అందమైన మున్నార్‌

అందమైన మున్నార్‌

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాభై చూడదగిన ప్రదేశాల్లో మన దేశంలోని కేరళ రాష్ట్రం కూడా చోటు దక్కించుకోవడం చెప్పుకోదగిన అంశం. కేరళలోని మున్నార్‌ ప్రాంతం దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది.

కేరళలో గల ఇడుక్కి జిల్లాలోని గురువాయర్‌కి 180 కి.మీ. దూరంలో, సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో మున్నార్‌ ఉంది. మున్నార్‌కు వెళ్ళే దారిలో ఎటు చూసినా ఆకాశాన్ని తాకేలా కనిపించే పచ్చని చెట్లు, చేయి ఎత్తితే అందేటంత దగ్గరలో కనువిందు చేసే తెల్లని మబ్బులు, ఎత్తైన కొండలు, లోతైన లోయలు, కొండల పైనుంచి కిందికి ఉరికే జలపాతాలు విహార యాత్రికుల్ని కట్టిపడేస్తాయి.

చియప్పారా జలపాతం

మున్నార్‌కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘చియప్పారా’ జలపాతం విహార యాత్రికుల్ని అమితంగా ఆట్టుకుంటోంది. ఈ జలపాతం అందాలు చూస్తూరటే గంటలు నిమిషాలుగా, నిమిషాలు సెకన్లుగా గడిచిపోతాయనడంలో సందేహం లేదు.

మున్నార్‌కి 4 కి.మీ. దూరంలో ఉన్న ‘పల్లివశిల్‌’ అనే గ్రామం నుండి మున్నార్‌ గనులు అద్భుతంగా కనిపిస్తాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని చూడాలంటే ఒకరోజు సరిపోదు. ఆ గనులను ఆనుకొని ఆ గ్రామంలోనే కొన్ని హోటళ్ళు, లాడ్జీలున్నాయి. అందులో బస చేయవచ్చు. లాడ్జీల చుట్టు పక్కల ఉన్న పెద్ద లోయలు, పచ్చని చెట్లు, కొండలు, వాటి మధ్యలో కనిపించే అందమైన ఇళ్ళను చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

కేరళలో ప్రధాన నృత్యం కథాకళి. ఆ నాట్యాన్ని చూస్తే మనం తప్పకుండా ఆశ్చర్యానికి గురవుతాం. నాట్యం చేసేటప్పుడు కళాకారులు ధరించే వస్త్రాలు, వారి అలంకరణ మనకు చాలా కొత్తగా అనిపిస్తుంది. అందువల్ల మనం ఇట్టే ఆ కార్యక్రమంలో లీనమైపోతాం. కేరళలో ‘మార్షల్‌ ఆర్ట్‌ షో’ కూడా చాలా పేరుగాంచింది. కేరళకు వెళితే అక్కడే ఉన్న ‘కలయరిపట్టు’ను కూడా దర్శించే వీలుంటుంది. మున్నార్‌ ప్రాంతంలో యువకులు బల్లాలు, కత్తులతో చేసే విన్యాసాలు అద్భుతం.

లోతైన లోయలు, ఎత్తైన కొండల మీద పచ్చటి దుప్పటి పరచినట్లుగా ఉండే కాఫీ తోటల్ని చూస్తే మనం మరో వింత లోకంలోకి వెళుతున్న అనుభూతి కలుగుతుంది. మున్నార్‌లోని ‘టాటా’ టీ మ్యూజియం కూడా చూడదగినదే. అందులో టీ పొడిని వివిధ దశల్లో ఎలా ప్రాసెసింగ్‌ చేస్తారో అక్కడ ఉన్న గైడ్‌ని అడిగితే మనకు చూపిస్తాడు. మున్నార్‌లో టీ అద్భుతంగా ఉంటుంది. మ్యూజియం చుట్టూ ఉన్న స్టాల్స్‌లో రకరకాల టీ పొడులను అమ్ముతారు.

మున్నార్‌లోని తేయాకు తోటల్లో పని చేసే స్త్రీలను గమనిస్తే వారి కట్టు, బొట్టు వింతగా ఉంటుంది. ఆ వస్త్రాధారణ అక్కడి ప్రజల సంప్రదాయం. టీ ఎస్టేట్‌లలో కాఫీ ఆకులను పెద్ద పెద్ద కత్తెర్లతో కత్తిరిస్తూ బుట్టలలోకి వేస్తున్న దృశ్యాన్ని తిలకిస్తే ముచ్చటగా అనిపిస్తుంది.

ఇవే కాకుండా మున్నార్‌కు వెళ్ళే దారి పొడుగున యూకలిప్టస్‌, టేకు, పనస, అరటి, నారికేళ వృక్షాలు, వాటికి అల్లుకొని పెరిగిన మిరియాల చెట్టు తీగలతో కూడిన ఆ ప్రాంతం మనకు కన్నుల పండగలా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్న లెమెన్‌ గ్రాస్‌ అనే చెట్టు ఆకుల్ని తెంపి వాసన చూసినట్లయితే అద్భుతంగా ఉంటుంది. ఆ ఆకు వాసన పీల్చడం వల్ల తలనొప్పి తగ్గుతుంది.

ఈ ప్రాంతానికి కేవలం 13 కి.మీ. దూరంలో ‘మట్టుపెట్టి డ్యామ్‌’ కూడా ఉంది. దీనిని 1953 ప్రాంతంలో రెండు కొండల మధ్య అనుసంధానం చేస్తూ నిర్మించారు. ఈ డ్యామ్‌ జలవిద్యుత్తు తయారీతో పాటు వేలాది ఎకరాలకు సాగు నీటిని అందిస్తోంది. ఇక్కడ బోటింగ్‌ సౌకర్యం కూడా ఉంది. ఈ డ్యామ్‌ను చూడడానికి వెళితే దానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఎర్నాకుళం వైల్డ్‌ లైఫ్‌ పార్కును కూడా సందర్శించవచ్చు. కేరళ రాష్ట్రంలో ప్రప్రథమంగా ఏర్పాటు చేసిన వైల్డ్‌లైఫ్‌ పార్కు ఇదేనని స్థానికులు చెబుతున్నారు. అంతరించిపోతున్న నీలగిరి, థార్‌, లాంగర్‌, సాబర్‌, గౌర్‌ ఏనుగు జాతులు ఈ పార్కులో ఉన్నాయి. వీటికి తోడు ఈ పార్కులో ప్రతి పన్నెండేళ్లకు ఒకే ఒక్క సారి పుష్పించే నీలకురింజ మొక్కలు కూడ ఉన్నాయి. అవి పూలు పూసిన ఏడాది పార్కులోని కొండలన్ని నీలిరంగులో కనిపించడం మరో విశేషం. ఇక్కడ పడమటి కనుమలలోని ‘అన్నాముడి’ అనే ఎత్తైన కొండను ఏనుగు తల అని కూడా పిలుస్తారు.

ఇక్కడి నుంచి 90 కి.మీ. దూరం ప్రయాణిస్తే మైలాదుమ్‌పురాలో ఉన్న సుగంధ ద్రవ్యాల పార్కుకి వెళ్ళొచ్చు. మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వంటి మొక్కలను అక్కడ మనం ప్రత్యక్షంగా చూసే వీలుంటుంది.

ఈ ప్రాంతంలో గైడ్‌లు చాలా మంది ఉన్నారు. వారికి అన్ని భాషల్లో ప్రావీణ్యం ఉంటుంది. ఆ మొక్కలు ఎలా పెరుగుతాయో, వాటిని ఎలా ప్రాసెస్‌ చేస్తారో లాంటి విషయాలను వారు చక్కగా వివరిస్తారు. అక్కడ ఉన్న షాపుల్లో తాజా దినుసుల్ని మనం కొనుగోలు చేయొచ్చు. మిరియాల తరువాత ఎక్కువగా అక్కడ కనిపించేవి రబ్బరు తోటలే. మనదేశంలో కేరళ 90 శాతం రబ్బరును ఉత్పత్తి చేస్తూ మొదటి స్థానంలో ఉంది. రబ్బరు చెట్ల కాండాల దగ్గర చేతికి అందే ఎత్తులో కవర్లు కట్టి దర్శనమిస్తుంటాయి. చెట్లు పెరిగిన కొద్దీ ఆ కవర్లలోకి ఓ తెల్లని ద్రవం (రేటెక్స్‌) వచ్చి చేరుతుందని దాన్నే రబ్బరుగా తయారు చేస్తున్నట్లుగా వారు చెబుతున్నారు.

టేక్కడిలో ‘పెరియాడ్‌ వైల్డ్‌లైఫ్‌ శాంక్చ్యురీ’ ఉంది. దీనిలో పులులు, ఏనుగులు, సాబార్‌లు, కోతులు ఉంటాయి. వీటిని చూడడానికి అడవి చుట్టూ సరస్సును ఏర్పాటు చేశారు. ఆ జంతువులను చూడాలంటే పడవల్లో ప్రయాణించి వెళ్ళి చూడాల్సి ఉంటుంది. ఈ శాంక్చ్యురీలో నీరు లేకుంటే బోటింగ్‌ ఆపేస్తారు. టేక్కడిలో వాటర్‌ ఫాల్స్‌తో పాటు టీ ప్లాంట్‌, కాఫీ తోటలు, కొబ్బరి తోటలు అధికంగా ఉంటాయి. ఈ ప్రాంతానికి ఏనుగుల తాకిడి ఎక్కువే. తల్లి ఏనుగులతో పాటు గున్న ఏనుగులు మైదాన ప్రాంతంలో ఆహారం తింటూ దర్శనమిస్తాయి. అక్కడ కనిపించే మత్తేభాలను మనం అల్లరి చేస్తూ, ఈలలు వేస్తూ వాటికి చికాకు తెప్పిస్తే అవి కోపంగా యాత్రికులనే కాదు, స్థానికులను కూడా వదిలి పెట్టవు. వీరంగం సృష్టిస్తాయి.

కేరళలోని బీచ్‌లలో ‘కోవళం బీచ్‌’ ప్రసిద్ధి చెందింది. ‘గోల్డ్‌ శాండ్‌ బీచ్‌ కూడా పేరు గాంచినదే. ఈ ప్రాంతంలో గద్దలు, ఈగల్స్‌, కింగ్‌ఫిషర్‌ లాంటి పక్షులు అధిక సంఖ్యలో ఉండి మనకు నేత్రానందాన్ని కలిగిస్తాయి. కేరళ రాష్ట్రమంతా కొండలు, లోయలు, జలసిరులతో, పచ్చని నారికేళ వృక్షాలతో అద్భుతంగా ఉంటుంది. కేరళలో మత్స్య సంపద కూడా ఎక్కువే. మలబార్‌ తీర ప్రాంతమంతా విహార యాత్రీకులను ఊహా లోకంలోకి తీసుకు పోతుందనడంలో సందేహం లేదు.

ఎలా వెళ్ళాలి

కేరళకు వెళ్ళడానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విమాన, రైలు సౌకర్యాలున్నాయి. మున్నార్‌కు చేరుకోవాలంటే మనం ముందుగా ఎర్నాకుళం వెళ్ళాలి. అక్కడ టూరిజం శాఖకు సంబంధించిన బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు, టాక్సీలు అందుబాటులో ఉంటాయి.

– డా|| మంతెన సూర్యనారాయణ రాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *