ఏకైక బ్రహ్మ ఆలయం పుష్కర్‌

ఏకైక బ్రహ్మ ఆలయం పుష్కర్‌

మనదేశంలో నిత్య పూజలందుకొంటున్న ఏకైక బ్రహ్మ దేవాలయం రాజస్థాన్‌ రాష్ట్రంలోని అజ్మీర్‌కు 22 కిలోమీటర్ల దూరంలో గల పుష్కర్‌లో ఉంది. అజ్మీర్‌ నుండి పుష్కర్‌ వెళ్లడానికి సిటీ బస్సులు ఉన్నాయి. పుష్కర్‌ అంటే పెద్ద సరస్సు. ఆ సరస్సు పక్కనే బ్రహ్మదేవుడి ఆలయం ఉంది. పద్మ పురాణాన్ని అనుసరించి ద్వాపరయుగంలో వజ్రనాభుణ్ణి వధించడానికి బ్రహ్మ తన ఆయుధమైన తామర పుష్పాన్ని ప్రయోగించినపుడు కొన్ని తామర రేకులు పడిన ప్రదేశమే ఈ పుష్కర్‌. అందుకే ఈ ప్రాంతం అంతగా ప్రాముఖ్యం చెందింది.

బ్రహ్మ దేవుడు ఈ ప్రాంతంలో యజ్ఞం చేసినట్లు చరిత్ర చెబుతోంది. అందువల్లనే పుష్కర్‌ చాలా ప్రసిద్ది చెందిందని స్థానికులు చెబుతారు. బ్రహ్మ దేవుడు యజ్ఞం చేసేటప్పుడు కాపలాగా తూర్పున సూర్యగిరి, దక్షిణాన రత్నగిరి పడమర దిక్కున సంఖోరా, ఉత్తర దిక్కున నీలగిరి పర్వతాలను సృష్టించాడు. సరస్వతీ దేవి ఆ యజ్ఞానికి సరైన సమయానికి రాలేకపోయింది. అప్పుడు అక్కడున్న గుర్జార్‌ అమ్మాయిని పాలతో అఖిషేకించి, గాయత్రిగా అమృతభాండాన్ని పట్టించి బ్రహ్మ పక్కన కూర్చోబెట్టి యజ్ఞం సకాలంలో నిర్విఘ్నంగా, శాస్త్రోక్తంగా, వేదవిధిగా, కాలతీతం కాకుండా జరిపించారు. తర్వాత ఆలస్యంగా వచ్చిన సరస్వతీ దేవి యజ్ఞంలో తన బదులు గాయత్రి ఉండుట చూచి అసూయ చెంది, కోపంతో బ్రహ్మ దేవుడికి ప్రపంచంలోని ఏ ఆలయంలో కూడా పూజలు జరగకూడదని శపించి, తర్వాత పశ్చాత్తాపం చెంది బ్రహ్మ స్వయంగా యజ్ఞం చేసిన ఈ ఒక్క ప్రదేశంలోనే బ్రహ్మదేవుడికి నిత్య పూజలు జరుగుతాయిని తెలిపింది.

పుష్కర్‌లోని బ్రహ్మదేవుని ఆలయం 700 మీటర్ల ఎత్తు ఉంటుంది. బ్రహ్మదేవుడి వాహనమైన హంస ఆలయ గోపురంపైన ఉంటుంది. గర్భగుడి ఎదురుగా వెండి తాబేలు దర్శనమిస్తుంది.

బ్రహ్మదేవుడి నాలుగు తలలు నాలుగు వేదాలకు ప్రతీకలు. బ్రహ్మకు నాలుగు చేతులు. ఒక చేతిలో రుద్రాక్షమాల (కాలానికి ప్రతీక), రెండవ చేతిలో కమండలం (నీటికి ప్రతీక), వేరొక చేతిలో దర్బ (త్యాగానికి ప్రతీక), మరొక చేతిలో పుస్తకం (తెలివికి సంకేతం) ఎడమ పక్కన సావిత్రితో, కుడి పక్కన సరస్వతీదేవితో కాలు ముడుచుకొని కూర్చుని ఉన్న భంగిమలో నిత్య పూజలు, హారతులు, నైవేద్యాలు, వేదోక్తంగా గుల్జారు వంశస్థులైన, ఏరాశర గోత్రం వారైన సన్యాసులచే అందుకుంటూ భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ గుడిని విశ్వామిత్రుడు నిర్మించాడని 8వ శతాబ్దంలో శ్రీ శంకరాచార్యులు దీన్ని పునరుద్దరించా రని, తర్వాత జవత్‌రాజ్‌ మహారాజు నేటి దేవాలయాన్ని పునరిద్దరించాడని తెలుస్తోంది.

ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ టైమ్స్‌

ప్రపంచంలోని 10 ముఖ్యమైన దేవాలయాల్లో పుష్కర్‌లోని బ్రహ్మగుడి పవిత్రమైన, మతపరమైన పుణ్య స్థలంగా గుర్తింపు పొందింది.

ఎలా వెళ్ళాలి ?

మన దేశంలోని అన్ని ప్రముఖ ప్రాంతాల నుంచి రాజస్థాన్‌ వెళ్లడానికి విమాన, రైల్వే సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌ నుండి అజ్మీర్‌ 1808 కిలోమీటర్లు. రైల్లో 2 రోజుల ప్రయాణం. అజ్మీర్‌ చాలా పెద్ద పట్టణం. అక్కడ చాలా ¬టళ్లు, లాడ్జీలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో మన తెలుగువారు తినే భోజనం దొరకదు. బ్రెడ్‌, పూరి, చపాతి, రొట్టెలు, పండ్లు, అటుకుల ఉప్మా, బోండాలు వగైరాలు విరివిగా దొరుకుతాయి. పర్యాటకులు బస చేసేందుకు అజ్మీర్‌ రైల్వే స్టేషన్‌కు దగ్గరలోనే అనేక లాడ్జీలు, అద్దె గదులు అందు బాటులో ఉన్నాయి. అజ్మీర్‌లో తయారుచేసే కలాకాన్‌ స్వీటు దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ది చెందింది. ఆ స్వీటు చాలా రుచిగా ఉంటుంది.

– ఎస్‌.వి.ఎస్‌.భగవానులు, విశ్రాంత డివిజనల్‌ ఇంజనీరు, ఎ.పి. ట్రాన్స్‌కో, ఒంగోలు, 9441010622

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *