అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి ‘జంబ లకిడి పంబ’

అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి  ‘జంబ లకిడి పంబ’

హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి ‘గీతాంజలి’ చిత్రంతో కథానాయకుడిగా మారాడు. ఆ తర్వాత ‘ఆనందో బ్రహ్మ’, ‘జయమ్ము నిశ్చయంబురా’ చిత్రాల్లోనూ హీరోగా నటించాడు. ఇవి తొలి చిత్రమంత విజయ వంతం కాకపోయినా… శ్రీనివాసరెడ్డికి నటుడిగా మాత్రం మంచి పేరే తెచ్చిపెట్టాయి. ఆ ఉత్సాహం తోనే తాజాగా ‘జంబ లకిడి పంబ’ చిత్రంలో నటించాడు. గతంలో ఇవీవీ సత్య నారాయణ ఈ పేరుతో తీసిన సినిమా చక్కని విజయాన్ని సాధించింది. కథానుగుణంగా ఆ పేరు పెట్టాం తప్పితే ఆ సినిమాకు దీనికి ఏ సంబంధం లేదని విడుదలకు ముందే నిర్మాతలు రవి, జోజో జోస్‌, ఎన్‌. శ్రీనివాసరెడ్డి తెలిపారు.

కథ విషయానికి వస్తే… ప్రేమించి పెళ్ళి చేసుకున్న వరుణ్‌ (శ్రీనివాసరెడ్డి), పల్లవి (సిద్ది ఇద్నానీ) కాపురం మూడునాళ్ళ ముచ్చటే అవుతుంది. పెద్దల్ని కాదని ఒక్కటైన వీరి మధ్య మనస్పర్థలు పెరిగి పోవడంతో విడాకుల కోసం లాయర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌ (పోసాని)ని కలుస్తారు. అప్పటికే 99 జంటలకు విడాకులు ఇప్పించిన హరిశ్చంద్ర ప్రసాద్‌, వీళ్ళ కేసుతో 100 పూర్తి చేసి, రికార్డు సృష్టించాలని భావిస్తాడు. కానీ ఈలోగా భార్యతో కలిసి గోవా ట్రిప్‌కు వెళ్ళి అక్కడ యాక్సిడెంట్‌లో చనిపోతాడు. స్వర్గం దగ్గర దేవేంద్రుడు ఓ మెలిక పెడతాడు. భార్యతో కలిసి అందులోకి అడుగుపెట్టా లంటే… ముందు వరుణ్‌, పల్లవిని కలపమని, వారి మధ్య మనస్పర్థలు తొలగిపోయేలా చేయమని చెబుతాడు. దాంతో గత్యంతరం లేక హరిశ్చంద్ర ప్రసాద్‌ ఆత్మ తిరిగి భూమి మీదకు వస్తుంది. వరుణ్‌, పల్లవిలకు తన గోడంతా తెలిపి, అన్యోన్యంగా ఉండమని, తద్వారా తనకు స్వర్గం ప్రాప్తిస్తుందని హరిశ్చంద్ర ప్రసాద్‌ వేడుకుంటాడు. కానీ వాళ్ళు ససేమిరా అంటారు. దాంతో ఒకరి కష్టాలు ఒకరికి తెలిస్తే అయినా వారిలో మార్పు వస్తుందేమోననే ఆశతో ఇద్దరి ఆత్మలను అటూ ఇటూ తారుమారు చేస్తాడు. దాంతో వరుణ్‌… పల్లవిలాను, పల్లవి వరుణ్‌లానూ ప్రవర్తించడం మొదలు పెడతారు. ఆ రకంగా అయినా వారిలో మార్పు వచ్చిందా? లేక కొత్త సమ స్యలు ఏమైనా మొదలయ్యాయా? ఈ భార్యభర్తలు విభేదాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టి ఒక్కటి అయ్యారా లేదా అన్నది మిగతా కథ.

నిజానికి ఇలాంటి కథలతో సోషియో ఫాంటసీ సినిమాలు కొన్ని గతంలో వచ్చాయి. ఒకరి ఆత్మ మరొకరిలోకి ప్రవేశించడం మనం చాలా సినిమా ల్లోనే చూశాం. కానీ భార్యాభర్తలను ఒకటి చేయడా నికి చేసే ఈ ప్రయత్నం అందరినీ ఆకట్టుకునేదే. కానీ దర్శకుడి అనుభవ రాహిత్యం కారణంగా ఈ కథ తేలిపోయింది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఏ ఒక్క సన్నివేశమూ మనల్ని ఆకట్టుకోదు. లాయర్‌గా పోసాని చేసే ఓవర్‌ యాక్షన్‌ తట్టుకోవడమే కష్టంగా ఉన్న సమయంలో భరణి ద్వితీయార్థంలో వరుణ్‌ తండ్రి పాత్రలో మరింత రెచ్చిపోయాడు. ఇక పోసాని శిష్యుడిగా వెన్నెల కిశోర్‌ వినోదాన్ని పంచే ప్రయత్నం చేసినా… అదీ పెద్దంత ఫలితాన్ని ఇవ్వలేదు. ధన్‌రాజ్‌, హరితేజ కామెడీ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేపోయింది. కథనం బలహీనంగా ఉండటం ఓ కారణమైతే… సాంకేతిక నిపుణుల సహకారం కూడా పెద్దంత లభించినట్టు కనిపించదు. స్వతహాగా మంచి సంగీత దర్శకుడైన గోపీసుందర్‌ బాణీలు ఆకట్టుకునే విధంగా లేవు. మాటలూ ఎక్కడా పెద్దంత పేలలేదు. నటీనటుల నటన కూడా అంతంత మాత్రమే. ప్రతి విషయం లోనూ ఆచితూచి అడుగులు వేసే శ్రీనివాసరెడ్డి ఈ కథను ఎందుకు ఎంపిక చేసుకున్నాడా అనిపిస్తుంది. అతనికి ఏమాత్రం సెట్‌కాని క్యారెక్టర్‌ చేసి అభాసు పాలయ్యాడు. కొత్తమ్మాయి సిద్ధి ఇద్నానీ కూడా గొప్పగా ఏమీ నటించలేదు. చెప్పుకోవడానికి చాలామంది కమెడియన్స్‌ ఉన్నా వారి వల్ల సినిమాకు ఎలాంటి ఉపయోగం దక్కలేదు. దర్శకుడు జె.బి. మురళీకృష్ణ గతంలో మలయాళ చిత్రం ‘ఆర్డినరీ’ని తెలుగులో ‘రైట్‌ రైట్‌’ పేరుతో రీమేక్‌ చేశాడు. అది విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో కనీసం రెండో సినిమాకైనా అతను మరింత గట్టిగా ¬మ్‌వర్క్‌ చేసి ఉండాల్సింది.

ఇదిలా ఉంటే… ఈ సినిమాకు ఇవీవీ హిట్‌ మూవీ ‘జంబ లకిడి పంబ’ అనే పేరు పెట్టడం మరో మైనస్‌ అయ్యింది. ఆ సినిమా స్థాయిలో కాకపోయినా… ఏ మోస్తరుగా అయినా ఉంటుందని ఆశపడి థియేటర్‌కు వచ్చిన వారికి తీవ్ర నిరాశ తప్పలేదు. ఆ పేరు కథాను గుణంగా సెట్‌ అయ్యేదే అయినా… అనవసరంగా ప్రేక్షకుల్లో ఆశలు రేపినట్టు అయ్యింది. ఏదేమైనా ఇటు శ్రీనివాసరెడ్డి, అటు దర్శకుడు మను ఇద్దరి కెరీర్‌లో ఈ సినిమా ఓ బ్లాక్‌ స్పాట్‌గా మిగిలిపోతుంది. కామెడీ సినిమాలు చూసి ఎంజాయ్‌ చేసేవారు కూడా ఈ చిత్రానికి దూరంగా ఉంటే మంచిది.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *