అన్ని వృత్తులవారిని సన్మానించాలి – అప్పుడే సమరసత సాధ్యమౌతుంది

అన్ని వృత్తులవారిని సన్మానించాలి – అప్పుడే సమరసత సాధ్యమౌతుంది

సామాజిక సమరసత జాతీయ కన్వీనర్‌ శ్యామ్‌ప్రసాద్‌

పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగిని సన్మానిస్తున్నట్లే, కులవృత్తుల వారినీ సన్మానించాలని, అప్పుడే సమాజంలో సామరస్యం వెల్లివిరుస్తుందని సామాజిక సమరసత జాతీయ కన్వీనర్‌ శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు. మచిలీపట్నంలో జూన్‌ 24న జరిగిన సమరసతా వేదిక సభలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు. శ్యాంప్రసాద్‌ ఇంకా ఇలా అన్నారు.

‘నేను సనాతన ధర్మానికి చెందిన వాడిని. ఉపనిషత్తుల సందేశం ఏకాత్మతే. నేడు ఆచరణలో ఉన్న కుల అసమానతలు, అంటరానితనం మధ్య కాలంలో వచ్చిన దురాచారాలు. హిందూ ధర్మానికి వ్యతిరేకమైనవి. ఈ దురాచారాలు తొలగించాలి. జ్ఞానం – విజ్ఞానం అందరికి అందుబాటులోకి రావాలి. పొట్టకూటి కోసం ఏ వృత్తినైనా స్వీకరించే స్వేచ్ఛ ఉండాలి. కులం పేరుతో ఎలాంటి ఆంక్షలు తగవు. ఇటువంటి సామాజిక వ్యవస్థ నిర్మాణం కోసం మనం కృషి చేయాలి’ అని స్వామి వివేకానంద మనకు సందేశమిచ్చారు. ఈ సందేశాన్ని అమలు చేయటం కోసమే సామాజిక సమరసతా వేదిక పనిచేస్తున్నది.

ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే వరకు వ్యక్తులకు, సమూహాలకు అనేక అవసరాలు ఉంటాయి. అనేకమంది తమ వృత్తులను సక్రమంగా నిర్వహిస్తేనే ప్రజల అవసరాలు తీరుతాయి. ఇల్లు కట్టుకోవాలంటే భూమిపూజ నుండి గృహప్రవేశం వరకు అనేక వృత్తుల వారు తమ పనులను చేయాల్సి ఉంటుంది. కనుక అన్ని వృత్తులు జన జీవనానికి అవసరమైనవే. ఏ వృత్తి ఎక్కువ కాదు, తక్కువ కాదు. హిందూ సమాజంలో కులానికి, వృత్తికి అవినాభావ సంబంధం ఉంది. ఇప్పటికీ అనేకమంది తమ కుల వృత్తులను నిర్వహిస్తున్నారు. కొన్ని వృత్తులలో ఉపాధ్యాయవృత్తి, పోలీసులు – సైనికులు, వ్యాపారం, పరిపాలకులు.. ఇలా అనేక వృత్తులలో నేడు అన్ని కులాలవారు ఉన్నారు. అయితే కొన్ని వృత్తులు ఇప్పటికి కులంతో కొనసాగుతున్నాయి.

ఉదాహరణకు రజక, క్షౌరవృత్తి, రోడ్లు శుభ్రం చేయటం, కుమ్మరి, కమ్మరి.

ఒక ఉపాధ్యాయుడు అనేకమందికి చదువు నేర్పి పదవీ విరమణ చేస్తున్నప్పుడు అతనికి సన్మానం చేస్తాం. అలాగే దశాబ్దాలపాటు తమ కులవృత్తి ద్వారా ప్రజలకు సేవలందించిన చర్మకారులు, మత్స్య కారులు, రోడ్లను శుభ్రం చేసేవారు, ధర్మప్రచారం చేసే మాల, మాదిగదాసులు.. ఇలాంటి వారికి ఎందుకు సన్మానం చేయకూడదు ? గ్రామ పెద్దలు ఇలా కులవృత్తులలో పనిచేసిన వారికి సన్మానం చేయాలి. తద్వారా అన్ని వృత్తులు గౌరవనీయమైనవనే భావన ఏర్పడుతుంది.సామాజిక గౌరవం, ¬దా వీరికి లభిస్తుంది. అప్పుడే వివిధ కులాలవారు సద్భావనతో కలిసిమెలిసి జీవించగలం. దీనినే సమరసతా అంటారు. సమరసత ద్వారానే హిందూ సమాజంలో ఐక్యత వస్తుంది. హిందూ సమాజ ఐక్యత ద్వారానే హిందూ ధర్మం, సంస్కృతి రక్షింపబడతాయి, తద్వారా భారతదేశం మళ్ళీ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది. నేడు మన మచిలీపట్నంలో సామాజిక సమరసతా వేదిక ద్వారా 12 కుల వృత్తులకు చెందిన పెద్దలను సన్మానించు కుంటున్నాం.

మచిలీపట్నం చారిత్రాత్మక పట్టణం. అనేక ధార్మిక, సామాజిక, రాజకీయ ఉద్యమాలకు పుట్టినిల్లు. 4 జులై 1904లో స్వామి వివేకానంద సమాధి పొందిన తర్వాత అదే సంవత్సరంలో శ్రీ రామకృష్ణానంద స్వామీజీ ద్వారా మచిలీపట్నంలో దేశంలో మొదటిగా హిందూ బాలసంఘం పేరున ఈ భవనం ప్రారంభమైంది.

1902లో బెంగాల్‌ విభజనకు నిరసనగా వందేమాతర ఉద్యమం ప్రారంభమైంది. 1904లో బిపిన్‌ చంద్రపాల్‌ మచిలీపట్నం వచ్చారు. దాంతో వందేమాతర ఉద్యమం ఆంధ్రప్రాంతంలో ప్రారంభమైంది. డా||అంబేద్కర్‌ సామాజిక ఉద్యమాలలో ప్రవేశించకముందే 1916లో శ్రీ వేమూరి రాంజి పంతులు (1891 – 1963) మచిలీపట్నంలో తన స్వంత స్థలంలో షెడ్యూల్డు కులాల అభివృద్ధికోసం వివిధ వృత్తులతో కూడిన పాఠశాలను, వసతి గృహాన్ని ప్రారంభించి దశాబ్దాల పాటు నిర్వహించారు. ఈ పాఠశాలలో చదువుకున్న అనేకమంది షెడ్యూల్డు కులాల విద్యార్ధులు ఉన్నత చదువులు చదివి, ఉన్నత స్థానాలను పొందారు. కొందరు ఐ.ఎ.ఎస్‌. ఆఫీసర్లు కూడా అయ్యారు. ఇలాంటి అనేక ఉద్యమాలకు కేంద్రమైన మచిలీపట్నం సామాజిక సమరసతకు ప్రధాన కేంద్రం కావాలి’ అని శ్యామ్‌ప్రసాద్‌ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి డా|| ధన్వంతరీ (అధ్యక్షులు, హిందూ విద్యా సంస్థలు) కులవృత్తుల వారిని సన్మానించారు. సభకు అంకాని శేషుబాబు అధ్యక్షత వహించారు. డా|| సారంగపాణి సభను ప్రారంభించారు. శ్రీఅంకెం జితేంద్ర కుమార్‌ మచిలీపట్నం పట్టణ సమరసత సంయోజక్‌గా, తిరుమల శెట్టిప్రసాద్‌, చిలకలపూడి నాగేశ్వర్రావు, మోపిదేవి రామకృష్ణ, అంకాల శేషుబాబులు సభ్యులుగా బాధ్యతలను స్వీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *