ఇదేం పెద్దమనుషుల క్రీడ !

ఇదేం పెద్దమనుషుల క్రీడ !

భారత ఉపఖండ దేశాలకు ఓ మహమ్మారిలా వ్యాపించిన క్రికెట్‌ క్రీడ కుట్రలు, మోసాలకు నెలవుగా మారిపోతోంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, పాకిస్థాన్‌, లాంటి అగ్రశ్రేణి జట్ల నిర్వాకం పుణ్యమా అంటూ ఈ ఆట విశ్వసనీయత కోల్పోడమేకాదు క్రీడాస్పూర్తికి, క్రికెట్‌ స్ఫూర్తికి సైతం విఘాతం కలిగిస్తూ అంతర్జాతీయంగా నవ్వులపాలవుతోంది.

క్రికెట్‌, ఈ మూడక్షరాల ఆటకు ఒకప్పుడు పెద్దమనుషుల క్రీడ, మర్యాదస్తుల ఆట అన్న ఘనమైన పేర్లుండేవి. సర్‌ డోనాల్డ్‌ బ్రాడ్మన్‌, సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌, మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ, గుండప్ప విశ్వనాథ్‌, జైసింహా లాంటి జెంటిల్‌మెన్‌ క్రికెటర్లు ఈ ఆటకు వన్నె తెచ్చిన వారిలో ఉన్నారు. 1970 దశకం వరకూ క్రికెట్‌ పెద్దమనుషుల క్రీడ అన్న పేరుకు తగ్గట్టుగానే ఉంటూ వచ్చింది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా క్రికెట్‌ స్ఫూర్తితోనే సాగుతూ వచ్చింది.

ప్రొఫెషనలిజంతో సర్వనాశనం

క్రికెట్‌ అమెచ్యూర్‌ ధోరణితో సాగినంతకాలం జయాపజయాలతో సంబంధమే ఉండేదికాదు. నియమ నిబంధనలను, క్రికెట్‌ స్ఫూర్తిని గౌరవిస్తూ క్రికెటర్లు మసలుకొనేవారు. అయితే ప్రపంచీకరణ పుణ్యమా అంటూ క్రీడలు సైతం ఓ వ్యాపారంలా మారిపోడంతో క్రీడారంగంలో ప్రొఫెషనలిజం అనేది అంతర్భాగంగా మారిపోయింది. నియమ నిబంధనలను, క్రీడాస్ఫూర్తిని పక్కన పెట్టి వ్యూహాల పేరుతో ప్రత్యర్థిని దొంగ దెబ్బ తీయటం, అడ్డదారులు తొక్కడం ఇప్పుడు సాధారణ విషయంగా తయారయ్యింది.

13 దశాబ్దాల క్రికెట్‌ చరిత్రను ఓసారి తిరగేస్తే అలనాటి బాడీలైన్‌ సిరీస్‌ ఒక్కటే అతిపెద్ద వివాదంగా కనిపిస్తుంది. అయితే 1980 దశకం తర్వాత నుంచి క్రికెట్‌ దారితప్పింది. వివాదాలకు చిరునామాగా మిగిలింది. స్పాట్‌ ఫిక్సింగ్‌, మ్యాచ్‌ ఫిక్సింగ్‌, బెట్టింగ్‌, బాల్‌ టాంపరింగ్‌ అన్నవి ఇప్పుడు క్రికెట్లో ఓ భాగంగా ఉన్నాయి.

ఐసిసి పగ్గాలు వేసినా ?

క్రికెట్‌ను అవినీతి రహితంగా, వివాదాలకు దూరంగా ఉంచాలన్న లక్ష్యంతో ఐసిసి పలురకాల చర్యలు చేపట్టింది. క్రికెటర్ల క్రమశిక్షణ కోసం నియమావళితో పాటు అవినీతి నిరోధక శాఖను సైతం ఏర్పాటు చేసింది. టి-20 నుంచి టెస్ట్‌ల వరకూ మ్యాచ్‌ల నిర్వహణ కోసం మ్యాచ్‌ రిఫరీలను సైతం నియమించింది. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకొన్నా, నియనిబంధనలు రూపొందించినా మ్యాచ్‌లతో పాటు వివాదాలు సైతం కొత్తగా సరికొత్తగా తెరమీదకు వస్తున్నాయి.

బాల్‌ టాంపరింగ్‌ అంటే ?

ఐదురోజుల సాంప్రదాయ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్‌ ప్రతి 80 ఓవర్లకూ ఓ కొత్త బంతిని ఉపయోగించే వెసులుబాటు ఉంటుంది. సాధారణంగా కొత్తబంతి మొదటి 20 ఓవర్ల ఆటవరకూ ఇరువైపులా స్వింగ్‌ అవుతూనే ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే పాతబంతి సైతం రివర్స్‌ స్వింగ్‌ అవుతూ ఉంటుంది. రివర్స్‌ స్వింగ్‌ సాధించడం కోసం ఉద్దేశపూర్వకంగా కొత్తబంతిని పాతబంతిలా మార్చడానికి ఫీల్డర్లు లేదా బౌలర్లు చేసే ప్రయత్నాలనే బాల్‌ టాంపరింగ్‌ అంటారు. డ్రింక్‌ మూతలు, చిన్నసైజు బ్లేడ్లు, టేపులను సైతం క్రికెటర్లు అంపైర్ల కళ్లు గప్పి టాంపరింగ్‌ కోసం ఉపయోగిస్తూ ఉంటారు.

జాన్‌ లీవర్‌ నుంచి బాన్‌క్రాఫ్ట్‌ వరకు

టెస్ట్‌ క్రికెట్లో 1976-77 మధ్య భారత్‌ – ఇంగ్లండ్‌ సిరీస్‌ నుంచే బాల్‌ టాంపరింగ్‌ వివాదాలకు తెరలేచింది. భారత్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో బంతిని స్వింగ్‌ చేయటం కోసం ఇంగ్లండ్‌ మీడియం పేసర్‌ జాన్‌ లీవర్‌ గ్రీజులాంటి ఓ క్రీమును బంతికి రాసి వివాదంలో చిక్కుకొన్నాడు. అప్పట్లో ఇది పెనుదుమారమే లేపింది.

ఆ తర్వాత 2001 సౌతాఫ్రికా సిరీస్‌లో భాగంగా పోర్ట్‌ ఎలిజబెత్‌ టెస్టు ఆడుతూ మాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ టాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అయితే విచారణ అనంతరం సచిన్‌ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడలేదని తేలిపోడంతో నిర్దోషిగా బయటపడ్డాడు.

2000 సంవత్సరంలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ వకార్‌ యూనిస్‌ చేతివేళ్లతో బాల్‌ టాంపరింగ్‌ చేయడం ద్వారా దొరికిపోయి భారీ జరిమానా చెల్లించాడు. బాల్‌ టాంపరింగ్‌ ఆరోపణలపై శిక్ష ఎదుర్కొన్న తొలి క్రికెటర్‌గా వకార్‌ యూనిస్‌ చరిత్రలో మిగిలిపోయాడు. 2004 ఇంగ్లండ్‌ సిరీస్‌లో పాకిస్థాన్‌ ఆటగాడు ఇంజమాముల్‌ హక్‌ సైతం బాల్‌ టాంపరింగ్‌ ఆరోపణలతో ఓ మ్యాచ్‌ను చేజార్చుకోవాల్సి వచ్చింది. అంతేకాదు అదే ఏడాది జింబాబ్వే పర్యటనలో భారత ఆటగాడు రాహుల్‌ ద్రావిడ్‌ బంతికి చూయింగ్‌ గమ్‌ లాంటి పదార్థం అద్ది జరిమానా చెల్లించాడు.

ఇప్పుడు తాజాగా కేప్‌టౌన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడోటెస్టులో ఆస్ట్రేలియా ఫీల్డర్‌ బాన్‌క్రాఫ్ట్‌ రివర్స్‌ స్వింగ్‌ కోసం బంతిని టాంపరింగ్‌ చేసి దొరికిపోయాడు. టివి రీప్లేలలో సైతం బాన్‌క్రాఫ్ట్‌ దోషిగా తేలాడు. దీంతో తాము ఉద్దేశపూర్వకంగానే ముందుగా నిర్ణయించు కొన్న వ్యూహం ప్రకారమే బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌ అధికారికంగా ప్రకటించాడు. ఐసిసి శిక్ష విధించడానికి ముందే ఆస్ట్రేలియా కెప్టెన్సీతో పాటు ఐపిఎల్‌ -11లో రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్సీని సైతం చేజార్చుకొన్నాడు.

బాల్‌ టాంపరింగ్‌కు శిక్ష ఏంటి ?

ఐసిసి నియమావళి ప్రకారం బాల్‌ టాంపరింగ్‌ ఆరోపణలతో దోషిగా తేలిన క్రికెటర్లకు నాలుగు డీమెరిట్‌ పాయింట్లతో పాటు ఓ టెస్ట్‌ మ్యాచ్‌ నిషేధం సైతం విధిస్తారు.

ఆస్ట్రేలియా లాంటి అగ్రశ్రేణి జట్లే విజయం కోసం ఐసిసి నియమావళిని ఉద్దేశపూర్వకంగా అతిక్రమించడం, ఓ వ్యూహం ప్రకారమే బాల్‌ టాంప రింగ్‌కు పాల్పడటానికి మించిన విషాదం మరొకటి లేదు. ఈ విషయాన్ని ఐసిసి తీవ్రంగా పరిగణించాలి. ఇలాంటి పరిస్థితుల్లో క్రికెటర్లు ఎంతటి మొనగాళ్ల యినా కఠిన చర్యలు తీసుకోక తప్పదు.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *