ఈ పెంపు సజ్జ రైతులకు వరం

ఈ పెంపు సజ్జ రైతులకు వరం

పంట మద్దతు ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా పంట సాగుకయ్యే ఖర్చుకు అదనంగా కనీసం 50 శాతం మేరకు తగ్గకుండా పెంచడం మనదేశ చరిత్రలో రైతుల సంక్షేమానికి చేపట్టిన మహత్తరమైన చర్య.

ఇంతవరకు వరి, గోధుమ పంటలకు ఇస్తున్న ప్రాధాన్యానికి ధీటుగా ఈసారి మెట్ట ప్రాంత రైతులు సాగుచేసే చిరుధాన్యాలు, నూనెగింజలు, పప్పుధాన్యాలకు కనీస మద్దతు ధరలు గణనీయంగా పెంచటంతో ఆ ప్రాంత రైతాంగానికి చేయూత లభించినట్లయింది. వర్షాధార పంటలైన చిరుధాన్యాల (హైబ్రిడ్‌ జొన్నకు రూ. 730, మాల్దండి జొన్నకు రూ.725, సజ్జకు 525 పెంపుతో) ధరల పెంపుతో ఆ ప్రాంత రైతాంగానికి ఆర్థికంగా వెసులుబాటుతో పాటు భరోసా కల్పించటం ముదావహం.

మరీ ముఖ్యంగా సజ్జ పంటకు సాగు ఖర్చు కన్నా 96 శాతం అదనంగా మద్దతు ధరకు చేర్చి క్వింటాలుకు రూ. 1950 గా నిర్ణయించటం వారి పాలిట వరం అంటే అతిశయోక్తి కాదు.

వర్షాభావ ప్రాంతాల్లో ముఖ్యంగా రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, కర్నాటక, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలకు పరిమితమై, తక్కువ దిగుబడులతో గిట్టుబాటు కాక, వినియోగదారుల ఆదరణ లేక ప్రతి ఏటా సజ్జ పంట సాగు విస్తీర్ణం తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో కనీస మద్దతు ధర (రూ.1950/క్వింటాలుకు) పెంపు వల్ల సజ్జ సాగుకు ఊపిరి పోసినట్లయింది.

సజ్జను సాగుచేసే రైతులు ముఖ్యంగా రాజస్థాన్‌ (51 శాతం సాగు విస్తీర్ణం), మహారాష్ట్ర (15.3 శాతం సాగు విస్తీర్ణం), గుజరాత్‌ (10.6 శాతం సాగు విస్తీర్ణం) ఉత్తరప్రదేశ్‌ (9.2 శాతం సాగు విస్తీర్ణం), మధ్యప్రదేశ్‌ (19 శాతం సాగు విస్తీర్ణం), తమిళనాడు (1.4 శాతం సాగు విస్తీర్ణం), ఆంధ్రప్రదేశ్‌ (1.1 శాతం సాగు విస్తీర్ణం) తదితర రాష్ట్రాల్లో తగినన్ని వనరులు లేక ఇతర పంటల సాగుకు అవకాశం లేక, నష్టాల్లో కూడా అక్కడ సజ్జ పంటనే సాగు చేస్తున్నారు. ఈ ప్రాంత రైతులందరికీ ప్రధానమంత్రి చేపట్టిన ‘2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయడం’ అనే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ఈ 96శాతం కనీస మద్దతు ధర పెంపుతో దాదాపుగా నేరవేర్చినట్లవుతుంది.

ఈ పెంపుతో సజ్జ రైతాంగానికి ఏటా 6,300 కోట్ల రూపాయల అదనపు లాభం చేకూరుతుంది. ఇందువల్ల వారి ఆర్థిక పరిస్థితులు తప్పక మెరుగుపడతాయి.

ప్రపంచ వ్యాప్తంగా సజ్జ పంట సాగు విస్తీర్ణం 26 మిలియన్‌ హెక్టార్లుంటే కేవలం భారతదేశంలోనే 12 మిలియన్‌ హెక్టార్లుగా ఉంది. మన దేశంలో వరి, గోధుమ పంటల తర్వాత రైతులు సజ్జనే ఎక్కువగా సాగు చేస్తున్నారు.

భారతదేశంలో రాజస్థాన్‌ వాసులకు సజ్జ ప్రధానమైన ఆహార పంట. మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ వేడిని తట్టుకొని మంచి పోషక విలువలు కలిగిన ప్రధాన ఆహార పంటగా సజ్జకు పేరుంది.

1950 సంవత్సరంతో పోల్చితే తగినంత గిట్టుబాటు ధర, ఆదరణ లేక సజ్జ పంట సాగు విస్తీర్ణం 26 శాతం మేర తగ్గిపోయింది. కాని అప్పటితో పోల్చితే దిగుబడి స్థాయి మాత్రం రెట్టింపు అయ్యింది. (3.42 నుండి 8.83 మిలియన్‌ టన్నులకు పెరిగింది.)

దీనికి ప్రధాన కారణం సజ్జలో మంచి ఉత్పాదక శక్తిగల హైబ్రిడ్‌లు ఉండటమే. సజ్జలో 50శాతం మేర విస్తీర్ణంలో అధికోత్పత్తినిచ్చే వంగడాలు ఉన్నాయి. అదే గుజరాత్‌లో 90శాతం మేర విస్తీర్ణంలో హైబ్రిడ్లు సాగులో ఉంటే, రాజస్థాన్‌లో అధికోత్పత్తి వంగడాల సాగు 25 నుంచి 30 శాతం మేరకే పరిమితమైంది. ఈ అధికోత్పత్తి వంగడాల విస్తీర్ణంతో పాటు మేలైన సాగు పద్ధతుల వల్ల పంట దిగుబడి, ఉత్పత్తి పెరిగింది.

అధికోత్పత్తి వంగడాల సాగు విస్తీర్ణత గుజరాత్‌లో పెరిగిన కారణంగా అక్కడ దిగుబడి హెక్టారుకు 1277 కిలోలు. కాగా రాజస్థాన్‌లో అధికోత్పత్తి రకాల విస్తీర్ణత తగ్గడం, వర్షాభావం, ఇతర కారణాల వల్ల అక్కడ దిగుబడి బాగా తగ్గింది. (788 కిలోలు/హెక్టారుకు).

అధికోత్పత్తినిచ్చే వంగడాల సాగు విస్తీర్ణత, మేలైన సాగు పద్ధతులు, సస్యరక్షణా చర్యల ద్వారా దిగుబడి, ఉత్పత్తులను పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు కనీస మద్దతు ధర పెంపు ఇతోధికంగా తోడ్పడుతుంది. మెట్ట ప్రాంత రైతుల పాలిట వరంగా మారిన సజ్జ పంటలోని పోషక విలుల గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి.

మనం తీసుకునే ప్రతి 100 గ్రా|| ఆహారపదార్థాల్లో, ప్రోటీన్లు 20%, మాంగనీసు 76 శాతం, నీరు 9 శాతం, కార్బోహైడ్రేట్లు 73%, పీచుపదార్థాలు, కొవ్వు, ఇతర ఖనిజాలు కచ్ఛితంగా ఉండాలి. ఇవన్నీ సజ్జలో పుష్కలంగా ఉన్నాయి.

– ప్రొ.పి.రాఘవరెడ్డి, 9989625230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *