అబ్బే… పెద్ద ‘ఇంటిలిజెంట్‌’ కాదు!

అబ్బే… పెద్ద ‘ఇంటిలిజెంట్‌’ కాదు!

కొన్ని కాంబినేషన్స్‌కు ఒకోసారి ఊహించని క్రేజ్‌ ఏర్పడుతుంది. పైగా అది తొలి కలయిక అయితే అంచనాలూ బాగా ఉంటాయి. అలా గత యేడాది చిరంజీవితో ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రం రూపొం దించిన వి.వి.వినాయక్‌, చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ కాంబినేషన్‌లో సినిమా అనగానే సహజంగానే ఇదేదో బాగా ఉండొచ్చనే భావన సగటు సినీ ప్రేక్షకుడిలో కలిగింది. ఇక దీనికి ‘జై సింహా’ వంటి విజయవంత మైన చిత్రం నిర్మించిన సి.కళ్యాణ్‌ ప్రొడ్యూసర్‌ అనగానే నిర్మాణ విలువలకు కొదవలేదని అనిపిం చింది. అలా తెరెకెక్కిందే ‘ఇంటిలిజెంట్‌’ సినిమా.

కథ విషయానికి వస్తే చిన్నప్పటి నుండే తోటి వారిని నొప్పించకుండా, తాను ఇబ్బంది పడకుండా కాస్తంత బుర్ర ఉపయోగించి ముందుకు సాగి పోతుంటాడు తేజు (సాయిధరమ్‌ తేజ). అతనిలోని చురుకుదనం చూసి, ముచ్చటపడి అతని చదువుకు తాను సాయం చేస్తానని ముందుకొస్తాడు సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అధినేత నందకిశోర్‌ (నాజర్‌). పెరిగి పెద్ద అయ్యాక ఆయన కంపెనీలోనే తేజు చేరతాడు. నందకిశోర్‌తో కలిసి తానూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటాడు. అయితే ఉద్యోగుల పట్ల నంద కిశోర్‌ ఉదారతతో వ్యవహరించడం తోటి సాఫ్ట్‌వేర్‌ కంపెనీల యాజమాన్యానికి నచ్చదు. ఆయన అడ్డు తొలగించుకోవాలని చూస్తుంటారు. అందుకోసం విక్కీ భాయ్‌ (రాహుల్‌ దేవ్‌)ను ఆశ్రయిస్తారు. విక్కీ భాయ్‌ హెచ్చరికలను ఖాతరు చేయని నందకిశోర్‌ హోమ్‌ మినిస్టర్‌ (వినీత్‌ కుమార్‌)ను కలిసి విషయం చెబుతాడు. అయితే విక్కీ భాయ్‌కి చెంచాగిరి చేసే హోమ్‌ మినిస్టర్‌ ఈ విషయంలో చేతులెత్తేస్తాడు. ఈ విషయాన్ని ఢిల్లీలోని పెద్దలకు చెప్పాలని నందకిశోర్‌ ప్రయత్నిస్తాడు. ఇదే సమయంలో తన కంపెనీని విక్కీ భాయ్‌ పేర రాసేసి, నందకిశోర్‌ ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త తేజుకు తెలుస్తుంది. ఇది ప్రీప్లాన్డ్‌ మర్డర్‌ అని గ్రహించిన తేజు తన ఐడెంటి టిని మార్చుకుని ధర్మాభాయ్‌గా మారతాడు. తన తెలివి తేటలతో హోమ్‌ మినిస్టర్‌నుండి నందకిశోర్‌ హత్యకు కారకులైన ప్రతి ఒక్కరిని తనదైన శైలిలో శిక్షిస్తాడు. అందుకోసం అతను ఏం చేశాడు? ఎలా ఇంటిలిజెంట్‌గా వ్యవహరించాడన్నదే మిగతా కథ.

పేరులో ‘ఇంటిలిజెంట్‌’ అని ఉన్నా హీరో వ్యవహారంలో పెద్ద తెలివితేటలేమీ కనిపించవు. ఎత్తుకు పై ఎత్తులూ ఉండవు. ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేసే రాజకీయ నేతలు, తనకు ఎదురు తిరిగే వ్యక్తుల బ్యాంక్‌ ఖాతాలను హ్యాక్‌ చేసి, ఆ డబ్బుల్ని బీదలకు, ఆపన్నులకు అందిస్తాడు ధర్మాభాయ్‌. ఆ రకంగా ఓ రాబిన్‌హుడ్‌ తరహాలో వ్యవహరిస్తుంటాడు. ఇలాంటి కథలను ఇప్పటికే చాలా చూడటం వల్ల ఇందులో మనకు కొత్తదనం ఏదీ కనిపించదు. ఇక నందకిషోర్‌ కుమార్తెగా నటించిన లావణ్య త్రిపాఠి పాత్రకూ పెద్దంత ప్రాధాన్యం లేదు. కేవలం పాటల కోసం పెట్టుకున్నట్టే ఉంది. సాఫ్ట్‌వేర్‌ ఎంప్లాయ్‌గా, ధర్మాభాయ్‌గా సాయిధరమ్‌తేజ కష్టపడే నటించాడు. కాని కథలో బలం లేకపోవడంతో సినిమా అంతా తేలిపోయింది. పోలీస్‌ అధికారులుగా ఆశిష్‌ విద్యార్థి, షాయాజీ షిండే పోషించిన పాత్రలూ గొప్పగా లేవు. వినీత్‌ కుమార్‌ ఓవర్‌ యాక్షన్‌ తట్టుకోవడం కాస్తంత కష్టమే. బ్రహ్మానందం పాత్ర నవ్వించక పోగా విసుగు తెప్పిస్తుంది. కథ, మాటలు అందించిన ఆకుల శివ ఇందులో రౌడీ పాత్ర చేశాడు. అదే మనకు పిచ్చి ఎక్కిస్తుంది. ఇంటర్వెల్‌ కాగానే పృధ్వీ, రఘుబాబుపై వచ్చే కామెడీ సీన్‌ సినిమా మొత్తానికీ పెద్ద రిలీఫ్‌.

సాంకేతిక నిపుణుల గురించి కూడా చెప్పుకోవ డానికి ఏమీ లేదు. తమన్‌ సంగీతం సో..సో… గానే ఉంది. ఇక ‘కొండవీటి దొంగ’ లోని ‘చమకు చమకు ఛామ్‌’ పాటను పనిలేక రీమిక్స్‌ చేసినట్టుగా అనిపిస్తుంది. స్వతహాగా మంచి డాన్సర్‌ అయిన సాయిధరమ్‌ తేజ్‌తో సరైన స్టెప్పులే వేయించలేదు. ఇక లావణ్య త్రిపాఠి డాన్సుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. ఈ సినిమా మొత్తంలో వినాయక్‌ మార్క్‌ ఎక్కడా కనిపించలేదు. ఆ మధ్య వచ్చిన ‘ఖైదీ నంబర్‌ 150’ కూడా రీమేక్‌ కావడంతో ఆ మాత్రం విజయం సాధించిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే దానికి ముందు కూడా వినాయక్‌ తీసిన ‘అఖిల్‌’ పెద్ద పరా జయాన్ని పొందింది. అదే కోవలో ‘ఇంటిలిజెంట్‌’ సైతం సాగింది. వరుస పరాజయా లతో సతమత మవుతున్న సాయిధరమ్‌ తేజకు వినాయక్‌ ఏ విధమైన సాయం చేయలేకపోయాడు. మరి ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న కె.ఎస్‌. రామారావు, కరుణాకరన్‌ సినిమా అయినా తేజుకు విజయాన్ని అందిస్తుందేమో చూడాలి. ‘ఇంటిలిజెంట్‌’ అనే పేరు చూసి థియేటర్‌కు వెళితే మాత్రం దర్శక నిర్మాతల ట్రాప్‌లో అమాయకంగా ఇరుక్కుపోయినట్టే!

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *