కాశీపట్నం చూడర బాబు – 13

కాశీపట్నం చూడర బాబు – 13

జరిగిన కథ

రాజారావు-శ్యామల, నాగభూషణం, బామ్మగారి కుటుంబం, విజయ్‌-పద్మ, శంఖరూప, రమేశ్‌-జయ, చంద్రశేఖర దీక్షితులు, కళాశాల విద్యార్థుల బృందం, మరి కొంతమంది రైలులో కాశీ పట్నానికి బయలుదేరారు.

నాగభూషణంగారు భార్య పోయి, ఒంటరివాడై శేష జీవితాన్ని కాశీలో గడుపుదామని; రాజారావు, శ్యామల దంపతులు కాశీ చూడాలనే కోరికతోనూ; జయ, రమేష్‌ దంపతులు రమేష్‌ తండ్రిగారి సంవత్సరీకం పనిమీద; విజయ్‌ని ఆవహించిన నిరుత్సాహాన్ని తొలగించడానికి విజయ్‌, పద్మ దంపతులు; తల్లి అస్తికలను కాశీలో కలపడానికి శంఖరూప, తన మనుమళ్ళతో బామ్మగారు కాశీ వెళుతున్నారు.

బామ్మగారు వాళ్ళ ముత్తాత ఆత్మలతో మాట్లాడినట్లు చెప్పటంతో అక్కడ ఉన్న యువ బృందం ఆ విషయాల గురించి చర్చించుకుంటున్నారు. ఆ సమయంలో రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి వీళ్ళ దగ్గరికి వచ్చాడు. అతను ‘నేనెవరిని’ అని తెలుసుకోవడం కోసం నేను గంగ ఒడ్డున కూర్చుని, ధ్యానంలో మునిగానని, ఎంతో శూన్యంలోకి వెళ్ళాక అక్కడ తనకు సృష్టికర్త కనిపించాడని, అతనికి, తనకి మధ్య మృత్యువు గురించి, సృష్టి గురించి సంభాషణ జరిగిందని చెప్పాడు. ‘ఏది పిండాండంలో ఉందో, అదే బ్రహ్మాండంలోనూ ఉంది, అదే సష్టి రహస్యం!’ అని తన కలలో కనిపించిన సృష్టికర్త చెప్పి, తన భుజం తట్టాడని చెప్పాడు. ఇంతలో ‘గంగకి వరద వస్తోంది చూడు’ అంటూ నన్ను ఎవరో తట్టి లేపుతున్నట్లు అనిపిస్తే మెలకువ వచ్చి, కళ్ళు విప్పి చూసాను. చిత్రం ! అతను అచ్చు నాకు కలలో కనిపించిన వాడే ! అని చెప్పాడు.

ఇక చదవండి..

‘అది ఎలా సాధ్యం ?’

‘కలలో కనిపించిన వ్యక్తి నిజంగా కళ్ళముందు సజీవంగా ఉన్నాడు’.

‘ఆ కళ్ళు అచ్చం కలలో కనిపించిన సృష్టికర్త కళ్ళ లాగే ఉన్నాయి ప్రేమని, వాత్సల్యాన్ని నింపుకొని’.

‘ఇతను సత్యం అయితే అతన్ని నేను ఇప్పుడేగా చూశాను. మరి కలలోకి ఎలా వచ్చాడు ? అది భ్రమ అయితే ఇక్కడ నిజంగా కనబడుతున్నాడు. ఇదెలా సాధ్యం ?’ అనుకున్నాను.

అప్పుడు అతన్ని అడిగాను ‘మనం ఇంతకు ముందు కలుసుకున్నామా ?’ అని.

‘లేదు ఇప్పుడే కలుసుకున్నాము’ అన్నాడు.

‘మరి నువ్వు నా కలలో ఎలా కనిపించావు ?’ అని అడిగాను.

అలా అడుగుతుండగా ఇతని లాంటి అతను నాతో అన్న మాటలు గుర్తొచ్చాయి. ‘నువ్వు, నేను మాత్రమే ఉన్నాము’.

అంతే ! నా మెదడు పొరలలో ఏదో కదలిక. తెరలు పొరలు చెరిగి, కరిగి పోయాయి. ఏదో కొత్త ఉత్సాహం, శక్తి నాకే తెలుస్తున్నాయి.

ఒకటి నిశ్చయంగా అర్ధమైంది.

భగవంతుడిని తెలుసుకునే ముందు నన్ను నేను తెలుసుకోవాలి. నేనెవరో తెలిస్తే, ఈ విశాల విశ్వం గురించి తెలుసుకుంటే, భగవంతుడి గురించి తెలుసుకున్నట్లే !

అంటే దేవుడున్నాడా ! మనలోనే ఉన్నాడా ?

సర్వం ఖల్విదం బ్రహ్మ. అంటే ఈ సష్టిలో ఉన్నదంతా బ్రహ్మమే తప్ప మరేమీ కాదు అనిపించింది.

అలా నా అన్వేషణలో భాగంగా కాశీలో అడుగు పెట్టిన వెంటనే జరిగిన ఈ సంఘటనతో నేను పునీతుడైనట్లు, ఏవో దివ్యశక్తులు నన్ను నడిపిస్తున్నట్లు అనిపించింది.

‘ఫ్రెండ్స్‌, ఇది ఇప్పుడే మీకు అర్ధం కాకపోవచ్చు. కానీ మీతో ఇవన్నీ చెప్పడానికి గల కారణం, కాశీ అంటే ఒక సరదాగా గడపడానికి వెళ్ళే స్థలమో లేక ఔటింగ్‌ లేక ఓ పిక్నిక్‌ స్పాట్‌ కాదు. కొన్నివేల ఏళ్ళ ధార్మిక చరిత్ర ఉన్న ఈ కాశీపట్టణంలో ఉండటం ఎంతో అదష్టంగా భావిస్తారు అనేకమంది. కొంతమంది శాంతిని వెతుక్కుంటూ కాశీకి వస్తారు. దానినొక శాశ్వతమైన మోక్ష స్థలం అంటారు విదేశీయులు. మనవాళ్లకి కాశీ అతి పవిత్రమైన ప్రదేశం. అది శివుడు, పార్వతి, గంగల సంగమం. ఒక రకంగా ఇది కూడా త్రివేణి సంగమమే.

దీనికి ఈ ఇరుకు సందులు, మురికి వాడలు ఇవేవి అడ్డురావు. ముఖ్యంగా ఈ జీవితం ఓ ప్రవాహం. ఇది ఉత్సాహంగా, ఉత్తేజంగా సాగుతూనే ఉంటుంది. మీరు చెయ్యాల్సినదల్లా ఒక నమ్మకం మీద నిలబడాలి. అందరూ విశ్వనాథుని దర్శనం చేసుకోండి, గంగ మాతని దగ్గరగా చూడండి. ఆ జీవనది మీకు ఎన్నో విషయాలను నేర్పుతుంది’ అని చెప్పి వెళ్ళిపోబోతుంటే..

కొంచెం దూరంలో ఉన్న మోహన్‌ దగ్గరగా వచ్చి అతన్ని చూస్తూ..

‘సర్‌ మీరు.. మీరు..’ అని తడబడుతుంటే, అతను నెమ్మదిగా

‘నా పేరు సత్యాన్వేషి. అటు వెళ్ళాలి, కొంచెం దారి ఇస్తారా !’ అని చక్కటి ఇంగ్లీష్‌లో అంటూ వెళ్ళిపోయాడు.

వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ ఉండిపోయారు ఈ బృందం అంతా.

మాట్లాడుతున్నంత సేపు అతన్నే గమనిస్తున్న శంఖరూప, ఏదో గుర్తొచ్చి లాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి బ్రౌస్‌ చేస్తోంది ‘యురేకా’ అంటూ నోరు విప్పి చెప్పే లోపల అతను అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

అక్కడున్న వాళ్ళతో శంఖరూప

‘మీకు తెలుసా అతను ఒకప్పటి గొప్ప వ్యాపారవేత్త. టాటా, బిర్లాల తరువాత ఇతనే. వాళ్ళది ‘గౌతమ్‌ గ్రూప్‌ అఫ్‌ ఇండస్ట్రీస్‌’. ఈయన దాని చైర్మన్‌. నాకు తెలుసు అతనే ! ఐదేళ్ల క్రితం ఉన్నట్టుండి మాయమయ్యాడు. కారణాలు తెలియవు నగరం అంతా ఇదే వార్త, బిజినెస్‌ సర్కిల్స్‌లో అంతా ఇదే చర్చ, ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. హఠాత్తుగా అతని నిశ్శబ్ద నిష్క్రమణ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కష్టపడి సంపాదించిన కోట్ల ఆస్తిని మొత్తం చారిటీలకి రాసేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అతని ప్రొఫైలు, ఫోటోలు చెక్‌ చేస్తున్నాను గూగుల్‌లో. ఇది ఒక్కటే దొరికింది. అసలా కంపెనీలో జాబు రావడమే గ్రేట్‌ అనుకునే వాళ్ళం అప్పట్లో. ఓహ్‌ మై గాడ్‌ ! ఇతను అజయ్‌ గౌతమ్‌’

ఉద్వేగంగా అంటూ

‘ఇదిగో కావాలంటే మీరు చూడండి’ అనగానే

అందరూ ‘ఏది ? ఏది ?’ అంటూ కుతూహలంగా వచ్చారు చూడటానికి. స్టైల్‌గా, సూట్‌లో రేమండ్స్‌ మోడల్‌లా ఉన్నాడు.

‘అప్పటికి ఇప్పటికి ఎంత తేడా !’

ఎవరో అన్నారు.. ‘అప్పుడు భోగి ! ఇప్పుడు యోగి కదా !’ అని.

ఆ మాటలు వింటున్న మోహన్‌ అందుకొని

‘అవును, నాకు ఆయన్ని ఎక్కడో చూసినట్టు అనిపించే దగ్గరికి వచ్చాను. ఒకసారి మా కంపెనీ తరఫున నేను ఒక సెమినార్‌కి వెళ్లినప్పుడు ఈయనే ముఖ్య అతిథి. అప్పుడు బాగా దగ్గర నుంచి చూశాను. అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని వదిలేసి ఒక యోగిలా బతకటం నిజంగా నమ్మశక్యం కావటం లేదు. అది తిరుగు లేని గొప్ప నిర్ణయం.

జీవితంలో ఒక దశకు వచ్చాక కొంతమంది ఒక నిర్వికార స్థితికి చేరుకుంటారు. దానిముందు ఈ కనిపించేవన్ని భౌతికమైనవి, అసలు తెలుసుకోవలసినది ఇంకేదో ఉందనే జిజ్ఞాస మొదలవుతుంది. దాన్ని వెతుక్కుంటూ వెళతారు. అంతకంటే ఋష్యత్వానికి అద్దం పట్టేదేముంది ?!’ అన్నాడు.

అప్పటికే కొంతమంది కుతూహలంగా అతన్ని ముందు బోగీల్లో వెతకడానికి బయలుదేరారు. కానీ ఎక్కడా కనిపించలేదు.

అర్ధరాత్రి అయింది. అప్పటికి రైలు ఇటార్సి దాటిపోయింది.

అతని కోసం వెతుకుతున్న వాళ్ళకి పాంట్రీ అతను ఇలా చెప్పాడు..

‘అతను ఒక్క అరగంట ముందు ఓ స్లీపర్‌ బోగిలో ఓ పిల్లాడిని రక్షించాడు. ఆ పిల్లాడు డోర్‌ దగ్గర నించున్నాడు. మాటలలో పడి ఎవరూ చూసుకోలేదు, డోర్‌ మూసుకుపోయింది. పిల్లాడు కమ్మీ పట్టుకొని వేలాడుతున్నాడు. రైలు వేగంగా పోతోంది. అంతా చీకటి. ‘చైన్‌ లాగే లోపల అతను దేవుడులా వచ్చి మా అబ్బాయిని కాపాడి వెళ్ళి పోయాడు’ అని పిల్లాడి తండ్రి దండాలు పెట్టేస్తున్నాడు’ అని చెప్పాడు ఎంతో ఉత్సాహంగా.

అది విన్న వాళ్ళు పూర్తి భావోద్రేకంలోకి వెళ్ళి పోయారు. రాత్రి అంతా ఆ విషయాలే మాట్లాడు కుంటున్నారు.

‘ఒక వ్యాపారవేత్త సర్వం త్యాగం చేసి సన్యాసిలా జీవించడం అంటే మాటలు కాదు. ఈ భౌతిక సుఖాలని వదిలేసి సర్వసంగ పరిత్యాగిగా మారడానికి ఎంత సాధన కావాలి ? అది తను కష్టపడి వేల లక్షల కోట్లను సంపాదించి, దాన్ని ధారాదత్తం చేయడం కేవలం స్థితప్రజ్ఞత వల్లనే సాధ్యం’ అని.

తన వెనకాలే వాళ్ళు రావడం గ్రహించి నవ్వుకుంటూ వాళ్ళకు కనిపించకుండా ముందు బోగీలోకి వెళ్ళిపోయాడు సత్యాన్వేషి. అదే పూర్వాశ్రపు గౌతమ్‌ గ్రూప్‌ అఫ్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ అజయ్‌ గౌతమ్‌.

—- —— ——

చంద్రశేఖర్‌ దీక్షితులు

కొత్త ప్రదేశం, కొత్త చోటు, ఎప్పుడూ తల్లిని వదిలి ఉండలేదు. బెంగగా అనిపించి ఏడుపు వచ్చింది చంద్రశేఖర్‌ దీక్షితులుకి. వంటి నిండా దుప్పటి ముసుగేసుకొని తెలియకుండానే నాగ భూషణం గారి మీద వాలి నిద్రపోయాడు. కొంచెం సేపు అయ్యాక తెలివి వచ్చింది. రైలు వేగంగా వెళుతున్నట్లు దాని శబ్దమే చెబుతోంది. లేచి టాయ్లెట్‌కి వెళ్లి అక్కడ బయట రైల్వే స్టాఫ్‌ పడుకున్న బెర్త్‌ దగ్గరకు వెళ్లి ఓ మూలగా కూర్చొన్నాడు. అవతలి వైపుకి కూర్చొని ఉత్తరం కాబోలు రాసుకుంటున్నాడు. అలికిడి వినేసరికి ఉలిక్కిపడి ఆపేస్తున్నాడు.

మొదట విజయ్‌ ఒకసారి టాయ్‌లెట్‌కి వచ్చి వెళ్ళాడు. కాసేపటికి పద్మ వచ్చి వెళ్ళింది. ఆ అలికిడికి నాగభూషణం గారికి మెలకువ వచ్చింది.

‘ఏంటమ్మా, ఎంతవరకు వచ్చాము ?’ అంటే ‘ఊరు తెలియటం లేదు, సమయం మాత్రం రాత్రి పన్నెండు దాటింది’ అంది పద్మ.

ఎలాగూ మెలకువ వచ్చిందని లేచి చెప్పులు వేసుకొని టాయ్‌లెట్‌కి వెళ్లి, బయటకు వస్తూ దీక్షితులు వంక చూశారు నాగభూషణం గారు. తల వంచుకొని చంద్రశేఖర్‌ అక్కడ స్టాఫ్‌ పడుకుని ఉంటే, వాడి కాళ్ళ దగ్గర కూర్చొని కాగితం మీద ఏదో గబగబా రాస్తున్నాడు.

తలుపు దాక వెళ్ళిన నాగభూషణం గారు, ఎందుకో వెనక్కి తిరిగి

‘ఇదిగో ! చంద్రశేఖరం, రావయ్యా. వచ్చి పడుకో. ఏం చేస్తున్నావు ఒక్కడివి ?’ అన్నారు. ఆ మాటలకి గబుక్కున వెనక్కి తిరిగి చూశాడు దీక్షితులు.

అనుభవజ్ఞుడైన నాగభూషణం గారికి ఆ చూపులో ఏదో భయం, తత్తరపాటు కనిపించాయి.

గబుక్కున చేతిలోని కాగితం జేబులోకి తోసేసాడు దీక్షితులు. మారు మాట్లడకుండా నాగభూషణంగారి వెనకాలే వెళ్ళాడు.

ఆ అబ్బాయిది మధ్య బర్త్‌. పైకెక్కి పడుకున్నాడు.

నాగభూషణంగారికి మటుకు నిద్దర పట్టలేదు. పైన ఆ అబ్బాయి బెర్తుపై అటు నుండి ఇటు తిరిగినట్లు అలికిడైంది. అప్పుడే పై నుంచి ఓ కాగితం కిందకి పడింది. అది తీసి అతని బెర్త్‌ మీద పెట్టబోయి ఒక్క క్షణం ఆగారు నాగభూషణం గారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *