ఏ క్షణమైనా

ఏ క్షణమైనా

‘త్రివేణి ఓ డాక్టర్‌. త్రివేణి నా కళ్లకు చిన్న సమస్య. నువ్వు పేరొందిన కంటి డాక్టరని నా సొంత చికిత్స చేసుకోకుండా నిన్ను అడుగుతున్నాను’ అంటూ త్రివేణి చేతులు పట్టుకొని కళ్లు మూసుకున్నాడు డాక్టర్‌ వెంకటేష్‌.

‘ఏమైంది’ భర్తను అడిగింది త్రివేణి.

‘కాసేపట్లో ఆపరేషన్‌ కేసు అటెండ్‌ చెయ్యడానికి ఆసుపత్రికి వెళ్ళాలి. భోజనం చేసి వెళ్దామని వంటగదిలోకి వెళ్తే వంట మనిషి కనపడలేదు. డైనింగ్‌ టేబుల్‌ మీద వండిన పదార్థాలు కూడా కనపడలేదు. నా కళ్లకు ఏమైనా అయిందేమో చూడవా వేణి’ అంటూ కళ్లు పెద్దగా చేస్తూ భార్య ముందుకు వంగాడు వెంకటేష్‌.

‘ఇప్పుడు నేను ట్రీట్‌మెంట్‌ చేసే పరిస్థితిలో లేను. మీరు అనస్థీషియా డాక్టర్‌ కదా ! ఏం మత్తుమందు ఇచ్చారో కాని మత్తులో దిగిపోయాను’ నవ్వుతూ అంది త్రివేణి.

‘ఇంతకూ ఈ రోజు వంట మనిషి వచ్చిందా ? రాలేదా ?’

‘సాయంత్రం సెలవు తీసుకొంటానని నిన్ననే చెప్పింది. ఉదయం వచ్చి రాత్రికి కావలసిన వంట కూడా చేసి ఫ్రిడ్జ్‌లో ఉంచుతానని చెప్పింది. ఒక్క ఐదు నిమిషాలలో వేడి చేసి పిలుస్తాను’ అంటూ వంట గదిలోకి వెళ్ళింది త్రివేణి. అప్పుడే కాంపౌండ్‌ గేట్‌ తీస్తున్న శబ్దం విని కిటికీ నుంచి తొంగి చూసింది. ట్యూషన్‌ పూర్తి చేసుకొని వస్తున్న కూతుళ్లిద్దరూ కారు దిగుతున్నారు. త్రివేణి వంట పదార్థాలను ఒక్కొక్కటిగా వేడి చేసి డైనింగ్‌ టేబుల్‌ మీద ఉంచుతోంది. తొమ్మిదవ తరగతి చదువుతున్న నవ్య లోపలికి వచ్చి ‘అమ్మ డ్రైవర్‌ కారు తాళాలు ఇచ్చి ఇంటికెళ్లాడు. మీతో చెప్పమన్నాడు. అక్కయ్య స్కూటీలో పెట్రోల్‌ పోయించుకోడానికి వెళ్ళింది’ అని చెప్పింది.

‘ఉదయం పోయించుకోవచ్చుగా ఇప్పుడే ఎందుకెళ్లింది ?’

‘నాకేం చెప్పలేదు. నువ్వే అడుగమ్మా’ అంది నవ్య.

‘వచ్చాక అడుగుతాలే. నువ్వు వెళ్లి మీ నాన్నను భోజనానికి రమ్మను. ఆపరేషన్‌ కేసు అటెండ్‌ చేయాలట. భోజనం చేసి వెళతారు. నువ్వు కూడా భోజనం చేస్తావా’ అడిగింది త్రివేణి.

‘తర్వాత తింటానమ్మ’ అని చెప్పి లోపలికెళ్ళింది నవ్య.

వెంకటేష్‌ రాగానే అన్నం వడ్డించింది త్రివేణి. సరదాగా కబుర్లు చెబుతూ వెంకటేష్‌ అన్నం తింటున్నాడు. ‘మీరు ఈ రోజు తప్పనిసరిగా ఆపరేషన్‌ అటెండ్‌ చెయ్యాలా’ ఉన్నట్లుండి గంభీరమైన ముఖంతో అడిగింది త్రివేణి.

‘త్రివేణి ఏమైంది అలా అడుగుతున్నావు ?’

‘నేను కంటి డాక్టర్‌ని కావడం వల్ల నాకు ఎప్పుడూ పగటి పూట ఉద్యోగం. మీరేమో ఈ మధ్య ఎక్కువగా రాత్రి వేళలో ఆపరేషన్‌ కేసులంటూ వెళుతున్నారు. నేనున్నప్పుడు మీరుండరు. మీరున్నప్పుడు నేనుండను. నాకు గదిలో ఒంటరిగా ఏదో చెప్పలేని వెలితిగా ఉంది. డబ్బే సర్వస్వం కాదని మనిద్దరికీ తెలుసు. అయినా మనం ఆ డబ్బు వలలో చిక్కుకొంటున్నామన్న భావన కలుగుతోంది’ అంది త్రివేణి.

‘నాకు ఆసుపత్రిలో ఒక ఆపరేషన్‌కు ఎంతిస్తారో నీకూ తెలుసు కదా ! అంత డబ్బు వదులుకోడానికి నాకు మనసు రావడం లేదు. అంతేకాకుండా ఒకవేళ వాళ్లు పిలిచినప్పుడు వెళ్లపోతే మరో డాక్టర్‌ రెడీగా ఉంటాడు. అవకాశాలు వదులుకుంటే ఆ తరువాత మనం కోరుకున్నా దొరకవు. ఈ పోటీ ప్రపంచంలో కష్టపడితేనే మన సంపదకు లోటుండదు’ అన్నాడు వెంకటేష్‌.

‘అదేనండి డబ్బు చేసే మాయ. కాని దాని వల్ల మీ ఆరోగ్యం కూడా దెబ్బ తినడానికి అవకాశం ఉంది’

‘ఒప్పుకుంటాను కాని అలా కష్ట పడటం వల్లే సిటీ సెంటర్లో పోయిన సంవత్సరం ఈ కొత్త ఇల్లు కట్టుకొని ఇక్కడికి రాగలిగాం కదా.

‘అమ్మా నేను కూడా భోజనం చేస్తాను. ఈ రోజు రిలీజైన సినిమా టికెట్ల కోసం ఉదయం నుంచి మా ఫ్రెండ్స్‌ ఆన్‌లైన్‌లో ఎంతగానో ప్రయత్నించారు. ఫస్ట్‌ షోకి పదకొండు టికెట్లు మాత్రమే ఖాళీగా ఉండటం చూసి మానుకున్నారు. మేం మొత్తం పన్నెండు మందిమున్నాం. అప్పటికీ నేను రానన్నాను. కాని వాళ్లు ఒప్పుకోలేదు. మళ్లీ ప్రయత్నిస్తే సెకండ్‌ షోకి దొరికాయి. అందుకే రాగానే స్కూటీలో పెట్రోల్‌ పోయించుకోడానికి వెళ్లాను’ అంది ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న లక్షణ్య.

‘ఏ థియేటర్‌’ అడిగింది త్రివేణి. థియేటర్‌ పేరు చెప్పింది లక్షణ్య.

‘ఇక్కడి నుండి ఎవరైనా వస్తున్నారా ?’ మళ్లీ అడిగింది త్రివేణి.

‘లేదమ్మా అందరూ థియేటర్‌కు అటు వైపున్న వాళ్ళే. నేనొక్కదాన్నే’ అంటూ తండ్రి వైపు చూసింది.

‘లక్షణ్య సెకండ్‌ షో అంటే అర్థరాత్రి దాటుతుంది. నువ్వు ఒంటరిగా ఎలా వస్తావ్‌ ? వద్దమ్మ మంచిదికాదు. నువ్వు సినిమాకు వెళ్లొద్దు’ అన్నాడు వెంకటేష్‌.

‘నేను వెళ్లకపోతే వాళ్ళు కూడా వెళ్లరు. ఇంటికి వెళ్ళిపోతారు’ అంది లక్షణ్య.

‘అదేంటి ?’ అడిగాడు వెంకటేష్‌

‘టికెట్స్‌ బుక్‌ చేసిన తర్వాత ఏ ఒక్కరు రాక పోయినా అందరూ ఇంటికెళ్లాలన్న రూల్‌ నేనే పెట్టాను. రెండు నెలల క్రితం మాలో ఒకరు రానందున సినిమా చూడకుండా అందరం ఇంటికి వెళ్ళాం. పాపం ఇప్పటికీ మేం ఆ విషయం గురించి ఆ అమ్మాయిని ఆట పట్టిస్తుంటాం’ అంది లక్షణ్య.

‘ఈ రోజు టికెట్స్‌ రద్దు చెయ్యు. మీ అందరికి రెండ్రోజుల్లో ఫస్ట్‌ షోకి నేను టికెట్స్‌ బుక్‌ చేస్తాను’ అన్నాడు వెంకటేష్‌.

‘వద్దు నాన్నా. అలా చేస్తే నేను వాళ్ల ముందు తలెత్తుకోలేను’ అంది. అంతలో వెంకటేష్‌ సెల్‌ మోగింది. ‘లక్షణ్య నువ్వు లోపలికి వెళ్లు. నేను తర్వాత మాట్లాడుతాను’ అన్నాడు వెంకటేష్‌.

ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ‘త్రివేణి నన్ను వెంటనే బయల్దేరి రమ్మన్నారు. లక్షణ్య సెకండ్‌ షోకు ఎలాగైనా వెళ్లాలన్న పట్టుదలతో ఉన్నట్లుంది. కాని మనం అనుమతించడం కరెక్ట్‌ కాదనిపిస్తుంది. ఈ రోజు ఆపరేషన్‌ కేసు లేపోతే నేనే తీసుకెళ్లేవాడిని. నేను వెళ్లిన తర్వాత లక్షణ్య నిన్ను అడుగుతుంది నువ్వేం చెబుతావ్‌?’ అడిగాడు వెంకటేష్‌.

‘అర్థమయ్యేలా చెబుతాను’

‘ఒకవేళ వెళ్తానని పట్టుపడితే ఏం చేస్తావ్‌ ?’ మళ్లీ అడిగాడు వెంకటేష్‌.

‘అదే ఆలోచిస్తున్నా. ముందైతే మీరు వెళ్ళండి. నేను చూసుకొంటాను’ అని చెప్పింది త్రివేణి.

వెంకటేష్‌ వెళ్లిన తర్వాత త్రివేణి కుర్చీలో కూర్చొని అన్ని కోణాల్లో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. లక్షణ్య గదికి వెళ్దామనుకుంది. ఇంతలో తనే వంటగదిలో నుంచి బయటకు వచ్చి ‘అమ్మ నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. మీ భయం నాకూ తెలుసు. మన దేశంలో జరిగే అత్యాచారాలు ప్రతిరోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నా. కాని ఇంత భయం అవసరం లేదు. స్కూటీ తీశానంటే సరిగ్గా ఆరు నిమిషాలలో థియేటర్‌ దగ్గరుంటాను. ఈ ఆరు నిమిషాల్లో మీరు భయపడేలా ఏదీ జరగదమ్మా’ అంది.

‘ఆరు నిమిషాలంటే మూడువందల అరవై క్షణాలు. ఈ మూడువందల అరవై క్షణాలలో ఏ క్షణమైనా ఏమైనా జరగొచ్చు. అదే నా భయం. మనం ప్రతీ క్షణం జాగ్రత్తాగా ఉండాలి’ అంది త్రివేణి.

‘అమ్మా ప్రయాణం మొత్తం మెయిన్‌ రోడ్‌ మీదుగానే కదా. అక్కడక్కడా సిసి టివి కెమెరాలు కూడా ఉన్నాయి. నాకు అంతా తెలుసమ్మా’

‘నీకు ఆ కెమెరాలున్న సంగతి మాత్రమే తెలుసు. కాని ఆ కిరాతకులకు ఏది పని చేస్తుందో ఏది పని చేయడంలేదో అన్ని తెలుసు. నేను అన్ని విధాలా ఆలోచించి చెబుతున్నాను నువ్వు వెళ్లడం మంచిదికాదు’ అని మెల్లగా నచ్చజెప్పింది త్రివేణి.

‘చిన్న చిన్న కోరికలకు కూడా అడ్డు చెబుతున్నారు. ఇంట్లో అందరూ చదువుకున్న వారే అయినా నాకు స్వేచ్ఛ లేదు’ అంది లక్షణ్య.

‘లక్షణ్య నీ చిన్న కోరికకు అడ్డు చెబుతున్నామని చాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్‌. మేమెప్పుడూ నీ నిర్ణయాలను గౌరవిస్తూనే ఉన్నాం. ఈ ఇల్లు కూడా నీ నిర్ణయం ప్రకారమే కట్టించాం కదా ? నీకు కేటాయించిన గదిని నువ్వు నచ్చలేదని చెప్పావ్‌. నీ ప్లాన్‌ ప్రకారమే కట్టించాలన్నావ్‌. ఆ ప్లాన్‌ చూసిన బిల్డర్‌ ‘సార్‌ మీ అమ్మాయి చిన్న పిల్ల. ఆమె ప్లాన్‌ ప్రకారం కట్టించాలంటే దీన్ని మళ్లీ పడగొట్టాలి. అందువల్ల మీకు పది నుండి పన్నెండు లక్షలు అదనంగా ఖర్చవుతుంది. మీ అమ్మాయికి సర్ది చెప్పండి’ అని చెప్పాడు. అయినా నేను, మీ నాన్న ఆ మాటలు లెక్క చేయకుండా నువ్వు చెప్పిన విధంగానే మార్పు చేయించాం. నీ నిర్ణయాలను గౌరవించినందుకు మాకిచ్చిన బిరుదు బాగుంది. మేం నీ స్వేచ్ఛకు అడ్డుగా ఉన్నామా ?’ అంటూ త్రివేణి బాధ పడింది.

‘నా ఐడియా ప్రకారం ఇంటిని మార్చినందుకు పది లక్షలు ఖర్చయిందా? నాకెందుకు చెప్పలేదమ్మా ? అంత పెద్ద విషయాన్ని అంగీకరించిన మీరు సెకండ్‌ షోకి వెళ్ళడానికి అంగీకరించకపోవడం ఏంటమ్మా ? ఈ మధ్య మన సిటీ పోలీస్‌ కమిషనర్‌ ‘సిటీలో అల్లరి మూకల్ని చాలా వరకు అరికట్టాం. ఆడవాళ్లు నిర్భయంగా ఉండొచ్చు’ అన్నారమ్మా.

‘అదే కమిషనర్‌ ‘మీతో పాటు మీ సోదరుడు లేదా డ్రైవర్‌ను తీసుకెళ్లడం మంచిదని’ చెప్పారు వినలేదా ? మన డ్రైవర్‌ కొత్తగా పనిలో చేరాడు. బాగా నమ్మకం కుదిరితేనే ఇటువంటి పనులకు తీసుకెళ్లాలి. లేకపోతే నీకు డ్రైవర్నే ఇచ్చి పంపేదాన్ని’ అంది త్రివేణి.

‘నువ్వు ఏదైనా చెప్పు వింటాను. కాని ఈ ఒక్కసారి వెళ్లనివ్వు. లేకపోతే నా పరువు పోతుంది. మా అందరికి ఫేవరేట్‌ హీరో సినిమా అది. ప్లీజ్‌ అమ్మ ఒప్పుకో’ అని తల్లిని బ్రతిమాలింది లక్షణ్య.

——-      ——

టూవీలర్‌ను పార్కింగ్‌ చేస్తున్నప్పుడు తనలాగే చాలా మంది అమ్మాయిలు సినిమాకు రావడం గుర్తించి ‘మా అమ్మా, నాన్నలు ఇంకా బి.సి.ల్లోనే ఉన్నారు. వాళ్లు అనవసరంగా భయపడి నన్నూ భయపెట్టారు’ అనుకొంది లక్షణ్య.

తల్లికి ఫోన్‌ చేసి థియేటర్‌ లోపలికి వెళ్తున్నాని చెప్పింది.

అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం విశ్రాంతి సమయంలో ‘ఇప్పుడు బ్రేక్‌ టైం’ అని త్రివేణికి మెసేజ్‌ చేసింది. సమోసాలు తీసుకురావడానికి క్యాంటీన్‌ వైపు వెళ్ళింది లక్షణ్య. అప్పుడే తల్లి దగ్గర నుంచి ఫోన్‌ వచ్చింది. క్యాంటీన్‌లో ఓ మూలకున్న స్తంభం చాటున వెళ్లి మాట్లాడింది. ఫోన్‌ కట్‌ చేసి ముందుకొస్తున్న సమయంలో ఒక ఆగంతకుడు ఫోన్‌లో మాట్లాడుతున్న మాటలు విని ఉలిక్కి పడింది.

‘ఆ ఆగంతకుడి టార్గెట్‌ నేనా ? లేక వేరే వాళ్లా ?’ అని భయపడింది లక్షణ్య. కాస్త దూరంగా వెళ్లి వాడిని చూడడానికి ప్రయత్నించింది. వాడు గుంపులో కలసి వెళ్లి పోయాడు. లక్షణ్యకు వాడి దుస్తులు మాత్రమే గుర్తున్నాయి. ఆ సంఘటనతో మనసులో అలజడి, భయం ఏర్పడింది. సమోసాలు తీసుకొని లోపలికి వెళ్లింది. ఆ సమయానికే సినిమా ప్రారంభం కావడంతో ఆ విషయం ఎవరితో చర్చించలేదు. కొద్దిసేపటికి సినిమాలో మునిగిపోవడంతో లక్షణ్య మనసులో ఏర్పడిన అలజడి తొలగిపోయింది.

సినిమా అయిపోయింది. అందరూ బై బై చెప్పుకొని వెళ్లిపోయారు. లక్షణ్య పార్కింగ్‌ వైపు వెళ్లింది. ఇంటర్వెల్‌లో జరిగిన సంఘటన గుర్తుకు రాగానే లక్షణ్యకు గుండెలో ఏదో తెలియని అలజడి మొదలైంది. భయం భయంగా హ్యాండ్‌బాగ్‌లో ఉన్న తాళం చెవులు తీసుకొని స్కూటీ దగ్గరకు వెళ్ళింది.

‘లక్షణ్య’ అన్న పిలుపు విని ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా నిలబడి ఉన్న తల్లి త్రివేణిని చూడగానే ఆశ్చర్యం, సంతోషం కలగలిపిన గొంతుతో ‘అమ్మ’ అని దగ్గరకు వెళ్లింది.

‘సినిమా అయిపోయిన తర్వాత నిన్ను తీసుకురావాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. నవ్య బయట కారు దగ్గరే ఉంది. స్కూటీ రేపు తీసుకుంటా మని వాచ్‌మెన్‌కు చెప్పేశాను’ అంది త్రివేణి.

అందరూ కారెక్కారు. ‘అమ్మా కారు ఎక్కడా ఆపొద్దు’ అంది లక్షణ్య.

‘ఈ సమయంలో పిడుగులు పడినా ఆపను’ చెప్పింది త్రివేణి.

—-  —–

‘అమ్మ ఈరోజు నేను నీ పక్కనే పడుకొంటాను’ అంది లక్షణ్య.

లక్షణ్య ప్రవర్తన వింతగా తోచింది త్రివేణికి. కొత్తింటికి వచ్చాక ఇదే మొదటిసారి లక్షణ్య ఇలా భయపడటం. ‘సరేరా నువ్వేం భయపడొద్దు. నేనున్నాను కదా ! వచ్చి పడుకో’ అంటూ చేతిలో ఉన్న పుస్తకాన్ని పక్కన పెట్టింది త్రివేణి. ‘నన్ను క్షమించమ్మ’ అని త్రివేణి కాళ్ళ మీద పడి విలపించసాగింది లక్షణ్య. ఏం జరిగిందో అర్థంకాక త్రివేణి ఆశ్యర్యపోయింది. ‘ఏమైందిరా ? ఎందుకు ఏడుస్తున్నావ్‌ ?’ అడిగింది త్రివేణి

థియేటర్‌లో బ్రేక్‌ టైంలో లక్షణ్యకు ఎదురైన సంఘటనను త్రివేణికి వివరించింది. ఆ కిరాతకుడు ఫోన్‌లో ‘పిల్ల చాలా బాగుంది. టూవీలర్‌పై మనం కలుసుకునే చోట రోడ్డు మీద ఒక్కతే వెళ్లడం గమనించాను. ఆ తరువాత సినిమా థియేటర్లోకి వెళ్తున్నప్పుడు చూశాను. ఈ రోజు ఎలాగైనా మనం దాన్ని కిడ్నాప్‌ చేసి కారులో తీసుకెళ్దాం. నువ్వు కారు తీసుకొని అక్కడ ఎదురు చూస్తూ ఉండు’ అన్న ఆ ఆగంతకుడి మాటలు తల్లితో చెప్తూ ఏడ్చింది.

‘వాడి మాటలకు ఇంతలా భయపడ్డావా ?’ అంటూ మెల్లగా లక్షణ్య తలను నిమిరింది త్రివేణి.

‘వాడి ముఖం చూడక పోయినా వాడి ఆకారం, దుస్తులు నాకు బాగా గుర్తున్నాయి. మనం కారులో వస్తున్నప్పుడు వాడు దారి మధ్యలో వేరే వ్యక్తితో కలిసి అక్కడ ఎదురు చూస్తున్నాడు. నేను చాలా భయపడ్డాను. మీరు వద్దన్నా వినకుండా సినిమాకు వెళ్లాను. ఒకవేళ నువ్వు థియేటర్‌కి రాకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో ? నన్ను చాలా పెద్ద గండం నుండి కాపాడావమ్మా. ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని నువ్వు చెప్పిన మాటలు నూటికి నూరుపాళ్ళు నిజం. ఈ రోజు నేను చేసిన పనికి నన్ను క్షమించమ్మా’ అని తల్లిని గట్టిగా పట్టుకొని ఏడ్చింది లక్షణ్య.

– ఓట్ర ప్రకాష్‌ రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *