ఒకరి వర్తమానం… మరొకరి భవిష్యత్తు ఒక్క క్షణం

ఒకరి వర్తమానం… మరొకరి భవిష్యత్తు ఒక్క క్షణం

‘గౌరవం’ చిత్రంతో కథా నాయకుడిగా పరిచయం అయిన అల్లు అరవింద్‌ తనయుడు శిరీష్‌ ఆ తర్వాత ‘కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాల్లో నటించాడు. అలానే ‘టైగర్‌’ మూవీతో టాలీవుడ్‌లోకి దర్శకుడిగా అడుగుపెట్టిన వి.ఐ.ఆనంద్‌ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి విజయవంతమైన చిత్రం రూపొందించాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఒక్క క్షణం’ మొదలు కాగానే ఇదేదో కాస్తంత కొత్తగా ఉంటుందనే భావన సాధారణ సినీ ప్రేక్షకుడికి కూడా కలిగింది.

తెలుగులో ప్యారలల్‌ లైఫ్‌ అనే కాన్సెప్ట్‌తో సినిమాలు ఇంత వరకు రాలేదు. మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో కొందరుంటారని అంటారు. అయితే ఒకరి చేతి వేలిముద్ర మరొకరితో కలవదన్నదీ అందరూ చెప్పే మాటే. కానీ ఇద్దరు వ్యక్తుల వర్తమానం మరో ఇద్దరి భవిష్యత్తు కాబోతోందన్నది వినడానికి చిత్రంగానే ఉంటుంది. అదే పాయింట్‌తో ‘ఒక్క క్షణం’ చిత్రం రూపుదిద్దు కుంది. జీవా (అల్లు శిరీష్‌) కు ఓ షాపింగ్‌మాల్‌లోని పార్కింగ్‌ ప్లేస్‌లో జ్యోత్స్న (సురభి) పరిచయం అవుతుంది. ఆ తర్వాత అది ప్రేమగా మారుతుంది. ఇంట్లో వారికి చెప్పి ఇక వివాహం చేసుకోవడమే తరువాయి అనుకుంటున్న సమయంలో జ్యోత్స్న తన అపార్ట్‌మెంట్‌ నుండి ఎదురుగా ఉండే ఓ జంటను కొంత కాలంగా గమనిస్తున్న విషయం జీవాకు చెబుతుంది. శ్రీనివాస్‌ (అవసరాల శ్రీనివాస్‌), స్వాతి (శీరత్‌ కపూర్‌) ప్రేమించి పెళ్ళిచేసుకుంటారు. కానీ వారిద్దరి మధ్య నిత్యం గొడవ జరుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి ఆవేశంలో శ్రీనివాస్‌ స్వాతి మీద చెయ్యిచేసుకుంటూ ఉంటాడు. ఈ వ్యవహారాన్ని గమనించిన జ్యోత్స్న ఆమెకు సాయం చేయాలని అనుకుంటుంది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ జరుగుతోందో తాను తెలుసుకుంటానని జీవా చెబుతాడు. ఆ ప్రయత్నంలో అతనికి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బోధపడతాయి. యేడాది క్రితం శ్రీనివాస్‌, స్వాతి జీవితంలో ఏ యే సంఘట నలు చోటు చేసుకున్నాయో అవే ఇప్పుడు తనతో పాటు జ్యోత్స్న జీవితంలో జరుగుతున్నాయి. ఇది ఎలా సాధ్యమనేది అర్థం కాదు. అయితే ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ను సంప్రదించినప్పుడు అమెరికా మాజీ అధ్యక్షులు జాన్‌ కెనడీ, అబ్రహం లింకన్‌ జీవితంలో జరిగిన సంఘటనలను ఉదహరిస్తూ అలా జరిగే ఆస్కారం ఉందని చెబుతాడు. ఇంతలో శ్రీనివాస్‌ చేతిలో స్వాతి హత్యకు గురవుతుంది. అతన్ని పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. దాంతో జ్యోత్స్న తాను కూడా జీవా చేతిలో చనిపోతానేమోనని భయపడుతుంది. మరి ఆమె భయాన్ని ప్రియుడు జీవా పోగొట్టగలిగాడా? నిజంగానే స్వాతిని శ్రీనివాసే చంపేశాడా? ఇవన్నీ ద్వితీయార్థంలో వీడే చిక్కుముడులు!

ఆసక్తికరమైన ఈ కథను తెరకెక్కించడంలో దర్శకుడు వి.ఐ. ఆనంద్‌ పూర్తిగా సఫలీకృతుడు కాలేక పోయాడు. ముఖ్యంగా ప్రధమార్థం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ప్రధానాంశంలోకి వెళ్ళడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. పైగా రెండు జంటల జీవితాల్లోనూ ఒకే రకమైన సంఘటనలు జరిగాయని చెప్పే సన్నివేశాలు బోర్‌ కొట్టే విధంగా ఉన్నాయి. ద్వితీయార్థంలో కథ కాస్తంత వేగంగా సాగింది. అయితే తిరిగి, తిరిగి కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ దురాగతాల దగ్గరకే చేరడంతో ప్రేక్షకులకు నీరసం వచ్చేస్తుంది. పతాక సన్నివేశంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కథానాయికను ‘ఒక్క క్షణం’ ఆత్మస్థైర్యంతో మెలగమంటూ ప్రధాన పాత్రలంతా చెవిన ఇల్లు కట్టుకుని కోరడంతో ఈ టైటిల్‌ పెట్టినట్టుగా ఉంది. నిజానికి ఈ కథకు ఇంతకంటే ఆసక్తికరమైన, మంచి పేరు పెట్టొచ్చు.

నటీనటుల విషయానికి వస్తే, గత చిత్రాలతో పోల్చితే అల్లు శిరీష్‌లో పరిణతి కనిపించింది. సురభి కూడా బాగానే చేసింది. అవసరాల శ్రీనివాస్‌ తన పాత్రను ఇంకాస్త బాగా చేయాల్సింది. సీరత్‌ కపూర్‌ స్వాతిగా ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఆమెను ఈ పాత్రకు ఎంపిక చేయడమే పెద్ద తప్పు. కమెడియన్‌ గా గుర్తింపు ఉన్న ప్రవీణ్‌ను హీరోయిన్‌ బావ క్యారెక్టర్‌కు తీసుకోవడం సరైన నిర్ణయం కాదు. ప్రతినాయకుడిగా దాసరి అరుణ్‌ కుమార్‌ నటించాడు. అతని ఎంట్రీ ఊహించనిది. సినిమా ప్రచారంలోనూ అతని గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా సస్పెన్స్‌ మెయిన్‌టైన్‌ చేశారు. అయితే అరుణ్‌ కుమార్‌ ఇంట్రడక్షన్‌ సీన్స్‌ కాస్తంత తేలిపోయినా ఆ తర్వాత నిదానంగా ఆ పాత్రలో అతను కుదురుకున్నాడు. హీరో తల్లిదండ్రుల పాత్రలకు కాశీవిశ్వనాథ్‌, రోహిణి న్యాయం చేకూర్చారు. సత్య చక్కని వినోదాన్ని అందించాడు. మణిశర్మ బాణీల కంటే నేపథ్య సంగీతానికే ఎక్కువ మార్కులు పడతాయి. శ్యామ్‌ కె.నాయుడు సినిమా టోగ్రఫీ బాగుంది. అబ్బూరి రవి మాటలు సహజంగా ఉన్నాయి. ఈ చిత్ర నిర్మాత చక్రి చిగురుపాటి ఇటీవలే ‘కేరాఫ్‌ సూర్య’ చిత్రం నిర్మించారు. ఆ వెనుకే వచ్చిన ఈ సినిమా సైతం ఆర్థికంగా ఏ స్థాయి లాభాలు తెచ్చి పెడుతుందనే సందేహం ఉండనే ఉంది. ఎందుకంటే ఈ తరహా చిత్రాలు అన్ని వర్గాలను అలరించవు. కేవలం థ్రిల్లర్‌ చిత్రాలను ఇష్టపడే వారికే నచ్చుతాయి. ‘ఒక్క క్షణం’ సైతం అదే కోవకు చెందిన సినిమా!

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *