ఎన్నికల వేడి

ఎన్నికల వేడి

కర్ణాటకలో మే 12న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం జాతీయ, ప్రాంతీయ మీడియా దృష్టి కేంద్రీకరించింది. అందులో భాగంగానే ఎన్‌డి టివి (24 I 7) ఏప్రిల్‌ 30న మధ్యాహ్నం 2 గంటలకు కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఓ విశ్లేషణాత్మక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఆ వివరాలు ఓసారి పరిశీలిద్దాం.

ఈ కార్యక్రమం కర్ణాటకలోని సిరాహట్టి ప్రాంతం నేపథ్యంగా, మధ్య మధ్యలో అక్కడ పోటీ పడుతూ రాజకీయ భవిష్యత్తు కోసం సాధ్యమైనంత పెద్దఎత్తున కసరత్తులు చేస్తూ తమ సర్వశక్తులొడ్డుతూ ప్రయత్నిస్తున్న నాయకులూ, మతగురువుల అభిప్రాయాలను వివరిస్తూ ఆసక్తికరంగా సాగింది. ఈ విశ్లేషణను ప్రణవ్‌రాయ్‌ ఆధ్వర్యంలో నలుగురు ప్రముఖ పాత్రికేయుల బృందం జరిపింది.

ఇప్పటివరకు పధ్నాలుగు ఎన్నికలు చూసిన కన్నడీయుల్లో వాటన్నిటినీ అలవోకగా స్పృశించిన ఈ కార్యక్రమం (‘బేటిల్‌ గ్రౌండ్‌’ పేరిట ఈ ప్రోగ్రాం ప్రసారమైంది) ప్రధానంగా ఇటీవల అంటే 2013లో జరిగిన ఎలక్షన్లను వేదికగా చేస్తూ ఆరంభమైంది. ఈ కార్యక్రమంలోనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పినట్లు ఎవరు ఎంతగా గింజుకున్నా దేశంలో అవాంఛనీయ కులాలవారీ విభజన, లెక్కింపు ఉంది. అయితే వ్యక్తిగతంగా తాను కుల విధానానికి వ్యతిరేకమని ఆయన సూటిగా చెప్పారు. అది వేరే విషయం. అయితే కర్ణాటకలో కుల పోరు కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సంగతి అక్కడి రాజకీయ నాయకులు చేస్తున్న వరుస యాత్రల విధానమే చెప్తోంది.

కర్ణాటకలో లింగాయతులు-62, ఎస్‌సి-1, ఎస్‌టి-62, ఒక్కళిగులు- 43, ముస్లింలు – 24, ఇతరులు – 33 (మొత్తం 224 నియోజక వర్గాలు) నియోజక వర్గాల్లో ప్రాబల్యం కలిగి ఉన్నారు. అందు చేత ఆయా వర్గాలకు చెందినవారికి అభ్యర్థిత్వాలను ఖరారు చేయడం తప్పదన్నట్లుగా ఇందులో విశ్లేషణ చేశారు. అయితే ఆయా ప్రాంతాల అత్యధిక సంఖ్యాకుల గణన ప్రాతిపదికగా అభ్యర్థులను నిలబెట్టకపోయినా ఉత్తరప్రదేశ్‌లో నిలబడిన అభ్యర్థుల సమర్థత ఆ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసిన సంగతిని ఈ విశ్లేషణ కార్యక్రమం విస్మరించడం సరిగా లేదు.

ఇప్పుడు కొత్త పథకాలా ?

కార్యక్రమంలో సిఎం సిద్ధరామయ్యను ఏ రాష్ట్రంలోనైనా పార్టీ విధి, విధానాలు ఎలా ఉన్నా ఎన్నికలకు కొన్ని నెలల ముందు శక్తివంతమైన కొత్త నిర్ణయాలు చేయడం పరిపాటే. అదే పంథాలో మీరు లింగాయతులను ప్రత్యేక మైనార్టీ మతంగా గుర్తించారా ? అని అడిగారు. దానికి ప్రతిగా ఆయన అదేం లేదు. నేను సిఎంగా ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజే మెనిఫెస్టోలో చెప్పిన ఆరు పథకాలను ఆరంభించాను. ఇక లింగాయత్‌ల విషయానికొస్తే అది ఎన్నో రోజుల నుంచి నలుగుతున్న అంశం. అదేం కొత్తది కాదు అని తేల్చేశారు. అయితే అది ఎప్పటి నుంచో ఉన్నా ఈ సందర్భంలో చేయడంలోని భావమేంటి? అని పాత్రికేయ బృందం ప్రశ్నిస్తే బావుండేదన్న భావన చూపరులలో కలిగింది.

రెండు నియోజకవర్గాల్లో మీరు ఎందుకు పోటీ చేయాల్సి వస్తోంది ? అన్న ప్రశ్నకు సిద్ధరామయ్య స్పందిస్తూ ఉత్తర కర్ణాటక ప్రాంతమైన బదామీ నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకే అక్కడ పోటీ చేస్తున్నా అని చెప్పారు. అయితే ఈ సమాధానం ఎవరినీ కన్విన్స్‌ చేయలేదు. దానిపై ఇంకాస్త వివరణ ఆయన్ను అడిగి ఉంటే బావుండేది. ఈ సందర్భంగా అక్కడి బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప సిద్ధరామయ్య రెండు స్థానాల్లో పోటీ చేయడం ఆయన అభద్రతా భావాన్ని ఎత్తి చూపుతోందని విమర్శించారని గుర్తు చేయడం గమనార్హం. కాని అదేక్రమంలో యడ్యూరప్ప తన కుమారుడి విషయంలో పోటీని తొలుత ప్రతిపాదించి, అనంతరం ఉపసంహరించు కోవడం విషయంలో సరిగ్గా వివరణ ఇవ్వలేక పోయారు. అలాగే బళ్ళారి బ్రదర్స్‌లో ఒకరికి టిక్కెట్‌ ఇవ్వడం, అనంతరం జరిగిన పరిణామాల విషయల్లోనూ సూటిగా సమాధానం ఇవ్వలేక పోయారు. అయితే ఎవరెన్ని చెప్పినా ఎదుటివారి వ్యూహాలను బట్టే, అవతలివారి ఎత్తుగడలుంటాయి కనుక ఆ కోణంలోనే దీన్ని చూడాల్సి ఉంటుందని సరిపెట్టుకోవాలి. ఎందుకుంటే ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సింది అధిక సంఖ్యాబలమే కాబట్టి. దీన్నే ఇంగ్లీష్‌లో ‘మ్యాజిక్‌ ఫిగర్‌’ అంటారు.

కర్ణాటకలోని మరో ప్రధాన పార్టీ (జనతాదళ్‌ (ఎస్‌)). ఆ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామిని కర్ణాటకలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడితే మీరు కాంగ్రెస్‌, బిజెపిలలో ఎవరికి మద్దతిస్తారని అడిగారు. ఎవరికీ ఇవ్వను. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నేను ప్రతిపక్షంలో కూర్చోడానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. అయితే ఈ విషయంలో కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ అంతరంగం మాత్రం మరోలా ఉన్నట్లుగా తెలుస్తోంది. తాను బిజెపితో కలవనని, ఒకవేళ తన కొడుకు కలిస్తే ఆయన్నే వదిలేస్తానని చెప్పారు. అయితే ఈ మాటలను విశ్లేషిస్తూ దేవెగౌడ కాంగ్రెస్‌కే మొగ్గు చూపుతారని చెప్పకపోయినా ఆయన మాటల ధోరణి వల్ల అనిపిస్తోందని ఈ కార్యక్రమం చెప్పడం బహుశా అలా అనడానికి ఛాన్సేమో అనిపించింది. ఎందుకంటే ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా జనతాదళ్‌ (ఎస్‌) నుంచి వచ్చిన వ్యక్తేగా ?

లింగాయత్‌ వర్గానికి చెందిన కొంతమంది ముఖ్యలతో ఈ బృందం జరిపిన ఇంటర్వ్యూలో ఓ మఠాధిపతి మాట్లాడుతూ దేశంలో ఇవి మాకు అవలేదు, జరగలేదు అనే వర్గాలున్నాయి కాని వారంతా కలిసి ప్రజాస్వామ్య స్ఫూర్తికి మారుపేరుగా నిలిచే ఓటింగ్‌ శాతం పెంపు పట్ల శ్రద్ధ వహించారా? అని ఆవేదన వెలిబుచ్చడం సరైన ఆలోచనాధోరణిగా అనిపించింది. లింగాయతులలోనూ ఆర్థికంగా వెనుకబడిన వారున్నారని ఆయన చెప్పారు. తాము ఒక వర్గానికే చెందిన వారమైనా ఇతర మతాల్లోని పేదలకూ ఆసరా ఇచ్చామని, అందుకు ఉదాహరణగా తమ విద్యాసంస్థల్లో చదివిన ఒక ముస్లిం నిరుపేద విద్యార్థి రామాయణ, మహాభారత గ్రంథాలకు చక్కటి విశ్లేషణా చేయగల సామర్థ్యం సంపాదించాడని చెప్పారు.

సర్వేల ఫలితాలు ఎలా ఉన్నా ప్రజలు రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి దిశగా నడిపిస్తారో వారికే పట్టం కట్టడమనేది ఎల్లప్పుడూ జరుగుతూ వస్తోంది. ఇప్పుడూ జరగబోయేది అదే కావొచ్చు.

– స్ఫూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *