అపహాస్యం

అపహాస్యం

‘కత్తితో పళ్ళు కోయవచ్చు, పీకలు తెగ్గొట్టవచ్చు’ అని మనకు బాగా తెలిసిన ఓ వాడుక పదం ఉంది. అలాగే రచయితలు తమ అందమైన కలంతో ఆహ్లాదకరమైన హాస్యాన్ని సృష్టించగలరు ! హాస్యం పేరిట డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లు రాసి అపహాస్యాన్ని జనింపగలరు. ‘జూలకటక’ అనే పేరుతో జెమినీ టి.వి.లో నవంబరు 15 రాత్రి 9.30 కి ప్రారంభమైన ఈ కార్యక్రమం పైన చెప్పుకున్న రెండో రకం కామెడీకి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇది ప్రతి బుధవారం ప్రసారమవుతుంది.

ఎలాంటి కార్యక్రమాలను ప్రజలు బాగా ఆదరిస్తారో అలాంటి వాటినే టి.విల్లో పేర్లు మార్చి కొత్తగా ప్రారంభిస్తారు. ఇదే ‘జూలకటక’ విషయం లోనూ జరిగింది.

మోతాదుకు మించిన హాస్యం, ద్వంద్వార్థాలు, కొన్నిచోట్ల సమర్థించుకోడానికి వీల్లేని అసభ్య పదజాలంతో నిండిపోయిన ‘జబర్దస్త్‌’ కార్యక్రమం కోవకే ఈ కార్యక్రమం కూడా చెందుతుంది. ఈ కార్యక్రమంలో కూడా ఇద్దరు జడ్జీలు, ఒక యాంకర్‌, నాలుగు టీంలు ఉన్నాయి.

కార్యక్రమంలో టీంల వారిగా ప్రదర్శించిన కామెడీ 

పిచ్చి పుల్లయ్య అనే ఓ రాజకీయ నాయకుడు ప్రజా సమస్యలు తీరుస్తానంటూ ఓ బోర్డు పెట్టు కుంటాడు. తన దగ్గరకొచ్చి సమస్య చెపుకున్న ఓ వ్యక్తికి ఇచ్చిన సూచనలు, వగైరా తొలి టీం ప్రదర్శిస్తుంది.

‘నాకు పెళ్ళై పదేళ్ళయినా పిల్లలు పుట్టలేదు. ఈ సమస్య తీర్చండి’ అని ఆ వ్యక్తి ఆ నాయకుణ్ణి అడుగుతాడు. దానికి ఆ నాయకుడు చెప్పిన సూచనలు చాలా అపహాస్యంతో కూడినవి. ఆ సందర్భం కావల్సినన్ని అవాంఛనీయ పదాలు దొర్లించే రీతిలో ఉంటుంది. ఈ అవకాశాన్ని సదరు స్కిట్‌ స్క్రిప్టురైటర్‌ ఏ మాత్రం వృథా చేయకుండా తన బుర్రలో ఉన్న ఆలోచనాధోరణినంతా వడ్డించేశాడు. అంతే ఎఫ్‌క్టివ్‌గా స్కిట్‌లో పాల్గొన్న నటీనటులు కూడా నటించారు. ఓ చోట తన సమస్యను చెప్పుకున్న అభ్యర్థి పోతూ పోతూ తన విజిటింగ్‌ కార్డు ఇస్తాడు. అది చూసిన నాయకుని అనుచరుడు ‘ఏమిటీ మీది యూసఫ్‌గూడానా ? ఇది నాకు ఇన్ఫర్‌మేషన్‌లా లేదు. ‘ఇన్విటేషన్‌లా ఉంది’ అంటాడు. అంతకు ముందు సదరు అభ్యర్థి చెప్పిన సమస్యకు కొనసాగింపుగా చెప్పిన వాక్యం ఇది. మరి ఇలాంటి సంభాషణలు ఎలా జనాదరణ పొందగలుగు తున్నాయని అడగవచ్చు. ప్రజలు ఛానల్స్‌ ఏం చూపిస్తే అదే చూస్తారు. ప్రజలకు మంచి, ఆరోగ్యకర కామెడీని అందించాల్సిన బాధ్యత ఛానల్స్‌పైనే ఉంటుంది. ఇలాంటి అవాంఛనీయ కల్పితాల్ని ‘కామెడీ’ నెపంతో ప్రదర్శించడ ఎంత వరకు కరెక్ట్‌ ?

అలాగే దీని తర్వాత మరో టీం ప్రదర్శించిన హాస్యం కూడా అపహాస్యం మాదిరిగానే ఉంది. ఓ వ్యక్తి ఇరవై ఏళ్ళ క్రితం ఓ అమ్మాయిని ప్రేమించి, తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతాడు. చాలా కాలానికి తిరిగొస్తాడు. ఇప్పుడామె మరొకర్ని చేసుకుందని విలపిస్తూ పుంఖానుపుంఖాలుగా డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ని గుప్పిస్తాడు. ఇందులో ఓ వ్యక్తి దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావును హైడోస్‌లో అనుకరిస్తాడు. సాధారణంగా మిమిక్రీ కళాకారులు నాగేశ్వరరావు అనగానే మెడ దగ్గర చెయ్యి పెట్టుకుని డైలాగులు చెప్తారు. దాన్నే ఇందులోను అనుకరించారు. అయితే వాస్తవానికి అంత కృత్రిమంగా నాగేశ్వరరావు నటించరు. ఆ విషయాన్ని అక్కినేని గతంలో ఒకసారి ఖండించారు కూడా. ఇక ‘వైఫై’, ‘అన్‌లిమిటెడ్‌ యూసేజీ’ అనే పదాలకు కుప్పలు తెప్పలుగా ద్వంద్వార్థాలు పుట్టించారు. ‘మనింట్లో వైఫై పనిచేయనపుడు పక్కింట్లో ‘వైఫ్‌’కి కనెక్ట్‌ అయిపోవాలి.’ లాంటి సంభాషణలు ఇందులో కోకొల్లలు.

ఇక మూడో టీం ప్రదర్శించిన స్కిట్‌ దర్శకుడు కె.రాఘవేంద్రరావు అంటే పిచ్చి ప్రేమ ఉన్న యువతి నేపథ్యంలో సాగుతుంది. ఆయన చిత్రాల్లో నటించిన శోభన్‌బాబు, డా|| రాజశేఖర్‌ తదితరుల వేషాల్లో కొందరు నటులు వారిని అనుకరిస్తారు.

కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా ఉదయభాను, బిత్తరసత్తి వ్యవహరించగా, వ్యాఖ్యాత్రిగా శ్రీముఖి వ్యవహరిస్తుంది. ఒక స్థాయిలో అయితే బిత్తిరి సత్తి తన నటనకున్న బ్రాండ్‌ ఇమేజీ ప్రకారం ఇందులోనూ కాస్తంత వెర్రిబాగులవాని లాగానే న్యాయనిర్ణేత స్థానంలోనూ వ్యవహరించారు. ఇక నాలుగో టీంలో అందరికి బాగా ఇష్టమైన సబ్జెక్టుగా పరిగణించే మద్యం తాగే అలవాటు ఉన్న వ్యక్తితో కూడిన సన్నివేశాలు గల హాస్యం. ఇటీవల బహుళ జనాదరణ పొందిన ఓ చిత్రంలోని పాట ‘అరె ! మామా ఓ పెగ్గులా’ నేపథ్యంలో ఈ స్కిట్‌ సాగుతుంది. ‘పెగ్గు పురుష లక్షణం’ అన్న పంచ్‌ కూడా ఇందులో ఉంటుంది.

పంచ్‌లకేం తక్కువకాదు

కార్యక్రమమంతా శృతిమించిన పంచ్‌లతోనే సాగింది. ‘మధ్యతరగతి వాడు మందు లేకుండా ఉండలేడు, సామాన్యుడికి సారా కావాలి, బార్ల ముందు బార్లు తీరిన జనం’ లాంటి చాలా పంచ్‌లు ఇందులో ఉన్నాయి. అలాగే ‘సర్వేజనా సుఖినోభవంతు’ విశ్లేషణ చమత్కారంగా ఉంది.

ఇందులో పాల్గొన్న నటీనటులు, స్క్రిప్టు రాసిన రచయితలు ప్రతిభ కలవారే! వీరు ఈ మాదిరి హాస్యాన్ని పండించడానికి కృషిచేసిన సమయంలో సగం వెచ్చించినా అభినందనీయ హాస్యం తప్పకుండా వచ్చేది.

– స్ఫూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *