అమ్మ ప్రేమ

అమ్మ ప్రేమ

‘వ్వాట్‌’ అంది స్రవంతి ఆశ్చర్యంతో…

‘నాకు ఇంతకంటే మరో మార్గం కనిపించడం లేదు స్రవంతీ’ అన్నాడు అనిరుద్‌. సాలోచనగా చూసింది స్రవంతి. సహజంగా ఏ నిర్ణయమైనా తనని సంప్రదించే తీసుకోవడం అనిరుద్‌కి అలవాటు. అటువంటిది మాట మాత్రంగా కూడా చెప్పకుండా తనని ఆదేశించడం ఆమెను నిలువెల్లా ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆమె ఆలోచనల్ని భగ్నం చేస్తూ ‘మమ్మీ’ అని దగ్గరకొచ్చాడు వినీత్‌.

మామూలుగానైతే ‘హాయ్‌ నాన్నా’ అని దగ్గరకు తీసుకొనేదేమో ! కాని ఇప్పుడు కొడుకుని ‘హగ్‌ చేసుకొనే మూడ్‌లో లేదు స్రవంతి. తను చెప్పాల్సింది చెప్పేసి బూట్లు చప్పుడు చేసుకుంటూ వెళ్లి పోయాడు అనిరుద్‌.

‘వాట్‌ మమ్మీ ఎందుకు అలా ఉన్నావ్‌ ?’ అడిగాడు వినీత్‌.

‘ఏం లేదు నాన్నా. వెళ్లి స్నానం చేసి హోమ్‌ వర్క్‌ చేసుకో’ అంది. ఏం అనుకున్నాడో ఏమో. ‘ఓకే మమ్మీ’ అని దిగాలు కళ్ళతో తన గదిలోకి వెళ్ళాడు ఎనిమిదో తరగతి చదివే వినీత్‌.

మరుసటి రోజు యధావిదిగా ఆఫీస్‌కి వెళ్లింది స్రవంతి.

తన కొలిగ్‌, బ్యాచ్‌మేట్‌ శ్రీవల్లి ఫోన్‌ చేసింది ‘హాయ్‌ శ్రావ్‌ బిజీగా ఉన్నావా?’ అడిగింది.

‘లేదు చెప్పు’ అంది స్రవంతి నిరాశక్తంగా.

‘ఏంటే నీ స్వరంలో జోష్‌లేదు’ అంది శ్రీవల్లి. ‘ఇంకేం జోష్‌’ అంది నిర్వేదంగా స్రవంతి.

‘ఏం జరిగింది?’ ఆరాతీసింది శ్రీవల్లి.

‘సర్వీస్‌కి రిజైన్‌ చేస్తున్నా.’ బదులిచ్చింది స్రవంతి. పిడుగు పడ్డంత ఆశ్చర్యం, ఆందోళనతో ‘వాట్‌’ అంది శ్రీవల్లి.

‘ఇది మీ తమ్ముడి గారి ఆదేశం.’

‘ఏమైంది తనకి ?’

‘తెలీదు’ అంది స్రవంతి.

‘ఐ.పి.ఎస్‌లకు, ఐ.ఏ.ఎస్‌లంటే పిచ్చ జెలసీ. అందుకు అతగాడు కూడా మినహాయింపు కాదు’ అంది శ్రీవల్లి

‘ఆ విశ్లేషణ అతడి విషయంలో నిజం కాదు. తను ఐ.ఏ.ఎస్‌ టాపరే. పోలీస్‌ ఉద్యోగం మీద మోజుతోనే ఐ.పి.ఎస్‌ తీసుకున్నాడు కదా.’

‘అఫ్‌కోర్స్‌. అయ్యగారికి ఈ మధ్య సెలబ్రిటీ స్టేటస్‌ వచ్చిందిగా. అందుకని కాస్త మిడిసిపాటేమో’ అంది శ్రీవల్లి

‘శ్రీవల్లీ. నువ్వు ఆయన గార్ని ఎంత తమ్ముడు అని సంభోదించినా. నా ముందే నా భర్తను తూలనాడడం బావోలేదు.’ అంది కోపంగా. ‘నీ పాతివ్రత్యం తగలెయ్య.’ అని గొణిగి ‘పది నిమిషాల్లో వస్తానుండు’ అని తన చాంబర్‌ నుండి బయలు దేరింది శ్రీవల్లి.

శ్రీవల్లి వచ్చే సరికి స్టెనోకి లెటర్‌ డిక్టేట్‌ చేస్తుంది స్రవంతి.

‘రా వల్లీ’ అని ఆప్యాయంగా పిలిచి స్టెనో వైపు తిరిగి ‘సాయంత్రం లోపు లెటర్‌ రెడీ చేయండి.’ చెప్పింది.

స్టెనో గ్రాఫర్‌ నీలిమ కదల్లేదు. ‘మేడమ్‌ మీరీ నిర్ణయం సడన్‌గా ఎందుకు తీసకుకున్నారో తెలుసుకోవచ్చా.’ అడిగింది. ‘ప్యూర్‌ పర్సనల్‌’ అంది స్రవంతి.

‘బట్‌ మేమ్‌ మీరు అగ్రికల్చరల్‌ సెక్రటరీగా చార్జ్‌ తీసకుకున్నాక కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందుల గొడవ లేకుండా రైతులు సుభిక్షంగా ఉన్నారు.’ భయపడుతూనే చెప్పింది నీలిమ.

స్రవంతి అసహజంగా చూస్తూ ‘నీలూ ప్లీజ్‌ డూ యువర్‌ డ్యూటీ.’ అంది.

భయటకు వచ్చింది నీలిమ. బాధపడే హృదయంతో సెక్రెటేరియేట్‌ బీట్‌ చూస్తున్న ఛానల్‌ ‘డీ’ రిపోర్టర్‌ తన బావ ఆనంద్‌కి చెప్పడం అది క్షణాల్లో మీడియాలో వైరల్‌ అవడం జరిగిపోయింది.

శ్రీవల్లితో డిస్కస్‌లో ఉండగానే కుప్పలు తెప్పలుగా ఫోన్‌లు. సమాధానం చెప్పలేక స్విచ్‌ఆఫ్‌ చేసింది స్రవంతి. నీలిమను ఇంటర్‌కమ్‌లోకి పిలిచి చెడామడా తిట్టింది.

‘గవర్నమెంట్‌కి నా లేఖ చేరకముందే మీడియాకు చేర్చావా ఇడియట్‌’ అంది కోపంగా.

అపరాధ భావనతో ‘సారీ మేమ్‌ మా బావ ఆనంద్‌కి బాధపడుతూ చెప్పాను అతడు న్యూస్‌ ఫ్లాష్‌ చేస్తాడనుకోలేదు.’ అంది.

‘ఏడ్చావ్‌లే. లెటర్‌ వెంటనే రెడీ చేసుకొని రా. ఢిల్లీకి కూడా ఫ్యాక్స్‌ చేయాలి.’ అంది. ఇదంతా గమనిస్తున్న శ్రీవల్లి. ‘రేపట్నించి ఘనత వహించిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ గారు ఇంట్లో వంట చేస్తూ కూర్చుంటారా ?’ అంది.

‘వంట చేస్తానో. పూల మొక్కలకు నీళ్లు పోస్తానో ఇంకా తెలీదు.’ అంది నవ్వుతూ.

‘అనిరుద్‌తో నేను మాట్లాడనా?’ అంది శ్రీవల్లి.

‘వద్దు. అతడు ఇలాంటి నిర్ణయం క్యాజువల్‌గా తీసకుకోడు.’ అంది.

‘సర్లే నీ పతి భక్తి మెచ్చాను. ఏదో ఫైల్‌ నీ దగ్గర పెండింగ్‌లో ఉందట. మా కజిన్‌ ఫోన్‌ చేసి చంపుతున్నాడు.’ అని ‘స్లిప్‌’ మీద ఫైల్‌ నెంబర్‌ రాసి ఇచ్చింది.

‘అన్ని నియమ, నిబంధనలకు ఆనుగుణంగా ఉంటే నా లాస్ట్‌ ఆటోగ్రాఫ్‌ ఆ ఫైల్‌ మీదే.’ అంది స్రవంతి.

‘సరే. ఆల్‌ ది బెస్ట్‌’ అని బయటపడింది శ్రీవల్లి. అప్రయత్నంగా టి.వి ఆన్‌ చేసింది స్రవంతి.

‘అంతర్‌ రాష్ట్రీయ మాదకద్రవ్యాల ముఠా చేసిన హెచ్చరికలకు భయపడే ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ అనిరుద్‌ తన భార్య స్రవంతితో ఉద్యోగానికి రాజీనామా చేయించాడని, అతడు కూడా సెలవులో వెళ్లబోతున్నాడన్న వార్తని అటు ఇటుగా మార్చి మీడియా వండి వార్చింది.

టి.వి ఆఫ్‌ చేసింది స్రవంతి. తనకి తెలిసి అనిరుద్‌ అంత పిరికివాడు కాదు. మరెందుకు ఇలా!? కణతల వద్ద నొక్కుకుంది.

————           ————          ————

‘మనం ఒక వారం రోజులు ఊటీ, కొడైకెనాల్‌, బెంగ్‌ళూర్‌ వెళ్తున్నాం.’ అన్నాడు అనిరుద్‌.

‘ఇదేంటి స్వామీ ఈ సడన్‌, సర్‌ప్రైజ్‌లు.’ అంది.

‘సర్‌ ప్రైజ్‌ల్లోనే కదా కిక్‌ ఉంటుంది.’ అన్నాడు నవ్వుతూ.

‘నీ సర్‌ప్రైజ్‌లు తగలెయ్య. మరి విన్నూకి క్లాస్‌లు మిస్‌కావా?’ అంది.

‘పర్వాలేదు.’ అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది భర్త ముఖంలోకి.

ఆ రోజు రాత్రే బెంగుళూర్‌ బయలుదేరారు. రోడ్డుపై అనిరుద్‌ నడిపే ఫోర్డ్‌ కారు రివ్వుమని వెళ్తోంది. వినీత్‌ నిద్రలో జోగుతున్నాడు.

‘మీ మాదక ద్రవ్యాల కేసు ఇన్వెస్టిగేషన్‌ సీరియస్‌గా సాగుతుంది. సి.ఎం. గారు మీరు ఇలా సెలవు పెట్టి, షికారు చెయ్యడానికి ఎలా ఒప్పుకున్నారు?’ అడిగింది స్రవంతి.

నవ్వి ‘సెలవు ఇవ్వకపోతే. నేనూ రిజైన్‌ చేస్తానని చెప్పా. అప్పటికే నీ రిజైన్‌ సమాచారం ఉందిగా భయపడ్డాడు. సెలవు విషయం మీడియాకు చెప్పకుండా వెళ్ళమన్నాడు.’ అన్నాడు అనిరుద్‌.

భర్త చేతిని ఆప్యాయంగా తన చేతుల్లోకి తీసుకుంది స్రవంతి.

‘అనీ. ఎంతకాలం అయ్యింది. మనం ఇంత ప్రైవసీగా ఊర్లకు వెళ్లీ.’ ఉరుకుల పరుగుల జీవితం గుర్తొచ్చింది ఆమెకు.

‘ఇదీ ఒకందుకు మంచిదేనేమో !’ అతడి భుజంపై తలవాల్చి అన్నది స్రవంతి. కాసేపటి తర్వాత వినీత్‌ని పడవలాంటి ఆ కారులో పడుకోబెట్టాడు. ఉదయం కల్లా బెంగుళూర్‌ చేరుకున్నారు. వినీత్‌లో ఎందుకో హుషారు లేదు. ‘నాకు క్లాసులు మిస్‌ అవుతాయిగా మమ్మీ.’ గొణిగాడు.

‘మీ డాడీకి తీరక తీరక ఇప్పుడు తీరిందిరా కన్నా. ఎంజాయ్‌ దట్సాల్‌.’ అంది వినీత్‌ని హృదయానికి దగ్గరగా తీసుకొని. అనిరుద్‌, స్రవంతి ఇద్దరూ హుషారుగానే ఉన్నారు గానీ వినీత్‌ ముఖంలో కళ, దేహంలో హుషారు లేదు. ఎందుకో వాడి పెదవులు అదురుతున్నాయ్‌.

‘అరేయ్‌ కన్నా. రేపు నీకు ఇష్టమైన ప్లేస్‌కు తీసకుకువెళ్తున్నా.’ చెప్పాడు అనిరుద్‌.

‘ఎక్కడికి డాడీ’ అడిగాడు వినీత్‌. ‘సస్పెన్స్‌’ అన్నాడు అనిరుద్‌ ఊరిస్తూ. బెంగుళూర్‌లోని పోలీస్‌ గెస్ట్‌హౌస్‌లో దిగారు. ఉదయాన్నే తొమ్మిదికల్లా రెడీ అయ్యి వినీత్‌ను ఊరించిన ప్లేస్‌కి వెళ్ళారు. అది ఆర్ట్‌ గ్యాలరీ !

వినీత్‌ కళ్లు రెప రెపలాడాయి. వాడి మనసుకు చప్పున రెక్కలు వచ్చినట్లైంది.

‘ఇక్కడ నీ ఏజ్‌ గ్రూప్‌ వాళ్ళకు ఆర్ట్‌ కూడా నేర్పిస్తారు.’ ఉత్సాహంగా చెప్పాడు అనిరుద్‌.

‘వావ్‌ నిజమా?’ అన్నాడు వినీత్‌ ఆనందంగా. ఆర్ట్‌ గ్యాలరీ నిర్వహించే రవిశంకర్‌ దగ్గరకు వెళ్ళారు. తన కొడుకుని పరిచయం చేశాడు. అనిరుద్‌కి రవిశంకర్‌తో ముందస్తు పరిచయం ఉంది. ‘వన్‌ వీక్‌ క్లాసెస్‌ ఉన్నాయ్‌ పంపుతారా.’ అడిగాడు

‘మా వాడు ఆర్ట్స్‌లో పెద్ద వీక్‌ ఏం కాదు. కాకుంటే కాస్త సానబెట్టాలి’ అని తనతో తెచ్చిన ఫైల్లోంచి కొన్ని తైల వర్ణ చిత్రాలు తీశాడు.

‘వావ్‌. ఇవి మీ వాడు వేసినవా?’ అన్నాడు ఆశ్చర్యంతో రవిశంకర్‌

‘ఎస్‌. మా వాడు వేసినవే.’ చెప్పాడు అనిరుద్‌. వినీత్‌ ఆశ్చర్యంగా చూశాడు తండ్రి వైపు. స్రవంతి పరిస్థితి కూడా అలాగే ఉంది.

‘డాడీ ఇవి ఎప్పుడు తెచ్చారు.’ అడిగాడు ఆశ్చర్యంగా.

‘చెప్పాగా అన్నీ సర్‌ ప్రైజ్‌లే ఉంటాయని’ అన్నాడు నవ్వుతూ.

‘అబ్బో బిగ్‌బాస్‌ షోలో సర్‌ప్రైజుల్లా ఉన్నాయ్‌.’ అన్నాడు. అతడికి నిజంగానే సర్‌ప్రైజింగ్‌గా ఉంది.

ఎంతో కష్టపడి అన్ని కలర్స్‌ కాంబినేషన్స్‌తో తాను కాన్వాస్‌పై బొమ్మలు గీసుకొని వస్తే తల్లి నిరుత్సాహపరిచేది.

‘బొమ్మలంటూ టైం వేస్ట్‌ చేసుకోకు నాన్నా. మ్యాధ్స్‌లో నువ్వు వీక్‌ కదా కాన్‌సన్‌ట్రేట్‌ చెయ్యి’ అనేది. తండ్రి దగ్గరకు వెళ్లి చూపితే ‘బిజీగా ఉన్నాను విన్నూ’ అని నిరాశపరిచేవాడు.

అటువంటిది ఇప్పుడు ఏకంగా ఆర్ట్‌ గ్యాలరీకి తీసకుకు రావడం వినీత్‌కి ఆశ్చర్యంగా ఉంది.

వారం రోజుల శిక్షణతోనే వినీత్‌ మంచి చిత్రాలు గీయడం మొదలు పెట్టాడు. గదికి వచ్చిన తర్వాత కూడా వాడికి ‘కుంచె’ కాసేపు ఇచ్చి ఎంకరేజ్‌ చేశారు తల్లిదండ్రులు.

బెంగుళూర్‌ తర్వాత ఊటీకి బయలుదేరారు. ఊటీలో అన్ని వసతులున్న ఒక గెస్ట్‌హౌస్‌లో దిగారు. వణికే చలిలో బయటకు బయలుదేరుతుంటే స్రవంతి ‘ఎక్కడికండి?.’ అంది.

‘నేనూ, విన్నూ మార్కెట్‌కి వెళ్ళి అలా వర్షంలో తడిచి వస్తాం అన్నాడు.’ నవ్వుతూ అనిరుద్‌. ‘అయ్యో వర్షంలో జలుబు చేస్తుంది.’ అంది స్రవంతి.

నవ్వుతూ తండ్రీ కొడుకులు మార్కెట్‌కి వెళ్లి తమకి కావాల్సినవి తీసుకొని తిరిగి గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటా రనగా వర్షం జోరుగా కురిసింది. ఆకాశంలో ఇంద్ర ధనస్సు కనిపిస్తూనే ఉంది. ఇద్దరూ వర్షంలో తడుస్తుండగానే స్రవంతి కూడా వచ్చింది. మమ్మీ అరుస్తుందేమో అనుకొని భయంగా చూస్తున్న వినీత్‌తో ‘రెయిన్‌ని మీరేనా ఎంజాయ్‌ చేసేది ? నేను చెయ్యనా!’ అంది స్రవంతి నవ్వుతూ.

గతంలో వర్షంలోకి వెళితే చాలు కేకలు వేసే ‘మమ్మీ’ ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతుందో వినీత్‌కి అర్థం కాలేదు. గదిలోకి వెళ్ళాక ఒకరి తలలు మరొకరు తుడుచుకున్నారు.

హీటర్‌ ఆన్‌ చేసింది స్రవంతి.

వినీత్‌కి వేడి వేడిగా బోర్నవిటా కలిపి ఇచ్చి, తామిద్దరూ చెరో కప్పు కాఫీ తీసుకున్నారు.

‘వారం రోజులకు పైగా నా క్లాసులు డుమ్మా.’ అన్నాడు వినీత్‌.

‘అరేయ్‌ మీ మమ్మీ కూడా టీచరే తెలుసా ?’ అన్నాడు అనిరుద్‌. స్రవంతి నవ్వుతూ చూసి.

‘అవును విన్నూ. నేను టీచర్‌గా చేస్తూనే సివిల్స్‌ రాసి సక్సస్‌ అయ్యాను.’ అంది.

‘ఐతే మిస్‌ అయిన క్లాసులన్నీ నాకు చెప్పాలి.’ అన్నాడు వినీత్‌.

‘నేనే కాదు. మీ డాడీ కూడా టీచ్‌ చేస్తారు నీకు.’ అంది.

‘అమ్మ..తల్లో.. టీచింగ్‌ మహా బోర్‌.’ అన్నాడు అనిరుద్‌..

‘తప్పదు స్వామీ. వీడ్నిక్కడే ఆర్ట్‌ గ్యాలరీలని, ఊటీ అని తిప్పుతుంటే వీడికి క్లాసులు పోక ఏమవుతాయ్‌’ అంది.

వినీత్‌ని దగ్గరకు తీసకుకొని ‘విన్నూ సూపర్‌ ఇంటల్‌జెంట్‌. సొంతంగా కూడా ప్రిపేర్‌ కాగలడు’ కొడుకును చూస్తూ గర్వంగా అన్నాడు అనిరుద్‌.

‘ఎస్‌ డాడ్‌. ఐ యామ్‌ బ్రిలియంట్‌. మా క్లాసులో టీచర్స్‌ ఎవరికన్నా అర్థం కాకపోతే నా చేత చెప్పిస్తారు తెలుసా’ అన్నాడు కనురెప్పలు అల్లారుస్తూ.

‘ఎస్‌. నా కన్నా సూపర్‌ ఇంటలిజెంట్‌.’ అని కొడుకును హత్తుకుంది స్రవంతి.

మరో నాలుగు రోజుల తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళడానికి సిద్దమయ్యారు. గదిలో వినీత్‌ ఆదమరిచి నిద్రపోతున్నాడు. కొడుకుని దగ్గరగా పొదువుకొని నిద్రపోతున్న స్రవంతికి చప్పున మెలుకువ వచ్చి కళ్లు తెరిచింది. వినీత్‌ పక్కన అనిరుద్‌ లేడు. లేచి మెల్లగా బయటకు వచ్చింది.

కారిడార్‌లో వణికించే చలిలో నిల్చున్నాడు అనిరుద్‌. వెనుక నుండి వచ్చిన స్రవంతి ‘అనూ నిద్రపోకుండా ఏంటి ఇక్కడ నిల్చున్నారు?’ అడిగింది.

‘రేపు మన జర్నీ శ్రావ్‌’ అన్నాడు.’అవును పడుకోండి. ఉదయాన్నే లేచి రెడీ అవ్వాలిగా’ అంది. బయట కురిసే మంచు తుంపర్లను చూస్తూ కూర్చున్నాడు. అతడి పక్కకి వచ్చి కూర్చుంది స్రవంతి. ‘ఏంటి అలా ఉన్నారు?’ అడిగింది.

‘సారీ శ్రావ్‌. బంగారం లాంటి నీ జాబ్‌ నుండి నిన్ను దూరం చేశాను’ అన్నాడు అపరాధనా భావంతో.

స్రవంతి ఏం మాట్లాడలేదు. అతడి భుజంపై తలవాల్చి ‘మన బాబు కంటే నా జాబ్‌ ఎక్కువా?’ అంది. షాకయినట్టు చూశాడు.

‘అనూ ఐ.ఏ.ఎస్‌ పొజీషన్‌ అంటే ఎంత గొప్పదో నీకు తెలుసు. అలాంటిది ఏదో పెద్ద అలజడే నీ చేత నన్ను శాసింపచేసిందని నేను భావించాను. బాబు కేరింగ్‌ కోసమే. నా చేత జాబ్‌మానిపిస్తున్నారని నాకర్థమైంది. నిజమే ఉరుకుల పరుగుల జీవితంతో మనం అసలు వాడ్ని పట్టించుకోవడం లేదు. నాలో నేనే తర్కించుకున్నాను. అనిరుద్‌ ఆల్వేస్‌ రైట్‌. అందుకే నీ మాట శిరసావహించాను.’ అంది.

‘బట్‌..బట్‌ వాడు డ్రగ్‌ ఎడిక్ట్‌ శ్రావ్‌. చాలా జాగ్రత్తగా వాడ్ని డీల్‌ చేయాలి.’ అన్నాడు అనిరుద్‌.

పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడింది స్రవంతి. ‘వ్వాట్‌’

‘అవును స్రవంతి. వాడు ఇప్పుడు సెకండ్‌ స్టేజీలో ఉన్నాడు. అవి అందకపోతే వాడికి కాళ్లు చేతులు వణుకుతాయ్‌. ఒక్కసారిగా వాటికి దూరమైతే వాడి మెదడులో ప్రకంపనాలు మొదలవుతాయి. అచేతనం అవుతాడు. క్రమేణా ఆ మత్తుకు వాడ్ని దూరం చేయడానికి అమ్మ ప్రేమనే మందుగా ఇవ్వాలని నీ చేత జాబ్‌ రిజైన్‌ చేయించా.’ అన్నాడు.

భర్తవైపు భయం భయంగా చూసింది.’ఏం మాట్లాడుతున్నారు మీరు’ గొణుగుతున్నట్టుగా అంది. ‘నీ ప్రేమకు ఆ శక్తి ఉంది స్రవంతి. నీకు తెలుసా నువ్వు నా లైఫ్‌లోకి రాకముందు నేను మద్యం తాగేవాడిని. మద్యం తీసుకొని దగ్గరకు వస్తే దూరం నెట్టావ్‌. నీకు ఇష్టం లేదని ఆ రోజు నుంచి నేను మందు తాగడం మానేశాను. నీ ప్రేమతోనే నన్ను మార్చుకున్నావ్‌. ఇప్పటి వరకూ మళ్లీ ముట్టుకోలేదు’ అంటున్న భర్త మాటలకు అడ్డొస్తూ ‘విన్నూ డ్రగ్‌ ఎడిక్ట్‌ అని మీకు ఎలా తెలుసు ?’ అడిగింది.

‘సిటీలో మాదకద్రవ్యాల సప్లయర్‌ ఒకడు చిక్కినప్పుడు ఇంటరాగేషన్‌లో బయటపడ్డ చైన్‌లో స్కూలు పిల్లలు కూడా వాళ్ల బారిన పడ్డారని తెలిసింది. మన విన్నూ చదివే స్కూల్‌ కూడా ఆ జాబితాలో ఉంది. ఐస్‌క్రీంలు, చాక్లెట్‌ల పేరుతో మాదక ద్రవ్యాలను ఆ స్కూల్‌ చుట్టుపక్కలా అమ్ముతున్నారు. తెలియకుండానే మత్తు కోసం మన వినీత్‌ కూడా ఆ ఉచ్చులో చిక్కుకున్నాడు. మన ఏ.టి.ఎం. కార్డులు వాటి పాస్‌వర్డ్‌లన్నీ వినీత్‌కి తెలుసు. ఇంట్లో నిర్లక్ష్యంగా పారేసి వెళ్లే మన ఏ.టి.ఎం. కార్డులను స్క్రాచ్‌ చేసి డబ్బులు తీసకుకోవడం వినీత్‌ అలవాటు చేసుకున్నాడు.

వాడి సంతోషం కోసం ‘ఫ్రెండ్స్‌కు ట్రీట్‌ ఇవ్వాలి’ అని వాడు చెప్పినప్పుడల్లా ఇబ్బడిముబ్బడిగా డబ్బులు ఇచ్చే వాళ్ళం. ఎవరి పాటికి వాళ్ళం వెళ్ళిపోవడంతో, వాడి ఒంటరితనంలోకి డ్రగ్‌ మహమ్మారి ప్రవేశించింది. వాడిని మామూలు మనిషిని చెయ్యడం కోసమే మన ప్రేమని విస్తరిద్దాం.’ అంటున్న భర్తని కావలించుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ హత్తుకుంది స్రవంతి.

‘మరో విషయం చెప్పాలి నీకు’ అన్నాడు. ‘ఏంటది ?’ అడిగింది భయంగా.

‘రోజు వాడికి నువ్విచ్చే బోర్నవిటాలో కలిపేది షుగర్‌ కాదు. షుగర్‌లా కనిపించే డ్రగ్‌’ అన్నాడు. ఉలిక్కి పడింది స్రవంతి.

‘విన్నూ ప్రస్తుతమున్న స్థితి నుండి క్రమేణా మన వైపుకు తెచ్చుకోవాలి వాడ్ని. ఒక్కసారిగా డ్రగ్స్‌ మానేస్తే వాడి కాళ్లు, చేతులు సరిగ్గా పనిచేయవు. ఫిట్స్‌ వచ్చే ప్రమాదం కూడా ఉంది. షుగర్‌ ప్లేస్‌లో వేసే డ్రగ్‌ క్రమేణా తగ్గించు. బాబుని కాపాడుకోవడానికి అంతకంటే మార్గం లేదు స్రవంతి’ అన్నాడు బాధగా.

‘నా చేతే నా బిడ్డకు ఆ విషాన్ని ఇస్తున్నానా ?’ షాకయ్యింది స్రవంతి.

‘ఇది డాక్టర్ల సలహా. తప్పదు స్రవంతి. వాడికి మనం ఇలా చేస్తున్నాం అని మాత్రం తెలియకూడదు.’ అన్నాడు అనిరుద్‌. భర్తను కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది స్రవంతి.

‘మన ప్రేమనే మత్తులో వాడ్ని పూర్తిగా దించాలి స్రవంతి. అదే వాడికి అసలైన ట్రీట్‌మెంట్‌’ అన్నాడు స్రవంతిని మరింత దగ్గరకు తీసకుకుంటూ.

‘నా కొడుక్కోసం నా ఉద్యోగాన్ని మాత్రమే కాదండీ. నా ప్రాణం కూడా వదులుకుంటాను.’ అంది స్రవంతి భర్త గుండెలపై వాల్చి.

————           ————          ————

సూర్య కిరణాలు చురుక్కుమనడంతో కళ్లు తెరిచింది స్రవంతి. అప్పటికే నిద్ర లేచిన అనిరుద్‌ ‘యోగా’ చేస్తూ కన్పించాడు. మరో నాలుగు రోజులు ఊటీలోని ఆ గెస్ట్‌హౌస్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.

‘గుడ్‌మార్నింగ్‌ మమ్మీ’ అంటూ నిద్ర లేచాడు వినీత్‌.

‘శ్రావ్‌ నువ్వు లేచి రెడీ అయితే బయట టిఫిన్‌ చేద్దాం’ అన్నాడు అనిరుద్‌.

‘బాగా నిద్ర పట్టేసింది. విన్నూకి పాలు కలిపి ఇచ్చి, మీకు కాఫీ తీసుకొస్తా’ అంది స్రవంతి ఫ్రిజ్‌ దగ్గరకు వెళ్తూ.

అనిరుద్‌ మారు మాట్లాడకుండా ‘ఇట్సోకే’ అన్నాడు. ఫ్రిజ్‌లోంచి పాల ప్యాకెట్‌ తీసి పైన కట్‌చేసి పాలు మరగ పెట్టింది. అవి మరిగే లోపు బ్రష్‌ చేసుకుంది. ఒక కప్పులో కాఫీ కలిపి అనిరుద్‌కి ఇచ్చింది. మరో కప్పులో పాలు పోసి అందులో బోర్నవిటాతో పాటు అనిరుద్‌ తెచ్చిన షుగర్‌ కూడా కలిపింది. వినీత్‌ గమనిస్తున్నాడు. బాధతోనే కొడుకు చేతికి కప్‌ ఇచ్చింది స్రవంతి.

వినీత్‌ అమ్మ కళ్ళలోకి చూస్తూ నేరుగా సింక్‌ దగ్గరకు వెళ్ళాడు. ఆ బోర్నవిటా సింక్‌లో పారబోశాడు.

అనిరుద్‌, స్రవంతి హతాశులై చూశారు. వేగంగా వచ్చి అమ్మనాన్నల్ని కౌగిలించుకున్నాడు వినీత్‌.

ఆ హఠాత్‌ పరిణామానికి ఇద్దరూ ఆశ్చర్య పోయారు. ‘రాత్రి నాన్న నీతో మాట్లాడిన మాటలు విన్నానమ్మా. ఐయామ్‌ వెరీ సారీ’ అన్నాడు. ఇద్దరూ కొడుకుని హత్తుకున్నారు. ‘నాకు మీ ప్రేమను మించిన మత్తు మరొకటి లేదని అర్థమైంది’ అన్నాడు వినీత్‌.

ఆ దంపతుల కళ్లలో ఆనంద భాష్పాలు పెల్లుబికాయి.

– తటవర్తి నాగేశ్వరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *