కబాలి పొలిటికల్‌ ఎంట్రీ

కబాలి పొలిటికల్‌ ఎంట్రీ

2017 వెళ్తూ.. వెళ్తూ నటుడు రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై ఓ క్లారిటీని ఇచ్చి వెళ్లింది. రజనీకాంత్‌ తన పొలిటకల్‌ ఎంట్రీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో డిసెంబర్‌ 31, 2017 నుంచి 1 జనవరి 2018 వరకు అటు జాతీయ ఛానళ్ళు, ఇటు ప్రాంతీయ ఛానళ్ళు పోటీపడీ ప్రత్యేక చర్చలు, కార్యక్రమాలు నిర్వహించాయి. వాటి పరిశీలన.

దేశంలోనే నాలుగో అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అక్కడి అధికార పార్టీలో పెను మార్పులే సంభవించాయి. ఈ తరహా అనిశ్చితి ఏ కోణం నుంచి చూసిన దేశానికి హితం కాదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజలు ఒక సరైన నాయకుడి కోసం ఎదురు చూస్తారన్న మాట నిర్వివాదాంశం.

డిసెంబర్‌ 31, 2017న రాత్రి 9 గంటలకు ‘ఇండియా టుడే’ ఛానల్‌ ప్రసారం చేసిన చర్చల్లో పాల్గొన్న వ్తలు రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీని అందరూ స్వాగతించారు.

కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన వారెవరైనా తమ పార్టీ ఆశయాలుగా అవినీతి రహిత భారతం, సుపరిపాలన అనే చెప్తారు. అలాగే రజనీ కూడా చెప్పారు. ఈ విషయంపై సాక్షి టి.వి. జనవరి 1 రాత్రి 9.30||లకి మ్యాగజైన్‌ స్టోరీలో ‘రాజకీయ రజనీ’ పేరిట విశ్లేషించడం బాగుంది.

అదే రోజు ఉదయం ఆ ఛానల్‌లో కె.ఎస్‌.ఆర్‌. లైవ్‌ షోలో రజనీ అన్న ‘ఆధ్యాత్మిక రాజకీయం’ మాటను గుర్తుచేస్తూ ఆ మాట బిజెపి ప్రోద్బలంతో అన్నదా? లేక భవిష్యత్తులో వారితో కలిసి పోటీ చేసే దారిని పటిష్టం చేస్తున్నట్లు అన్నదా? అనే భావన రేకెత్తించారు. అయితే ఈ మాటకు భారతీయ జనతా పార్టీకి లింక్‌ పెట్టడం అంత సవ్యంగా లేదు. ఎందుకంటే ‘ఆధ్యాత్మిక రాజకీయం’ అన్నమాటకు విపులంగా అర్థాన్ని రజనీకాంత్‌ ఇంకా ఇవ్వలేదు. కానీ ‘ఆధ్యాత్మిక’ తదితర సంప్రదాయ మాటలు ఎక్కడ దొర్లినా దాన్ని బిజెపితో ముడిపెట్టేయడం ప్రస్తుత పరిస్థితులో ఒక అనివార్య అంశం అయిపోయింది. ఈ విషయాన్ని ఆ నాటి చర్చలో పాల్గొన్న ఆ పార్టీ ప్రతినిధి చెప్పారు.

మరి పైన అనుకున్న ‘ఆధ్యాత్మిక రాజకీయం’ అన్నది ఇంతవరకూ ఆ రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు హేతువాద ప్రాధాన్యతలో ఉన్నాయి కనుక వారీ పదాన్ని సమన్వయ అంశంగా చూస్తారా? అంటే దానికీ ఒప్పుకోలు రీతి సమాధానం దొరకదు. ఎందుకంటే పాలకపక్షం ప్రథమ ప్రాధాన్యత వేరైనా ఆ రాష్ట్ర సంప్రదాయాల్ని, ఆలయాల్ని పెంచిపోషించే విశిష్ట రీతిలో ఉంది. అయితే వారెవరూ ఆ పార్టీకి ఓటేసి ఉండకపోతే వారలా అన్ని సార్లు అధికారం చేపట్టేవారా ? కనుక ఓ సందర్భంలో జయలలితే చెప్పినట్లు మతం అన్నది వ్యక్తిగతం. అదేవిధంగా తమిళనాట ఏ జాతీయ పార్టీ అయినా అక్కడి ప్రాంతీయ పార్టీతో అంట కాగవలసిందేనని ఓ వక్త ప్రతిధ్వనిలో ‘రాజకీయాల్లోకి రజనీ’ అంటూ జనవరి 1న రాత్రి 9 గంటలకు ప్రసారం చేసిన చర్చలో అనడం అంత సరికాదు. ఎందుకంటే ఓటర్లెప్పుడూ ఒకే రీతిలో పరిస్థితులకు స్పందించరు. ‘మార్పు కోసమే కొత్త పార్టీ’ అని చెప్తున్న రజనీకాంత్‌ హయాంలో క్షేత్రస్థాయి మార్పులు జరగొచ్చేమో చూద్దాం.

రజనీ రాజకీయ ప్రవేశ ప్రకటనకు ఇరవై ఏళ్లు పట్టినా, ప్రకటించిన మర్నాడే కార్యాచరణకు పూనుకోవడం బాగుంది. వెంటనే వెబ్‌సైట్‌ తెరవడం, సభ్యత్వానికి పేరు నమోదు చేసుకోవాలని అభ్యర్థించడం బాగుందని ఇండియా టుడే ఛానల్‌ ప్రసారం చేసిన ‘మిషన్‌ రజనీ 2021’ చర్చా కార్యక్రమంలో పేర్కొంది.

విజయం తథ్యమా?

తమిళనాట రాజకీయాలు- సినిమాలకు అవినాభావ సంబంధాలున్నా సినీగ్లామర్‌ నేపథ్యంగా నేతలవుదామని వచ్చిన వారి కలలు అంతంత మాత్రంగానే నెరవేరడం, కొన్నిసార్లు విఫలమైన వైనం కూడా అదే రాష్ట్రంలో చూశాం. కావున విజయం తథ్యమన్న భావం అన్ని వేళల్లో సాకారమవదని హితవు పలికాయి పలు చర్చలు. అందుకే ఇండియా టుడే జనవరి 1 రాత్రి నిర్వహించిన చర్చలో సినిమాల్లో ఏదైన తప్పు దొర్లితే రీటేక్‌లో సరిచెయ్య వచ్చు కానీ రాజకీయాల్లో ‘నో రీటెక్‌’ అని హెచ్చ రించింది.

‘తన వెంట వచ్చే అనుచరులు కార్యకర్తలుగా కాకుండా కాపలాదారులుగా ఉండాలి. పదవుల కోసం, సొంత పనులు చక్కబెట్టుకోవడం కోసం ఉండకూడదు.’ అన్న రజనీ ఆదేశాలు ఆచరణలో అసాధ్యం అని ప్రతిధ్వనిలో పాల్గొన్న ఓ వక్త తేల్చేశారు.

మరి రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ దేశ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూద్దాం.

– స్ఫూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *