ఎలగందల్‌ కోట

ఎలగందల్‌ కోట

పర్యాటకం, ఆహ్లాదం రెండూ విడదీయరాని అంశాలు. భౌగోళిక శాస్త్రం ప్రకారం పర్యాటకం అనేక అంశాల కలయిక. ఇందులో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలతో పాటు అన్వేషణాంశాలు, సామాజిక ప్రక్రియలుంటాయి. అయితే ‘క్యాంబెల్‌’ నిర్వచనాన్ని అనుసరించి భౌగోళిక పర్యాటకం ఆ ప్రాంతీయ విషయాలను విశ్లేషిస్తుంది.

తెలుగు రాష్ట్రాలు రెండు భాగాలుగా విడిపోయాక తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, గత వైభవం, నాగరికతలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఈ ప్రాంతాన్ని పూర్వం రాజులు పాలించే వారు గనుక తెలంగాణలో అద్భుతమైన కోటలు, కట్టడాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. వాటిల్లో ఆనాటి రాజుల శాసనాలు, వారు ముద్రించిన నాణాలతో పాటు రాజ పాలన తాలూకు తీరు తెన్నులు, రాజవంశీయుల కళాపోషణ, శిల్పకళా వైభవం నాటి చరిత్రకు సాక్షిగా నిలుస్తున్నాయనడంలో సందేహం లేదు.

అయితే నేడు రాష్ట్రంలోని కొన్ని కోటలు పర్యాటక కేంద్రాలుగా మారి ప్రజల్ని ఆకర్షిస్తుంటే, కొన్ని శిథిలావస్థలో అఘోరిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇంచుమించు 28 కోటలు పర్యాటక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. అటువంటి వాటిలో కరీంనగర్‌లోని ‘ఎలగందల్‌ కోట’ కూడా ఒకటి. దీనినే ‘ఎలగందల్‌ ఖిల్లా’ అని కూడా అంటారు.

ఈ కోట కరీంనగర్‌ పట్టణం నుంచి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో కరీంనగర్‌ – వేముల వాడ రోడ్డు మార్గంలో అందమైన తాడిచెట్ల మధ్యలో ఉండి పర్యాటకుల్ని అమితంగా ఆట్టు కుంటోంది.

ఎలగందల్‌ కోటకు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. కాకతీయులు, ఢిల్లీ సుల్తానులు, కుతుబ్‌ షాహీలు, మొగల్‌ చక్రవర్తులు, నిజాం నవాబులు ఈ కోట నుంచే తమ పరిపాలనను సాగించారు. ఇది ఎక్కువ కాలం నిజాం సర్కార్‌ నియంత్రణలోనే ఉండేది. నిజాం పాలనలో ఈ కోట కరీంనగర్‌కు ప్రధాన కార్యాలయంగా ఉండేదని చరిత్ర చెబుతోంది.

కోట లోపలికి వెళ్లేకొద్దీ మనం తప్పకుండా ఆశ్చర్యానికి గురవుతాం. శత్రువులు కోటలోనికి ప్రవేశించడానికి వీలు లేని విధంగా దీన్ని రూపొందిం చారు. అటువంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను మనం ఇక్కడ నేటికీ చూడొచ్చు.

శత్రువుల నుండి దాడులను నిరోధించడానికి పాలకులు కోట చుట్టూ సుమారు 5 మీటర్ల (116 అడుగుల) వెడల్పు, 4 మీటర్ల (14 అడుగులు) లోతైన నీటి కందకాన్ని రక్షణగా ఏర్పాటు చేశారు. అందులో మొసళ్లను వదిలిపెట్టేవారు. ‘ఈద్‌’ ప్రార్థనల కోసం ప్రత్యేకమైన మసీదును కూడా ఈ కోటలో నిర్మించారు.

కోటపై భాగంలో నాలుగు దిక్కులా ఫిరంగి దళాలు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా అక్రమంగా కోటలోనికి ప్రవేశించాలని ప్రయత్నిస్తే వారిని అక్కడే నిలువరించేవారు. ఎలగందల్‌ గ్రామంలో ఉన్న ‘చింతామణి’ చెరువు వద్ద క్రీ.శ. 1202 నాటి శిలా శాసనాన్ని మనం ఇప్పటికీ చూడొచ్చు. ఈ శాసనంలో కాకతీయ గణపతిదేవుని సేనానియైన ‘చండప్రగడ’ కాలంలో విద్వాంసులైన శ్రీకరుణ, బసవాజీలకు నరసింహదేవర పేరుతో ఉన్న మాన్యాలను దానమిచ్చినట్లు చరిత్ర చెబుతోంది. చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే కరీంనగర్‌ జిల్లాలో ఈ ప్రాంతాన్ని అయిదుగురు సామ్రాజ్యాధిపతులు పాలించారని మనకు అర్థమవుతుంది.

పురాతన జ్ఞాపక చిహ్నాలుగా కొండపై భాగంలో గల కోట, తూర్పు ద్వారానికి వెలుపలనున్న ‘బృందావన సరస్సు’ మనకు కనిపిస్తాయి. దీన్ని 1774 ఎ.డి.లో ఫాపర్‌ ఉద్‌ దౌలా నిర్మించాడని తెలుస్తోంది.

ముసల్మాన్‌ సన్యాసులైన సయ్యద్‌ షాహ్‌, మానావర్‌ కాద్రి సాహెబ్‌, దులాషాహ్‌ సాహెబ్‌, సయ్యద్‌ మరూప్‌ సాహెబ్‌, షాహ్‌ తావిట్‌, బిస్మిల్లా సాహెబ్‌, హైదర్‌ సాహెబ్‌ సమాధులను కదిలించినపుడు ఇక్కడున్న మినార్‌లు ఊగుతాయి. ఈ మినార్లు ఎక్కేందుకు లోపల నుంచి మెట్లు కూడా ఉన్నాయి. కరీనంగర్‌- వేములవాడ రహదారిలో ఎలగందల్‌ కోట నుంచి ‘మానకొండూర్‌’ వరకు 9 కిలోమీటర్లు మేర రహస్య సొరంగం ఉందని నేటికీ ఈ ప్రాంతవాసులు నమ్ముతున్నారు.

దీనికి ‘వెలుగందుల కోట’ అని కూడా పేరుంది. ఈ కోటను కాకతీయ ప్రభువుల కాలంలో (1083-1323) నిర్మించారు. యోధులైన మాసునూరి నాయక్‌, రాచర్ల పద్మ నాయక్‌లు దీని నిర్మాణంలో పాలుపంచుకున్నారు. అయితే 16వ శతాబ్దాంలో కుతుబ్‌షాహీ వంశీయులు ఈ ఎలగందల్‌ కోటను ఆక్రమించుకున్నారు. ‘కుయినముల్‌ ఉల్‌’ ను కమాండర్‌గా వారు నియమించారు. అనంతరం మొఘల్‌ సామ్రాజ్య ఆధీనంలోకి ఇది వెళ్లిపోయింది.

హైదరాబాద్‌ నిజాం ఉల్‌ముల్క్‌ అసఫ్‌జాహ్‌ హయాంలో అమిన్‌ఖాన్‌ ఎలగందల్‌కు ‘ఖిలేదార్‌’ అయ్యాడు. సికందర్‌ ఝూ (1803-1823) హయాంలో 1754లో ‘దంసా’ ఈ కోటను పునర్నిర్మాణం చేశాడు. బహదూర్‌ ఖాన్‌, కరీముద్దీన్‌లు అనంతర కాలంలో ఖిలేదార్లుగా పనిచేశారు. ఆనాటి కరీముద్దీన్‌ పేరునే ఈ పట్టణానికి పెట్టారు.

కాలక్రమంలో 1905లో జిల్లాల పునర్వ్యవ స్థీకరణ సమయంలో ఆరవ నిజాం మహబూబ్‌ ఆలీఖాన్‌ జిల్లా కేంద్రాన్ని ఎలగందల్‌ నుంచి కరీంనగర్‌కి మార్చాడు.

ఎలా వెళ్లాలి ?

రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ పట్టణాల నుంచి హైదరాబాద్‌కు బస్సు, రైలు సౌకర్యాలున్నాయి. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌ 150 కిలోమీటర్లు. కరీంనగర్‌ నుంచి ఎలగందల్‌ కోట 13 కిలోమీటర్లు.

– డా|| మంతెన సూర్యనారాయణ రాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *