‘ఈ నగరానికి ఏమైంది?’ నిజమే ! ఏదో అయ్యింది !!

‘ఈ నగరానికి ఏమైంది?’  నిజమే ! ఏదో అయ్యింది !!

తొలి చిత్రం ‘పెళ్ళి చూపులు’తో చిత్రసీమలోనే కాదు… సాధారణ ప్రేక్షకుడి లోనూ ఓ మంచి గుర్తింపును, గౌరవాన్ని సంపాదించున్నారు దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌. పలు అవార్డులనూ అందుకున్న ఆ సినిమా తర్వాత తరుణ్‌ ఏ సినిమా చేస్తాడా? అని చాలామంది రెండేళ్ళుగా ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా వచ్చేసింది. దీనిని ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌ బాబు నిర్మించడం, దాదాపుగా అందరూ కొత్తవాళ్ళు ఇందులో నటించడం విశేషం.

కథ విషయానికి వస్తే చాలా చిన్నదే. బాల్యం నుండి స్నేహితులైన వివేక్‌ (విశ్వక్‌సేన్‌), కార్తీక్‌ (సాయి సుశాంత్‌ రెడ్డి), ఉపేంద్ర (వెంకటేశ్‌ కాకుమాను), కౌశిక్‌ (అభినవ్‌ గోమాతం) షార్ట్‌ ఫిల్మ్స్‌ తీసి జీవితాన్ని సరదాగా గడిపేయాలని అను కుంటారు. వారు ఒకటి తలిస్తే దైవం వేరొకటి తలిచింది. షార్మ్‌ ఫిల్మ్‌ మేకర్‌ కావాలనుకున్న వివేక్‌ ప్రేమ విఫలం కావడంతో ఉద్యోగంలో చేరిపోతాడు. సినిమాటోగ్రాఫర్‌ కావాలనుకున్న కార్తీక్‌ రాజీపడి పోయి బార్‌ నిర్వాహకుడిగా మారిపోయి… తన యజమాని కూతుర్ని వివాహం చేసుకుని లండన్‌ వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఫిల్మ్‌ ఎడిటర్‌ కావాలని కలలు కన్న ఉపేంద్ర వెడ్డింగ్‌ ఫోటోగ్రాఫర్‌గా మారతాడు. నటుడు కావాలనుకున్న కౌశిక్‌.. టివి యానిమేషన్‌ సీరియల్స్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అవుతాడు. వీళ్ళలో వీళ్ళకు మళ్ళీ ఇగో క్లాషెస్‌. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మొహమాటం. అయితే వీరంతా కార్తీక్‌ ఎంగేజ్‌మెంట్‌ జరుగబోతున్న సందర్భంగా ఒక పబ్‌లో పార్టీ చేసుకుంటూ… గోవా వెళ్ళాలని అనుకుంటారు. అనుకోని పరిస్థితుల్లో కారులోనే గోవాకు చేరతారు. చేతిలో పెద్దంతగా డబ్బులు లేకపోవడంతో ఐదు లక్షల విలువ చేసే ఎంగేజ్‌ మెంట్‌ రింగ్‌ మాయమైన నేపథ్యంలో తప్పని సరై ఓ షార్ట్‌ ఫిల్మ్‌ కాంటెస్ట్‌లో పాల్గొనడానికి సిద్ధపడ తారు. మరి వాళ్ళు దానిని పూర్తి చేశారా? విజయం సాధించారా? ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ను తిరిగి కొనగలి గారా? అసలు తమదైన జీవితాన్ని కోల్పోయిన ఈ నలుగురు స్నేహితులకు గోవా హాలిడే ట్రిప్‌ కనువిప్పు కలిగించిందా ? అన్నది మిగతా కథ.

‘పెళ్ళిచూపులు’ వంటి లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ తీసిన తరుణ్‌ భాస్కర్‌… మరోసారి అలాంటి కథతో జనం ముందుకు రాకూడదని ముందే అనుకున్నారు. ఆ నిర్ణయానికి తగ్గట్టే బడ్డీ కామెడీ కాన్సెప్ట్‌తో ‘ఈ నగరానికి ఏమైంది?’ కథను రాసుకున్నారు. షార్ట్‌ ఫిల్మ్‌ మేకర్‌గా తన, తోటి స్నేహితుల జీవితంలో జరిగిన సంఘటనలతో ఈ కథను అల్లుకున్నారు. అందువల్ల… ఆ వర్గం దీనితో కనెక్ట్‌ అయినట్టుగా మిగిలినవారు కావడం కష్టం. నిజానికి ఇది మల్టీప్లెక్స్‌ ఆడియెన్స్‌ను టార్గెట్‌ చేసి తీసిన సినిమా. అందుకే పరిమితమైన బడ్జెట్‌లోనే సినిమాను తీశారు. ఎవరికోసమైతే సినిమా తీశారో వారిని ఇది రీచ్‌ అవుతుంది. నిర్మాత సురేశ్‌ బాబు గతంలో తన సినిమాలకు యూనివర్శల్‌ అప్రిసియే షన్‌ లభించాలని, అన్ని వర్గాలను అది చేరాలని కోరుకునే వారు. కానీ ఆయన ఆలోచనలోనూ ఇప్పుడు బాగా మార్పు వచ్చినట్టు ఈ సినిమా నిరూపిస్తోంది. ప్రత్యేకంగా ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా నిర్మించారు. నటీనటులంతా ఆయా పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. ముఖ్యంగా వారి క్యారెక్టరైజేషన్‌ విషయంలో తరుణ్‌ భాస్కర్‌ చేసిన ¬మ్‌ వర్క్‌ గొప్పది. అయితే… కొన్ని లూప్‌హోల్స్‌ లేకపోలేదు. వివేక్‌ సాగర్‌ సంగీతం, ముఖ్యంగా నికేత్‌ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

జీవితంలోని ఆటుపోటులను తట్టుకునే క్రమంలో యువత ఎంత బాధ్యతారాహిత్యంగా ఉంటుందో వివేక్‌ పాత్ర ద్వారా చూపించారు. నిజంగానే ఓ సైకో తరహా పాత్ర అతనిది. అయితే అలాంటి వారిని హీరోలుగా చూపించడంలోనే ఇబ్బంది ఉంది. వారి బలహీనతలను గ్లోరిఫై చేయడం ద్వారా బలహీన మనస్కులు అదే దారిలో నడిచే ఆస్కారం ఉంది. ఈతరం యువ దర్శకులు దానిని అర్థం చేసుకోవడం లేదు. సమాజంలో ఉన్నదే చూపిస్తున్నామనే ధోరణి వారిలో కనిపిస్తోంది. ప్రజలకు ఏది మంచిదో అది చూపించడం సంస్కారం. కేవలం వినోదం కోసం, ప్రేక్షకుల క్షణిక మెప్పుదల కోసం అవలక్షణాలు ఉన్న వ్యక్తిని హీరోని చేస్తే ఓ బలమైన కళను దుర్వినియోగ పర్చినట్టే అవుతుంది. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ మందులో మునిగి తేలిపోవడం కూడా సరైన సంకేతాలను ఇవ్వదు. ఈ విషయంలో తప్పనిసరిగా యువ దర్శకులు సంయమనం పాటించాలి. ఇది చాలదన్నట్టు తమ సినిమాలను విమర్శిస్తే తట్టుకోలేని విధంగా దర్శకులు ఉంటున్నారు. మొదటి రోజు కాకపోయినా… నిజం నిలకడమీద తెలియకపోదు. సినిమాను జనం ఆదరించలేదంటే అందులో విషయం లేదనే అర్థం. ‘పెళ్ళిచూపులు’ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తిన విమర్శకులు ‘ఈ నగరానికి ఏమైంది?’ని విమర్శించా రంటే లోపం ఎక్కడ ఉందో దర్శకుడే వెతుక్కోవాలి. మూడో చిత్రం తెరకెక్కించే లోపు తరుణ్‌ భాస్కర్‌ ఆ పనిచేస్తే మంచిది. ఎందు కంటే చక్కని సృజనాత్మకత, రచనా పటిమ కలిగిన అతని నుండి మేలైన చిత్రాలు రావాలని జనం కోరుకుంటున్నారు. వారి కోరిక రాబోయే రోజుల్లో తీరుతుందేమో చూడాలి.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *