అందమైన కులు… మనాలీ…

అందమైన కులు… మనాలీ…

హిమాలయాలను శివాలిక్‌ పర్వత శ్రేణు లంటారు. ఇవి మనదేశంలో పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ వరకు విస్తరించి ఉన్నాయి. ఈ పర్వత శ్రేణుల మధ్యలో ఎన్నో లోయలు, కనుమలు, పీఠభూములు విస్తరించి ఉన్నాయి.

డార్జిలింగ్‌, సిమ్లా, కులు, మనాలీ వంటి అద్భుతమైన హాలిడే స్పాట్స్‌ ఈ ప్రాంతంలోనే కొలువుదీరాయి. ప్రకృతికి ప్రతీకలు ఈ ప్రాంతాలు.

హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని సిమ్లాకు చేరుకోగానే మనకు ఎటు చూసినా ఎత్తైన కొండలు, లోయలే దర్శనమిస్తాయి. ఇక్కడ కొండలన్నీ గుబురుగా పెరిగిన చెట్లతో పచ్చదనం కప్పేసినట్లుగా ఉంటాయి. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎన్నడూ ఐదు డిగ్రీలకు మించదు. చాలా చలిగా ఉంటుంది. ఎటు చూసినా రంగు రంగుల చెక్క ఇళ్లే మనకు దర్శనమిస్తుంటాయి.

సిమ్లాకు 20 కిలోమీటర్ల దూరంలో ‘కుఫ్రీ’ పర్వత శ్రేణి ఉంది. ఇది సముద్ర మట్టానికి 8,630 అడుగుల ఎత్తులో ఉంటుంది. సిమ్లా నుంచి ముఫ్పై నిమిషాల ఘాటురోడ్డు ప్రయాణం తరువాత ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ స్వయంగా ప్రకృతే మనల్ని ఆహ్వానిస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆకాశం నుంచి చిరుజల్లులుగా రాలిపడుతున్న చల్లని మంచు బిందువులు శరీరాన్ని తాకగానే ఒక్కసారిగా మన శరీరమంతా పులకరిస్తుంది. ఈ ప్రదేశంలో చలి తీవ్రత ఎక్కువ గనుక పర్యాటకులు తప్పనిసరిగా తమతో చేతి గ్లౌజ్‌లు, సాక్స్‌లు, స్వెట్టర్స్‌ తీసుకెళ్లాలి.

అక్కణ్ణుంచి రెండు కిలోమీటర్ల దూరంలో గల ‘కుఫ్రీ’ లోనే అత్యంత ఎత్తైన ప్రాంతానికి గుర్రాల మీద స్వారీ చేస్తూ వెళ్లొచ్చు. అక్కడ కొలువైన పురాతన శివాలయంలో స్వామివారిని దర్శించుకొని పక్కనే ఉన్న వ్యూ పాయింట్‌ నుంచి చైనావాల్‌ను చూసి ఆనందించవచ్చు.

ఈ పర్వత శ్రేణిలో గుర్రాల మీద స్వారీ చేయడమంటే చిన్న విషయం కాదు. ఎత్తైన కొండల మీద, మంచులో దాదాపు గంటసేపు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈ గుర్రాలు ప్రత్యేక శిక్షణను కూడా తీసుకుంటాయి.

ఈ కొండల మీద సినిమా షూటింగ్స్‌ ఎక్కువగా జరుగుతాయి. చాలామంది ప్రముఖులు దీన్ని మంచి హాలిడే స్పాట్‌గా పేర్కొంటారు.

సిమ్లాలో ఆపిల్‌ తోటలు ఎక్కువగా ఉంటాయి. ఆ తోటల్లోకి వెళ్లి గనుక మనం పరిశీలించినట్లయితే వేరుశెనగ గుత్తుల్లా యాపిల్‌పండ్లు కిందికి వేళాడుతూ మనకు నేత్రానందాన్ని కలిగిస్తాయి.

ఇక్కడే ఇండో-టిబెట్‌ సరిహద్దును కూడా మనం గమనించవచ్చు. ఇంకాస్త ముందుకు వెళితే ఓ పెద్ద హనుమాన్‌ ఆలయం ఉంటుంది. ఇంకా హార్టీకల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ పెంచిన తోటలు కూడా మనకు ఆనందాన్ని పంచుతాయి.

ఇక్కడే సాయంత్రం దాకా ఎంజాయ్‌ చేసి స్థానిక వంటకాలను రుచి చూసి ఉదయాన్నే బయల్దేరితే బాగుంటుంది. ఎందుంటే ఇక్కడి వంటలు చాలా రుచిగా ఉంటాయి.

తెల్లవారుజామున బయల్దేరుతోంటే దారి పొడవునా అన్నీ కొండ లోయలే. ఎంత అద్భుతంగా ఉంటాయో ! ఓ పక్క కొండలు.. మరోపక్క లోయలు.. యాత్రికులతో పాటు పరుగులు తీస్తున్న మేఘాలు.. చూస్తూ ఉండగానే గ్రీన్‌వ్యాలీకి చేరుకుంటాం. ఈ ప్రాంతమంతా పేరుకు తగ్గట్టుగానే పచ్చని చెట్లతో నిండి ఉంటుంది.

దారిలో బస్సు ఆపి భోజనాలు చేసే సమయంలో ఉడుతలు, కుందేళ్లు మనపక్కనే అటు ఇటు పరుగెడుతూ కనిపిస్తాయి. ఆ పక్కనే ప్రవహిస్తున్న సెలయేళ్లలో నుంచి ఎగిరిపడుతున్న చేపలు… నిజంగా ఇదంతా ఓ అద్భుతమైన ఘట్టం. ఎటు చూసినా అందాలే…సుందర దృశ్యాలే… ఆ తర్వాత బస్సు ఎక్కితే అక్కడి నుంచి తెల్లవారకముందే మనాలీ చేరుకోవచ్చు. బస్సుల్లోనే కాదు మనాలీకి టాక్సీల్లో కూడా వెళ్లొచ్చు.

మనాలీకి వెళ్లే దారిలో మనకు ‘కులు’ లోయ దర్శనమిస్తుంది. ఇది ప్రకృతి రమణీయంతో చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ చెట్లు చాలా ఎత్తులో కనిపిస్తాయి.

మనం మనాలీ చేరుకునే సరికి అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి కిరణాలు పసిడి కాంతులతో మెరిసిపోతూ మనల్ని తాకుతాయి. కిటికీల్లోంచి చల్లని ఆహ్లాదకరమైన గాలులు మనకు గిలిగింతలు పెడతాయి.

హోటల్లో దిగి ఫ్రెష్‌ అయి ఇక్కడి నుంచి 13 కిలోమీటర్ల దూరంలో గల ‘సోలాన్‌ వ్యాలీ’కి చేరుకోవాలి. కాని అక్కడికి వెళ్లాలంటే ప్రైవేటు వాహనాలే శరణ్యం. ఓ మంచి ప్రైవేట్‌ వాహనాన్ని మాట్లాడుకుని అక్కడి నుంచి బయల్దేరితే దారిలో అందమైన తెల్లని మంచు పర్వతాలు పాలరాతి కొండల్లా దర్శనమిస్తాయి. ఆ సమయానికి మంచంతా పేరుకుపోయి గట్టిపడి ఉంటుంది. అలాగని ఆ కొండలు ఎక్కాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రమాదమే.

కొండల కింద మంచు గడ్డల్ని ఒకరిపై మరొకరు విసురుకుంటూ ఆటలాడుతుంటే మనకు బాల్యం గుర్తొసుంది. పారాచూట్‌ వైవింగు, స్కేటింగ్‌, మోటార్‌ కారు డ్రైవింగ్‌, ట్రెక్కింగ్‌, ఐస్‌ హాకీ… వంటి వివిధ రకాల క్రీడలు మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

తిరుగు ప్రయాణంలో కొన్ని అద్భుతమైన హిందూ దేవాలయాల్ని కూడా మనం దర్శించుకోవచ్చు. కొన్ని ¬టల్స్‌లో ట్రావెల్‌ ఏజెన్సీలు డిజె పాటలతో డ్యాన్స్‌ ప్రోగ్రామ్స్‌ ఏర్పాటు చేస్తుంటాయి. పర్యాటకులు ఆ పాటలకు హుషారుగా చిందులేస్తుంటారు.

ఇక్కడ హదిబ్జా అమ్మవారి ఆలయం చాలా ప్రసిద్ధి గాంచినది. ఇక్కడే ఎల్లప్పుడూ వేడి నీరు వచ్చే ఒక కొళాయి కూడా ఉంది. ఈ ప్రాంతంలో అమ్మే టీ పొడి చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ మహిళలకు అందమైన డ్రెస్‌ మెటీరియల్స్‌, స్వెట్టర్లు చాలా చౌకగా దొరుకుతాయి.

మనాలీలో ‘రోతంగ్‌ పాస్‌’ ప్రాంతం చాలా ముఖ్యమైనది. అక్కడి వెళ్లాలంటే రెండు, మూడు మంచుకొండలెక్కాల్సి ఉంటుంది. ఇది అత్యంత చల్లని ప్రదేశం. దాంతో నీరు గడ్డకట్టి ఉంటుంది. కొండల మధ్యలో ఎత్తైన మంచు వృక్షాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. రోతంగ్‌పాస్‌కి చేరుకోగానే మనకు ఆకాశాన్ని అందుకున్న ఫీలింగ్‌ కలుగుతుంది.

ఆ మంచు పర్వతాలపై కూర్చొని ప్లాస్క్‌లో తెచ్చుకున్న వేడి వేడి టీ తాగుతుంటే ఆ మజాయే వేరు…

కొండల మధ్య ప్రవహించే నదిలో బోటింగ్‌ చేయడం నిజంగా మాటలకందని అనుభూతనే చెప్పుకోవాలి. నదిలోని చల్లని నీరు ఎగిరెగిరి పడుతూ యాత్రికుల్ని తడిపేస్తుంది. సాయంకాలం అక్కడే ‘క్యాంప్‌ ఫైర్‌’ ఏర్పాటు చేసుకుని ఉదయాన్నే బయల్దేరితే బాగుంటుంది.

కులు, మనాలీ ట్రిప్‌ యాత్రికులకు కచ్ఛితంగా ఒక మంచి తియ్యని అనుభూతిని కలిగిస్తుంది.

ఎలా వెళ్లాలి ?

రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ వెళ్లడానికి రైలు, బస్సు సౌకర్యాలున్నాయి. హైదరాబాద్‌ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి విమానంలో గాని లేదా ట్రైన్‌లో గాని చేరుకుంటే అక్కడి నుంచి బస్సు లేదా ప్రైవేట్‌ వాహనాల్లో కులు, మనాలీ చేరుకోవచ్చు.

– డా|| మంతెన సూర్యనారాయణ రాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *