అజంతా గుహలు – బౌద్ధశిల్పాలు

అజంతా గుహలు – బౌద్ధశిల్పాలు

అజంతా గుహలు అందాలకు పుట్టినిల్లు వంటివి. 1930లో ‘యునెస్కో’ వీటిని ప్రపంచ వారసత్వ (హెరిటేజ్‌ ) ప్రదేశాలుగా గుర్తించింది. అజంతా గుహలు 1819లో 28వ మద్రాసు అశ్విక దళానికి చెందిన ‘జాన్‌స్మిత్‌’ ఈ ప్రాంతానికి వేటకు వచ్చినపుడు వెలుగులోకి వచ్చాయి.

అజంతా గుహలన్నీ బౌద్ధ గుహలే. వీటిలో కొన్ని క్రీ.పూ. ఒకటి, రెండు శతాబ్ధాల నాటి ‘హీనయానానికి’ సంబంధించినవి కాగా మరికొన్ని క్రీ.శ. 5, 6 శతాబ్దాల నాటి ‘మహాయానాని’కి చెందినవి.

హీనయాన కాలంలో బుద్ధుని ధర్మచక్రం, బోధి వృక్షం ప్రతీకలుగా చూపించారే తప్ప సాకారంగా చూపించలేదు. అయితే మహాయాన కాలంలో మాత్రం బుద్ధున్ని సాకారంగా చూపిస్తూ బౌద్ధ మత సంబంధిత గాథల్ని కళాత్మకంగా శిల్పాలుగా చెక్కారు.

క్రీస్తు శకం ఐదవ శతాబ్దానికి చెందిన ఏడు మహాయాన గుహల్లో ప్రథమ గుహ అత్యద్భుతమైన కుడ్య (గోడ) చిత్రాలకు పేరు పొందింది. దీని బయట బుద్ధుని జీవిత గాథలను చెక్కారు. పైకప్పు ఆధారంగా ఇరవై స్తంభాల మీద చక్కని శిల్పాలను మలిచారు. రెండవ గుహలో నాగరాజుల మూర్తులు, వారి అనుచర గణం శిల్పాలున్నాయి. ఈ గుహ పైకప్పు మీద కూడా అద్భుతమైన చిత్రాలు మనకు కనిపిస్తాయి.

8, 9, 10, 12, 13, 15 గుహలు హీనయాన శాఖ సంబంధమైనవి. వీటిలో తొమ్మిదవది చైత్ర గుహ. ఇందులో హీనయాన, మహాయాన శాఖలకు చెందిన కుడ్య చిత్రాలు, ఐదవ శతాబ్ధం నాటి బుద్ధ విగ్రహం ఉన్నాయి. పదవ గుహ అతిప్రాచీన, సుందరమైనదిగా పేరు పొందింది.

18 నుండి 20 వరకు గల గుహలు 5వ శతాబ్ధానికి ఉత్తరార్థంలో నిర్మించిన మహాయాన గుహలు. 16వ గుహలో మనకు అందమైన ద్వారపాలిల విగ్రహాలు దర్శనమిస్తాయి. పదిహేడవ గుహ లోపలికి వెళ్తే బుద్ధుని విగ్రహాలు, పద్మాలను చూడొచ్చు. 21 నుండి 27 వరకు గల గుహలు అజంతా శిల్పకళలో పరిపూర్ణమైన దశను సూచిస్తాయి. ఇరవై ఆరవ గుహలో బుద్ధుని ‘మహా పరినిర్యాణ’ (మరణం) ప్రతిమ దర్శనమిస్తుంది. ఇక్కడ బుద్ధ భగవానుడు కళ్లు మూసుకుని, విశ్రమిస్తున్న భంగిమలో కనిపిస్తాడు. బుద్ధుడు తనువు చాలిస్తున్నందుకు ఒక శిష్యుడు కంటతడి పెడుతుండగా, పైన బుద్ధుని దివ్యమైన శరీరాన్ని దేవతలు స్వాగతిస్తున్నట్లు చెక్కిన తీరు అపూర్వం.

మహారాష్ట్రలోని అజంతా గ్రామానికి మూడున్నర కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవులతో కూడిన గుర్రపునాడ ఆకృతిలో ఉన్న కొండ మీద అజంతా గుహలు ఏర్పడ్డాయి. ఇవి ఔరంగాబాద్‌ పట్టణానికి 107 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అజంతాకు దగ్గరలో జలగావ్‌, భూసావల్‌ పట్టణాలున్నాయి. వీటికి దిగువన ఉన్న కొండల మధ్య ‘వాఘర్‌’ నది ప్రవహిస్తూ ఉంటుంది. అజంతా గుహలు ఈ కొండకు దక్షిణంగా 35 నుండి 115 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఇక్కడికి సమీపంలోనే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ‘ఘృష్ణేశ్వర’ క్షేత్రం కొలువు తీరింది.

అజంతా గుహలకు ఆకర్షణగా నిలిచేవి చిత్రకళలే ! ఈ గుహలకు వెళ్లే దారిలో మనకు సన్నని గుర్రపు నాడాలు కనిపిస్తుంటాయి. వీటికి దగ్గరలోనే అద్భుతమైన జలపాతం కూడా ఉంది. ఇది చూపరులను అమితంగా ఆకట్టుకుంటోంది. అజంతా గుహల పైకప్పు, గోడల మీద చెక్కిన గౌతమ బుద్ధుని జీవిత విశేషాలు, రంగురంగుల చిత్రాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కొండకు పశ్చిమ భాగంలో ఉన్నటువంటి గుహల్లో వేటగాడు పన్నిన వలలో చిక్కిన పావురాన్ని రక్షించే శిబిచక్రవర్తి చిత్రం, జానపద కథా చిత్రాలు కనిపిస్తాయి.

రెండో గుహలో బుద్ధ భగవానుడి జననాన్ని చిత్రించారు. దానికి పైభాగంలో హంసలు బారులు తీరిన దృశ్యం ఎంతో మనోహరంగా పర్యాటకుల మనస్సును దోచుకుంటుంది.

పైన చెప్పుకున్న 16వ గుహలో ద్వారపాలికలే కాకుండా బుద్ధుడి నిజ జీవితంలో ఎదురైన పలు సంఘటనలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. వీటిని పురాతన కాలంలోనే చిత్రీకరించినట్లు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. నాటి చిత్రకారులు ఆ చిత్రాలకు వేసిన రంగులు నేటికీ అలాగే ఉన్నాయి.

యాభై ఆరు మీటర్ల ఎత్తులో ఉన్న కొండపై అజంతా గుహలు పడమటి నుండి తూర్పుకు వ్యాపించి ఉంటాయి. తొలుత ‘జాన్‌స్మిత్‌’ ఈ గుహలను ఎక్కడి నుంచైతే చూశాడో ఆ ప్రదేశాన్ని ‘వ్యూ పాయింట్‌’ గా చెబుతారు. ఈ గుహల్లో తీర్చిదిద్దిన శిల్పాలు, చిత్రాలన్నీ బౌద్ధ మతానికి ప్రతీకలు. అయితే వీటిలో ఏది మొదటిదో, ఏది చివరిదో చెప్పడానికి చారిత్రక ఆధారాలు మాత్రం లేవు.

ఈ గుహల్లో అలనాటి మహా శిల్పులు చేతి గొడ్డలి, ఉలి, సుత్తి మూడు ప్రధానమైన పరికరాలతో ఓ అద్భుతమైన చిత్రాన్ని రూపొందించారు. ఇది నేటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. 16వ బౌద్ధ గుహలో నదీ ప్రవాహ దృశ్యం, హరిసేనుని మంత్రి వరాహదేవుడు వేయించిన దాన శాసనాలు కూడా మనకు కనిపిస్తాయి. 17వ గుహలో చిత్రించినటువంటి వీపాసిన్‌, సిచిన్‌, విశ్వబు, క్రకుచ్ఛంద, కనకముని, కశ్యప, మైత్రేయ మొదలైన బుద్ధ రూపాలు యాత్రికులను ఎంతగానో ఆకర్షిస్తాయి. వాటితో పాటు రాకుమార మరణం, జీవన చక్రం, మహాకవి, విస్సాంతర, సుతసోమ, మతిపోసక, సామ, పురు, నిగోధ మృగ వంటి వివిధ జాతక కథలు, బౌద్ధస్థూపాలు, పరినిర్యాణ జీవితేతివృత్తాలున్నాయి.

– డా|| మంతెన సూర్యనారాయణ రాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *