మీరట్ రాష్ట్రోదయం – భారత భాగ్యోదయం

మీరట్ రాష్ట్రోదయం – భారత భాగ్యోదయం

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం చారిత్రాత్మకమైన స్వయంసేవక మహాసంగమాన్ని నిర్వహించింది. లక్షకు పైగా స్వయంసేవకులు, మూడు లక్షలకు పైగా ప్రజలు ఈ ‘నభూతో’ అన్నట్టున్న కార్యక్రమంలో కదంతో కదం కలిపి నడిచారు. పదంతో పదం కలిపి పాడారు. గుండెలపై చేతులుంచి ‘త్వదీయాయ కార్యాయ బద్ధా కటీయం’ అని సామూహిక ప్రార్థన చేశారు. కనీవినీ ఎరుగని ఈ మహాఘట్టంలో జనగళం పాంచజన్య పర్జన్యగర్జనై జాతీయవాద జయస్వరం వినిపించింది. ఫిబ్రవరి 25న జరిగిన ‘రాష్ట్రోదయ్‌’ అనే ఈ మహాసంగమం నిజానికి భారత భాగ్యోదయంలా గోచరించింది.

అయితే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ పరమపూజనీయ సర్‌సంఘచాలక్‌ మోహన్‌ జి భాగవత్‌ అన్నట్టు ఇది శక్తి ప్రదర్శన కాదు. బల ప్రదర్శన అంతకన్నా కాదు. తన శక్తి ఎంతో, తన సత్తా ఎంతుందో, తన బలం ఏ పాటిదో తెలుసుకునే శక్తి పరీక్ష ఇది. సాహసోద్యమ బాటలో సఫలయాత్ర సాగిస్తున్న స్వయంసేవకులు చేసుకునే సింహావ లోకనం ఇది. కేవలమిది వెనక్కి తిరిగి చూసుకోవడం మాత్రమే కాదు. ముందుకు చూసుకుని సాగడం కూడా !

ఈ మహాసమ్మేళనం వెనుక ఒక మహాసంకల్ప ముంది. ఆ మహాసంకల్పాన్ని సాకారం చేసుకునే మహత్ప్రయత్నం ఉంది. మీరట్‌, మొరాదాబాద్‌, సహారన్‌పూర్‌ డివిజన్లలోని 24 పాలనా పరమైన జిల్లాల్లోని 10, 580 గ్రామాల్లోని ప్రతి వీధికి, ప్రతి ఇంటికీ స్వయంసేవకులు వెళ్లారు. ఈ ప్రయత్నం అక్టోబర్‌ 2017 నుంచి జనవరి 1, 2018 వరకూ సాగింది.

మీరట్‌, సంభల్‌, బాఘ్పత్‌, ముజఫర్‌నగర్‌, శామ్లీ, అమ్రోహా, మొరాదాబాద్‌, సహారన్‌పూర్‌, బిజ్నోర్‌, రాంపూర్‌, గాజియాబాద్‌, నోయెడాలలో విస్తతంగా పనిచేశారు. దీని కోసం 7500 మంది కార్యకర్తలు సమయమిచ్చారు. వారితో పాటు వేల మంది స్వయంసేవకులు ఇంటింటికీ వెళ్లారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. గురించి, దాని సిద్ధాంతం, ఆలోచనా విధానం గురించి వివరించారు. శిబిరంలో పాల్గొనేవారి నుంచి రూ.50 నమోదు రుసుమును సేకరించారు. ఇంత విస్తతమైన జన ప్రచార ఉద్యమం ఈ ప్రాంతంలో గతంలో ఎన్నడూ జరగలేదు. ఈ బహత్తర ప్రయత్నంలో 3.01 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 1.70 లక్షల మంది ఆర్‌.ఎస్‌.ఎస్‌.కి పూర్తిగా కొత్త వారు. గతంలో వారెన్నడూ సంఘ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఇవేకాక ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్న వారు కూడా చాలామందున్నారు.

ఈ కార్యక్రమం జరగడానికి ముందే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి గ్రామంలో స్వయంసేవకులు తయారయ్యారు. మూడు లక్షల మంది స్వయం సేవకుల డేటాబేస్‌ సమకూరింది. ఇక కార్యక్రమ నిర్వహణ కూడా అదే స్థాయిలో సాగింది. శిబిరంలో ఎక్కడా ప్లాస్టిక్‌ వాడకం లేదు. పర్యావరణాన్ని ఇంతలా గౌరవించిన ప్రయత్నం ఇంకొకటి లేదు. సైన్‌ బోర్డుల నుంచి, తినే కంచాల దాకా ఎక్కడా ప్లాస్టిక్‌ని ఉపయోగించలేదు. బహుశః ఇదొక రికార్డేనేమో.

ఇక శిబిరానికి వచ్చిన వారికి భోజనం కోసం మీరట్‌లోని మూడులక్షల కుటుంబాల నుంచి, సమాజంలో అన్ని వర్గాలు నుంచి రెండేసి చొప్పున ఆహార పొట్లాలొచ్చాయి. ఎలాంటి తరతమ భేదాలు లేకుండా అందరికీ పంచారు. ‘సహనావవతు, సహనౌభునక్తు – సహవీర్యం కరవావహై’ అన్న ఆర్యోక్తి ఆచరణ రూపంలో కనిపించింది. మీరట్‌ నగరంలోని ప్రతి ఇంటి నుంచీ వచ్చిన ఆతిథ్యం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి ఊరి నుంచీ వచ్చిన స్వయంసేవకుల గుండెలను స్పశించింది. భారత దేశంలోని ప్రతి వ్యక్తికీ సమరసతా, సమభావనా సహజీవన సందేశాన్ని, హైందవ విలువలను ఆర్ద్రతతో పంచింది. అటు అసొంలో జనవరిలో ఒక మహా సమ్మేళనం జరిగింది. ఫిబ్రవరిలో కేరళలో యాభై వేల స్వయంసేవకుల మహాసమ్మేళనం జరిగింది. మార్చిలో మీరట్‌ మహా సమ్మేళనం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *