నిరంతర ప్రేరణ పిళ్లా రామారావు

నిరంతర ప్రేరణ పిళ్లా రామారావు

ఆయన వయసు అప్పటికి 92 ఏళ్లు. సంఘ్‌ కార్యక్రమాలలో నిక్కరు బదులు ప్యాంట్‌ ధరించే పద్ధతి ప్రవేశించింది. ఆ వేషధారణతోనే ఆయన శాఖా కార్యక్రమానికి హాజరయ్యారు. పైగా జీవితంలో మొదటిసారిగా ప్యాంటు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనే విశాఖ ప్రముఖులు, తెలుగు ప్రాంతంలో ఆరంభం నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ కోసం అవిరళరగా శ్రమించిన పిళ్లా రామారావు. ఒక నిబద్ధతతో, కర్తవ్య నిష్టతో ఆర్‌ఎస్‌ఎస్‌ వెంట నడిచిన రామారావుగారు (95) ఫిబ్రవరి 3, 2019న విశాఖపట్నంలో వారి స్వగృహంలో తుదిశ్వాస వదిలారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సహ సర్‌ కార్యవాహ భాగయ్య పిళ్లా రామారావు మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు.

1940లో సంఘ జీవితం ప్రారంభించి ఆజన్మాంతం అత్యంత క్రియాశీలంగా పనిచేసిన కార్యకర్త రామారావుగారు. జిల్లా కార్యవాహగా విశాఖ, విజయనగరం జిల్లాలలో విస్తృతంగా పర్యటించారు. విశాఖ మహానగర సంఘచాలక్‌గా మూడు దశాబ్దాల పాటు క్రియాశీలంగా పనిచేసి, సంఘకార్యాన్ని విస్తరింప చేశారు. కార్యకర్తగా, సమాజ సేవకునిగా నిరంతర పర్యటనలో జీవితాంతం శ్రమించిన కర్మయోగి.

విద్యారంగం

విశాఖకు సంబంధించి విద్యారంగం మీద రామారావుగారి ముద్ర చెరగనిది. సంఘ్‌ కార్యం కోసం ఆయన ఏరి కోరి ఈ వృత్తిలో ప్రవేశించారు. భౌతికశాస్త్రంలో ఉత్తమ ఉపన్యాసకునిగా పేరుగాంచిన రామారావుగారు వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. ఆంధ్ర విశ్వవిద్యా లయంలో పలువురు ఆచార్యులు ఆయన దగ్గర చదువుకున్న వారే.

విశాఖపట్నంలో 1957లో భారతీయ విద్యాకేంద్రం ప్రారంభించిన ప్రముఖులలో వారు ఒకరు. భారత్‌ ట్యుటోరియల్‌ కాలేజీగా ప్రారంభమై బివికె ఉన్నత పాఠశాల, జూనియర్‌, డిగ్రీ, పిజి కళాశాల వరకు అభివృద్ధి చేయడంలో రామారావు పాత్ర ప్రముఖమైనది.

అలాగే 1971 సంవత్సరంలో బివికె కళాశాలను ప్రారంభించి, ఆ సంస్థకు కూడా రామారావు తొలి ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించారు. కళాశాలను ఉత్తమ ప్రమాణాలతో అభివృద్ధి చేసి, విశాఖ నగరంలోనే ప్రతిష్టాత్మక సంస్థగా తీర్చిదిద్దారు. 1980లో విశాఖ సమీపంలోని గుడిలోవ విజ్ఞాన విహార ఆవాస విద్యాలయం ప్రారంభించినపుడు దానికి ప్రథమ అధ్యక్షులుగా పనిచేసారు.

నిస్వార్థ సామాజిక నేతృత్వం

ఒక వైపు విద్యావేత్తగా, మరొకవైపు విశాఖపట్నం నగరానికి ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘచాలక్‌గా నిరంతర సమాజసేవలో సమర్పితమైన కార్యకర్త రామారావుగారు. దాదాపు 1970 నుండి 2000 వరకు ఏ రాజకీయ పదవీ, ప్రభుత్వ పదవీ లేకుండా సామాజిక, సంఘ కార్యకర్తగా, విద్యావేత్తగా విశాఖ మహానగరంలో రామారావు తెలియని వారు ఎవరూ లేరనటం అతిశయోక్తి కాదు. ఏ భావజాలం, సిద్ధాంతాన్ని నమ్మేవారైనా కావచ్చు, వారిని అత్యంత గౌరవ భావంతో చూసేవారు. ఆ రోజుల్లో ‘పిళ్లా రామారావు అంటే సంఘం – సంఘం అంటే పిళ్లా రామారావు’ అనేవారు.

విశాఖ మహానగరంలో కలెక్టర్‌, ఐఏఎస్‌, ఐపీఎస్‌, వైస్‌ ఛాన్సలర్‌, పారిశ్రామికవేత్తలు మెదలగు వారందరూ పిళ్లా రామారావు గారిని ఆప్యాయత, ఆదరణతో గౌరవించేవారు. అయితే తనకున్న ఉన్నత సంబంధాలను వారు ఎన్నడూ వ్యక్తిగత జీవితానికి వాడుకోకపోవడం వారి నిజాయితీకి నిదర్శనం. ‘నిండు మనంబు నవ్య నవనీత సమానం’ అన్నట్లు వారి మనస్సు, మాట కూడ నవనీతమే. మధురమైన వాక్కుతో అత్యంత వినయసంపన్నులు కాబట్టే వారు అజాత శత్రువుగా జీవించారు.

సంఘ అనుకూల జీవనం

1948లో వారు నెల్లూరులో సంఘ ప్రచారక్‌గా పని చేశారు. విద్యార్ధి దశలో రామారావుగారికి మెడిసిన్‌లో సీటు వచ్చింది. అయినప్పటికీ సంఘ కార్యం చేయటానికి అనుకూలమైనది ఉపాధ్యాయ వత్తి అని ఆయన భావించారు. కుటుంబ సభ్యులు ఒత్తిడి చేసినప్పటికీ బిఎస్సీలో చేరి, తరువాత ఎమ్మెస్సీ కూడా పూర్తి చేసి తన లక్ష్యం మేరకు ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. ఉత్తమ ఉపాధ్యాయుడుగా, ప్రిన్సిపల్‌గా, క్రియాశీల సంఘ కార్యకర్తగా జీవితాంతం పని చేశారు.

సంఘ కార్యానికి ప్రతిరోజు 5 లేదా 6 గంటలు సమయాన్ని వెచ్చించి స్వయంసేవకుల కుటుంబాలను కలుస్తూ పరామర్శిస్తూ నిరంతర ప్రేరణ కలిగించేవారు. విశాఖలోని పెద్దలందరినీ వ్యక్తిగతంగా కలిసేవారు. కార్యకర్తలకు, స్వయం సేవకులకు, సమాజంలోని సామాజిక సంస్థలకు అందరికీ అందుబాటులో ఉంటూ సమాజసేవకు సమర్పితమై జీవించిన కర్మయోగి రామారావు.

విలక్షణమైన వ్యక్తిత్వం

1975 అత్యవసర పరిస్థితిలో ‘మీసా’ చట్టం కింద ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 19 మాసాలు జైలు శిక్ష అనుభవించారు. జైల్లో ఆనందంగా ఉంటూ తోటి రాజకీయ ఖైదీలందరికీ ప్రేరణగా నిలిచారు.

విశాఖపట్నంలో ‘వివేకానంద మెడికల్‌ ట్రస్ట్‌’ ప్రారంభించినప్పుడు ప్రముఖ పాత్ర వహించారు. సామాన్య ప్రజానీకానికి ఆసుపత్రి మెరుగైన వైద్య సేవలను అందిస్తూ ప్రగతిని సాధించడం వెనుక రామారావు పాత్ర ప్రముఖమైనది.

నిత్య నూతనం

రామారావుగారు పాత తరానికి చెందిన స్వయం సేవక్‌. కానీ అత్యంత ఆధునికంగా ఆలోచించి జీవించేవారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. గణవేష్‌లో నిక్కర్‌కి బదులు ప్యాంటును ప్రవేశపెట్టారు. ఆ మార్పును కూడా ఆయన స్వాగతించారు. తన 92 వ ఏట జీవితంలో మొదటిసారిగా ప్యాంటు ధరించి గణవేష్‌తో కార్యక్రమంలో పాల్గొన్నారు. సంఘ కార్యం పట్ల వారికున్న శ్రద్ధాభక్తులు అలాంటివి.

సంఘ వ్యవస్థపై విశ్వాసం

గత పది సంవత్సరాలుగా అనారోగ్యం కారణంగా ప్రత్యక్షంగా సంఘ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా సంఘకార్యక్రమాలు, కార్యకర్తల విషయంలో ఎప్పుడూ సకారాత్మకంగానే ఆలోచించే స్వభావం వారిది. సంఘంపై వారికి అచంచల విశ్వాసం ఉండేది. సర్‌ సంఘచాలకులు పూజ్యశ్రీ గురూజీ, బాలాసాహెబ్‌జీ, రజ్జుభయ్యా అందరితో వారికి అత్యంత సాన్నిహిత్యం ఉండేది.

రాష్ట్రాయ స్వాహా

రామారావు గారి శరీరం పంచభూతాలలో కలిసి పోయినప్పటికీ, వారి కర్మమయ జీవితం అఖండజ్యోతి వలె నిరంతరం స్వయంసేవకులకు, సామాజిక కార్యకర్తలకు, విద్య, ధార్మిక సంస్థలకు నిరంతరం ప్రేరణ కలిగిస్తూనే ఉంటుంది. వారి పవిత్ర చరణాలకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించా లని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను.

 –    వి.భాగయ్య, సహ సర్‌ కార్యవాహ, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *