సజ్జతో ఆరోగ్యం..

సజ్జతో ఆరోగ్యం..

కేంద్ర ప్రభుత్వం సజ్జ పంటకు కనీస మద్దతు ధరను పెంచిన నేపథ్యంలో రైతులందరూ ఈ పంటపై దృష్టి పెట్టాలి. ఎటువంటి వాతావరణాన్ని అయినా తట్టుకునే శక్తి సజ్జకు ఉంది. మెట్ట ప్రాంత రైతులకు ఈ పంట నిజంగా వరం. ఇందులో పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి.

ఆరోగ్య ప్రయోజనాలు

– కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

– రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె పోటు రానివ్వదు.

– కణ విభజనలో, కణ నిర్మాణంలో కీలక పాత్ర వహిస్తుంది.

– జీర్ణ వ్యవస్థను శుద్ధి చేస్తుంది.

– ఇన్సులిన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది.

– చిన్న పిల్లల్లో ఆస్తమాను తగ్గిస్తుంది.

– బ్రెస్ట్‌ కాన్సర్‌ను నివారిస్తుంది.

– శరీరంలో హర్మోన్ల ఉత్పత్తికి సహకరిస్తుంది.

– టైప్‌ 2 డయాబిటిస్‌ను నిరోధిస్తుంది.

– సజ్జలో ఉండే పీచుపదార్థాలు, అమైనో ఆమ్లాల వల్ల శరీరానికి ఎక్కువ శక్తి కలుగుతుంది.

సజ్జలో పోషక విలువలు హెచ్చుగా ఉంటాయి. ఆహారం కూడా చాలా రుచిగా ఉంటుంది. గతంలో అమెరికా, పశ్చిమ యూరోప్‌ దేశాల్లో పక్షులకు, పశువులకు దాణాగా సజ్జ గింజలనే ఉపయోగించేవారు. ప్రజలు కూడా ఆహారంగా తీసుకునేవారు. మన దేశంలో పందెం ఎడ్లు, పందెం కోళ్లను బలిష్టంగా తయారుచేసేందుకు వాటికి సజ్జ గింజలనే పెట్టేవారు.

అయితే సజ్జలో పోషక విలువలు ఎక్కువగా ఉన్నప్పటికీ ‘ఫైటేటో’ కూడా అతిగా ఉంటుంది. అందువల్ల కొంతమంది తినడానికి ఇష్టపడరు. ప్రస్తుతం సజ్జలో ఫైటేటోను పూర్తిగా తగ్గించే విషయంలో పరిశోధనలు సఫలీకృతం అవుతున్నాయి.

మన శాస్త్రవేత్తలు జింకు, ఇనుపధాతువుల పరిమాణాన్ని 32 యూనిట్ల కన్నా ఎక్కువ స్థాయికి పెంచి, వాటితోపాటు అధికోత్పత్తినిచ్చే సజ్జ వంగడాలను రూపొందించి సాగులోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి అధికోత్పత్తి నిచ్చే పంటను విస్తృతంగా చేపట్టి సాగు విస్తీర్ణాన్ని పెంచితే రైతులు పోషక విలువలతో కూడిన సజ్జ ధాన్యాన్ని పొందుతారు. తద్వారా వారి ఆదాయం కూడా పెరుగుతుంది.

రైతులు సజ్జ పంటను ప్రధానంగా భూసారం తక్కువగా ఉన్న నేలలో, అతి తక్కువ వర్షపాతమున్న ప్రాంతాల్లో, ఎక్కువ ఉష్ణోగ్రతలున్న ప్రదేశాల్లో విస్తృతంగా సాగు చేస్తారు. ఇది ప్రధానంగా వర్షాధార పంట. మెట్ట ప్రాంతాల్లో సాగు చేసిన పంటను పశువుల మేతగా కూడా ఉపయోగిస్తారు.

రోజురోజుకీ పెరుగుతున్న కాలుష్యం వల్ల వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్న నేపథ్యంలో సజ్జ పంట ఎటువంటి ప్రాంతంలోనైనా ఎదుగుతుందని పరిశోధనా పరంగా రుజువైంది. ఇన్ని సుగుణాలున్న ఈ పంటను మెట్ట ప్రాంత రైతులు ఇతోధికంగా సాగు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

భిన్నమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా, అధికోత్పత్తినిచ్చే విధంగా శాస్త్రవేత్తలు సజ్జలో వినూత్న పద్ధతుల్ని ప్రవేశపెట్టాల్సి ఉంది. అదే విధంగా పోషక విలువలతో కూడిన పదార్థాల రూపకల్పనకు కూడా కృషి చేయాలి. రైతులు కూడా సజ్జను విస్తృతంగా సాగు చేయాలి.

ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన అధికోత్పత్తి వంగడాలను విస్తృతంగా ప్రాచుర్యం చేసి, విత్తనో త్పత్తిని ముమ్మరం చేసి, నూతన వంగడాల సాగును బాగా పెంపొందించాలి. ఈ కొత్త వంగడాల నుండి అధికోత్పత్తిని సాధించడానికి తదనుగుణంగా ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ పరిస్థితులను, అనువైన సాగు పద్ధతులను వృద్ధి చేసి, విస్తృతంగా ప్రాచుర్యం చేయాలి. చీడపీడల నుండి సజ్జ పంటను జీవ సంబంధిత కషాయాలతో సంరక్షించటం ఉత్తమం.

సజ్జ పంట తక్కువ సమయం(80-85 రోజులు) లోనే చేతికొస్తుంది. పైన పేర్కొన్న అధికోత్పత్తినిచ్చే వంగడాలు సాంకేతిక పరిజ్ఞానంతో దిగుబడి స్థితిని ప్రస్తుతం ఉన్న (991 కి/హె) స్థితి నుండి అదనంగా హెక్టారుకు 500 కేజీల వరకు పెంచాలి. ఇలా చేస్తే అదనపు దిగుబడి వల్ల మెట్ట ప్రాంత రైతాంగానికి రెట్టింపు లబ్ధి కలుగుతుంది.

ప్రస్తుతం మెట్ట ప్రాంత రైతులు వర్షాభావ పరిస్థితుల వల్ల వరి, గోధుమల కన్నా సజ్జ పంటలో తక్కువ దిగుబడి పొందుతున్నారు. వరి, గోధుమలతో పోల్చితే పోషక విలువల పరంగా, ఆరోగ్యపరంగా సజ్జ చాలా మేలైనది. అందుకే ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం మెట్ట ప్రాంత రైతులను ప్రోత్సహించేందుకు సజ్జకు కనీస మద్దతు ధరను కూడా పెంచింది.

– ప్రొ.పి.రాఘవరెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి,  9989625230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *