సంఘ శిక్షావర్గలు 2018

సంఘ శిక్షావర్గలు 2018

ప్రథమవర్ష – తెలంగాణ

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ – తెలంగాణ ప్రాంత ప్రథమవర్ష హైదరాబాద్‌, ఘట్‌కేసర్‌, అన్నోజిగూడలోని శ్రీ విద్యావిహార్‌ పాఠశాలలో మే 6 నుండి 25 తేదీ వరకు జరిగింది. ఈ వర్గకు వర్గాధికారిగా ప్రముఖ బిల్డర్‌, నల్గొండ, లక్ష్మణరావు, వర్గ కార్యవాహగా ఇందూర్‌ విభాగ్‌ సంఘచాలక్‌ జనగాం నరేంద్ర, వర్గ సహకార్యవాహగా ఖమ్మం విభాగ్‌ సహకార్యవాహ రాంచంద్రరావు వ్యవహరించారు.

25న జరిగిన వర్గ ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సిబిఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ పాల్గనగా, ముఖ్యవక్తగా ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ సహ ప్రాంత ప్రచారక్‌ లింగం శ్రీధర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ ప్రాంత సంఘచాలక్‌ బూర్ల దక్షిణామూర్తి, వర్గ అధికారి లక్ష్మణ్‌రావు, క్షేత్ర ప్రచారక్‌ ఏలె శ్యామ్‌ కుమార్‌, తెలంగాణ ప్రాంత ప్రచారక్‌ దేవేంద్ర, ప్రాంత కార్యవాహ కాచంరమేశ్‌, తెలంగాణ ప్రాంత అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ముఖ్యఅతిథి లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ ‘దేశ ప్రగతిలో, మంచి భవిష్యత్తు నిర్మాణంలో యువత పాత్ర ఎంతో ఉన్నది. కనుక అటువంటి యువతలో దేశభక్తిని, క్రమశిక్షణను, సమాజం పట్ల సేవా భావనను నింపుతున్నటు ఆర్‌.ఎస్‌.ఎస్‌. గత 90 సంవత్సరాలుపైగా చేస్తున్న కృషి అభినందనీయ’ మన్నారు.

ముఖ్యవక్త లింగం శ్రీధర్‌ మాట్లాడుతూ ‘హైందవ చైతన్యమే ఈ దేశానికి శ్రీరామరక్ష అని, హిందూ సమాజంలో ఉన్న అనైక్యతలను- భేదభావనలను తొలగించి సంఘటితమైన, శక్తివంతమైన హిందూసమాజాన్ని నిర్మించడానికి ఆర్‌.ఎస్‌.ఎస్‌. కృషి చేస్తున్నద’ని అన్నారు.

ఈ వర్గలో 419 మంది స్వయంసేవకులు శిక్షణ పొందారు. వీరందరూ తెలంగాణలోని వివిధ గ్రామాల నుండి తమ స్వంత ఖర్చులతో ఈ శిక్షణకు అవసరమయ్యే ఖర్చు భరించి గత 20 రోజులుగా పూర్తిగా ఇక్కడే ఉంటూ శిక్షణ పొందారు. ఇందులో సుమారు 55 మంది స్వయంసేవకులు రోజువారి కూలిపనులు చేసుకొని ధనం కూడబెట్టుకొని పాల్గొనడం విశేషం.

 

ప్రథమ వర్ష – ఆంధ్రప్రదేశ్‌

విద్యార్థులలో మార్కుల శాతం కన్నా ఆత్మస్థైర్యం పెరగాలని ప్రముఖ వ్యాపారవేత్త తులసి రామచంద్రప్రభు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌, నూతక్కిలో మే 6 నుంచి 25 వరకు జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రథమవర్ష సమారోప్‌ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘భారతీయ సంస్కృతికి సనాతన ధర్మం అతి పురాతనమైనదని, దీనిని నిలుపుకోవడం కోసం అందరూ కృషి చేయాల’ని అన్నారు.

ముఖ్య వక్త ఆంధ్రప్రదేశ్‌ ప్రాంత సంఘచాలక్‌ భూపతిరాజు శ్రీనివాసరాజు ప్రసంగిస్తూ ‘బాలాసాహెబ్‌జీ చెప్పినట్లుగా సంఘానికి నిగ్రహశక్తి, అనుగ్రహశక్తి రావాలని, హిందూ సమాజాన్ని దాడుల నుండి కాపాడే శక్తి నిగ్రహ శక్తి అని, ఈ రోజున సంఘానికి నిగ్రహ శక్తి వచ్చింద’ని అన్నారు. ఇంకా హిందూ సమాజం కోరినది ఇచ్చే అనుగ్రహ శక్తి సంఘానికి ఇంకా రాలేదని, ఆ శక్తిని సంపాదించా లని అన్నారు. సంఘం నిశబ్ధంగా పనిచేస్తూ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంద’ని అన్నారు.

ఈ కార్యక్రమంలో వర్గాధికారిగా కె.వి.వెంకటా చలం, ఆంధ్రప్రదేశ్‌ ప్రాంత ప్రచారక్‌ భరత్‌కుమార్‌, సహప్రాంత ప్రచారక్‌ ఆదిత్య, ఇతర సంఘప్రాంత పెద్దలు, పురప్రజలు పాల్గొన్నారు.

ద్వితీయవర్ష  – భాగ్యనగర్  (తెలంగాణఆంధ్రప్రదేశ్‌)

సేవా, సమరసత, సంఘటిత సమాజ నిర్మాణమే ఆర్‌ఎస్‌ఎస్‌ ధ్యేయమని ఆర్‌.ఎస్‌.ఎస్‌. తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత ప్రముఖ్‌ అప్పాల ప్రసాద్‌ అన్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ దగ్గర ఒయాసిస్‌ పాఠశాలలో మే 5 నుండి 24వ తేదీ వరకు జరిగిన 20 రోజుల ఆర్‌.ఎస్‌.ఎస్‌.ద్వితీయవర్ష సంఘశిక్షా వర్గలో తెలంగాణ (122) ఆంధ్రప్రదేశ్‌ (75)ల నుండి 197 మంది శిక్షార్థులు పాల్గొన్నారు. శిక్షార్థుల శారీరక్‌ ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

మే 24 సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో అప్పాల ప్రసాద్‌ పాల్గొని మాట్లాడుతూ ‘కుల, మత, వర్గ, ప్రాంత, భాష పేరుతో ఘర్షణలని నివారించి హిందువుల్లో కుటుంబ భావనని, సేవా భావాన్ని పెంపొందించుటకు ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తలను నిర్మాణం చేస్తుందని అన్నారు. వైదికధర్మం అందించిన మానవత్వాన్ని, భారత రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలని పెంపొందించుటకు సంఘం పనిచేస్తున్న దని వివరించారు. నేడు ఆర్‌.ఎస్‌.ఎస్‌. దేశవ్యాప్తంగా 50,000 గ్రామాలలో శాఖలు నడుపుతూ, లక్షా 74 వేల సేవా కార్యక్రమాల ద్వారా విస్తరించిందని పేర్కొన్నారు. విద్య, వైద్య, సాంస్కృతిక, సామాజిక, వృత్తి నైపుణ్య రంగాలన్నింటిలో పేద, బలహీన వర్గాలకు ఆర్‌.ఎస్‌.ఎస్‌. సేవలు అందిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రముఖ వైద్యులు దాసోజు శ్రీధర్‌, వర్గ అధికారి సింహాద్రి సూర్యనారాయణ, ప్రముఖ చార్టెర్డ్‌ అకౌంటెంట్‌, హైదరాబాద్‌, శిబిర కార్యవాహ యుగంధర్‌, ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఆంధ్రప్రదేశ్‌ ప్రాంత సహకార్యవాహ, క్షేత్ర ప్రచారక్‌ ఏలె శ్యామ్‌కుమార్‌, క్షేత్ర సేవా ప్రముఖ్‌ ఎక్కా చంద్రశేఖర్‌, తెలంగాణ సహ ప్రాంత ప్రచారక్‌ లింగం శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.

విశేష ప్రథమవర్ష- శ్రీకాకుళం (తెలంగాణఆంధ్రప్రదేశ్‌)

ఈ సంవత్సరం 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు మధ్య కలిగిన స్వయం సేవకులకు విశేష ప్రథమవర్ష ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణాకు కలిసి శ్రీకాకుళంలోని గురజాడ విద్యాసంస్థల ప్రాంగణంలో జరిగింది. ఇందులో 81 మంది శిక్షణ పొందగా ఆంధ్రప్రదేశ్‌ నుండి 56, తెలంగాణా నుండి 25 మంది పాల్గొన్నారు.

ఈ వర్గకు వర్గ అధికారిగా తెనాలికి చెందిన ప్రముఖ న్యాయవాది వంగిశెట్టి సత్యనారాయణ, వర్గకార్యవాహగా విజయనగరానికి చెందిన ఎలపర్తి తిరుపతిరావు వ్యవహరించారు. డాక్టర్‌ వృత్తి నిర్వహించేవారినుండి నిరక్షరాస్యుని వరకు అన్ని వృత్తులవారు పాల్గొన్నారు. సామాజిక దృక్పథాన్ని పెంచే విధంగా జరిగిన ఈ వర్గ మే 6 నుండి ప్రారంభమై 25వ తేదీతో ముగిసింది.

విశేష ద్వితీయవర్ష- చెన్నై (కేరళ, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)

రెండు సంవత్సరాల కొకసారి జరిగే దక్షిణాది రాష్ట్రాల విశేష ద్వితీయవర్ష ఈసారి చెన్నై, అంబత్తూర్‌లోని వివేకానంద కళాశాల ప్రాంగణంలో మే 7 ప్రారంభమై 26వ తేదీ వరకు (20 రోజులు) జరిగింది. 40 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు కల్గిన స్వయం సేవకులు (కేరళ-70, దక్షిణ, తమిళనాడు 45, ఉత్తర తమిళనాడు 44, దక్షిణ కర్నాటక 13, ఉత్తర కర్నాటక 8, తెలంగాణ 50, ఆంధ్రప్రదేశ్‌ 80 మంది) మొత్తం 310 మంది శిక్షణ పొందారు.

వర్గపాలక్‌గా అఖిల భారతీయ కార్యకారిణీ సదస్యులైన సుహాస్‌రావు హీరేమఠ్‌ బాధ్యత నిర్వహించారు. కేరళలోని శబరిమలై విభాగ్‌ సంఘచాలక్‌ మోహన చంద్రన్‌ సర్వాధికారిగా ఉన్నారు. క్షేత్ర ప్రచారక్‌ ప్రముఖ్‌ గొట్టుముక్కల భాస్కర్‌ వర్గలో దక్షిణ మధ్యక్షేత్ర (కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ) ప్రముఖ్‌గా వ్యవహరించారు.

శిక్షణలో పాల్గొన్నవారికి సామాజిక దృక్పథాన్ని, సమాజంపట్ల సంవేదనను కలిగించే విధంగా శిక్షణ నిచ్చారు. అందులో భాగంగా ఒకరోజు చెన్నైలోని సేవాబస్తీలలో ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారా నడుస్తున్న వివిధ సేవా కార్యక్రమాల నిర్వహణ అనుభవాన్ని అందించారు.

నాలుగు భాషలు మాట్లాడే ప్రాంతాల వారు 20 రోజులపాటు కలిసి జీవించడంలో భాష అడ్డు రాలేదు. విపరీతమైన ఎండల కారణంగా రెండు పూటల స్నానం చేయవలసిన అవసరం ఏర్పడినప్పటికీ జల సంరక్షణలో భాగంగా నీటిని పొదుపు చేస్తూ రోజుకు ఒక్కపూటే స్నానంతో సరిపెట్టుకుంటూ నీటిని పొదుపు చేసుకోవడం ఎలాగో తర్ఫీదు పొందారు. సెల్‌ఫోన్‌ మీద ఆధారపడి సమాజ సంబంధాలు, కుటుంబంలో ప్రేమాను రాగాలను కోల్పోతున్న నేటి ఆధునిక జీవితంలో సెల్‌ ఉపయోగించకుండా శిక్షణ పొందడం వలన ఒకరికొకరు కొత్తవారైనప్పటికి సామూహిక జీవన అనుభూతిని పొందడం విశేషం. టాయ్‌లెట్స్‌ను 20 రోజులపాటు అంబత్తుర్‌ నగర స్వయంసేవకులే శుభ్రపరచడం ద్వారా ఈ వర్గ ఒక కుటుంబ వాతావరణాన్ని తలపించింది.

 

రాష్ట్ర సేవికా సమితి – తెలంగాణ, ప్రవేశ శిక్షావర్గ

మే 6 నుండి 20 వరకు రాష్ట్ర సేవికా సమితి ప్రవేశశిక్షావర్గ హైదరాబాద్‌, నారాయణగూడలోని కేశవమెమోరియల్‌ ఉన్నత పాఠశాలలో జరిగింది.

మే 20వ తేదీన సార్వజనికోత్సవంలో కళ్యాణి రాచపూడి (సాయివాణి హాస్పిటల్స్‌ దోమలగూడ) పాథాలజిస్ట్‌ అధ్యక్షులుగా పాల్గొని ‘శిక్షణ పొందిన సేవికలు (మహిళలు) ప్రదర్శించిన శారీరిక విన్యాసాలను ప్రశంసిస్తూ దేశ, ధర్మ, సంస్కృతి రక్షణకై రాష్ట్ర సేవికాసమితి మహిళల ద్వారా నిర్వహిస్తున్న అనుశాసనబద్ధమైన ఈ కార్యం దేశానికి ఎంతో అవసరమైనద’ని అన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన అల్కాతాయి ఇనామ్‌దారు రాష్ట్ర సేవికాసమితి అఖిల భారతీయ సహ కార్యవాహిక మాట్లాడుతూ ‘భారతదేశం ప్రపంచానికి జ్ఞానంతోపాటు మానవ విలువలను అందించిన దేశమని, పరుల సొమ్మును మట్టిలాగా భావించే, పరస్త్రీలను తల్లివలే భావించే సంస్కృతి మనదేనన్నారు. కాని ఈ రోజు సమాజంలో జరుగుతున్న అనేక అత్యాచారాలకు మన కుటుంబ వ్యవస్థ కుంటుపడడమే కారణమని, కుటుంబానికి కేంద్ర బిందువైన స్త్రీ ద్వారానే జీవన విలువలు ప్రతి ఒక్కరికి అందుతాయని, అలాంటి స్త్రీ శారీరకంగా, మానసికంగా, భౌద్ధికంగా శక్తివంతమై నప్పుడే తిరిగి మన దేశం విలుపల పరంగా, ఆర్థికంగా, వైజ్ఞానికంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. గత 80 సంవత్సరాలుగా రాష్ట్ర సేవికాసమితి తన కార్యం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నద’ని అన్నారు. ఇందుకొరకు ప్రతి ఒక్కరు చేయూతనివ్వాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో శిక్షార్థుల తల్లిదండ్రులు, సేవికలు, జిల్లా, నగర, ప్రాంత వివిధ పుర ప్రముఖులు సుమారు 500 మంది పాల్గొన్నారు.

మే 18వ తేదీన భాగ్యనగర్‌ (బర్కత్‌పురా, నారాయణగూడ) పురవీధులలో జరిగిన పథ సంచలనం ఎంతగానో ఆకట్టుకుంది.

రాష్ట్ర సేవికా సమితి – ఆంధ్రప్రదేశ్‌, ప్రవేశ శిక్షావర్గ

రాష్ట్ర సేవికా సమితి-ఆంధ్రప్రదేశ్‌ ప్రవేశ శిక్షావర్గ నెల్లూరులోని జివిఆర్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలలో మే 4 నుండి 18వ తేదీ వరకు 15 రోజుల పాటు జరిగింది. ఈ వర్గలో 10 జిల్లాలనుండి 164 మంది సేవికలు (మహిళలు) పాల్గొని శిక్షణ పొందారు.

18న జరిగిన ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా గవర్నమెంట్‌ మహిళా నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రమాదేవి, గైనకాలజీ డాక్టరు సత్యప్రియ, వర్గ సర్వాధికారి ముప్పిరాల ఇందిర, వర్గ కార్యవాహిక తిరుపతి సత్యవతి. అఖిలభారతీయ ప్రముఖ కార్యవాహిక సీతా గాయత్రి, పుట్టశేషు, ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రాంత బౌద్ధిక్‌ ప్రముఖ్‌, 500ల మందికి పైగా పురప్రజలు పాల్గొన్నారు.

వర్గ సమారోప్‌లో సీతాగాయత్రి మాట్లాడుతూ ‘జాగత మాతశక్తి భారతదేశాన్ని పరమవైభవ స్థితికి తీసుకు వెళ్తుందని వందనీయ మౌసీజీ స్పష్టంగా నమ్మారు. వారు భవిష్య ధ్రష్ఠ. ఎటువంటి విషమ స్థితినైనా సహనంతో ఎదుర్కొంటూ వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ వచ్చే సమస్య లకు సమాధానం చెబుతూ దేశ స్వాభిమానాన్ని నిలబెట్టిన సీతా, సావిత్రి, ఝాన్సీలక్ష్మీభాయి వంటి మహిళలు ఈ జాతిలో కోకొల్లలు. అటువంటి కార్యకర్తలను నిర్మాణం చేస్తున్న సమితిలో మహిళ లందరూ భాగస్వాములు కావాలని సమాజం ఈ రోజున ఆకాంక్షిస్తుంది. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న సమితి కార్యం దీనికి సాక్ష్యమంటూ’ వందనీయ మౌసీజీ జీవితంలోని ప్రేరణాత్మకమైన సంఘటనలను ఉదహరించారు.

మే 16 వ తేదీ నెల్లూరు పురవీధుల్లో జరిగిన పథ సంచలనం అందరినీ ఆకట్టుకుంది.

 

ఉపాధ్యాయుల ప్రాథమిక శిక్షావర్గ

ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగు సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు ‘ప్రాథమిక శిక్షావర్గ’ నిర్వహించబడుతెంది. ఈ సంవత్సరం మే నెల 7 రాత్రి నుండి 14 మధ్యాహ్నం వరకు శ్రీకాకుళం జిల్లాలోని గురజాడ విద్యాసంస్థలో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని 7 జిల్లాలు 33 మండలాలలు 31 గ్రామాల నుండి 44 మంది ఉపాధ్యాయులు పాల్గొని శిక్షణ పొందారు. ఆదర్శపాఠశాల, ఆదర్శ గ్రామము, ఆదర్శ కుటుంబం గురించి జరిగిన కార్యశాలలో (వర్క్‌షాప్‌) లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *