కాశీపట్నం చూడర బాబు – 18

కాశీపట్నం చూడర బాబు – 18

ధార్మిక, సమాజిక నవల

జరిగిన కథ

నాగభూషణంగారు భార్య పోయి, ఒంటరివాడై శేష జీవితాన్ని కాశీలో గడుపుదామని; రాజారావు, శ్యామల దంపతులు కాశీ చూడాలనే కోరికతోనూ; జయ, రమేష్‌ దంపతులు రమేష్‌ తండ్రిగారి సంవత్సరీకం పనిమీద; విజయ్‌ని ఆవహించిన నిరుత్సాహాన్ని తొలగించడానికి విజయ్‌, పద్మ దంపతులు; తల్లి అస్తికలను కాశీలో కలపడానికి శంఖరూప, తన మనుమళ్ళతో బామ్మగారు, చంద్రశేఖర దీక్షితులు రైలులో కాశీ వెళుతున్నారు. వీరితోపాటు ఒక యువబృందం కూడా కాశీ వెళుతున్నారు. అదే రైలులో యోగిగా మారిన గౌతమ్‌ గ్రూప్‌ అఫ్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ అజయ్‌ గౌతమ్‌ కనిపించాడు.

ఇంతలో నాగభూషణంగారు, విజయ్‌ దీక్షితులు ఆత్మహత్య చేసుకుంటానంటూ రాసిన ఉత్తరం చదివి, అతన్ని జాగ్రత్తగా చూడాలనుకున్నారు.

రైలు కాశీ చేరింది. అందరూ దిగారు. కృష్ణశాస్త్రిగారి మనిషి చంద్రశేఖర దీక్షితులను తన వెంట తీసుకెళ్ళాడు. వారితో నాగభూషణం గారు కూడా వెళ్ళారు. నాగేంద్ర అందరినీ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్ళాడు. అక్కడ నుండి గుడికి బయలుదేరి, శివుణ్ణి, ఆ తరువాత శిఖరాన్ని దర్శించుకున్నారు. అక్కడి నుండి గంగా హారతికి బయలుదేరి, అక్కడ ముందుగా ఘాట్స్‌ చూశారు. మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్స్‌ వచ్చినప్పుడు అందరూ నమస్కారం చేసుకున్నారు. ఇంతలో నాగభూషణంగారు విజయ్‌కి ఫోన్‌ చేసి వస్తున్నానని చెప్పారు. అనంతరం గంగా హారతి చూశారు. అదొక అద్భుత దృశ్యం. మీరాబాయి కీర్తనతో మొదలయిన హారతి కార్యక్రమం పూర్తవ్వడానికి గంట సమయం పట్టింది. అది చూడటానికి భారతీయులకంటే విదేశీయులే ఎక్కువ వచ్చారు. వాళ్ళలో అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు. రాత్రి అవటంతో వెంటనే భోజనాలు చేసి, గెస్ట్‌హౌస్‌కి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. తెల్లారాక గంగా స్నానానికి బయలుదేరారు. చలిగా ఉండటంతో మధ్యలో మట్టి పిడతలలో చాయ్‌ తాగారు. అప్పుడు కాస్త చలి తగ్గినట్లనిపించింది. తరువాత 15 నిముషాల్లో ఘాట్స్‌ చేరారు. అక్కడికి బామ్మగారు తన సంచీని, శంఖరూప, రాజారావులు అస్థికలను తెచ్చారు.

ఇక చదవండి..

అక్కడకి అప్పటికే కష్ణ శాస్త్రి గారు పంపిన ఇద్దరు పురోహితులు వచ్చేశారు. నాగేంద్ర వాళ్లతో మాట్లాడాడు.

మొత్తం అన్ని కార్యక్రమాలు అయ్యేసరికి రెండు గంటలు పట్టింది.

శంఖరూప తల్లి అస్థికలు గంగలో కలుపుతూ ‘అమ్మా! నువ్వు కోరుకున్నట్లుగా నేను పెళ్లి చేసుకుంటాను. నీ మాట వింటాను. బాలత్త నన్ను జాగ్రత్తగా చూసుకుంటోంది’ అని మనసులోనే తల్లికి చెప్పుకుంది.

‘ఇది ఏనాటి ఋణానుబంధమో, తను చూడని, తనకు తెలియని సత్యం తండ్రి అస్థికలను కలిపాను’ అని నమస్కరించి మూడు మునకలు వేశాడు రాజారావు.

ఆ కార్యక్రమం పూర్తి చేసిన తరువాత మళ్ళీ వచ్చి భార్య శ్యామలతో పాటు స్నానం చేసి సంకల్పం, అర్ఘ్యర ఇవ్వడం లాంటివి చేశాడు. శ్యామల గంగలో మునక వేస్తూ పులకించింది.

విజయ్‌, పద్మ కూడా పరమ పావని అయిన గంగలో మునిగి భక్తితో నమస్కరించారు. పద్మ అయితే మనసులో ‘అమ్మా గంగా మాతా ! నీ దివ్య దర్శనంతో నా భర్తలో చక్కటి మార్పు వచ్చింది. అదంతా నీ చలవే ! కృతజ్ఞతలు తల్లీ !’ అని మరోమారు నమస్కారం చేసుకుంది.

జయ, రమేశ్‌ కూడా అందరితో పాటు సరిగంగ స్నానాలు చేశారు.

బామ్మగారిని రెండు పక్కలా మనవడు రిత్విక్‌, మనవరాలు నవ్య పట్టుకొని ఆవిడని నీళ్ళలో దిగమని జాగ్రత్తగా మూడు సార్లు మునకలు వేయించారు.

మూడు మునకలు వేసిన బామ్మగారు ఇక తనను వదలమని చెప్పి, రొంటిన ఉన్న తన సంచీని తీశారు. ఆ సంచీలోని వస్తువులు గంగలో కలుపుతూ గట్టిగా ఏడిచారు. ఆ పక్కనే స్నానం చేస్తూ సంకల్పం చెప్పుకుంటున్న మోహన్‌, వసంతలు అది చూసి ‘బామ్మగారికి ఏమైందో’నని ఆశ్చర్యపోతూ దగ్గరకు వచ్చారు.

అందరూ నెమ్మదిగా ఆవిడని పైనున్న మెట్ల దగ్గరకు తీసుకొచ్చి కూర్చోపెట్టారు. కొంచెం దూరంలో ఉన్న రాజారావు, శ్యామల కూడా దగ్గరగా వచ్చారు. అక్కడే ఉన్న మిగతావాళ్ళు కూడా పరిగెత్తుకొచ్చారు ఏమైందోనని.

నాగేంద్ర కూడా ‘ఏమిటి ఏమైంది’ అని అడిగాడు.

ఎవరికీ తెలియదు ఏమైందో. వసంత, నవ్య ఆవిడని పట్టుకునే ఉన్నారు.

ఇంతలో ఆ ఇద్దరు పురోహితులు వచ్చారు. కార్యక్రమాలు చేయించినందుకు వాళ్ళకు ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చి పంపించేశారు.

ఆడవాళ్ళు అక్కడ బట్టలు మార్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. వసతులు ఉన్నాయి గాని అని వాళ్ళకి నచ్చలేదు. రూమకి వెళ్లి మార్చుకుందాం అనుకున్నారు.

ఉన్నట్టుండి బామ్మగారు మోహన్‌ చేతులు పట్టుకుని ‘నాయినా మోహన్‌ ! ఇది ఏ నాటి అనుబంధమో, నువ్వు ఎవరో ? నేను ఎవరో ? ఇన్ని రోజులు నన్ను కన్న తల్లిలా చూసావు, నీ భార్య పిల్లలు కూడా నన్ను ఇంట్లో మనిషిలా ఎంతో ఆదరంగా చూసారు. ఇప్పుడు ఈ ముసలి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళకు. ఇక్కడే వదిలెయ్యి. ఎన్నాళ్ళుంటానో తెలియదు. ఇంతకాలం నా బరువు మోసింది చాలు. ఇక మొయ్యకు. ఈ బంధాన్ని ఈ కాశీలో వదిలెయ్యి’ అన్నారు.

ఆ మాటలకి అక్కడున్న వాళ్ళంతా నిర్ఘారత పోయారు. ఏంటి ఈవిడ మోహన్‌కి సొంత తల్లి కాదా ? అదేమిటి ఆశ్చర్యంగా ఉంది ! ఇలాంటిది ఎప్పుడూ వినలేదు.

అస్సలు ఎవరికి ఇంత కూడా అనుమానం రాలేదు. అయినా ఎవరనుకుంటారు ? ఆవిడ మోహన్‌ తల్లి కాదని ? పైకి ఎవరూ అనడం లేదు గాని అందరి మనస్సులోను ఇవే ప్రశ్నార్ధకాలు మెదులుతున్నాయి.

‘అమ్మా ! ఇప్పుడవన్నీ ఎందుకు మాట్లాడతారు? మీరు హాయిగా ఉండండి’ అన్నాడు మోహన్‌.

‘హాయిగానే ఉన్నాను నాయినా. అసలు వాళ్ళు నన్ను విసిరేసినా నువ్వు నెత్తిన పెట్టుకున్నావు. మనిషికి మనిషికి మధ్య రక్తసంబంధం, చుట్టరికమే అక్కరలేదు అని నిరూపించావు. ఇంకా నీకు భారం అవదల్చుకోలేదు.

ఇక్కడ ముక్తిభవన్‌ అని ఉందిట. అది కాకపోతే ఇంకా చాలా ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ నాలాంటి వాళ్ళని చేరదీసి ఇంత ముద్ద పెడతారు, నేను కన్ను మూస్తే మణికర్ణికలోనే దహన సంస్కారాలు చేస్తారు. మళ్ళీ చెబుతున్నా నాయినా ! ఇంక చాలు ఈ బరువు మొయ్యడం.

నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు నా వాళ్ళ గురించి చెప్పమని. కానీ నా మనసు ఒప్పుకోలేదు నాయినా వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ! అందరూ ఆ సంచీలో ఏమున్నాయి ? అన్నారు కదా ! అందులో నేను ఎవరో, నా ఉనికిని తెలిపే ఆనవాళ్ళు, గుర్తులున్నాయి. అందుకే వాటిని గంగలో నిమజ్జనం చేసేశాను.

ఇప్పుడు పూర్తిగా బంధ విముక్తనయ్యాను. హాయిగా ఉంది నా మనసు. ఆనందంగా ఈ విశ్వేశ్వరుడి సన్నిధిలో ఉండి ఇక్కడే ఈ పరమ పావని గంగా మాత ఒడిలో రాలిపోతాను. ఇన్ని రోజులు నన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్న మీకు నా ఆశీర్వాదాలు తప్ప ఏమీ ఇవ్వలేని పేదదాన్ని’ అంది.

ఆ మాటలకి నవ్య, రిత్విక్‌ చలించిపోయారు.

‘మీరే మా నాన్నమ్మ, ఎక్కడికీ వెళ్లొద్దు’ అంటూ ఆవిడని గట్టిగా చుట్టేసుకుని ఏడ్చేశారు.

‘అయిన వాళ్ళు, కానీ వాళ్ళు అంటూ లేరు. ఎవరు ప్రేమను అందిస్తారో వాళ్ళే మనవాళ్లు. ఇంతకంటే మనిషికి కావలసినది ఏముంది బామ్మగారు !’ పూర్తిగా విషయం తెలియకపోయినా ఆవిడని ఓదారుస్తూ అంది శ్యామల.

ఆ మాటలతో అక్కడున్న వాళ్లందరికీ అర్ధమయింది. చాలా చోట్ల జరుగుతున్న కథె ఇది అని. అనుబంధాలు, ఆత్మీయతలు మగ్యం అవుతున్న ఈ రోజుల్లో పెద్దవాళ్లను వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేయడం వింటూనే ఉన్నాము. కానీ ఇలా కళ్ళముందు కనిపించేసరికి అంతా ఒక్కసారిగా నిర్ఘారతపోయారు.

ఆవిడ కని, పెంచిన సంతానమే ఆవిడని వదిలేసి వెళ్ళారని తెలిసేసరికి అందరి మనసులు ఒక్కసారి భారమయ్యాయి.

‘అసలు వాళ్ళకి మనసెలా ఒప్పింది? కన్న తల్లిని వదిలేసుకున్న వాళ్ళు ఎంత దరిద్రులో, పుట్టగతు లుండవు’ అంటూ ఆవేశపడింది శ్యామల.

అప్పుడు వసంత చెప్పింది.

‘మొన్న కష్ణా పుష్కరాలకి వెళ్ళినప్పుడు, అక్కడ మా అత్తగారిది మావగారిది, పిండ ప్రదానం చేసి వస్తుంటే, ఈ బామ్మగారు మా దగ్గరకు వచ్చి ‘బాబు నా స్థితి చెప్పుకోవడానికి చాల సిగ్గుగా ఉంది. ఒకప్పుడు నేను బాగా బతికిన దాన్నే, పరిస్థితుల ప్రాబల్యం వల్ల సిగ్గు విడిచి అడుగుతున్నాను. రెండు రోజులయింది తిని, చేతిలో ఓ ఇరవయి రూపాయలు ఉన్నాయి. అవి కాస్త రెండు సార్లు టీ తాగేసరికి అయిపోయాయి. పాపం ఆ పోలీసు వాళ్లే కాస్త పడుకోవటానికి చోటు ఇచ్చారు. నాకు భోజనం పెట్టించు’ అని అడిగారు.

నిజం చెప్పద్దూ మాకు కడుపులో దేవినట్లయింది. ఆ తరువాత ఆవిడకి భోజనం పెట్టించి ఆవిడ వివరాలు అడిగితే ‘నాయినా, నేను చేసిన నేరం ఏమీ లేదు, ఇంత ముసలిదాన్నైనా ఇంకా బతికి ఉండటమే నా నేరం, అందుకే నన్ను వాళ్ళు కావాలని వదిలేశారు’ అని చెప్పిందే కాని వాళ్ళ పేర్లు కూడా చెప్పలేదు ఆవిడ’.

‘నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటారా ? అంటే మనం నమ్మం. కానీ ఉన్నారు. ఎందుకు టివిలోనే బోలెడుసార్లు చూపించారు. ఇంకా చాలా చోట్ల జరిగింది. ఓల్డ్‌ ఏజ్‌ హోమ్స్‌లో ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు’ అంది శ్యామల

అప్పుడు శంఖరూప అంది

‘నిజం ఆంటీ ! ఇలాంటివి చూసే పaతీవటశీశ్‌ీ ్‌శీ స్త్రశీa అనే మూవీ తీసారు’.

అప్పుడు రాజారావు అందుకుని

‘ఈ ప్రపంచం ఎంత చిత్రమైనది ! నా స్నేహితుడి తండ్రి తన భార్య, కొడుకును వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. చివరిదశలో ఆయనను ఆ కొడుకే ఆదరించాడు. చనిపోయాక వాడే కర్మ కాండలు జరిపించాడు. ఈ బామ్మగారి పిల్లలు కన్న తల్లినే వదిలేశారు. అయినా ఆ తల్లి ప్రాణం వాళ్ళని క్షమించి వదిలేసింది. ఒక్క మాట వాళ్ళ మీదకు రానీయకుండా’ అన్నాడు.

‘అప్పుడు మోహన్‌ చెప్పారు ”ఆవిడ మన ఇంట్లోనే ఉంటారు” అని.

నిజానికి ఆవిడ మాతో ఎంత బాగా కలిసిపోయారో ! ఒక్కరోజు కూడా మా ఎదురుగా కంటతడి పెట్టలేదు. ఆ మనసులో ఎంత బాధ దాచుకున్నారో ఇప్పుడే మాకూ తెలుస్తోంది’ అని చెప్పటం ముగించింది వసంత.

శంఖరూప ఆవిడ చెయ్యి పట్టుకునే ఉంది.

ఇదంతా మౌనంగా చూస్తూ ఉండిపోయారు రమేశ్‌, జయ దంపతులు. నిజానికి ఆ సంఘటన రమేశ్‌ మనసుని సూటిగా గుచ్చింది.

ఒకరకంగా ‘నువ్వూ బామ్మగారి పిల్లల్లాంటి వాడివే, కన్న తండ్రిని సరిగ్గా చూసుకోలేక పోయావు’ అని మనసు నిలదీసినట్లనిపించింది. అతని హదయంతో పాటు వాతావరణం కూడా బరువెక్కింది.

ఇంతసేపు జరిగినదంతా చూస్తున్న నాగేంద్ర ‘వెళదామా బ్రేక్‌ ఫాస్ట్‌ చెయ్యాలి కదా’ అన్నాడు.

‘ప్యాక్‌ చేయించి తీసుకెళదాం’ అని విజయ్‌ అంటూ వెనక్కి తిరిగేసరికి ఎప్పుడొచ్చారో తెలియదు గాని వాళ్ళ వెనకాలే నాగభూషణం గారు, చంద్రశేఖర్‌ దీక్షితులు నిలుచుని ఉన్నారు.

అంతా విన్నట్లుగా వాళ్ళ ముఖ కవళికలు చెబుతున్నాయి.

–  మణి వడ్లమాని

(ఇంకా ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *