తులసీదాస్‌- రామపాదాలను అర్చించిన అక్షరం

తులసీదాస్‌- రామపాదాలను అర్చించిన అక్షరం

ఆగస్టు 17 తులసీదాస్‌ జయంతి ప్రత్యేకం

అమ్మ హులసీ అంటే తనకెంత ప్రేమో, రామకథ అన్నా తులసీదాసుకు అంత ప్రేమ.

బాల్యంలో తులసీదాసు అసలు పేరు రామ్‌బోలా. పసిప్రాయం నుండే ఆయన రామనామం ఉచ్చరించటం తప్ప మరో పలుకు పలికేవాడు కాదట, అందువల్లే రామ్‌బోలా అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. కాలక్రమంలో తులసీదాస్‌గా ప్రసిద్ధుడయ్యాడు. తులసీదాసు గురువు నరహరి అనీ, నరహరిదాసు, నరహర్యానంద్‌ అని చెబుతారు.

తులసీదాసు రాజాపూర్‌లో 1554 శ్రావణ శుద్ధ సప్తమి నాడు జన్మించాడు. బాల్యం కష్టాల్లో గడిచింది. తులసీదాసు జన్మించిన కొద్ది కాలానికే తల్లి దండ్రులిరువురూ కాలధర్మం చెందారు. దాంతో స్వార్థపరులైన కుటుంబ సభ్యులు ఆయన్ని ఇంటి నుండి బయటకు పంపించేశారు.

తులసీదాసు తండ్రి రాజాపూర్‌ ఆస్థానంలో రాజగురువుగా ఉండేవారు. పుట్టినప్పుడు పిల్లవాడు ఏడ్వలేదు, కేవలం రామనామాన్నే ఉచ్చరిస్తూ ఉండటంతో పిల్లవాడి పేరు ‘రామ్‌బోలా’గా స్థిరపడి పోయింది. తులసీదాస్‌ జన్మించిన మూడవరోజు తల్లి హులసీ కన్నుమూసింది. చనిపోయేముందు తల్లి తన పిల్లవాడి సంరక్షణ బాధ్యతలు దాసి చునియాకు అప్పగించింది. తర్వాత చునియా పసివాడు రామ్‌బోలాని తీసుకొని తన అత్తవారి ఊరు హరిపూర్‌ చేరుకొంది. అయితే అక్కడ పాము కాటుకు గురై చునియా మరణించింది. ఈ విషయాన్ని రాజాపూర్‌లో ఉన్న తండ్రికి చేరవేసి పిల్లాణ్ణి తీసుకొని పోవలసిందిగా చునియా కుటుంబ సభ్యులు కోరారు. అయితే రామ్‌బోలాని అశుభ సూచకంగా భావించి తండ్రి తీసుకొని పోవటానికి నిరాకరించారు.

అయిదేళ్ళ వయసు వచ్చే దాకా బాలుడు రామ్‌బోలా ఇల్లిల్లూ తిరిగి భిక్షాటన చేసి పొట్ట నింపుకున్నాడు. ఇదే సమయంలో అనంతానందుడి శిష్యుడు నరహర్యానంద పిల్లవాణ్ణి చేరదీసి శుద్ధిచేసి సూచర క్షేత్రంలో రామకథని వినిపించారు. అంతేకాదు, రామ్‌బోలా అనే పేరుని తులసీగా మార్చారాయన. అయిదేళ్ళ తర్వాత నరహరి ఆ పిల్లవాణ్ణి తీసికొని కాశీ చేరుకున్నారు. అక్కడ శేష సనాతన్‌ని కలుసుకున్నారు. తులసీ ప్రతిభా పాటవాలని చూసి శేషసనాతన్‌ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

శేష సనాతన్‌ నీడన ఉంటూ తులసీ ఇతిహాస, పురాణాలన్నీ, కావ్య శాస్త్రాలని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. శేషసనాతన్‌ మరణానంతరం తులసీ తన స్వస్థలం రాజాపూర్‌ చేరుకొని రామకథామృత గానం చేస్తూ అక్కడి వారందరినీ ఆకట్టుకున్నారు.

1583లో తారపితా గామ్రానికి చెందిన ఓ బ్రాహ్మణుడు తన కుమార్తెనిచ్చి తులసీతో వివాహం జరిపించాడు. అయిదేళ్ళ అనంతరం ఆయన భార్య ఓ నాడు చెప్పాపెట్టకుండా పుట్టిల్లు చేరుకుంది. తులసీ కూడ భార్య వెనకాలే అత్తారిల్లు చేరుకున్నాడు. అయితే భార్య మందలింపుతో ఆయన వైరాగ్యాన్ని పొందాడు. భర్త వైరాగ్యాన్ని చూసిచింతాక్రాంతురాలైన భార్య 1589లో మృతి చెందింది.

తులసీ ఇల్లు విడిచి దేశమంతటా 15 సంవత్సరాల పాటు తీర్థయాత్రలు చేస్తూ చివరన చిత్రకూటం చేరుకున్నాడు. అనంతర కాలంలో చిత్రకూటాన్నే నివాస స్థానంగా మలచుకున్నాడు. అక్కడ హనుమంతుని ద్వారా రామదర్శన భాగ్యాన్ని పొందగలిగాడు. ఇక్కడే హతహరివంశుని లేఖ అందుకున్నాడాయన. అంతేకాదు సూరదాసు కూడ ఈయన్ని కలుసుకునేందుకు వచ్చాడు.

1616లో ఈయన తన ‘సూరసాగర్‌’ని తులసీకి చూపించాడు. మీరాబాయి నుంచి లేఖ అందుకున్న తులసీ ఆమెకు ప్రత్యుత్తరం రాశారు. 1628లో ‘రామగీతావళి-కృష్ణగీతావళి’ని సంకలనం చేశారు. ఆ తర్వాత కాశీకి వెళ్ళిపోయారు. మార్గమధ్యంలో హరిపూర్‌, దిగ్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో ఆగి కవితారచన చేశారు. కాశీలో విశ్వనాథుణ్ణి దర్శించాక రామకథా రచనకి ప్రేరణ పొందారు. ఆ పరిణామక్రమంలోనే తులసీ 1631లో అయోధ్య చేరుకొని ‘రామ చరిత మానస్‌’ రచనకు శ్రీకారం చుట్టారు. అచిరాకంలోనే ‘రామచరిత మానస్‌’ ఖ్యాతి పొందటంతో కాశీలోని పండితులు తులసీపై ద్వేషాన్ని, అసూయని పెంచుకొని ‘రామచరిత మానస్‌’ని దొంగిలించేందుకు ప్రయత్నించారు. అయితే తులసీ ‘రామచరిత మానస్‌’ ప్రతిని కాశీ జమీందారైన టోడర్‌ వద్ద భద్రపరిచారు. కాశీ పండితుల ద్వారా ఇబ్బందులకు గురైనప్పటికీ ఈయన 1633 నుండి 1640 సంవత్సరాల మధ్యకాలంలో ‘వినయ్‌ పత్రిక’ రచన చేశారు. ఆ తర్వాత తులసీ మిథిలా యాత్ర చేశారు.

ఈ సమయంలోనే తులసీదాసు ‘రామలలాన వాఛూ’, ‘పార్వతీ మంగళ్‌’ ‘జానకీ మంగళ్‌’ రచించారు. 1640లో ‘దోహావళి’ని రచించాక, 1641లో ‘వాల్మీకి రామాయణం’ ప్రతి నకలుని రూపొందించారు. 1642లో మరో భక్తకవి కేశవదాసు తులసీని కలుసుకున్నారు. ఆయన నుండి స్ఫూర్తిపొందిన కేశవదాసు ‘రామచంద్రిక’ రాశారు. తన యాత్రలో భాగంగా తులసీదాసు పలువురు భక్త కవులు నాభాదాసు, నందదాసు, గోపీనాథ, మూలక్‌దాసు మొదలైన వారిని కలుసుకున్నారు. తులసీదాసు పలు మహత్యాలని చూపారని కూడ ‘మూలగోసాయీ చరిత’లో వేణీ మాధవదాసు పేర్కొన్నారు.

1670 ప్రాంతాల్లో జహంగీర్‌ చక్రవర్తి తులసీదాసుని దర్శించుకున్నారు. ధన, కనక, వస్తు, వాహనాలను సమర్పించుకునేందుకు యత్నించారు. అయితే తులసీ వాటిని తిరస్కరించారు. ఆ కాలంలోనే వారు మరిన్ని రచనలు చేశారు. 1680లో ఓ శ్రావణ శనివారం నాడు గంగాతీరంలోని అసీఘాట్‌ వద్ద తులసీదాసు ఇహలోకాన్ని వీడారు.

‘సంవత్‌ సోలహ సౌ అసీ, అసీ గంగకే తీర్‌

శ్రావణ శ్యామా తేజ్‌ సని తులసీ తజే శరీర్‌’

మొగలుల కాలంలో హిందూ సమాజం అణచివేతకు గురువుతకూ వచ్చింది. ఇబ్బందుల పాలైన హిందూ సమాజాన్ని జాగృత పరచే యత్నం నాటి భక్త కవులు తమ రచనల ద్వారా చేశారు. మొగలుల ద్వారా అవమానాలకు గురైన హిందూ సమాజ స్థితిని చరిత్రకారులు సంకేత రూపంలో ఎలాగయితే అక్షర బద్ధం చేశారో అదే క్రమంలో తులసీదాసు సైతం తన ‘రామచరిత మానస్‌- కవితావళి’లో సంకేత మాత్రంగా ఉటంకించారు. రామచరిత మానస్‌లోని ఉత్తర కాండలో తులసీదాసు సమకాలీన సామాజిక పరిస్థితులని చిత్రించారు. నిజం చెప్పాలంటే అది కల్పన కాదు, నిజమైన చరిత్ర.

నాటి వర్ణాశ్రమ వ్యవస్థ గూర్చి మానస్‌లోని ఉత్తరకాండలో ఓ చోట తులసీదాస్‌ ఇలా పేర్కొన్నారు.

‘కలిమలగ్రసే ధర్మ సబలుప్త భయే సదగ్రంథ్‌ |

దంభిన్హ నిజమతి కల్పి కరిప్రగట కియే బహుపంథ్‌||

…… …… …… ……

మాతుపితా బాలకన్హి బోలావహిఁ |

ఉదరభరై సోయి ధర్మసిఖావహి ||

…… …… …… ……

సౌభాగినిఁ విభూషన హీనా

బిధవన్హ కే సింగార నబీనా

నారి ముయీ గృహ సంపతి నాసీ

మూడ మూడాయీ వోహిఁ సన్యాసీ ||

తులసీదాసు భాగవతం నుండి ప్రేరణ పొంది నప్పటికీ పై వర్ణనలో సమకాలీన అనుభవాలను జోడించారు. భారతదేశంలో సనాతన ధర్మాన్ని ధ్వంసం చేసేందుకు పలుమార్లు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరిగాయి. నేడూ జరుగుతున్నాయి. అయితే ఆనాడు మహనీయుల సంకల్పశక్తి ఆ కుట్రలను ధ్వంసం చేస్తూ వచ్చింది. గౌతమబుద్ధుడు ప్రవచించిన బౌద్ధం ద్వారా కూడా సనాతన ధర్మవ్యవస్థకు ప్రమాదం వాటిల్లబోయింది. కానీ ఆది శంకరుల వారు ఆ ప్రమాదం వాటిల్లకుండా అడ్డుట్టవేశారు. వైదిక-సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరించేవారికి భారతదేశంలో మనుగడ ఉండదని తులసీదాసు గట్టి నమ్మకం. దశావతారాల్లో ఒక అవతారంగా భావిస్తున్న బుద్ధుడి గూర్చి తులసీదాసు అభిప్రాయాన్ని చూడండి-

‘అతులిత మహిమా వేద్‌ కీ తులసీ కియే విచార్‌

జేహి నిందత్‌ నిందిత్‌ భయో బిదిత్‌ బుద్ధ అవతార్‌’

భారతదేశంలో రాముడు, కృష్ణుడు తర్వాత బుద్ధుడిని అవతార పురుషుడిగా భావిస్తారు. అయితే వైదిక ధర్మానికి దూరం కావడంతో చివరికి బుద్ధావతారం ఏమయిందీ? అవతార పురుషు డయినప్పటికీ ఇతర అవతారాల మాదిరి భారత దేశంలో బుద్ధుడు ప్రశస్తి పొందలేకపోయాడు. తన ప్రతి రచనలో తులసీదాసు భావాన్నీ, భాషనీ, అనుభూతినీ, అభివ్యక్తిని అద్భుతంగా ఆవిష్క రించారు. తులసీదాసు భక్తకవే కాదు, విశ్వమానవుడు కూడా!

– విద్యారణ్య కామ్లేకర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *