కాశీపట్నం చూడర బాబు -17

కాశీపట్నం చూడర బాబు -17

ధార్మిక, సమాజిక నవల

జరిగిన కథ

నాగభూషణంగారు భార్య పోయి, ఒంటరివాడై శేష జీవితాన్ని కాశీలో గడుపుదామని; రాజారావు, శ్యామల దంపతులు కాశీ చూడాలనే కోరికతోనూ; జయ, రమేష్‌ దంపతులు రమేష్‌ తండ్రిగారి సంవత్స రీకం పనిమీద; విజయ్‌ని ఆవహించిన నిరుత్సాహాన్ని తొలగించడానికి విజయ్‌, పద్మ దంపతులు; తల్లి అస్తికలను కాశీలో కలపడానికి శంఖరూప, తన మనుమళ్ళతో బామ్మగారు, చంద్రశేఖర దీక్షితులు రైలులో కాశీ వెళుతున్నారు. వీరితోపాటు ఒక యువబృందం కూడా కాశీ వెళుతున్నారు. అదే రైలులో యోగిగా మారిన గౌతమ్‌ గ్రూప్‌ అఫ్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ అజయ్‌ గౌతమ్‌ కనిపించాడు.

ఇంతలో నాగభూషణంగారు, విజయ్‌ దీక్షితులు ఆత్మహత్య చేసుకుంటానంటూ రాసిన ఉత్తరం చదివి, అతన్ని జాగ్రత్తగా చూడాలనుకున్నారు.

రైలు కాశీ చేరింది. అందరూ దిగారు. కృష్ణశాస్త్రి గారి మనిషి రామ్మూర్తి విజయ్‌ను, చంద్రశేఖర దీక్షితులను కలిశాడు. దీక్షితుల్ని తన వెంట తీసుకెళ్ళాడు. వారితో నాగభూషణం గారు కూడా వెళ్ళారు. నాగేంద్ర అందరినీ వాన్‌లో గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్ళాడు. మధ్యలో నడిపించాడు. బామ్మగారు నడవలేక సెక్యూరిటీ వాళ్ళ కుర్చీలో కూర్చోబోతుంటే వాళ్ళు వద్దని సైగ చేశారు. ఎలాగోలా అందరూ గెస్ట్‌హౌస్‌ చేరి, మళ్ళీ గంటలో తయారయి గుడికి నాగేంద్ర వెంట బయలుదేరారు. చెప్పులు లేని కాళ్ళతో గోమయం, గోమూత్రాలు తొక్కకుండా తప్పించుకుంటూ వెళ్తున్నారు. మధ్యలో షాపుల వాళ్ళ హడావుడి ఒకటి. మొత్తానికి గుడి ముఖ్యద్వారం చేరారు. అందరూ వరుసలో వెళుతూ, రాజారావు ‘గోవిందా, గోవిందా’ అని గట్టిగా అరవడంతో అతనివంక వింతగా చూశారు జరగరానిదేదో జరిగినట్లుగా. ఇక చదవండి..

అందరూ తనను అలా వింతగా చూడటం రాజారావుకి మరింత వింతగా అనిపించింది. అంతలో ఎందుకలా జరిగిందో గ్రహించిన రాజారావు వెంటనే నాలిక కరచుకొని ‘ఓం నమః శివాయ’ అన్నాడు. ‘అయినా శివుడు, విష్ణువు ఒకటే కదా’ అని కూడా అనుకున్నాడు.

రాజారావు ‘ఓం నమః శివాయ’ అనగానే మిగతా తెలుగు వారు అందుకుని ‘ఓం నమః శివాయ’ అనుకుంటూ, దేవుణ్ణి స్మరించుకుంటూ ముందుకు వెళ్ళారు.

గుడి ముఖ్య ద్వారం దాటి లోపలికి ప్రవేశించగానే గర్భ గుడిలోకి వెళ్ళడానికి కాబోలు మూడు ద్వారాలు ఉన్నాయి. వాటిల్లోంచి భక్తులు లోపలికి వెళుతున్నారు.

చాలామంది పారవశ్యంతో ‘హర హర మహాదేవ, జై విశ్వనాధ బాబాకి’ అనుకుంటూ వెళుతున్నారు.

అందరు ఆ ఇత్తడి దడి లోంచి శివుణ్ణి దర్శనం చేసుకున్నారు. ‘ఇదివరకు అయితే శివుణ్ణి తాకనిచ్చేవారు అందరిని. ఇప్పుడు మటుకు ఒక్క తెల్లారగట్ట అయ్యే అభిషేకం అప్పుడే ముట్టుకోనిస్తున్నారు’ అని నాగేంద్ర చెప్పాడు వెనుక నుంచి.

తిరుపతిలో లాగా కాకపోయినా అక్కడ కూడా సెక్యూరిటీ వాళ్ళు జనాల్ని పక్కకి లాగుతున్నారు. రాజారావు, మోహన్‌, బామ్మగారు మిగతావాళ్ళు కూడా గట్టిగా ‘శంభో శంకరా’ అన్నారు.

రాజారావు అయితే మహా మత్యుంజయ స్తోత్రం చదువుతున్నాడు పైకే. అలా అందరూ దర్శనం చేసుకొని బయటకు వచ్చారు.

అక్కడ నుంచొని పైకి చూస్తే బంగారు గోపురం కనిపిస్తోంది. ‘ఇదిగో అందరూ శిఖర దర్శనం చేసుకోండి’ అన్నారెవరో. అందరూ గోపురం వంక చూసి మరోసారి చేతులతో దండం పెట్టుకున్నారు తృప్తిగా.

తప్తి నిండిన మనసుతో అందరు బయటకి వస్తున్నారు. అక్కడే ఆ పక్కనే కూర్చున్న పూజరులు, తిలకం పెడతామని డబ్బులు ఇవ్వమని అడగుతున్నారు. అది చూసి ‘మనం ఎంతో దూరం నుండి వస్తాము. ఇదిగో వీళ్ళు ఇలా చేయటం వల్లే భక్తి భావం పోతోంది’ అన్నాడు రమేశ్‌.

విజయ్‌ మటుకు ఏదో తెలియని పారవశ్యంలో మునిగిపోయాడు. అతనికి తెలియకుండానే అతని కళ్ళ వెంబడి నీళ్ళు కారసాగాయి. ‘శివునికి ప్రత్యేకించి ఒక రూపం లేదు. ఆయన లింగాకారుడు. ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న తత్వమే శివతత్వం’ అనుకున్నాడు.

అందరూ ఆ విశ్వేశ్వరుడికి మరో మారు దండం పెట్టుకొని బయటకు వచ్చారు.

‘పదండి పదండి ! గంగా హారతికి వెళ్దాం’ అంటూ అక్కడ నుండి తొందర చేస్తూ ముందుకు నడవసాగాడు నాగేంద్ర. అందరూ అతన్ని అనుసరించారు.

మోహన్‌ పిల్లలు, శంఖరూప ఆ బజార్‌ని, అక్కడ షాప్‌లని తమ మొబైల్‌తో ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు.

అక్కడ అందరిని అలరించిన దశ్యం ఏమిటంటే కళాశాల విద్యార్థులు. ఎంత మంది వచ్చారో కాని, వాళ్ళంతా జట్లు జట్లుగా తిరుగుతూ సందడి చేస్తున్నారు. స్టడీ టూర్‌లా వచ్చారుట. మోహన్‌ వాళ్ళ అబ్బాయి రిత్విక్‌ వాళ్లతో మాట్లాడాడు. అలాగే జపాన్‌ నుంచి కొంతమంది వచ్చారు. వాళ్ళకి ఒక గైడ్‌ అన్నీ చెబుతోంది.

ఇంతలో రైల్లో కలిసిన యువబృందం కనిపించారు.

‘మేం చెప్పాం కదా కలుస్తాం అని !’ అంటూ అందరిని పలకరించారు. బామ్మగారి దగ్గరకు వచ్చి ‘బామ్మగారు మీ హారర్‌ స్టొరీ గుర్తుంచుకొని ఆ ప్రదేశం కాశీలో ఎక్కడుందో వెతుకుతాం’ అంటూ జోక్‌ చేసారు.

అలా కాసేపు మాట్లాడి ‘మేం గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటాం’ అని చెప్పి యువబృందం అక్కడనుంచి వెళ్ళిపోయారు.

అందరు నాగేంద్ర వెంట చిన్న చిన్న సందుల లోంచి నడిచి ఘాట్‌ దగ్గరకు చేరుకున్నారు.

అక్కడి దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు.

దశాశ్వమేధ ఘాట్‌ దీప కాంతులతో మెరిసి పోతోంది.

‘గంగా హారతి ఓ అద్భుత ప్రదర్శన. బోటులోనే కూర్చొని సాయంత్రం ఏడు గంటలకు గంగాహారతిని చూడొచ్చు. ఇది ఒక అరగంట పాటు జరిగే నిత్య కార్యక్రమం. ఇది చూడటానికి వేలాదిమంది వస్తారు. పడవలన్నింటినీ ఒడ్డుకు కొంచెం దూరంలో ఆపి ఉంచుతారు. అక్కడ నుండి ఒడ్డున ఉన్న వేదికపై నుండి గంగానదికి ఇచ్చే దీప హారతిని చక్కగా చూడొచ్చు. ఈ లోగా మనం పడవల్లో వెళ్లి అన్ని ఘాట్స్‌ చూసొద్దాం’ అన్నాడు నాగేంద్ర.

పడవ వాళ్ళు అడిగిన దాంట్లో సగానికి బేరం చేసి రెండు పడవలు మాట్లాడాడు నాగేంద్ర. అన్ని ఘాట్‌లు చూపించి, హారతి సమయానికి తీసుకు రావాలని చెప్పాడు.

బామ్మగారు మటుకు ముందు ఆ గంగని తల మీద చల్లుకొని పడవ ఎక్కారు. ఎందుకో ఆవిడ చాల గంభీరంగా ఉన్నారు. ‘బామ్మగారూ స్నానం రేపు చేద్దురుగాని, ఈ పూటకి ఇలా కానిచ్చేద్దాం’ అన్నాడు నాగేంద్ర. అందరూ కూడా ఆ పవిత్ర గంగను తల మీద చల్లుకున్నారు.

పడవ ఎక్కే ముందు అక్కడ అందరూ స్నానాలు అవి చేయడం చూసి నీళ్ళు తలమీద చల్లుకోడానికి మోహన్‌ పిల్లలు నవ్య, రిత్విక్‌ ముందు కొంచెం సందేహించారు. కాని ఆ తరువాత వాళ్ళు కూడా చల్లుకున్నారు. పడవలు బయలుదేరాయి.

యుగయుగాలుగా ప్రవహిస్తున్న పునీత గంగని చూసేసరికి అందరిలోనూ ఒక పవిత్ర, దివ్యమైన భావన కలిగింది.

ఇంతలో విజయ్‌కి నాగభూషణం గారి దగ్గర నుంచి ఫోన్‌ వచ్చింది. ‘రేపు పొద్దున్న చంద్రశేఖర్‌ దీక్షితులుని తీసుకొని వస్తాను. కలిసిన తరువాత వివరంగా మాట్లాడుకుందాం’ అని చెప్పారు. సరే అన్నాడు విజయ్‌.

పడవ నడిపే వాళ్ళు అన్ని ఘాట్స్‌ పేర్లు వివరంగా చెబుతున్నారు.

ముఖ్యంగా మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్స్‌ వచ్చినప్పుడు అందరినీ నమస్కారం చేసుకోమని చెప్పారు. అక్కడ కాశీలో స్వర్గస్తులైన వారి భౌతికకాయాలకు అంత్యక్రియలు జరుగుతున్నాయి. అలా మంటల్లో కాలుతున్న నిర్జీవ శరీరాలు చూసినా భయం వేయలేదు నవ్య, రిత్విక్‌లకు. అందరి మనసుల్లో ఓ అతీతమైన భావన ఆ దశ్యాలు చూసేసరికి. అన్నీ చూసిన తరువాత మళ్ళీ దశాశ్వమేధ ఘాట్‌ దగ్గరకు వచ్చారు.

అది హారతి ఇచ్చే సమయం అవ్వటంతో దశాశ్వమేధ ఘాట్‌ మొత్తం జనంతో నిండిపోయింది. భజన గీతాలు మొదలు పెట్టారు. హారతిని దగ్గరగా చూడటం కోసం మరికొందరు డబ్బులిచ్చి మరీ పడవల్లో కూచున్నారు. అక్కడ ఎక్కడ చూసినా దీపాలే.

తీరం పక్కనే చేసిన సిమెంట్‌ గద్దెలపై పెద్ద హారతులతో సిద్ధంగా ఉన్నారు. ఇంకా కొన్ని నిమిషాల్లోనే హారతి ప్రారంభం అయ్యింది. దాదాపు ఒక అరగంట పాటు మంత్రాలు, భక్తి గీతాలతో తీరం హోరెత్తింది. ఒక్కరు కూడా హారతి అయ్యే వరకు కదలలేదు.

గంగాహారతి ఒక అద్భుతం.

హారతికి కూర్చున్న జనసమూహాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

అందులో భారతీయులకంటే విదేశీయులే ఎక్కువగా వున్నారు. వారిలో అన్ని దేశాల వాళ్ళు కనిపిస్తున్నారు. అందులో ఎక్కువగా జపనీయులు, చైనీయులే ఉన్నారు.

మీరాబాయి కీర్తనతో మొదలయిన హారతి కార్యక్రమం పూర్తవ్వడానికి గంట సమయం పట్టింది.

ఘంటానాదంతో, శంఖం పూరిస్తూ, శ్లోకాలు పఠిస్తూ లయబద్ధంగా పూజారులు హారతి ఇస్తుంటే అవి అందుకుంటూ శివ పార్వతులు అక్కడ ఆనంద తాండవం చేస్తునట్లనిపించింది.

రకరకాల దీపాలతో, ధూపాలతో గంగామాతకి హారతివ్వడం నిజంగా అద్భుత దశ్యమే.

హారతి చూసుకొని గెస్ట్‌ హౌస్‌కి వెళ్ళడానికి వెనుతిరిగారు అందరూ.

దారిలో తినడానికి బోలెడు హోటల్స్‌ ఉన్నాయి. ‘అందరం ఓ మంచి హోటల్‌కి వెళదాం. అక్కడ కూర్చొని తింటూ రేపటి ప్రోగ్రాం సెట్‌ చేసుకొందాం’ అన్నాడు నాగేంద్ర.

బామ్మగారు మరి కొంతమంది తప్ప మిగతా వాళ్ళు భోజనాలు చేశారు.

‘రేపు ముఖ్యంగా నిమజ్జనం ఉంది. అదీ కాకుండా రేపు గంగాస్నానం చేసేస్తే ఓ పని అయిపోతుంది. ఆ తరువాత కాశీ చూసుకొని ఎల్లుండి గయ వెళ్దాం. ఆ తరువాత అలహాబాద్‌, అయోధ్య, వింధ్యావాసిని, సీతామడి అన్నీ చూసుకోవచ్చు’ అన్నాడు నాగేంద్ర.

‘సరే’ అంటే ‘సరే’ అనుకున్నారు అంతా.

వాళ్ళని గెస్ట్‌ హౌస్‌లో దింపేసి ‘అందరూ ఉదయం ఐదు గంటలకి తయారయి సిద్ధంగా ఉండండి’ అని చెప్పి వెళ్ళిపోయాడు నాగేంద్ర.

–   –   –

మరునాడు పొద్దున్నే గంగాస్నానం కోసం అందరూ బయలుదేరారు. అప్పటికే కోలాహలం మొదలయిపోయింది తెల్లవారుజామున జరిగే అభిషేకం కోసం.

నాగేంద్ర వచ్చాడు వీళ్ళని తీసుకెళ్ళడానికి. చలి బాగానే ఉంది. వెళుతూ మట్టి పిడతల్లో చాయి తాగేసరికి వంట్లోకి శక్తి వచ్చినట్లయింది. కాస్త చలి తగ్గినట్లనిపించింది. నడుస్తున్నంత సేపు పడవల వాళ్ళు ఈగల్లా ముసిరేస్తున్నారు.

పడవ వాళ్ళే కాదు పురోహితులు కూడా ‘అవి చేస్తాం, ఇవి చేస్తాం, పితృదేవతలకి మోక్షం వస్తుంది’ అంటూ చెవిలో జోరీగలా రొద పెడుతూనే ఉన్నారు ఘాట్‌ చేరేవరకు. నాగేంద్ర ముందే హెచ్చరించాడు ‘ఎవ్వరూ మాట్లకండి వాళ్లతో’ అని. అతని మాట పాటిస్తూ సమాధానం ఇవ్వకుండా నడిచారు అందరూ.

పదిహేను నిమిషాల్లో ఘాట్‌ దగ్గరకు చేరారు.

బామ్మగారు తన వెంట ఎవరికీ చూపించకుండా దాచుకుంటున్న తన సంచీని కూడా తెచ్చుకున్నారు. శంఖరూప, రాజారావులు కూడా అస్థికలున్న సంచీలు తెచ్చుకున్నారు.

– మణి వడ్లమాని

– ఇంకా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *