సమరసత సేవా ఫౌండేషన్‌ కృషితో… గుడిలో ‘బడుగు’ ఘంటారావం !

సమరసత సేవా ఫౌండేషన్‌ కృషితో… గుడిలో ‘బడుగు’ ఘంటారావం !

కృష్ణాజిల్లా, నందిగామ డివిఆర్‌ గిరిజన కాలనీలో కొత్తగా కట్టిన శ్రీ సీతారామ దేవాలయంలో 2018 ఫిబ్రవరి నుండి శివకృష్ణ అర్చకులుగా పనిచేస్తున్నారు. గిరిజనుడైన శివకృష్ణ ఆలయంలో నిత్యపూజా కైంకర్యాలను శ్రద్ధాభక్తులతో చేయటం చూసి సాటి గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ గిరిజనుడు వేదమంత్రాలు చదువుతూ దీపారాధన, సంకల్పం, గణపతి పూజ, ప్రధాన పూజలతో పాటుగా సీతారామ స్వాములకు నివేదనచేసి, రాత్రికి పవళింపు సేవ చేయటం చూసి ఎంతో గర్వపడుతున్నారు. ‘భగవంతుని సేవించటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక సామాన్య యానాది కుటుంబంలో పుట్టిన నాకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు శిక్షణ ఇచ్చి, అర్చకుడిగా నియమించారు’ అని శివకృష్ణ అన్నారు. ‘మా పరిసర ప్రాంతాలలో హిందూ ధర్మ వ్యాప్తికి ఇతోధికంగా కృషిచేస్తాను. మతాంతీకరణను అడ్డుకుంటాను’ అని ఆయన ఉత్సాహంగా చెప్పారు.

శివకృష్ణ ఒక్కరే కాదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా కట్టిన దేవాలయాల్లో అర్చకులుగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఐదు వందలమంది పనిచేస్తూ ఒక నిశ్శబ్ద ధార్మిక విప్లవాన్ని తీసుకొస్తున్నారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలలోని హరిజన, గిరిజన బస్తీలలో, కొండ ప్రాంతాలలో వారు పనిచేస్తూ ధార్మిక చైతన్యానికి కృషి చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ శాఖ హిందూ ధార్మిక పరిరక్షణ ట్రస్టు, సమరసత సేవా ఫౌండేషన్‌ వారి సంయుక్త, సమైక్య కృషి ఫలితమే ఈ ధార్మిక సంస్కరణ. శతాబ్దాలపాటు సమాజానికి దూరంగా ఉంచబడ్డవారే నేడు హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కాపాడే బాధ్యతను తలకెత్తుకో వటం హిందుత్వానికి శుభసూచకం.

సమరసతకు శ్రీకారం

2015లో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టువారు ధర్మ పరిరక్షణకు, వ్యాప్తికి పనిచేస్తున్న సంస్థల పని తీరును సమీక్షించారు. అనుకున్న రీతిలో ఫలితాలు రాకపోవటానికి గల కారణాలు అన్వేషించారు. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా, సమన్వయంతో పనిచేయగల్గిన ఒక సంస్థ ఆవశ్యకతను వారు గుర్తించారు. స్వర్గీయ పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌, తదితర పెద్దల సహకారంతో సమరసత సేవా ఫౌండేషన్‌ ఆవిర్భవించింది. క్షేత్రస్థాయిలో ధర్మ ప్రచారం చెయ్యటం, స్థానికులను ధర్మ పరిరక్షణలో భాగస్వాము లను చెయ్యటం, దేవాలయాలు కేంద్రంగా నూతన ధార్మిక చైతన్యాన్ని తీసుకొని రావటం కోసం సమరసత సేవా ఫౌండేషన్‌ను ప్రారంభించారు. డిసెంబరు 2, 2015న తిరుపతిలో శ్రీవారి ఆస్థాన మండపంలో జరిగిన ధార్మిక సమ్మేళనంలో కంచి పెజావర్‌ పీఠాధిపతులతో పాటుగా ఇతర మఠాలకు చెందిన 60 మంది మఠాధిపతులు ఈ సంస్థను దీవించారు. హిందూ సమాజంలోని వివిధ వర్గాల ప్రజలను, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకోవటం, వారి ధార్మిక అవసరాలను తీర్చటమే లక్ష్యంగా పనిచేయమని ఆదేశించారు.

హిందూ ధార్మిక చైతన్య వ్యాప్తి అనే పవిత్ర యజ్ఞంలో సముచిత రీతిలో ప్రజలందరిని భాగస్వాములుగా చేయటమే లక్ష్యంగా సమరసత సేవా ఫౌండేషన్‌ ఆనాటి నుండి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నది. కేరళ ప్రభుత్వ రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసి, ఇటీవలే స్వర్గస్తులైన ఎంజికె మూర్తి అధ్యక్షులుగా సమర్థవంతమైన సేవలు అందించారు. ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలకు 13 మంది జిల్లాస్థాయి ధర్మ ప్రచారకులు ఉన్నారు. డివిజనల్‌ స్థాయిలో విభాగ్‌ ధర్మ ప్రచారకులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని 676 మండలాలకు గాను, 325 మండలాల్లో సమరసత సేవా ఫౌండేషన్‌ పనిచేస్తున్నది. ఈ 325 మండలాల్లో ప్రతి మండలానికి ఒక ధర్మ ప్రచారకుడు ధర్మ ప్రచార నిమిత్తం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఈ 325 మండలాలలో 45 సుదూర గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రసిద్ధిచెందిన పీఠాధిపతులు, మఠాధిపతులు, ధర్మ ప్రచారకులకు శిక్షణ ఇచ్చారు.

ధర్మ ప్రచారం

సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గత మూడు ఏళ్ళలో 39,44,403 కుటుంబాలకు ధర్మ సందేశం చేరింది. 42 లక్షల కరపత్రాలను పంచారు. గీతాజయంతి సందర్భంగా బాలబాలికలకు నిర్వహించిన గీతా కంఠస్థ పోటీలలో 2016లో 47,723 మంది పాల్గొనగా, 2017లో 52,539 మంది పాల్గొన్నారు. కలియుగంలో భగవన్నామ స్మరణకు ఎంతో ప్రాధాన్యం ఉంది. భజన బృందాలకు శిక్షణిచ్చి భజన సాంప్రదాయాన్ని పునరుద్ధరించటమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల భజన బృందాలకు శిక్షణ ఇచ్చారు. సేవా ఫౌండేషన్‌ పనిచేస్తున్న గ్రామాల్లో నెలకు ఒకసారి గ్రామస్థు లందరూ హాజరయ్యే విధంగా సామూహిక హారతి కార్యక్రమాన్ని చేపట్టారు. 2032 దేవాలయాల్లో షుమారు 40 వేలమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేద హిందువుల సౌకర్యార్థం దేవాదాయశాఖ చేపట్టిన పుణ్యక్షేత్రాల ఉచిత సందర్శన కార్యక్రమం ‘దివ్యదర్శనం’కు అర్హులైన బడుగు, బలహీన వర్గాలవారిని ఎంపిక చేసేందుకు దేవాదాయశాఖకు సమరసత సేవా ఫౌండేషన్‌ సహక రిస్తున్నది. యువజన సమ్మేళనాల ద్వారా గ్రామీణ యువతను సమీకరించి, ధార్మిక చైతన్యం రగిలించ టానికి జరుగుతున్న కృషిలో భాగంగా 2018లో 2754 గ్రామాల నుండి ఇరవై వేలమందితో కార్యక్రమాలు నిర్వహించారు.

దేవాలయాల నిర్మాణం

తిరుమల తిరుపతి దేవస్థానం వారు షెడ్యూల్‌ కులాల, తెగలవారి ఆవాస ప్రాంతాలలో, మత్స్యకార గ్రామాల్లో దేవాలయాలు నిర్మిస్తున్నది. 2016లో రాష్ట్రప్రభుత్వం 500 దేవాలయాలు నిర్మాణానికి అనుమతించింది. దేవాలయా లను ఎక్కడ కట్టాలో నిర్ణయించే బాధ్యతను సమరసత సేవా ఫౌండేషన్‌కు ఇచ్చారు. దళారులు, గుత్తేదారులు లేకుండా స్థానికుల భాగస్వామ్యంతో ఈ దేవాలయాలను దేవాదాయశాఖ, తిరుమల తిరుపతి దేవస్థానంవారు, హిందూ పరిరక్షణ సంస్థలవారి మార్గదర్శకత్వంలో సమరసత సేవా ఫౌండేషన్‌ కార్యకర్తలు నిర్మిస్తున్నారు. రెండున్నర ఏళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 500 దేవాలయాలను హరిజన, గిరిజన ఆవాస ప్రాంతాలలో, మత్స్యకార గ్రామాల్లో నిర్మించారు. ప్రజలు సైతం ఈ దేవాలయాలకు ఉదారంగా విరాళాలు ఇచ్చారు.

ఈ దేవాలయాల్లో అర్చకులుగా పనిచేయటానికి ధార్మిక ఆసక్తి, అర్హత కలిగిన స్థానికులనే ఎంపిక చేశారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానంవారు అర్చకత్వ శిక్షణ ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన 500 మంది నేడు ఈ దేవాలయాల్లో సుశిక్షితులై, అర్చకులుగా పనిచేస్తూ భగవదారాధన చేస్తున్నారు. ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలు అర్చకులుగా సేవలు అందిస్తూ, మిగిలిన సమయంలో తమ వృత్తులు చేసుకుంటూ ఆదర్శంగా జీవిస్తున్నారు. కృష్ణాజిల్లా కలెక్టరు జిల్లాలో పనిచేస్తున్న బడుగు, బలహీన వర్గాలకు చెందిన అర్చకులను తన కార్యాలయానికి పిలిపించారు. వారి శ్రద్ధాభక్తులను చూసి ఆశ్చర్యపోయారు. ఒకసారి శిక్షణిచ్చి వదిలివెయ్యటంకాక, తిరుమల దేవస్థానంవారు కొత్తగా నియమించిన అర్చకులకు ఏడాదికి రెండుమార్లు పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు.

అన్యమత ప్రచారకుల వ్యతిరేకత

సమరసత సేవా ఫౌండేషన్‌ కార్యకర్తలు బలహీన వర్గాలు నివసిస్తున్న మారుమూల కుగ్రామాలకు సైతం వెళ్లగలిగారు. వారిని అక్కున చేర్చుకుంటున్నారు. సామాన్యులు వారికి స్వాగతం పలుకుతుండగా, క్రైస్తవమత ప్రచారకులకు వారి రాక ఇష్టంగా లేదు. స్థానికుల భాగస్వామ్యంతో క్రైస్తవ ప్రచారకుల అభ్యంతరాలను అధిగమిస్తున్నారు.

కానీ కొన్నిచోట్ల క్రైస్తవ మతపెద్దలు, క్రైస్తవ ప్రచారకుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురయింది. కర్నూలు జిల్లా, పాండ్యం మండలం భూపాలపాడు గ్రామంలో 37 మాదిగ కుటుంబాలు వారు తమ ప్రాంతంలో దేవాలయం నిర్మించ మని కోరారు. ఆ గ్రామ సర్పంచ్‌ దేవాలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించారు. కాని అదే కాలనీలో నివాసం ఉంటున్న క్రైస్తవులు కొందరు దేవాలయ నిర్మాణాన్ని అడ్డుకొనటమేకాక హిందూ సోదరులపై భౌతికంగా దాడిచేశారు. ఆ చిన్న గ్రామంలో అనుమతిలేని 3 క్రైస్తవ ప్రార్థనామందిరాలు ఉన్నాయి. అధికారులు ఈ సమస్య పరిష్కారానికి గ్రామ సభను ఏర్పాటు చేయగా 85 శాతం మంది ఆలయ నిర్మాణానికి అనుకూలంగా చేతులెత్తారు. దానితో నిర్మాణానికి ఉన్న ప్రతిబంధకం తొలిగిపోయి, నిర్మాణం జరిగింది. జిల్లా అధికారులు ఆలయ నిర్మాణం కావాలనుకొన్న వారికి మద్ధతుగా నిలబడగా, స్థానిక రాజకీయ నేతలు క్రైస్తవులకు మద్ధతుగా నిలబడటం అందరికీ ఆశ్చర్యం కల్గించింది. అట్లాగే రాజమండ్రి, కాకినాడ మధ్య ఒక జీర్ణ దేవాలయాన్ని పునరుద్ధరించటానికి జరిగిన ప్రయత్నాలను కూడా క్రైస్తవ మత ప్రచారకులు అడ్డుకొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 చోట్ల దేవాలయాల నిర్మాణాన్ని ఏదోఒక సాకుతో అడ్డుకొనే ప్రయత్నం క్రైస్తవ ప్రచారకులు చేశారు. కొన్నిచోట్ల అధికారులు, మరికొన్నిచోట్ల నేతలు వారికి బాసటగా నిలవటం శోచనీయం. అయినా ఈ ప్రతిబంధకాలను అధిగమించి నిర్మాణం దిశగా సమరసత ఫౌండేషన్‌ కార్యకర్తలు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.

వెల్లివిరిస్తున్న ధార్మిక చైతన్యం

సుదూర ప్రాంతాలలో నివసిస్తున్న హిందువులు ధర్మాచార్యుల రాకకోసం ఎన్నో సంవత్సరాల నుండి నిరీక్షిస్తున్నారు. సామాన్య ప్రజల ఆధ్యాత్మిక తృష్ణ తీర్చటం కోసం హైందవ సంస్థలు, ఆచార్యులు ఇన్నాళ్లుగా తగినంతగా ముందుకు రాలేదు. ఆ ఖాళీని క్రైస్తవమత ప్రచారకులు ఉపయోగించుకొన్నారు. ధర్మంపట్ల, దైవంపట్ల, తరతరాల వారసత్వంపట్ల సామాన్య ప్రజలకు కూడా ఎనలేని ఆసక్తి ఉంది. కాని చెప్పేవారు కరువై, చేస్తున్న క్రైస్తవమత ప్రచారానికి ఆకర్షితులై మతం మార్చు కుంటున్న మన సోదరుల దగ్గరకు ఇప్పుడు సమరసత కార్యకర్తలు వెళుతున్నారు. కోటి మందికి పైగా హిందువుల వద్దకు వెళ్లగలిగారు. సనాతన ధర్మం విశిష్టత గురించి, మతాంతీకరణ ప్రమాదాల గురించి వివరించి వారిలో ఒక ధార్మిక స్పృహను కల్గించగలిగారు. సమరసత కార్యకర్తల కృషి ఫలితంగా గ్రామీణులలో ఒక నూతన ఆసక్తి మొదలయింది.

ధార్మిక సాధికారత

‘సమరసత సేవా ఫౌండేషన్‌ చేస్తున్న హిందూ ధర్మ జాగరణ పనిలో సహకరించటానికి రాష్ట్ర వ్యాప్తంగా యువకులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. 322 మంది ధర్మ ప్రచారకులలో 46 మంది గిరిజనులే. వారికి మద్దతుగా స్థానికులు అనేకమంది తమ సమయం ఇచ్చి పనిచేస్తున్నారు. మొత్తం 5వేల గ్రామాలలో పనిచేయటానికి ప్రోత్సాహం ప్రజల నుండే వస్తున్నది. అనేకమంది మహిళలు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో పనిచేయటానికి ముందుకు వస్తున్నారు’ అని ఫౌండేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్యామ్‌ ప్రసాద్‌ అన్నారు. ‘కుల వివక్ష ఇంకా కొన్ని గ్రామాలలో ఉంది. రాయలసీమలోని కొన్ని కుగ్రామాలలో వివక్ష నేటికీ కొనసాగుతున్నది. అలాంటి గ్రామాలలో సైతం సమరసత సేవా కార్యకర్తల కృషి వలన మార్పు వస్తున్నది. సామూహిక భజన, హారతి కార్యక్రమా లలో హిందూప్రజలందరూ పాల్గొంటున్నారు. దళిత, గిరిజనులైన అర్చకులు ఇస్తున్న తీర్థ ప్రసాదాలను అందరూ భక్తితో తీసుకుంటున్నారు’ అని ఆయన తెలిపారు. ధార్మిక చైతన్యాన్ని మరింతగా వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తామని, బలహీన వర్గాలకు ధార్మిక సాధికారత కలిగించే దిశలో మరింత పురోభివృద్ధి సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు.

– డా.బి.సారంగపాణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *