కాశీపట్నం చూడర బాబు – 12

కాశీపట్నం చూడర బాబు – 12

ధార్మిక, సమాజిక నవల

జరిగిన కథ

రాజారావు-శ్యామల, నాగభూషణం, బామ్మగారి కుటుంబం, విజయ్‌-పద్మ, శంఖరూప, రమేశ్‌-జయ, చంద్రశేఖర దీక్షితులు, కళాశాల విద్యార్థుల బృందం, మరి కొంతమంది రైలులో కాశీ పట్నానికి బయలుదేరారు. నాగభూషణంగారు భార్య పోయి, ఒంటరివాడై శేష జీవితాన్ని కాశీలో గడుపుదామని; రాజారావు, శ్యామల దంపతులు కాశీ చూడాలనే కోరికతోనూ; జయ, రమేష్‌ దంపతులు రమేష్‌ తండ్రిగారి సంవత్సరీకం పనిమీద; విజయ్‌ని ఆవహించిన నిరుత్సాహాన్ని తొలగించడానికి విజయ్‌, పద్మ దంపతులు; తల్లి అస్తికలను కాశీలో కలపడానికి శంఖరూప, వీళ్ళెవరికీ సంబంధం లేని చంద్రశేఖర దీక్షితులు కాశీ వెళుతున్నారు. వీరితో పాటు బామ్మగారు తన మనుమళ్ళతో ప్రయాణిస్తున్నారు.

బామ్మగారు ఆ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా ఉండి, ‘కాశీపట్నం చూడర బాబూ’ అనే పాట పాడి, జంతర్‌ పెట్టె గురించి చెప్పింది. సాయంత్రం అందరికీ బామ్మగారు వాళ్ళ ముత్తాత గురించి చెప్పారు. ఆ ముత్తాత చిన్నప్పుడు కాశీ పారిపోయి, అక్కడ వేదాలు, పనసలు, పన్నాలు అన్నీ నేర్చుకుని పండితుడయ్యాడు. ఆయన ఇంటికి తిరిగి వస్తూ చనిపోయినా మోక్షం రాక అక్కడే తిరుగుతున్న వేదపండితుల ఆత్మల ప్రశ్నలకు సమాధానం ఇచ్చి, వచ్చాడు. ఇదంతా విని అక్కడ ఉన్న యువ బృందం ఆ రాత్రి శంఖరూప, నాగభూషణం గారితో కలిసి ఆ విషయాల గురించి చర్చించుకుంటున్నారు. అఘోరాల గురించి, దేవుడి గురించి కూడా చర్చించుకుంటున్నారు. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగా అక్కడ బోగీ ద్వారం వద్ద ఉన్న పై బర్త్‌ నుండి ఒక వ్యక్తి దిగి నేరుగా వీళ్ళ దగ్గరికి వచ్చాడు. అది చూసి అక్కడ ఉన్న యువబృందం, శంఖరూప, నాగభూషణం గారు, విజయ్‌, మరికొందరు విస్తుపోయారు.

ఇక చదవండి..

ఆ వ్యక్తి వచ్చి ‘కాసేపు ఇక్కడ కూర్చోవచ్చా’ అన్నాడు. అందరూ గంభీరమైన అతని గొంతు వంక, అతని వంక తదేకంగా చూస్తున్నారు. అతను సన్నగా, తెల్లగా పొడవుగా ఉన్నాడు. నలుపు-తెలుపు జుట్టు, తెల్లటి గడ్డం. ఒక్క మాటలో చెప్పాలంటే ఋషిలా ఉన్నాడు. ఆ మొహంలో ఆకర్షణ, ఏదో తెలియని తేజస్సు కనిపిస్తోంది. అక్కడ అకస్మాత్తుగా గాలిలో ఏదో దివ్యత్వం ఆవరించిన భావన. అక్కడున్న అందరిలోనూ అదే ఫీలింగ్‌. ఇదంతా జరగడానికి రెండు నిముషాలు పట్టింది. కొంతసేపటికి నాగభూషణం గారు ముందుగా తేరుకొని ‘రండి ఇక్కడ కూర్చోండి’ అంటూ అని అతనికి సీట్‌ ఆఫర్‌ చేసారు. కూర్చుంటూ అందరి వైపు చూసి నవ్వాడు అతను.

ఆ నవ్వు ఓ మహాజ్ఞాని చుట్టూ ఏర్పడిన ఓ తేజో వలయంలా ఉంది. ‘మిత్రులారా ! మీరు మాట్లాడుకుంటున్నవి వింటున్నాను. నేను కొన్ని విషయాలు మీతో చెప్పొచ్చా’ అనటంతో అందరూ ‘అయ్యో ! ఫర్వాలేదు సర్‌, చెప్పండి ప్లీజ్‌’ అన్నారు ఉత్సాహంగా.

నాగభూషణం గారు, శంఖరూప కూడా ‘ప్లీజ్‌ సర్‌ ! చెప్పండి’ అన్నారు.

‘థాంక్యూ !’

‘నైనం చిన్దంతి శస్త్రాణి – నైనం దహతి పావకః’

‘వాస్తవానికి అందరూ ప్రేమించేది ఆత్మనే. ఆత్మే లేకపోతే ఈ దేహం ఎందుకూ పనికి రాని వ్యర్ధ వస్తువు అవుతుంది. అయితే నేనెవరిని ? ఈ ప్రశ్న నన్ను నిరంతంరం వేధిస్తుంటే అది తెలుసుకోవాలని అన్ని బంధాలను తెంచుకొని వచ్చేశాను. నిజమే నా వల్ల నా వాళ్ళకి బాధ కలిగి ఉండచ్చు. కాని నాలో ‘జీవితం అంటే ఇది కాదు, ఇంకేదో ఉంది. అది తెలుసుకోవాలి’ అనే అన్వేషణ ఉంది. ఒక్కోసారి సమాధానం దొరికినట్లే అనిపిస్తుంది. కానీ అది సంతప్తినివ్వటం లేదు. ఆ అన్వేషణలో భాగంగా గంగా తీరానికి వచ్చాను.

కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర గల గంగ, ఈ కర్మ భూమిలో జరిగిన ఎన్నో సంఘటనలకు సాక్షీభూతమై నిలచింది. మహా యుద్ధాలు జరిగాయి. ఎందరో మరణించారు. శిథిలాల నుంచి శిఖరాలకి ప్రయాణించారు. వీటిని చూస్తూనే కాలాలతో నిమిత్తం లేకుండా తన లక్ష్యం అయిన సాగరం వైపు ప్రయాణం సాగిస్తూనే ఉంది. ఆమె సత్యం. అందుకే యుగయుగాలుగా మార్పు లేకుండా ఉంది.

అందానికి పరవశం చెందుతూ అలలు సుళ్ళు తిరుగుతూ ముందుకు సాగుతున్నాయి. ప్రతి నిత్యం కనిపించే ఈ చంచల అందాన్ని ఎవరైనా పట్టగలరా ? ఒక్కో క్షణంలో ఒక్కో అందం. చూపు తిప్పలేని అలౌకిక స్థితి. ఈ ప్రపంచంలో అన్నీ రూపాంతరం చెందుతున్నా గంగ మటుకు శాశ్వతమైనది. మానవులందరూ కూడా తెలుసుకో తగ్గ విషయం ఆమె తన ప్రయాణంలో ఎన్నో కష్టనష్టాలకు, ఆటు పోట్లకు తట్టుకొని తనకు కలిగే ఆటంకాలను అతి చాకచక్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగిపోతుంటుంది. నిశితంగా గమనిస్తే నది లాంటి మన జీవితాలలో వచ్చే అవరోధాలు, నది ప్రవాహాన్ని ఆపడానికి వచ్చే పెద్ద బండరాళ్ళు, లేదా పెద్ద పెద్ద పర్వతాల వంటివి. అయినప్పటికీ ఎంతో ఓర్పుతో, చాకచక్యంగా, ఒడుపుగా ముందుకు సాగిపోవడమే అంతిమ లక్ష్యం.

అంటే ఆ గంగ ప్రయాణం మానవులకి ఒక ధ్యేయాన్ని నిర్దేశిస్తోంది. సాగరం చేరడం గంగ లక్ష్యం. దాన్ని సాధించడానికి ఆమె పడే శ్రమ, తపన, అకుంఠిత దీక్ష మనందరికీ ఆదర్శం. అలాంటి గంగ ఒడిలో వందలు, వేల మంది పుణ్యస్నానాలు చేస్తున్నారు.

వారణాసిలో మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్‌లలో జరిగే శవదహన కార్యక్రమాలను చూసాను. తప్పించుకోలేని ఆ మత్యువనే సత్యం గురించి తెలుసుకోవాలి అనిపించింది. గంగ ఒడ్డున ఓ ప్రశాంత ప్రదేశాన్ని ఎంచుకొని ధ్యానంలో కూర్చున్నాను.

అప్పుడు ఒక అలౌకికమైన స్థితి. చేతనాచేతనలకు అందనిది. ఎక్కడ ఉన్నానో తెలియటం లేదు. అంతా శూన్యం. నా దేహం దూదిపింజ కన్నా తేలికగా ఎగిరిపోతోంది అనంత విశ్వంలోకి, ఆకాశంలోని మేఘంలా !

కొండలు, కోనలు, నదులు, సెలయేళ్ళు దాటి పైపైకి సాగిపోతున్నాను! నా సుదీర్ఘ ప్రయాణం అలా అనంతంగా సాగుతూనే ఉంది !

నాకు ఆకలి లేదు, దప్పిక లేదు, అశాంతి లేదు, దుఖం లేదు, బాధ అంతకంటే లేదు ! ఎక్కడిదాక ఈ అంతు తెలియని అన్వేషణ ? అంతటా శూన్యమే.

అక్కడో అద్భుతం జరిగింది.

ఒక్క జీవ రాశి కూడా లేని ఆ శూన్య ప్రదేశంలో ఒకతను నవ్వుతూ కనిపించాడు. ఆ కళ్ళలోని తేజస్సు, ఒక మహాకాంతి అతని చుట్టూ వలయంలా ఉజ్జ్వలంగా ప్రకాశిస్తోంది!

‘ఎవరు నువ్వు ? ఈ ప్రదేశం ఎక్కడ ఉంది ? ఎవరూ కనిపించటం లేదు ? కాని అంతా శూన్యంలా ఉంది ?’ అన్నాను.

‘కొంచెం నెమ్మదించుకొని నన్ను చూడు ! నేను నిన్ను అదే ప్రశ్న వేస్తున్నాను ? నువ్వు ఎవరు ?’ అన్నాడు అతను.

‘అవును నేనెవరిని ?’

అటు ఇటు తిరిగాను, చుట్టూ చూశాను. అంతా శూన్యం. అయినా ఏదో సంపూర్ణంగా ఉంది. అతను నన్ను చూస్తున్నాడు, చూస్తూనే ఉన్నాడు.

‘నీలాంటి మనిషిని’ అన్నాను.

అప్పుడు నా గొంతులో ఉత్సాహం, ఏదో పెద్దవిజయం సాధించిన వాడిలా!

‘మరి నేనెవరో తెలుసా ?!’ అన్నాడు.

ఏదో దివ్యత్వం నన్ను చుట్టుముడుతోంది. అర్ధమయింది ‘నువ్వు సష్టికర్తవి కదా !’.

‘అవును. ఏదో అన్వేషణలో ఉన్నట్టున్నావు ?’ అన్నాడు.

నేనూ ‘అవును’ అన్నాను.

మళ్ళీ ‘మత్యువు అనే సత్యాన్ని తెలుసుకోవాలని!’ అన్నాను.

‘మరి తెలుసుకున్నవా ?’ అడిగాడు.

‘ఆ అన్వేషణలోనే నువ్వు కనిపించావు’.

‘అయితే యదార్ధాన్ని గ్రహించావా ? ఈ జీవితం మాయాగ్రస్తం, మత్యువు మాయా ముక్తం అని తెలిసిందా ! గీతలో కూడా ‘ప్రాణులందరూ పుట్టక ముందు కనిపించకుండా ఉంటారు. చనిపోయిన తరువాత కూడా కనిపించరు’ అని ఉంది. చావు పుట్టుకల మధ్యలోనే కనిపిస్తారు. అందుకే వాళ్ళ దష్టిలో నువ్వు ఒక శూన్యం. అంటే ఏమి లేదు. ఒకసారి దేహం నుండి ఆత్మ విడిపోతే ఆ దేహానికి విలువ లేదు’ అంటూ ‘నాతో రా! అలావెళదాం’ అన్నాడు.

అతను చెప్పిన కొన్ని మాటలు అర్ధం అయ్యాయి, కొన్ని కాలేదు.

‘నాకు ఒక అనుమానం. నువ్వు పుట్టిస్తావు, నువ్వే నాశనం చేస్తావు, మళ్ళీ మళ్ళీ అదే చేస్తావు. అలా ఎందుకు ?’ సూటిగా అడిగాను.

‘ఓ అదా ! చెబుతా విను’ నా కళ్ళలోకి సూటిగా చూస్తూ ‘అహం బ్రహ్మస్మి ! ఈ అనంత విశ్వాన్ని నేనే సష్టించాను, నేను మహాకాల స్వరూపుడను, ఇదంతా ఎందుకో తెలుసా ? నీ కోసం’.

‘నా కోసమా ! అందరి కోసమా !?’

‘కాదు నీ కోసమే’

‘మరి.. మిగతా వాళ్ళు ?’

‘ఇంకెవరూ లేరు. ఈ అనంత విశ్వంలో నువ్వూ, నేనే ఉన్నాం’

‘మరి భూమి మీదున్న మానవకోటి అంతా ?’

‘అన్నీ నువ్వే ! అన్నీ నీ రూపాలే ! యుగయుగాలుగా సష్టి సాగుతూనే ఉంది. తుది, మొదలు లేవు. ఇది ఒక అండాకారం, ఒక బ్రహ్మాండం’ అంటూ చెపుతూనే ఉన్నాడు. నేను మధ్యలో అడ్డుకుని,

‘ఉండు ఉండు, ఒక్క క్షణం ఉండు ! నాకు ఏమి అర్ధం కావటం లేదు. అంతా నేనేనా ! అదేమిటి ?’ నేను విస్మయం చెందాను.

‘అవును ! నువ్వే ! మీ లోకంలో పుట్టిన రాముడు, కష్ణుడు, బుద్ధుడు అన్నీ నువ్వే !’

‘అయితే నేను దేవుడినా ? నేను సష్టికర్తనా ?’

‘కొన్ని వేల జన్మలు ఎత్తగా, నువ్వు నా లాగే సష్టికర్తవు అవుతావు. అప్పటిదాక ఇలా పుట్టడం-చనిపోవడం, పుట్టడం-చనిపోవడం అనే చక్రం తిరుగుతూనే ఉంటుంది’ అన్నాడు. ‘అయితే ఈ విశ్వం, ఈ శూన్యం వీటిని ఏమని పిలవాలి?’ అడిగాను.

‘బ్రహ్మాండం’ అని పిలవాలి, ‘యత్‌ పిండాండే తత్‌ బ్రహ్మాండే’ అని చెప్పాను కదా ! అనగా ఏది పిండాండంలో ఉందో, అదే బ్రహ్మాండంలోనూ ఉంది అని అర్థం. ఇదే సష్టి రహస్యం!’ అని నా భుజం తట్టాడు.

‘గంగకి వరద పొంగుకుంటూ వస్తోంది. అదిగో చూడు’ అంటూ నన్ను ఎవరో తడుతూ లేపుతున్నారు. అంతవరకూ ఉన్న జాగ్రదావస్థ నుండి మెలకువ వచ్చింది. కళ్ళు విప్పి చూసాను.

చిత్రం !

అతను అచ్చు నాకు కలలో కనిపించిన వాడే !

–  మణి వడ్లమాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *