ఆర్జీవీ మారలేదంటున్న ‘ఆఫీసర్‌’

ఆర్జీవీ మారలేదంటున్న ‘ఆఫీసర్‌’

కొందరు కలిసి సినిమా చేస్తున్నారంటే… ఎక్కడి లేని ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుంది. వీరిద్దరూ కలిసి ఏదో వండర్‌ క్రియేట్‌ చేస్తారు అనే నమ్మకం ఏర్పడుతుంది. ఆ మధ్య నాగార్జున హీరోగా సినిమా చేయబోతున్నాను అని రాంగోపాల్‌ వర్మ చెప్పగానే… అందరూ ‘శివ’ సినిమా నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. నిజానికి ‘శివ’ సినిమా తర్వాత దానినే హిందీలో నాగార్జునతోనే వర్మ రీమేక్‌ చేశాడు. అక్కడ కూడా ఆ సినిమా విజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ‘అంతం’, ‘గోవిందా గోవిందా’ సినిమాలు వచ్చాయి. ఇందులో ‘అంతం’ ఫర్వాలేనిపించినా… ‘గోవిందా గోవిందా’ వర్మ కెరీర్‌లోనే ఓ బ్లాక్‌ స్పాట్‌లా మిగిలిపోయింది. సెన్సార్‌ ఇబ్బందులు పడటంతో పాటు వెంకటేశ్వరస్వామి భక్తుల ఆగ్రహానికి, శాపనార్థాలకూ గురయ్యాడు వర్మ. ఇక తెలుగులో సినిమాలే చేయనంటూ శపథం పట్టి బాలీవుడ్‌కు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ ఒట్టు తీసి గట్టుమీద పెట్టాడనుకోండీ అది వేరే సంగతి. మొత్తం మీద దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత నాగార్జున, వర్మ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంది ‘ఆఫీసర్‌’ మూవీ. ఈ సినిమాను వర్మే నిర్మించాడు.

కథ విషయానికి వస్తే ముంబైలోని నారాయణ్‌ పసారి అనే ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ ‘సిస్టమ్‌’ను కాపాడే క్రమంలో చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. అయితే… అతను చేసిన ఓ ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ మెడకు చుట్టుకుంటుంది. దానిని ఇన్వెస్ట్‌గేట్‌ చేసే పనిని శివాజీరావు (నాగార్జున)కు అప్పచెబుతారు. హైదరా బాద్‌లో ఉండే శివాజీరావు ఈ కేసు విషయమై ముంబై వెళతాడు. అక్కడ తన పాత స్నేహితురాలు, క్రైమ్‌ బ్రాంచ్‌ చీఫ్‌ (మైరా సరీన్‌) కలుస్తుంది. అలానే సిటీ పోలీస్‌ కమీషనర్‌ (షాయాజీ షిండే) సాయంతోనూ నారాయణ్‌ పసారిని పకడ్బందీ పథకంతో అరెస్ట్‌ చేస్తాడు. కానీ అండర్‌ వరల్డ్‌నే డీల్‌ చేసిన అనుభవం ఉన్న పసారి కోర్టు నుండీ నిర్దోషిగా బయటకు రావడమే కాదు… తిరిగి డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగంలో చేరతాడు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ తనను అరెస్ట్‌ చేయించిందనే కసితో అతనే ఓ అండర్‌ వరల్డ్‌ను తయారు చేస్తాడు. ఆ విషయం తెలియని పోలీస్‌ ఉన్నతాధికారులు… అతన్నే ఆ అండర్‌ వరల్డ్‌ను అంతం చేసే టీమ్‌కు హెడ్‌ను చేస్తారు. దాంతో పసారి… తన సహాయకుల బృందంలోకి శివాజీరావును తీసుకుంటాడు. తనని అరెస్ట్‌ చేసిన శివాజీరావుపై కక్ష తీర్చుకోవడానికి పసారి ఎలాంటి పన్నాగాలు పన్నాడు? పసారి నిజ స్వరూపం తెలిసిన శివాజీరావు అతని ఎత్తుల్ని ఎలా చిత్తు చేశాడు? అన్నది మిగతా కథ.

మంచి పోలీస్‌, చెడ్డ పోలీస్‌ కథాంశాలతో ఇంతవరకూ చాలా సినిమాలు వచ్చాయి. సిస్టమ్‌ను కాపాడే నెపంతో ఎంతోమంది పోలీస్‌ ఆఫీసర్లు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న సినిమాలనూ మనం చూశాం. నిజానికి ముంబై అండర్‌ వరల్డ్‌ మీద వర్మ ఎన్నో సినిమాలు తీశాడు. అందులో మిగిలి పోయిన కొన్ని సన్నివేశాలను బేస్‌ చేసుకుని పైపైనే వర్మ ఈ కథ రాసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఐ.పి.ఎస్‌. ఆఫీసర్‌ శివాజీరావుగా నాగార్జున చక్కని నటనే కనబరిచాడు. అయితే… అతని స్నేహితురాలిగా నటించిన మైరా సరీన్‌ తేలిపోయింది. ఆమెకు ఇదే తొలి తెలుగు సినిమా. అలానే పసారి పాత్రధారి కూడా మెప్పించలేక పోయాడు. ఆ పాత్రకు కాస్తంత పరిచయస్తులను తీసుకుని ఉంటే బాగుంది. షాయాజీ షిండే, అజయ్‌, నారాయణరావు వంటి నలుగురైదుగురు మాత్రమే తెలిసిన ముఖాలు. మిగిలిన వారంత అంతగా పరిచయం లేని వారు కావడంతో… వర్మ హిందీలో తీసిన సినిమాను తెలుగులో డబ్‌ చేసినట్టే అనిపించింది. పైగా సంభాషణలూ అలానే ఉన్నాయి. తండ్రీ కూతుళ్ల మధ్య అనుబంధాన్ని కూడా వర్మ అంత ఆకట్టుకునేలా తీయలేకపోయాడు. ఉన్న రెండు పాటలూ పరమరొటీన్‌గా ఉన్నాయి.

సినిమా ప్రారంభం నుండీ ముగింపు వరకూ కూడా ఎలాంటి ఉత్సుకతనూ ప్రేక్షకుల్లో కలిగించదు. బలహీనమైన సన్నివేశాలను కెమెరా యాంగిల్స్‌, సౌండ్‌ తో మేనేజ్‌ చేయాలని వర్మ చూసినట్టుగా అనిపిస్తుంది. డైలాగ్స్‌ చెప్పించాల్సిన చోట కూడా మ్యూజిక్‌ ప్లే చేసి మాటల రచయిత పని సులువు చేశాడు. తెర మీద కనిపించేది చూస్తూ, సౌండ్స్‌లోని వేరియేషన్స్‌ను వింటూ గడిపేయాల్సిందే. థియేటర్‌ నుండీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు భలే నటించారు అనిపించే పాత్ర సినిమాలో ఒక్కటీ కనిపించదు. అలానే ఏ సన్నివేశం మనల్ని వెంటాడదు. వర్మ ఏమిటీ ఇంకా మారలేదు? అనే ప్రశ్న ఉదయిస్తుంది. కనీసం ఆ కాంబినేషన్‌కు ఏర్పడిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అయినా… కష్టపడలేదేమిటా అనే బాధ కలుగుతుంది.

వర్మ మారతాడనుకోవడం ప్రేక్షకుల మూర్ఖత్వం అంటారా… ఏమో కావచ్చు కూడా!

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *