అసాధారణ ప్రతిభావంతుడు

అసాధారణ ప్రతిభావంతుడు

భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ నిఖంజీ 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి జాతీయజట్టులో చోటు సంపాదించాడు. అంతేకాదు రెండు వేర్వేరు క్రీడల్లో తన దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహించిన అతికొద్ది మంది క్రీడాకారులలో ఒకరిగా నిలిచాడు.

క్రీడాకారులు రెండు రకాలు. కేవలం ఒకే ఒక్క క్రీడలో అద్భుతంగా రాణించే వారు కొందరైతే, రెండు లేదా అంతకు మించిన క్రీడల్లో రాణించే బహుముఖ ప్రతిభ కలిగిన వారు మరికొందరు.

క్రీడలకు విశేష ప్రాధాన్యమిచ్చే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ లాంటి దేశాలలో మాత్రమే మనకు బహుముఖ ప్రతిభావంతులైన క్రీడాకారులు కనిపిస్తారు. అయితే అలాంటి అసాధారణ క్రీడాకారుల జాబితాలో ఇప్పుడు భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ సైతం చోటు సంపాదించాడు.

క్రికెట్‌ నుంచి గోల్ఫ్‌

హర్యానా రాష్ట్రం నుంచి 1978లో భారత క్రికెట్‌లోకి దూసుకొచ్చిన కపిల్‌దేవ్‌ మేటి ఆల్‌ రౌండర్‌గా చరిత్ర సష్టించాడు. 1983లో భారత్‌ను ప్రపంచకప్‌ విజేతగా నిలిపిన తొలి భారత కెప్టెన్‌ ఘనతను సొంతం చేసుకొన్నాడు. 1994 అక్టోబర్‌ 24న చివరిసారిగా భారత క్రికెట్‌ జట్టులో సభ్యుడిగా పాల్గొన్న కపిల్‌ రిటైర్మెంట్‌ తర్వాత గోల్ఫ్‌లో ప్రవేశించాడు. అందులో నిలదొక్కుకోడానికి రెండేళ్లపాటు విపరీతంగా శ్రమించాడు. గోల్ఫర్‌గా రాణిస్తూ ఏకంగా భారతజట్టులో చోటు సంపాదించాడు. అటు క్రికెట్లోనూ ఇటు గోల్ఫ్‌లోనూ భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన తొలి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

59 ఏళ్ల వయసులో..

జపాన్‌ వేదికగా ఈ సంవత్సరం అక్టోబర్‌లో జరగబోయే ఆసియా- పసిఫిక్‌ సీనియర్‌ గోల్ఫ్‌ ఛాంపియన్‌ షిప్‌లో పాల్గొనే భారతజట్టులో కపిల్‌దేవ్‌ చోటు సంపాదించాడు. అమిత్‌ లూత్రా, రిషీ నారాయణ్‌ లాంటి అగ్రశ్రేణి గోల్ఫర్లతో కూడిన ఆరుగురు సభ్యుల జట్టులో కపిల్‌కు సైతం చోటు దక్కింది. గతంలో భారత క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహించిన కపిల్‌ తిరిగి 2018 అక్టోబర్‌ 17న భారత గోల్ఫ్‌జట్టులో సభ్యుడిగా పోటీకి దిగబోతున్నాడు. 59 ఏళ్ల కపిల్‌ క్రీడాజీవితంలో ఇదో అరుదైన ఘనతగా మిగిలి పోతుందనే చెప్పాలి.

బహుముఖ ప్రతిభావంతులు

కపిల్‌కు ముందు రెండు లేదా పలు రకాల క్రీడల్లో రాణించిన క్రీడాకారులలో ఆస్ట్రేలియా ఆల్‌ రౌండర్లు కీత్‌ మిల్లర్‌, షేన్‌ వార్న్‌; సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఏబి డివిలియర్స్‌, ఆస్ట్రేలియా మహిళా క్రికెట్‌ సూపర్‌ ఆల్‌ రౌండర్‌ ఎల్సీ పెర్రీ లాంటి బహుముఖ ప్రతిభావంతులు మనకు కనిపిస్తారు.

ఏబి డివిలియర్స్‌

సౌతాఫ్రికా ఆల్‌టైమ్‌ గ్రేట్‌ క్రికెటర్‌ అనగానే మనకు ఏబి డివిలియర్స్‌ పేరు గుర్తుకొస్తుంది. టెస్ట్‌, వన్డే, టి-20 ఫార్మాట్లలో పరుగుల మోత మోగించిన బ్యాట్స్‌మన్‌గా మాత్రమే మనకు ఏబి డివిలియర్స్‌ గురించి తెలుసు.

అయితే హాకీ, ఫుట్‌బాల్‌, రగ్బీ, స్విమ్మింగ్‌, బ్యాడ్మింటన్‌, అథ్లెటిక్స్‌ క్రీడల్లో అసాధారణంగా రాణించిన ఒకే ఒక్కడు ఏబి డివిలియర్స్‌. సౌతాఫ్రికా తరపున జాతీయ హాకీ, జాతీయ ఫుట్‌బాల్‌, జాతీయ జూనియర్‌ రగ్బీ క్రీడల్లో పాల్గొన్న ఘనత ఏబి డివిలియర్స్‌కు దక్కింది.

కీత్‌ మిల్లర్‌

అలనాటి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కీత్‌ మిల్లర్‌కు క్రికెటర్‌గా, ఫుట్‌బాలర్‌గా, ఫైటర్‌ పైలెట్‌గా గొప్ప చరిత్రే ఉంది. విక్టోరియా స్టేట్‌ నుంచి ఆస్ట్రేలియా క్రికెట్లో చోటు సంపాదించిన కీత్‌ మిల్లర్‌ 55 టెస్టుల్లో 170 వికెట్లు పడగొట్టడమే కాదు 2వేల 958 పరుగులు సాధించాడు. అంతేకాదు ఆస్ట్రేలియా ఫుట్‌బాల్‌ జట్టులో సభ్యుడిగా 55 మ్యాచ్‌లు ఆడాడు.

షేన్‌వార్న్‌

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ షేన్‌వార్న్‌ గొప్ప క్రికెటర్‌ మాత్రమే కాదు అసాధారణ పోకర్‌ ప్లేయర్‌ కూడా. క్రికెట్‌ ఆటగాడిగా 145 టెస్టుల్లో 708 వికెట్లు పడగొట్టిన షేన్‌వార్న్‌ వరల్డ్‌ సిరీస్‌ ఆఫ్‌ పోకర్‌లో కంగారూల జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటికే 23 వేల డాలర్ల వరకూ ప్రైజ్‌ మనీ సంపాదించాడు.

ఎల్సీ పెర్రీ

ఇక మహిళల విషయానికొస్తే ఆస్ట్రేలియా సంచలనం ఎల్సీ పెర్రీ తర్వాతే ఎవరైనా. మహిళా ప్రపంచకప్‌ క్రికెట్‌, ప్రపంచకప్‌ మహిళా ఫుట్‌బాల్‌ టోర్నీల్లో పాల్గొన్న ఏకైక క్రీడాకారిణి ఎల్సీ పెర్రీ మాత్రమే.

ఆరు టెస్టులు, 73 వన్డేలు, 81 టి-20 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాకు ఆల్‌ రౌండర్‌గా సేవలందించిన ఎల్సీ 18 అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ల్లో పాల్గొంది. 2011 పిఫా ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు డిఫెండర్‌గా సేవలు అందించింది. ఆస్ట్రేలియా క్రీడారంగంలోనే సూపర్‌ స్టార్‌గా, సూపర్‌ మోడల్‌గా కూడా ఎల్సీ గుర్తింపు సంపాదించుకొంది.

25 ఏళ్ల ఎల్సీ పెర్రీ నుంచి 59 ఏళ్ల కపిల్‌దేవ్‌ వరకూ క్రీడాకారులు పలురకాల క్రీడల్లో రాణిస్తున్న తీరు చూస్తుంటే ప్రతిభకు వయసుతో ఏమాత్రం పనిలేదని, ఆడ, మగ అన్న తేడా లేనేలేదని చెప్పక తప్పదు.

ఒక్క క్రీడలో జాతీయజట్టులో చోటు సంపాదించడానికే తలకిందులుగా తపస్సు చేసే పరిస్థితి ఉంటే రెండు లేదా అంతకు మించిన క్రీడల్లో తమ తమ దేశాలకు ప్రాతినిథ్యం వహించిన క్రీడాకారులకు జేజేలు పలికినా అది తక్కువే అవుతుంది.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *