కడలి కల్లోలంలో… తూర్పు భారతం !

కడలి కల్లోలంలో… తూర్పు భారతం !
  •  కనుమరుగవనున్న సుందర్బన్‌ అడవులు
  •   తమిళనాడుకూ పొంచి ఉన్న ముప్పు

ఇప్పటికే ప్రపంచంలోని తీర ప్రాంత నగరాలలో పర్యావరణ విపత్తుల గణాంకా లను కూడా ఐఐటి అధ్యయనం పరిగణనలోకి తీసుకుంది. ఇప్పటికే న్యూయార్క్‌లో సముద్రమట్టం ఆరు మీటర్ల ఎత్తుకు పెరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏర్పాట్లు మొదలుపెట్టారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ఈ శతాబ్దాంతానికి సముద్రమట్టం 2.7 నుండి 4 మీటర్ల ఎత్తు పెరిగితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచిస్తున్నారు.

సముద్రమట్టం పెరుగుతూండడంతో తీర ప్రాంతం కోతకు గురవుతున్నది. దీనివల్ల సుందర్బన్‌ అడవులు త్వరలో కనుమరుగయ్యే ప్రమాదం ఉందనీ, కాబట్టి వీటిని పరిరక్షించేందుకు భారత, బంగ్లాదేశ్‌ ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని పర్యావరణ వేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.

భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులలో 1 లక్షా 40 వేల హెక్టార్లల మేర విస్తరించి ఉన్న అడవులను ‘సుందర్బన్‌ అడవులు’ అని పిలుస్తారు. దట్టంగా రావిచెట్లతో నిండి ఉన్న, ప్రపంచంలోనే పెద్ద అటవీ ప్రాంతం ఇది. ఒకవైపు భారత్‌ నుండి గంగానది, మరోవైపు బంగ్లాదేశ్‌ నుండి ఐరావతీ నది పాయలుగా ఈ అడవుల గుండా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ అడవులలో ప్రవహించే గంగా, ఐరావతీ పాయలలో డాల్ఫిన్‌ చేపలు, మొసళ్ళు తిరుగాడుతూ ఉంటాయి. ‘ఇండియన్‌ పైథాన్‌’గా పేరొందిన కొండచిలువలకు ఈ అడవులు ఆలవాలం. ప్రసిద్ధి చెందిన బెంగాల్‌ టైగర్లు (పెద్ద పులులు) ఈ అడవులలో 500 వరకు ఉన్నాయని యునెస్కో పేర్కొంది.

నిత్యం పచ్చదనంతో కళకళలాడే సుందర్బన్‌ అడవులకు ఇప్పుడొక పర్యావరణ సమస్య వచ్చింది. అదేమిటంటే ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం పెరుగుతూండడం వల్ల ఇక్కడ తీరప్రాంతం నిత్యం కోతకు గురవుతోంది. దానితో ఈ అడవులు క్రమేపి కనుమరుగవుతున్నాయి. పల్లపు ప్రాంతాలలో వచ్చే వరదలు, అక్కడి నేలలో పెరుగుతున్న ఆమ్లీకరణ అక్కడి ప్రజల జీవనోపాధిని, అక్కడి జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

‘ఉవ్వెత్తున ఎగసిపడే సముద్ర కెరటాలు, తరచుగా వచ్చే తుఫానులు, వాతావరణంలో సంభవించే మార్పులు మా జీవితాలపై, వృత్తులపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఇవాళ మేం వల వేసి పట్టుకుందామంటే ఒక్క చేప కూడా దొరకడం లేదు. అందువల్ల మాలో చాలామంది వేరే వృత్తులని ఆశ్రయించాల్సి వస్తోంది’ అని అంటాడు స్థానికంగా నివసిస్తున్న సత్యనాధ్‌ పాత్రా. అతని వృత్తి చేపలు పట్టడం.

సముద్రమట్టం పెరిగిపోతూండడం వల్ల, భూమిలోను, భూగర్భ జలాలలోను ఉప్పదనం పెరిగిపోతున్నది. దీనివల్ల సుందర్బన్‌ అడవుల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు బ్రతుకుతెరువు కోసం పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాకు వలస వెళ్లి పోతున్నారు. ఇలా వలస వెళ్లిపోయే ‘వాతావరణ శరణార్థులు’ ఇతర నగరాలలో పరిశ్రమలు, భవన నిర్మాణ కూలీలుగానో, ఇళ్ళలో పనిచేసుకుంటూనో కాలం వెళ్ళబుచ్చుతున్నారు.

కుంచించుకుపోతున్న సుందర్బన్‌ దీవులు

ఉపగ్రహాల ద్వారా తీసిన చిత్రాల ఆధారంగా ఇటీవల జరిపిన అధ్యయనం బట్టి వెల్లడయ్యిందేమి టంటే తీరప్రాంతాలు కోతకు గురౌతూండడం వల్ల గత నాలుగేళ్ళలో నాలుగు శాతం అనగా 9,990 హెక్టార్ల మేర సుందర్బన్‌ అడవులు కనుమరుగై పోయాయి. వంద దీవులలో విస్తరించి ఉన్న ఈ అడవులలో కొన్ని దీవులు నీట మునిగిపోయాయి. సముద్రమట్టం పెరుగుతూండడంతో అనేక దీవుల నుండి జనాలు వేరే చోటికి వలస వెళ్లిపోతున్నారు.

‘సుందర్బన్‌ అడవులలో సగటున ఏడాదికి 200 మీటర్ల వరకు తీరప్రాంతం కోతకు గురౌతోంది. పర్యావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని ఈ అడవులను రక్షించుకోడానికి అవసరమైన అన్ని చర్యలూ చేబట్టాలి’ అంటారు సంజయ్‌ గుప్తా. ఈయన వరల్డ్‌ బ్యాంక్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.

2015లో ఒక ఆర్ధిక సంస్థ విడుదల చేసిన నివేదిక పర్యావరణం దెబ్బతినడం వల్ల, జీవ వైవిధ్యం దెబ్బ తినడం వల్ల సుందర్బన్‌ అడవులలో ఏడాదికి 170 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లుతోందని పేర్కొంది.

సుందర్బన్‌ అడవులలో సంభవిస్తున్న పర్యావరణ విధ్వంసంలో మానవ ప్రమేయం కూడా లేకపోలేదు. నానాటికీ పెరిగిపోతున్న అక్రమ కట్టడాల నిర్మాణం, ఇటుకల తయారీకోసం, వాటిని కాల్చడానికి ఉపయోగించే కొలిమిల నిర్మాణానికి జరిగే స్థలాల దురాక్రమణ, రొయ్యల పెంపకం కోసం పెద్ద సంఖ్యలో చెరువులు తవ్వేయడం వంటి చర్యలు అక్కడి పర్యావరణ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. 2014 డిసెంబరులో ఒక ఆయిల్‌ టాంకర్‌ మునిగిపోవడం వల్ల వందల లీటర్ల ఫర్నేస్‌ ఆయిల్‌ నీటిపాలైంది. అందువల్ల 350 చదరపు కిలోమీటర్లకు పైగా సముద్ర జలాలు కలుషితమయ్యాయి.

‘సుందర్బన్‌ అడవులు ఎంతో ప్రాచీనమైనవి. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఇక్కడి ప్రజలకు తెలియదు. ఆ విషయంలో వారు సిద్ధంగా లేరు కూడా. ఈ అడవులను రక్షించుకునేందుకు యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలను చేపట్టాలి. లేకపోతే చాలా తొందర్లోనే ఈ అడవులు కనుమరుగైపోతాయి’ అని డా.జయంత బసు అంటారు. ఈయన ప్రముఖ పర్యావరణ నిపుణులు.

తమిళనాడుకు పొంచి ఉన్న ముప్పు

భూ ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతూండడం వల్ల 2050 నాటికి సముద్రమట్టం ఒక మీటరు ఎత్తు పెరిగినట్లయితే భారతదేశంలోని తమిళనాడు తీవ్రంగా నష్టపోనున్నదనీ, ఆరు లక్షల కోట్ల మేర ఆ రాష్ట్ర ఆర్ధిక వనరులకు నష్టం వాటిల్లనుందనీ పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెన్నైలోని Indian Institute of Technology వారితో కలిసి Indo-German Centre for Sustainability వారు పర్యావరణంలో సంభవిస్తున్న మార్పులను గురించి ఒక అధ్యయనం జరిపారు. ఆ వివరాలను వారు Madras Institute of Development Studies తో కలిసి సంయుక్తంగా జనవరి 20, 2018న వెల్లడించారు. సముద్ర మట్టం బాగా పెరగడం వల్ల 1.3 మిలియన్‌ ప్రజలు ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉందనీ, ఇంకా ఎంతో మంది జీవనోపాధిని కోల్పోనున్నారనీ ఈ అధ్యయనం అంచనా వేసింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్ళూర్‌ జిల్లాలలోని సముద్ర తీరాలలో నివసించే లక్షా పాతిక వేలమంది జాలర్లు తీవ్రంగా నష్టపోనున్నారని ఈ అధ్యయనం వెల్లడిస్తోంది.

సముద్ర మట్టం పెరిగినట్లయితే 2050 నాటికి తమిళనాడుకు చెందిన 143 నుండి 356 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం సముద్రజలాలలో కలిసిపోనున్నదని ‘Future Sea Level Rise: Assessment of Loss and Damage in Chennai in 2015’ పేరుతో జరిగిన ఒక అధ్యయనం పేర్కొంటోంది.

భారతదేశానికి 7,500 కోలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉంది. ఇందులో 15 శాతం (1,076 కిలోమీటర్ల) తీరం తమిళనాడులో ఉంది. భారతదేశ జనాభాలో 35 శాతం ప్రజలు సముద్ర తీరానికి 100 కిలోమీటర్ల పరిధిలో గల పట్టణాలలో నివసిస్తున్నారు. ఇటీవలి దశాబ్దాలలో తీరప్రాంత నగరాలలోనే పరిశ్రమల ఏర్పాట్లు భారీగా జరిగాయి.

భూ ఉపరితల ఉష్ణోగ్రతలు స్థిరంగా పెరుగు తూండడం వల్ల సముద్ర జలాలు వేడెక్కి ధ్రువాల వద్ద మంచుచరియలు కరుగుతున్నాయి. ఫలితంగా సముద్రమట్టం పెరిగి, తీర ప్రాంతాలలోని పల్లపు భూభాగాలు నెమ్మదిగా ముంపుకు గురవుతున్నాయి. సముద్రగర్భంలోని చమురు నిక్షేపాలను వెలికి తీసేందుకు జరిపే మైనింగ్‌, పంపింగ్‌ వల్ల కూడా కొన్ని చోట్ల తీర ప్రాంత భూభాగాలు ముంపుకు గురవుతున్నాయి.

2100 వచ్చే నాటికి ప్రపంచ దేశాలలోని అన్ని తీర ప్రాంతాలలోను సముద్రమట్టం 0.3 నుండి 0.6 మీటర్ల వరకు పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి సహకారంతో పనిచేసే Intergovernmental Panel on Climate Change (IPCC) 2013లో వెల్లడించింది. పర్యావరణ నిబంధనలను కఠినంగా అమలు చేసినట్లయితే 2040 తరువాత వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్‌ను కొంతవరకు తగ్గించవచ్చని ఈ సంస్థ పేర్కొంది.

వాతావరణంలోని మార్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పనిచేసే తమిళనాడు రాష్ట్ర కార్యాచరణ సమితి 2010-2100 మధ్య కాలంలో భూ ఉపరితల ఉష్ణోగ్రత 3.1 డిగ్రీల సెల్సియస్‌ పెరగడం వల్ల సముద్రమట్టం 0.7 మీటర్ల ఎత్తు పెరగనున్నదని పేర్కొంది.

చెన్నై ఐఐటికి చెందిన రాజన్‌, Institute of Financial Management and Researchకి చెందిన భైరవన్‌ 2011లో సంయుక్తంగా ఒక అధ్య యనం నిర్వహించారు. ‘సముద్రమట్టం పెరగడం వల్ల 2050 నాటికి తమిళనాడుకు చెందిన 1,091 చదరపు కిలోమీటర్ల భూభాగం సముద్రంలో మునిగిపోతుంది. 47,418 నుండి 53,554 కోట్ల రూపాయల మేరకు ఆర్ధిక నష్టం వాటిల్లుతుంది’ అని వారి అధ్యయనం వెల్లడిస్తోంది.

ఇప్పటికే ప్రపంచంలోని తీర ప్రాంత నగరాలలో పర్యావరణ విపత్తుల గణాంకాలను కూడా ఐఐటి అధ్యయనం పరిగణనలోకి తీసుకుంది. ఇప్పటికే న్యూయార్క్‌లో సముద్రమట్టం ఆరు మీటర్ల ఎత్తుకు పెరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏర్పాట్లు మొదలుపెట్టారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ఈ శతాబ్దాంతానికి సముద్రమట్టం 2.7 నుండి 4 మీటర్ల ఎత్తు పెరిగితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచిస్తున్నారు.

‘ఏదైనా ఒక నగరానికి సంబంధించి విపత్తు నివారణ చర్యలు తీసుకోవాలంటే భవిష్యత్తులో సంభ వించబోయే ఉపద్రవాలను గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది’ అంటారు ఐఐటికి చెందిన రాజన్‌.

పట్టణ నిర్మాణ నిపుణుడైన పి.టి. కృష్ణన్‌ ‘పట్టణ నిర్మాణాల విషయంలో ఏ ప్రభుత్వమూ విపత్తు నివారణ చర్యల గురించి ఆలోచించడంలేదు. ప్రకృతి పరమైన విపత్తులు సంభవిస్తే కలిగే నష్టాల గురించి స్థానిక ప్రజలలో అవగాహన కలిగించాలి. ఇందు కోసం ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి’ అని అంటారు.

‘స్థానిక పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో సంభవించబోయే ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు వీలుగా స్థానిక ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకునే స్వేచ్ఛను కల్పిస్తూ రాజ్యాంగంలో చట్ట సవరణలు చేయాలి’ అని తారా మురళి అంటారు. ఈమె చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్‌.

– డా|| దుగ్గిరాల రాజకిశోర్‌, 8008264690

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *