ఐఎస్‌ఐ పిడికిలిలో పాక్‌ న్యాయవ్యవస్థ, మీడియా !

ఐఎస్‌ఐ పిడికిలిలో పాక్‌ న్యాయవ్యవస్థ, మీడియా !

పాకిస్తాన్‌ అంతర్గత వ్యవహారాలలో ఐఎస్‌ఐ (ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌) మరింత పట్టు బిగుస్తున్నదా? ఇటీవల జరిగిన పరిణామాన్ని పరిశీలిస్తే ఔనన్న సమాధానమే సరైనదని పిస్తుంది. ఇస్లామాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి షౌకత్‌ అజీజ్‌ సిద్దికి తొలగింపు, అందుకు ఐఎస్‌ఐ చూపిన పట్టుదల గమనిస్తే పాకిస్తాన్‌ ఆ నిఘా సంస్థ ఉక్కు పిడికిలిలో మరింతగా బిగుసుకుపోతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి. ఐదు దశాబ్దాల తరువాత అక్కడి న్యాయవ్యవస్థలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం ఇందుకు మరొక రుజువుగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, పాకిస్తాన్‌ మీడియా కూడా ప్రస్తుతం ఐఎస్‌ఐ చెప్పినదే రాస్తోందని, చూపిస్తున్నదని ఆ న్యాయమూర్తి మరో పదునైన విమర్శ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం మీద ఐఎస్‌ఐ ప్రభావం అంచనాకు అందనిది. అంటే- న్యాయ, కార్య నిర్వాహక, చట్ట నిర్మాణ వ్యవస్థల మీద తన ఆధిపత్యాన్ని అది పటిష్టం చేసుకుందని స్పష్టంగానే తెలుస్తున్నది.

సిద్దికి ఇస్లామాబాద్‌ హైకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తి. ఆయన వచ్చే నెలలోనే ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కూడా పొందవలసి ఉంది. ఇంతలోనే ఆయనను పదవి నుంచి (అక్టోబర్‌ 12) తొలగించారు. కారణం- ఐఎస్‌ఐ మీద ఆయన ”వివాదాస్పద” వ్యాఖ్యలు చేశారు. తనకు అనుకూలమైన నిర్ణయాలు జరగడానికి పాకిస్తాన్‌ న్యాయవ్యవస్థలో ఐఎస్‌ఐ జోక్యం చేసుకుంటున్నదని ఆయన జూలై 21న జరిగిన రావల్పిండి జిల్లా న్యాయవాదుల సంఘం సమావేశంలో బాహాటంగానే ఆరోపించారు. ఇదే ఆయన చేసిన తప్పు. ఎంతోకాలం న్యాయవాదిగా, మరెంతోకాలంగా న్యాయమూర్తిగా పనిచేసిన సిద్దికికి ఐఎస్‌ఐ ‘ఘనత’ తెలియదని అనుకోలేం. దాని ఘటనాఘటన సామర్థ్యం ఏపాటిదో ఆ న్యాయ నిపుణుడికి తెలిసి ఉండదని భావించడానికి ఎంతమాత్రము అవకాశం లేదు. అయినా ఆయన ఎందుకు అంతటి ‘వివాదాస్పద’ వ్యాఖ్యలు చేశారు? ఇది ఒకరకమైన తిరుగుబాటు వంటిదే. లేదంటే తీవ్ర నిర్వేదంతో చేసిన వ్యాఖ్య కూడా కావచ్చు. భారతదేశమే లక్ష్యంగా పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్ర వాదులు జరిపే అరాచకాలన్నింటికి పథకాలు రచించి ఇచ్చే పని ఐఎస్‌ఐ చేస్తుంది. ఇది బహిరంగ రహస్యం. కొందరు పాక్‌ ప్రధానులు, అధ్యక్షుల పదవులకు ఎసరు రావడం వెనుక కూడా ఆ నిఘా సంస్థ హస్తం ఉందన్న సంగతిని కూడా ఎవరూ కొట్టిపారేయలేరు. తాజాగా జరిగిన ఎన్నికలలో ఐఎస్‌ఐ సమర్థించడం వల్లనే ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధాని పదవిని చేపట్టగలిగారన్న అభిప్రాయం కూడా ఉంది. అలాగే సైన్యం మద్దతు కూడా ఇమ్రాన్‌కే దక్కింది. పాక్‌ సైన్యానికీ, ఐఎస్‌ఐ మధ్య అవినాభావ సంబంధమే ఉంది. ఐఎస్‌ఐ మీద సిద్దికి చేసిన వ్యాఖ్యలను పరిశీలించవలసిందని సాక్షాత్తు సైన్యమే ఆ దేశ సుప్రీంకోర్టును కోరడం విశేషం.

ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, ఆయన కుమార్తె మరియం నవాజ్‌లు ఎన్నికలు ముగిసేవరకు జైలులోనే ఉండాలని, ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనంలో సిద్దికి ఉండరాదని తాము గట్టిగా ఆశిస్తున్నట్టు ఐఎస్‌ఐ ఇస్లామాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఒత్తిడులు తెచ్చిందని సిద్దికి ఆరోపణ. ఇవాళ పాకిస్తాన్‌ న్యాయవ్యవస్థ ఎంత మాత్రము స్వేచ్ఛాయుతమైనది కాదు. న్యాయవ్యవస్థ ఇచ్చే తీర్పులు, నిర్ణయాలు అన్నీ తనకు అను కూలంగా వెలువడేందుకు గాను ఐఎస్‌ఐ న్యాయ మూర్తుల పేనళ్ల ఏర్పాటును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నదని సిద్దికి ఆరోపించారు. కొన్ని కేసుల విషయంలో తనకు మాత్రమే అనుకూలంగా తీర్పులు రావడానికి ఐఎస్‌ఐ తనే ధర్మాసనాలను రూపొందించుకుందని సిద్దికి వెల్లడించారు. ఈ మాటలన్నీ జూలై 21న పాకిస్తాన్‌ ప్రముఖ పత్రిక ‘డాన్‌’ నమోదు చేసిన వార్తాకథనంలో ఉన్నవే.

ఇవాళ న్యాయవ్యవస్థ ఒక్కటే కాదు, మీడియా కూడా ‘బందూక్‌వాలా’ (సైన్యం) చెప్పుచేతలలోనే నడుస్తున్నది. ఈ వ్యవస్థకు కూడా సైన్యం నుంచే మార్గదర్శకాలు వస్తున్నాయి. ఇవాళ పాక్‌ మీడియా సత్యం చెప్పడం లేదు. కారణాలు రెండు. ఒకటి దాని మీద ఒత్తిడి. రెండు మీడియా స్వప్రయోజనాలు అని సిద్దికి రావల్పిండి సభలో చెప్పారు. అక్కడితో ఆగితే ఐఎస్‌ఐ అంతగా పట్టించుకునేది కాదేమో! కానీ, సిద్దికి మరో మాట అన్నాడు. ‘భారత్‌ అభివృద్ధి పథంలో వెళుతోంది. ఎందుకంటే అక్కడ రాజకీయ ప్రక్రియకు ఆటంకం కలగలేదు’ అని. ఇది నిఘా వ్యవస్థకు పుండు మీద కారం రాసినట్టు ఉండే మాటే కదా!

దాదాపు తిరుగుబాటు వంటి ఈ మాటలని ఐఎస్‌ఐ సహిస్తుందని ఎవరూ భావించలేదు. తనను తొలగిస్తారని తెలుసునని, ఇదేమీ అనూహ్యం కాదని సిద్దికియే ప్రకటించారు. సిద్దికి వ్యాఖ్యలను పరిశీలించవలసిందని మొదట సైన్యం ఇస్లామాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్వర్‌ కాన్సీకి చెప్పింది. కానీ ఆయన సిద్దికి మీద వచ్చిన ఆరోపణలను త్రోసిపుచ్చారు. దీనితో సైన్యం నేరుగా పాక్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొయిన్‌ సాకిబ్‌ నిసార్‌కు చెప్పింది. ఆయన వెంటనే స్పందించారు. పాకిస్తాన్‌ న్యాయవ్యవస్థ తీరు తెన్నులను నిర్దేశించే సుప్రీం జ్యుడిషియల్‌ కౌన్సిల్‌ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లారు. ఐదుగురు సభ్యుల ఈ కౌన్సిల్‌ అధ్యక్షుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే. అంటే సాకిబ్‌ నిసార్‌. ఈ కౌన్సిల్‌ సిద్దికి వ్యాఖ్యలను పరిశీలించి ఆయనను పదవి నుంచి తొలగించవలసిందని ప్రధాని ఇమ్రాన్‌కు సిఫారసు చేసింది. ఆ వెంటనే పాకిస్తాన్‌ అధ్యక్షుడు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *