అందాల సోయగాల ‘అరకులోయ’

అందాల సోయగాల ‘అరకులోయ’

అరకులోయ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో ఉంది. దీనిని ఇక్కడి ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్‌ ఊటీ (ఉదక మండలం) అని పిలుస్తుంటారు. ఇక్కడ వాతావరణం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. విశాఖ (వైజాగ్‌) నగరానికి ఇది 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైజాగ్‌ నుండి అరకులోయకు రైలు మార్గంలో వెళితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. భారతదేశంలోనే ఎత్తైనటువంటి బ్రాడ్‌గేజ్‌ రైల్వేమార్గం ‘శిమిలీ గుడ’ ఇక్కడే ఉన్నది. మార్గం మధ్యలో 84 వంతెనలు, 58 సొరంగాలు (టనెల్స్‌) లను దాటి వెళ్ళాల్సి ఉంటుంది. లోయలోకి వెళ్లే దారిలో ‘బొర్రా గుహలు’ దర్శనమిస్తాయి. 1807లో విలియం కింగ్‌ జార్జ్‌ వీటిని కనిపెట్టాడు. ఇవి అనంతగిరి కొండల్లో ఉన్నాయి. రోడ్డు, రైలు మార్గంలో వెళితే ఈ గుహలు తప్పక దర్శించాల్సిందే. కిరాండల్‌ కొత్త వరుస రైల్వే మార్గంలో వెళితే బొర్రా గుహల రైల్వేస్టేషన్‌లో దిగవచ్చు.

అరకులోయకు రైలు మార్గం

బొర్రాగుహలను జాతాపు, కొండ దొర, నూకదొర, వాల్మీకి తెగలు, గిరిజన జాతుల సహాయంతో కనుగొన్నారు. గోస్తని నదికి దిగువలో ఈ గుహలున్నాయి. ఇవి సున్నపురాతి నిక్షేపిత గుహలు. భూమిపై నుండి 60 మీటర్ల లోతు వరకు ఉంటాయి. శివలింగం, మానవ మెదడు ఆకారం, పక్షి ఆకారం, స్థంభాల ఆకారపు సున్నపురాతి నిక్షేపాలు ఈ గుహల్లో కనిపిస్తుంటాయి.

ఆధునిక కాలంలో మనిషి దైనందిన జీవితం యాంత్రికంగా మారిందనేది అక్షర సత్యం. అందువల్ల కాస్త మానసిక ఉల్లాసం కోసం, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవించటానికి ప్రతీ రోజు ఇక్కడికి వేలాదిమంది పర్యాటకులు ఈ అందాలను ఆస్వాదించడానికి అరకులోయకు వస్తుంటారు. ప్రకృతి ఒడిలో పచ్చదనం పరుచుకున్న ఈ అరకులోయ ప్రాంతంలో సుందరపక్షి సంతతులు, రామచిలకలు నేత్రానందాన్ని కలిగిస్తుంటాయి. అటవీ సంపదను అభివృద్ధిపరచి, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడే దిశగా అరకులోయ ప్రకాశిస్తోంది. చుట్టూ తలపై కప్పుకున్న విశాలమైన ఆకాశం, వీటికి తోడు మనోహరంగా కనిపించే అడవులు, కొండలు, కోనలు, అందమైన ప్రదేశాలు, ఆహ్లాదభరితమైన వాతావరణం నెలకొని ఉంటుందిక్కడ. సంప్రదాయ గిరిజనుల ‘పోడు’ వ్యవసాయం ఒక పక్క, గిరిజనులు పండించే కాఫీ తోటలు మరోపక్క చూపరులను కనువిందు చేస్తుంటాయి.

బొర్రాగుహలు

ఇక్కడి కొండల మధ్యలోనుంచి చలికాలంలో సూర్యోదయాన్ని చూడటం ఒక దివ్యానూభూతి. అది మంచు దుప్పటి వలె కన్పిస్తుంది. చుట్టూ చెట్లు, చల్లగా వీచే పిల్ల తెమ్మరలు సందర్శకులను ఆహ్లాదభరితుల్ని చేస్తాయి. కనుచూపు మేరలో దర్శనమిచ్చే గిరిజన పల్లెలెన్నో యాత్రికులను చేతులు చాచి రమ్మని ఆహ్వానిస్తున్నట్లు అనిపిస్తుంటుంది. ఇక్కడి ప్రజల సంస్కృతీ, సంప్రదాయాలు, పల్లె గుబాళింపులతో మనసు పులకరిస్తుంది.

ప్రతీ రోజు ఉదయం విశాఖపట్నం నుంచి సుమారు 90 కి.మీ. దూరంలోగల ‘బొర్రా రైల్వేస్టేషన్‌’కు వెళ్ళేందుకు సందర్శకుల కోసం టూరిజం శాఖ రైలును అందుబాటులో ఉంచింది. బొర్రా గుహల్ని దర్శించడం పర్యాటకులకు మరపురాని అనుభూతి. ఆ రోజుల్లో ఈ గుహల గురించి వినడమే తప్ప చూసినవారు చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇక్కడికి రావడానికి తగిన ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉండేవి కాదు. కానీ ఇప్పుడు టూరిజం శాఖ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోంది. బొర్రా గుహల్ని ఆనుకొని ఉన్న రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతం నుండి కొంత భూమిని పర్యాటక శాఖ సేకరించింది.

టూరిజం అధికారులు పర్యాటకుల సౌకర్యార్థం ఇక్కడ ఓ విశ్రాంతి గదిని కూడా నిర్మించారు. రోజురోజుకూ సందర్శకుల సంఖ్య పెరగుతూ ఉండటంతో లోయ చుట్టు పక్కల లాడ్జీలు, హోటళ్ళను ఏర్పాటు చేశారు. వీటికి తోడు అరకు ప్రాంతంలోని గిరిజనులు తయారు చేసే వస్తువుల్ని విక్రయించేందుకు విక్రయశాలల్ని కూడా ఏర్పాటు చేశారు. బొర్రా గుహల లోపల ఆ రోజుల్లో చాలినంత వెలుతురు ఉండేది కాదు. ఏడెనిమిది సంవత్సరాల క్రితం విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. ఇక్కడి గుహలలోని గోడలపై చిత్రించిన ఆంజనేయ స్వామి, పాముపడగ, గుడిగోపురం, మర్రి ఊడలు, వినాయకుడు, తల్లి-పాప, షిర్డీ సాయిబాబా, శివపార్వతులు ఇంకా ఎన్నో చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటాయి. శివరాత్రి పర్వదినం వచ్చిందంటే ఇక్కడి శివలింగానికి గిరిజనులు పెద్దఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు. బొర్రాగుహలకు 15 కి.మీ. దూరంలో ‘టైడా’లోని ‘జంగిల్‌ బెత్స్‌’ అనే ఓ అద్భుతమైన నందనవనం దర్శనిమిస్తుంది. అక్కడ దట్టమైన వృక్షాలపై నివాసం ఉండే పక్షి జాతుల కిలకిల రావాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

చాపరాయిగడ్డ

2900 అడుగుల ఎత్తులోనున్న ఈ ‘అటవీ వనం’ మీద సందర్శకులు బస చేసేందుకు అనుకూలంగా పర్యాటక శాఖ ఆధునిక సౌకర్యాలతో కాటేజీలు నిర్మించింది. ఈ నయనానందకర సుందరవనం నుంచి తూర్పు కనుమల వైపు 42 కిలోమీటర్లు ప్రయాణిస్తే ‘అరకు వ్యాలీ’ కి చేరుకోవచ్చు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే దేవుడు సృష్టించిన ఎన్నో అద్భుతాలు ఇక్కడ మనకు కన్పిస్తుంటాయి. ముఖ్యంగా ‘అరకు’లో ఉన్న పద్మాపురం గార్డెన్‌ సుందరకమైన పూల మొక్కలతో, ఆకాశాన్నంటే ‘సిల్వర్‌ ఓక్‌’ చెట్లతో సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ నిర్మించిన ‘ట్రీ హట్స్‌’ దేవేంద్రుని ఉద్యానవనాలను తలపింపజేస్తాయి.

ఈ గార్డెన్‌ నిత్యనూతనంగా రంగుల హరివిల్లును గుర్తుచేస్తూ ఉంటుంది. అక్కడ కొంతమంది ప్రజలు పనులు కూడా చేసుకుంటూ నివాసం ఉంటున్నారు. అక్కడ దర్శించాల్సిన మరో ముఖ్యమైన ప్రదేశం ‘మ్యూజియం’. దీనిని 1996లో ప్రారంభించారు. ఇందులో గిరిజన కళా రూపాలెన్నో మనకు కనిపి స్తాయి. ఆధునిక నాగరికతకు నోచుకోని మహిళలు, పొలాల్లో పనిచేసే స్త్రీలకు చేతివృత్తులలో శిక్షణనిస్తూ, సంప్రదాయానుగుణంగా ఉండే వారు తయారు చేసిన వస్తువుల్ని మ్యూజియంలో పెట్టి విక్రయిస్తుంటారు. అలా వచ్చిన ధనంతో ఎన్నో కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి.

మత్స్యగుండం

అరుకులోయ నుండి పాడేరు రిజర్వ్‌ ఫారెస్టుకు వెళ్లే మార్గంలో 15 కిలోమీటర్ల దూరంలో ‘చాపరాయిగడ్డ’ అనే ప్రాంతం సందర్శకుల్ని కట్టిపడేస్తుంది. చాప పరుచుకున్నట్లుగా కనిపించే విశాలమైన బండరాళ్ళ మీది నుండి ప్రవహించే నీళ్ళల్లో ఆడుకునేందుకు చిన్న పిల్లలు ఎంతో ఆసక్తి చూపిస్తారు.

పాడేరు ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోంది. నగరవాసులు సెలవు దినాలలో దీనిని ‘పిక్నిక్‌ స్పాట్‌’గా భావించి ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకొంటుంటారు. ‘చాపరాయిగడ్డ’కు 30 కిలోమీటర్ల దూరంలో ‘మత్స్యగుండం’ అనే ప్రదేశం ఉంది. ఈ ప్రాంతంలోనే ‘మత్స్య లింగేశ్వర ఆలయం’ కూడా కనిపిస్తుంది. ఆలయం నుండి నూరు అడుగుల కింద ‘గుండం’ కూడా ఉంది. ఆలయం చుట్టూ ఎటు చూసినా పెద్ద పెద్ద కొండకోనలు వాటి మధ్యలో ఎక్కడో ఒడిస్సా ప్రాంతంలో పుట్టిన వాగు

అనంతగిరి

లు, వంకలెన్నో బండరాళ్ళను తాకుతూ ఈ ‘మత్స్య గుండం’లోకి వచ్చి చేరుతుంటాయి. వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు నీరు చాలా ఎత్తునుంచి ప్రవహించడం అద్భుతంగా కన్పిస్తుంది. ఆలయం కిందుండే గుండానికి సంబంధించిన ఒక కథ గురించి ఇక్కడి స్థానికులు తరచూ చెప్పుకుంటారు.

పూర్వం సింగరాజులనే సర్పాలకు, చేపలకు యుద్ధం జరిగిందట. అప్పుడు తల్లి చేప పిల్ల చేపల్ని సర్పాల భారిన పడకుండా రక్షించడానికి వాటిని తీసుకొచ్చి ఈ గుండంలో దాచిందని ఇప్పటికీ వీటిని ఇక్కడ ‘మత్స్య లింగేశ్వరుడు’ కాపాడుతున్నాడని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ శివాలయం ఉన్న చోట గిరిజనులు ఇప్పటికీ మూడు రోజులు ఎంతో వైభవంగా వేడుకగా జాతర జరుపుతుంటారు. ‘అనంతగిరి’ కొండల ప్రాంతంలో సాగు చేస్తున్న కాఫీ తోటలు, జల పాయలు, నదిపాయలు, ప్రకృతి శోభ అందర్ని ఆట్టుకుంటాయి. ఒక్కసారి అరకులోయను దర్శిస్తే మనసు పదేపదే అక్కడికే లాగుతూ ఉంటుంది. అక్కడ గడిపిన మధుర క్షణాల స్మృతిపథంలో ఆ జ్ఞాపకాలు గిలిగింతలు పెడుతుంటాయి. అరకులోని కాఫీ తోటలు చాలా ప్రత్యేకమైనవి. కొద్ది రోజుల క్రితమే ‘బొర్రాగుహల’ కు ‘ప్రపంచ వారసత్వ సంపద’ ¬దా కూడ లభించడం శుభసూచకం.

– డా|| మంతెన సూర్యనారాయణ రాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *