అదే రీతిలో బాలల చిత్రోత్సవం !

అదే రీతిలో బాలల చిత్రోత్సవం !

భారత అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి హైదరాబాద్‌ శాశ్వత వేదిక అవునా ? కాదా ? ఇదో బేతాళ ప్రశ్న. 1995తో మొదలుకొని 2017 వరకు హైదరాబాద్‌లో 12వ సారి అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని జరుపుకున్నాం. అయినా ఈ ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం మాత్రం రావడంలేదు. దాంతో పిల్లల చిత్రాలపట్ల పాలకులకు ఎంతటి అభిమానం ఉందో అర్థమవుతోంది. ‘హైదరా బాద్‌ను మీరు శాశ్వత వేదికను చేస్తే మీకు తగిన రీతిలో సౌకర్యాలు కల్పిస్తాం’ అని గత ప్రభుత్వాలు హామీలిచ్చాయి. ‘తప్పకుండా’ అంటూ అప్పట్లో సాయి పరాంజపే ఆధ్వర్యంలోని చిల్డ్రన్‌ ఫిల్మ్‌ సొసైటీ ఆమోదం తెలిపింది. అయితే ప్రభుత్వం కేటా యించిన స్థలం నచ్చక, నగరం నడిబొడ్డులో ఇస్తే వేడుకలు ఇంత కంటే ఘనంగా చేస్తామని ఆమె స్వయంగా ప్రకటించారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఈ వ్యవహారం ఉంది.

అయితే అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాన్ని వేరే రాష్ట్రంలో జరపడానికి వారూ పెద్దంత సుముఖంగా లేరు. ఇదే శాశ్వత వేదిక అని ప్రకటించకపోయినా మన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని భుజానికెత్తుకుని నిర్వహిస్తూనే ఉంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండవ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ఎప్పటిలానే ఎలాంటి మెరుపులు లేకపోవడమే బాధకు గురి చేసే అంశం.

రెండేళ్ళకు ఒకసారి అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని నవంబర్‌ 14 నుండి 20 వరకు జరుపుతున్నారు. కాని ఈసారి ఈ వేడులు ఓ వారం ముందే నిర్వహించారు. ఇది చిల్డ్రన్‌ ఫిల్మ్‌ సొసైటీ ఆలోచనో, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమో తెలియదు. 8వ తేదీన ఈ వేడుకను రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రారంభించారు. దాదాపు మూడు లక్షల మంది బాలలు ఈసారి చిత్రాలను చూసే ఏర్పాట్లు చేశారు. ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌ అతిథులకు, మీడియాకు, జ్యూరీ సభ్యులకు వేదిక కాగా జంట నగరాల్లోని పది థియేటర్లలో సాధారణ ప్రేక్షకులు, పిల్లల కోసం సినిమాలను ప్రదర్శించారు. విశేషమేంటంటే విదేశాల నుండి గత యేడాదితో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో సినిమాలు ప్రదర్శనకు వచ్చాయి. అలానే తెలుగులోనూ వివిధ విభాగాల్లో ఏడు చిత్రాలు ప్రదర్శనకు ఎంపిక య్యాయి. గతంలో రూపుదిద్దుకున్న మరో రెండు, మూడు బాలల చిత్రాలు కూడా అదనపు ఆకర్షణగా నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని చిల్డ్రన్‌ ఫిల్మ్‌ సొసైటీ ఈ చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నప్పటికీ దీనికి సంపూర్ణ సహకారం లభించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం నుండే.

ఈసారి ఇదే సమయంలో శాసన సభ సమావేశాలు జరగడంతో ప్రభుత్వ అధికారులంతా దానిపైనే దృష్టి కేంద్రీకరించారు. దాంతో బాలల చిత్రోత్సవాన్ని పట్టించుకున్న నాథుడే లేకపోయాడు. ఎవరికి వారు తమ తమ వ్యవహారాల్లో బిజీగా గడిపేశారు. నిజానికి ఈ అవకాశాన్ని మరో రకంగా సద్వినియోగం చేసుకుని ఉండాల్సింది. ఆస్కారం ఉన్న శాసన సభ్యులను చిత్రోత్సవానికి పిలిచి, వారికి కనీసం రెండు, మూడు చిత్రాలను చూపించి ఉంటే ఎంత బాగుండేది ! కానీ సర్కారుకు అసలు ఇలాంటి ఆలోచనే రాలేదు. మన శాసన సభ్యులు సైతం అసెంబ్లీ సమావేశాలపై చూపించిన శ్రద్ధను కూతవేటు దూరంలో ఉన్న ప్రసాద్‌ ఐమాక్స్‌కు వెళ్ళి సినిమాలు చూసొద్దామనే దానిపై పెట్టలేదు. మన శాసనసభ్యులంతా పిల్లలతో కలిసి సినిమాలు చూస్తే ఎంతో నిండుగా ఉండేది.

ఇక ఎప్పటిలానే ఈసారి కూడా సమన్వయ లోపం ప్రస్ఫుటంగా కనిపించింది. మరీ దారుణంగా ఇ.సి.ఎఫ్‌.ఐ. బయోస్కోప్‌ అనే సమాచార పత్రిక ఈసారి తెలుగులో ముద్రించడం మానేసింది. చివరి నిమిషంలో ఈ విషయం తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వమే ఆ బాధ్యతను భుజానవేసుకుంది. ఈ విషయంలోనే కాదు, ప్రారంభ చిత్రం ఏదనే దానిలోనూ ఎలాంటి స్పష్టత కనిపించలేదు. మీడియాకు కూడా చివరి వరకూ ఏ సమాచారమూ అందలేదు. ముఖ్య అతిథులు ఎవరెవరు హాజరవుతారో కూడా తెలియని పరిస్థితి. రెండేళ్ళకు ఓసారి వేడుక జరపాలి కాబట్టి జరిపినట్టుగా ఉంది తప్పితే, చిత్తశుద్ధి మాత్రం ఇసుమంతైనా కనిపించలేదు. ముగింపు వేడుక సైతం తూతూ మంత్రంగా జరిగిపోయింది. బాలీవుడ్‌ ప్రముఖులు హాజరైనట్టుగా తెలుగు నటీనటులు హాజరు కాకపోవడం కూడా బాధాకరమే. వివిధ విభాగాల్లో తెలుగు సినిమాలు పోటీ పడినా అవార్డుకు ఎంపికైనవి చేతిమీద లెక్కించదగ్గవే.

ఏ విభాగంలో లేకపోయినా అందరినీ అలరించిన చిత్రం మాత్రం ‘పూర్ణ’ అనే చెప్పాలి. ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన సాహస బాలిక మాలవత్‌ పూర్ణ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాలల చిత్రోత్సవానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలానే బహుమతిని అందుకున్న ఇరాన్‌ చిత్రం ‘హౌరా’ అందరి మనసులను దోచుకుంది.

ఎన్నో ఆశలతో బాలల చలన చిత్రోత్సవానికి ఎంట్రీలు పంపుతున్న వారికి, సినిమాలు చూడటానికి ఎంతో సమయం వెచ్చిస్తున్న వారికి తగిన సహాయ, సహకారాలు ప్రభుత్వ అధికారుల నుండి లభించడం లేదన్నది వాస్తవం. వచ్చే సారైనా పరిస్థితులు మెరుగుపడతాయేమో చూడాలి.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *