ఆజ్‌తక్‌ పంచాయితీ

ఆజ్‌తక్‌ పంచాయితీ

టి.వి. ఛానళ్లు నిర్వహించే కార్యక్రమాలకు ఆకర్షణీయమైన పేర్లు పెట్టి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడం సహజం. అందులో భాగంగానే ప్రముఖ జాతీయ ఛానల్‌ ఆజ్‌తక్‌ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఆజ్‌తక్‌ పంచాయితీ’ అన్న పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించి మే 26న ప్రసారం చేసింది. ఇందులో కేంద్రమంత్రులు పీయూష్‌ గోయల్‌, నితిన్‌గడ్కరీ, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌షా పాల్గొన్నారు.

ఇది ‘కర్ణాటక’ పంచాయితీ

ఈ కార్యక్రమంలో దేశంలో ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలకు అధిక సమయాన్ని కేటాయించారు. అలా కాకుండా అన్ని అంశాలకు సమ ప్రాధాన్యం ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. వాస్తవానికి ఈ కార్యక్రమం పేరు ‘ఆజ్‌తక్‌ పంచాయితీ’ అయినా ఇందులో ఇటీవల అందరి దృష్టిని అమితంగా ఆకర్షించిన కర్ణాటక రాజకీయ పరిణామాలనే ఎక్కువగా స్పృశించారు.

‘కర్ణాటకలో మెజారిటీ లేదని తెలిసినా మీరెందుకు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకెళ్ళారు?’ లాంటి ఇప్పటికే అనేక కార్యక్రమాల్లో చాలామంది అడిగిన ప్రశ్నలనే అమిత్‌ షాను ఇందులోనూ అడిగారు. దానికి ఆయన ధీటుగానే సమాధానం చెప్పారు. ‘ఆ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన మాకు ప్రజలు నూట నాలుగు స్థానాలిచ్చి అగ్ర స్థానంలో నిలబెట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకు మా వంతు ప్రయత్నంగా మేం ముందడుగు వేయకపోతే అత్యున్నత ప్రజాకోర్టు తీర్పును అవమానించినట్లు అవుతుంది’ అని చెప్పారు. అలాగే ‘కర్ణాటకలో కొలువుదీరిన కూటమి ఎన్నాళ్లుంటుంది ?’ అన్న ప్రశ్నకు ‘నేనేం జ్యోతిష్కుణ్ణి కాను’ అని సమాధానమిచ్చారు. ఇలా మాటిమాటికి కర్ణాటక ఎన్నికలు, ఫలితాలకు సంబంధించిన ప్రశ్నలనే వేస్తూంటే ఓ సందర్భంలో కాస్త అసహనానికి గురైన అమిత్‌ షా ఈ కార్యక్రమానికి ‘ఆజ్‌తక్‌ కర్ణాటక’ అని పేరు పెట్టాల్సింది అంటూ చమత్కరించారు.

అప్పుడూ అంతే..

ప్రతిపక్షాలన్నీ ఏకమై కర్ణాటకలో బిజెపిని ఓడించి తీరతామని బెంగళూరు వేదికగా చేసిన ప్రతిజ్ఞ మీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపింది ? అన్న ప్రశ్నకు ‘ఇందులో కొత్తగా ఏముంది? 2014 ఎన్నికలలోనూ ప్రతిపక్షా లన్నీ మాకెదురుగా పోరాడాయి కదా ? ఒక్క తెలుగు దేశం తప్ప. అందువల్ల నాపై అది ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు’ అని సూటిగా సమాధానం ఇచ్చారు.

శివసేన మాతోనే…

మహారాష్ట్రలో ఇప్పటి వరకూ మీ మిత్రపక్షంగా ఉన్న శివసేన రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఎలా ? అన్న ప్రశ్నకు ‘అదేం లేదు శివసేన మాతోనే ఉంటుంది. ఏవో చిన్న చిన్న అభిప్రాయ బేధాలున్నా అవి సమసి పోతాయి. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వచ్చే చిన్న చిన్న పొరపొచ్చాల లాంటివే అవి!’ అని బదులిచ్చారు అమిత్‌ షా.

సంకీర్ణంలో రాకపోకలు తప్పవా ?

సంకీర్ణంలో వైదొలగుతున్న రాజకీయ పార్టీల అంశాలు అమిత్‌షా ముందుంచితే ‘ఇది సర్వసాధారణం. ఇలా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యం వహించిన పార్టీలు వైదొలగిపోవడం, కొన్ని కొత్తవి రావడం జరుగుతూనే ఉంటాయి. ఇది వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలోనూ జరిగింది. అయితే మాకు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సత్తా ఉన్నా ఎన్నికల్లో కలిసి పోటీ చేసామన్న దృక్పథంతో వాటికి ప్రభుత్వ ఏర్పాటులో గౌరవనీయ భాగస్వామ్యం కల్పించాం. ఇది కేంద్రంలోనూ బిజెపి, పాలిత రాష్ట్రాల్లోనూ మీరు పరీక్షించవచ్చు. అవి ఎంత చిన్న పార్టీలైనా వాటికి మేమిచ్చిన ప్రాధాన్యాన్ని గమనించవచ్చు.

అది వేరు… ఇది వేరు…

కాంగ్రెస్‌ – జెడి(ఎస్‌) కూటమిని అపవిత్ర కూటమి అన్న మీరు మీ పార్టీ కశ్మీర్‌లో ఏర్పాటు చేసిన పిడిపి-బిజెపి కూటమిని ఎలా చూస్తారు ? అని అడిగిన ప్రశ్నకు అమిత్‌ షా చాలా అర్థవంతమైన సమాధానాన్ని ఇచ్చారు. ‘కర్ణాటక ఎన్నికల్లో అటు జెడి(ఎస్‌), ఇటు కాంగ్రెస్‌ ఒకరినొకరు ప్రత్యర్థి పార్టీలుగానే పరిగణించి విమర్శించుకున్నాయి. కాని కశ్మీర్‌లో మేము, పిడిపి ఎన్నికలప్పుడు ప్రత్యర్థిగా కాంగ్రెస్‌నే భావించి పోరాడి గెలిచాం. అందుకే ఈ పొత్తుకి, దానికి పోలికే లేదు’ అన్నారు.

ఇలా ఆసక్తికరంగా జరిగిన ఈ ముఖాముఖి కార్యక్రమంలో కొంత తేలికపాటి వాతావరణాన్ని కల్పించడానికి యాంకర్‌ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు (జమిలి ఎన్నికలు) నిర్వహిస్తే ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్న మీరు మిగతా సమయంలో ఏం చేస్తారు ? అన్న సరదా ప్రశ్నకు అమిత్‌ షా నవ్వుతూ ‘అదేం లేదు. నా ముందు ఏ పని ఉంటే ఆ పనిలోనే త్రికరణ శుద్ధిగా మమేకం అవటం నాకు అలవాటు’ అన్నారు.

ఇది ఆహూతులు మధ్య జరిగిన ముఖాముఖి కార్యక్రమం కనుక అమిత్‌షా చెప్పిన జవాబులకు వారి వద్ద నుంచి వచ్చే ప్రత్యక్ష స్పందన, తదితరాలు టి.వి. వీక్షకులకు ఆసక్తికరంగా అనిపించాయి. దానికి తోడు ప్రశ్నలడిగే వారు జవాబులు చెప్పేవారు ఇద్దరూ ఎలాంటి పరిమితులు పెట్టుకోకుండా తమ తమ విధులను నిర్వర్తించారు. కనుక కార్యక్రమం చాలా వరకు రాణించింది. అమిత్‌ షా అన్నట్లు కర్ణాట గురించి ఎక్కువగా ప్రశ్నలు అడగకపోతే ఇంకా బాగుండేది.

– స్ఫూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *