహ్న భోజనం కాశీ అన్నపూర్ణ ఉచిత భోజనశాలలో చేశారు. గెస్ట్‌హౌస్‌లో ఎవరి పేమెంట్‌ వాళ్ళు చేసేశారు.

మళ్ళీ నాగేంద్ర వాళ్ళని కలిసి, ఒక ఇన్నోవా తీసుకొచ్చాడు అందరినీ స్టేషన్‌లో దింపడానికి.

బామ్మగారిని నాగభూషణం గారు ఉంటున్న ఆశ్రమంలో దింపేసి, బయలుదేరారు మోహన్‌, వసంత, వాళ్ళ పిల్లలు.

శ్యామల ఇంచుమించుగా వారం రోజుల నుంచి శంఖరూపని గమనిస్తోంది. ‘అమ్మాయి డ్రెస్‌లు మోడరన్‌గా ఉన్నా మనిషి చాలా పద్ధతిగా ఉంది. ఊరు వెళ్ళిన వెంటనే ఏదైనా చక్కటి సంబంధం చూడాలి ఈ అమ్మాయికి’ అనుకుంది.

ఇక విజయ్‌ దష్టి అంతా చంద్రశేఖర్‌ దీక్షితుల మీద ఉంది. ఈ కాశీ ప్రయాణం అతనిలోని నిర్లిప్తతని పటాపంచలు చేసింది. అంత చిన్నపిల్లాడు బతుకు తెరువు కోసం ఇంత దూరం వచ్చాడు. ఆత్మహత్య చేసుకుందామనేంత నిరాశలో ఉన్న అతనికి బతుకు మీద ఆశ కలిపించగలిగాడు తను.

అప్పుడు అనిపించింది విజయ్‌కు.. ‘ఒక మనిషికి సాయం చేయడమంటే మనలోని ఆత్మను సంతప్తి పరచడమే’ అని. అందుకే తనలోని నిర్లిప్తత, స్తబ్దత పోయి, ఉత్సాహం వచ్చింది అనుకున్నాడు.

విజయ్‌లో వచ్చిన మార్పు గమనించిన పద్మ ‘అమ్మయ్య ! ఇక నిశ్చింతగా ఉండొచ్చు’ అనుకుంది.

ఇంతలో శంఖరూప సెల్‌ మోగింది. గౌతమ్‌ వాళ్ళ నాన్నగారి కేర్‌ టేకర్‌ ఫోన్‌ చేసాడు.

‘కంగారు పడండి మేడం. పెద్ద సారుకి కొద్దిగా మతిమరుపు తగ్గింది. వాళ్ళ కోడలు, పిల్లలు హైదరాబాద్‌ వచ్చేశారు. ఆయన ఇప్పుడు బాగున్నారు. అది మీకు వెంటనే చెబుదామని ఫోన్‌ చేశాను’ అన్నాడు.

‘ఓహ్‌.. నిజంగా ! గ్రేట్‌ న్యూస్‌. ఇదిగో ఇవాళ బయలుదేరుతున్నాను. రేపు రాత్రికి వచ్చేస్తాను’ అంటూ ఫోన్‌ ఆఫ్‌ చేసి, ‘హమ్మయ్య ! అంకుల్‌ మళ్ళీ మామూలు మనిషి అవుతున్నారు, ఇప్పుడు హాయిగా ఉంది’ అనుకుంది.

సాయంత్రం అందరూ స్టేషన్‌లో ప్లాట్‌ ఫారం మీద రైలు కోసం ఎదురు చూస్తున్నారు.

ఒకళ్ళకొకళ్ళకి ముఖ పరిచయం లేని వాళ్ళని ఒక కుటుంబంలా కలిపింది ఈ ప్రయాణం.

చెప్పాలంటే వీళ్ళు రాగద్వేషాలకి అతీతులేం కారు. అందరిలోనూ అన్ని రకాల స్పందనలూ ఉన్నాయి. అయితేనేం ఈ ప్రయాణం అందరినీ ఒకటి చేసింది.

కాశీకి చేరిన కథల్లో కొన్ని ముగింపుకి వస్తే కొన్ని ఇక్కడ ప్రారంభమయ్యాయి.

ఈ ప్రయాణం తరువాత తమ సమస్యలు తీరాయని అందరూ అనుకున్నారు. దాంతో ఇప్పుడు అందరి ముఖాలలోను ఓ తప్తి, ఆనందం కనిపిస్తున్నాయి.

అందరి కళ్ళముందు శివుడు, పార్వతి, గంగ ముగ్గురూ త్రివేణి సంగమంలా దర్శనమిస్తున్నారు.

ఇదో జీవన ప్రవాహం.

ఈ గమనం తరతరాల నుండి, యుగాయుగాల నుండీ సాగుతూనే ఉంది.

  మణి వడ్లమాని

– అయిపోయింది.