మాతృ సమానురాలు ఉషాతాయి ఛాటి

మాతృ సమానురాలు ఉషాతాయి ఛాటి

అసంఖ్యాక సమితి సేవికల మార్గదర్శి ఉషాతాయి ఛాటి ఆగస్టు 17న నాగ్‌పూర్‌లో మరణించారు.

రాష్ట్ర సేవిక సమితి పూర్వ ప్రముఖ సంచాలిక ఉషాతాయి గుణ్‌వంత్‌ ఛాటి ఆగస్టు 17న పరమపదించారు. వారి వయస్సు 91 సంవత్సరాలు. ఆగస్టు 18 నాడు మోక్షధాంఘాట్‌ వద్ద జరిగిన అంత్యక్రియలకు ముందు రా.సే.స. ప్రధాన కార్యాలయం దేవి అహిల్య మందిర్‌ వద్ద వేలాది సేవికలు, సమాజ ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. సర్‌ కార్యవాహ భయ్యాజి జోషి, రా.సే.స. ప్రముఖ సంచాలిక వి.శాంత, పూర్వ ప్రముఖ సంచాలిక ప్రమీలతాయి మెథే, ప్రముఖ కార్యవాహిక ఎ.సీతక్క, అఖిల భారతీయ సహ కార్యవాహిక సుల్భాదేశ్‌పాండే, మరికొందరు ఇతరులు శ్రద్ధాంజలి ఘటించారు. సేవికలు ఉషాతాయికి మాన వందన అర్పించారు.

ఉషాతాయి 1927 ఆగస్టు 31 వినాయక చవితి నాడు విదర్భలోని భందారాలో జన్మించారు. ఆమె ప్రాథమిక విద్య మన్రో హైస్కూల్లో పూర్తయింది. రా.స్వ.స. స్వయంసేవక్‌ గుణవంత్‌ ఛాటితో వివాహం తరువాత ఆమె నాగపూర్‌లో స్థిరపడి హిందుములించి శాలలో బోధించారు. వారు వాగ్మిత వికాస్‌ సమితిని స్థాపించి 30 సంవత్సరాలు అధ్యక్షులుగా పనిచేశారు. వారు విద్యార్థుల కొరకు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించేవారు. 1975 అత్యవసర పరిస్థితి కాలంలో ఆమె జైలు కెళ్ళారు.

బాల్యం నుండే సేవిక అయిన ఉషాతాయి సంస్థలో వివిధ బాధ్యతలు నిర్వహించి 1994లో ప్రముఖ సంచాలిక అయ్యారు. 2006 వరకు ఈ బాధ్యతలు నిర్వహించిన తరువాత ప్రమీలతాయి మేథేకు బాధ్యతలు అప్పగించారు.

మృదు మధుర గళం వారికి దేముడిచ్చిన వరం. నాగపూర్‌ రేడియో కేంద్రం నుండి ప్రసారమైన ఎన్నో గీతాలకు ఆమె స్వరం ఇచ్చారు. ఎన్నో సంగీత కార్యక్రమాలను సమర్పించారు. సంగీత వృత్తి సమితి పనికి అడ్డంకిగా ఉండడంతో ఆమె సంగీత వృత్తిని వదిలి వేశారు.

ఆమెకు జోషి ఫౌండేషన్‌ వారు రాష్ట్రీయ ఏకాత్మత పురస్కారాన్ని, డోంబివిలి స్వామి వివేకానంద ఎడ్యుకేషనల్‌ ట్రస్టు వారు వివేకానంద పురస్కారాన్నీ, భోపాల్‌ నుండి ఓజస్విని పురస్కారం ప్రదానం చేశారు. తనకు లభించిన బహుమానం మొత్తాన్ని ఆమె సంఘమిత్ర సేవా సంస్థాన్‌కు విరాళంగా ఇచ్చారు.

ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌కార్యవాహ భయ్యాజి జోషి మాట్లాడుతూ ”ఏ పరిస్థితిలోనూ ఎంచుకున్న మార్గాన్ని విడువకుండా కొనసాగడం కష్టమన్నారు. అటువంటి వారిలో ఉషాతాయి ఉన్నత స్థానం. దేశానికి గర్వకారణమైన పనిని కొనసాగించడం ఆమెకు నిజమైన నివాళి” అన్నారు.

సమితి అఖిల భారతీయ సహ కార్యవాహిక సుమతి చిత్రతాయి మాట్లాడుతూ ”వేలాది మంది సేవికలకు ఉషాతాయి తల్లివంటిదన్నారు. అందువల్ల ఆమె లక్షణాలను అనుకరించడం ఆమెకు నిజమైన నివాళి”అన్నారు ఆమె.

ఆగస్టు 18 నాడు సమితి ఢిల్లీ శాఖ అధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద సంతాప సమావేశం జరిగింది. ఉత్తర క్షేత్ర సంపర్కప్రముఖ్‌ రాధా మెహతా, ఉత్తర క్షేత్ర పాలకాధికారి ఆషాశర్మ, ప్రాంత కార్యవాహిక సునీత భాటియ మరి ఇంకొందరు సేవికులు శ్రద్ధాంజలి ఘటించారు.

సమితి మూడవ ప్రధాన సంచాలికగా 1994 నుండి 2006 వరకు ఉషాతాయి అధిపతిగా ఉన్నారు. మహిళల సాధికారత కొరకు పనిచేస్తూ సమాజంలో వారి తోడ్పాటును పొందాలని ఆమె ఉద్భోదించేవారు. బాలికల విద్య, సంక్షేమంపై, ముఖ్యంగా సమాజంలోని బలహీన వర్గాల బాలికల పట్ల ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. వారు ప్రముఖ సేవికగా ఉన్న సమయంలో అటువంటి బాలికల కోసం ఉచిత వసతి గృహాలు ప్రారంభించారు. ఆమె నాగపూర్‌ నగరం, విదర్భ ప్రాంతాల కార్యవాహిక గానూ బాధ్యతలు నిర్వహించారు. చాలా కాలంగా మోకాలు నొప్పితో బాధపడుతున్నా తాయి నవ్వుతు భరించారు. ఆమె సాధారణ జీవనం గడుపుతూ సహాయం చేయడానికి, మార్గదర్శనానికి సదా సిద్ధంగా ఉండేవారు. ”ఆమె మరణంతో సమితి దారి దీపాన్ని కోల్పోయింది అన్నారు ఆషా శర్మ.

ప్రపంచ వ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. యుకెలో హెచ్‌.ఎస్‌.ఎస్‌. సంఘచాలక్‌ ధీరజ్‌ డిషా తన సంతాప సందేశంలో, ఉషాతాయిలో మాతృత్వం, దయ, రుణ మూర్భీభవించాయి. ఆమె ఒక నిజమైన కర్మయోగి. అసంఖ్యాక సేవికలకు, సామాజిక కార్యకర్తలకు ప్రేరణగా నిలచారు. ఆమె నిష్క్రమణ చాలా సంవత్సరాల ప్రభావం చూపుతుంది. ప్రపంచ వ్యాప్త సేవికలకు ఆమె జీవితం నిరంతరం ప్రేరణనిస్తుంది” అన్నారు.

మూర్తీభవించిన త్యాగ నిరతి

ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌సంఘచాలక్‌ మోహన్‌జీ భాగవత్‌ హుబ్లీలోని సమితి కార్యాలయంలో ఆగస్టు 18 నాడు శ్రద్ధాంజలి ఘటించారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వారి కుటుంబం రెండువైపుల నుంచి సంఘంతో అంకిత మయ్యారన్నారు. ఆమె భర్త నాగపూర్‌ ఘోష్‌ తోలిలో సభ్యుడుగా ఉండేవారు. వారిరువులు కలసి కనిపించడం అరుదు. ఘోష్‌ తొలి సభ్యులు వారింటికి వచ్చినప్పుడు మాత్రం వారు కలసి కనిపించేవారు.

ఉషాతాయి గొప్ప గృహిణి. అతిధులెవరినీ భోజనం చేయకుండా వెళ్ళనిచ్చే వారు కాదు. ఆమె ప్రజలతో సులభంగా కలసిపోయే వారు. తన స్వభావం, నిబద్ధతలతో సంఘ, సమితి కార్యకర్తలకు ఆమె ప్రేరణగా నిలిచారు. ఆమెకు గీత్‌ అంటే చాలా ఇష్టమని, ఆమె ప్రముఖ్‌ సంచాలిక అయిన తరువాత సేవికలను గీత్‌ ప్రస్తుతి కార్యక్రమానికి ప్రేరేపించారని భాగవత్‌ గుర్తు చేశారు. ఆమె గట్టి మాటల మనిషని, చేపట్టిన కార్యాన్ని పూర్తి చేసేవారని అన్నారు. ఎట్టి పరిస్థితులోను చెరగని ఆమె చిరునవ్వు అందరికీ స్ఫూర్తినిచ్చేది. ఆమెది ఆత్మోవిలోపి వ్యక్తిత్వం! ఆమె వెళ్ళిన అన్ని చోట్లా ఉత్సాహం నింపేవారని, ఇప్పుడు లోటు ఏర్పడిందని భాగవత్‌ అన్నారు. అయితే సంఘంలోను, సమితిలోను వారి విలువల నుంచి నేర్చుకొని, అమలు చేయడం మన బాధ్యత అన్నారు. పనిని కొనసాగించాలన్నారు.

ఆమె మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన భాగవత్‌, ఇటీవల ఆమెతో కలసి పాల్గొన్న రక్షాబంధన్‌ను గుర్తు చేసుకున్నారు. కర్నాటక ఉత్తర ప్రాంత సహ కార్యవాహిక రత్నమాల సేవికల పక్షాన విచారం తెలిపారు. వందనీయ ఉషాతాయి స్మారకంగా మాతృమందిర్‌ ప్రాంగణంలో మోహన్‌ భాగవత్‌ ఒక మొక్క నాటారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *